" ఒకే ఒక్కడు "

 

నా పేరు అప్పారావు. నేను "కోరమాండల్ ఫెర్టిలైజర్స్" లో "ఆడియో విజ్యువల్ వ్యాన్ డ్రైవర్ కమ్ ఆపరేటర్" గా 1975 వ సంవత్సరంలో జాయిన్ అయ్యాను. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఏప్రిల్ 2010 లో రిటైర్ అయ్యాను.

1975 వ సంవత్సరం నుంచి బ్రహ్మర్షి పత్రీజీ "కోరమాండల్ ఫెర్టిలైజర్స్"లో రీజియనల్ సీల్స్ మేనేజర్‌గా తమ ఉద్యోగ నిర్వహణ చేస్తూన్నప్పుడు నేను వారి వ్యాన్‌కి డ్రైవర్‌గా వుంటూ వారితో కలిసి కంపెనీ టూర్‌లు తిరిగేవాడిని!

వృత్తిరీత్యా నాకు వారు పై అధికారి అయినా కూడా వారు నన్ను ఎంతో గౌరవంగా చూసుకునేవారు! నన్ను తమ తోటి స్నేహితుడిలా ఆదరిస్తూ ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన నాకు 1976 వ సంవత్సరం నుంచే ధ్యానం చేయమని చెప్తూండేవారు కానీ నేను వారి మాటలను పెడచెవిన పెడుతూ వచ్చి ధ్యానం చేయలేదు. ఆ తర్వాత సార్ ధ్యానప్రచారం కోసం 1992 వ సంవత్సరంలో కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్లిపోయారు.

అనుకోకుండా మళ్ళీ 2001 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా "చింతలపూడి" గ్రామంలో జరిగిన ధ్యానశిక్షణా సభలో పత్రీజీని ఒక గొప్ప గురువుగా మరి "బ్రహ్మర్షి" గా కలవడం జరిగి ఎంతో సంతోషపడ్డాను! ఆయన నాకు మళ్ళీ ధ్యానం గురించి చెప్పారు! అప్పటినుంచి నేను ధ్యానం చేస్తున్నాను!

నాకు ఇంతకుముందు పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాంసం తినే అలవాట్లు వుండేవి. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి నా చెడు అలవాట్లు అన్నీ మానేశాను!!

ఇక నేను ఇప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. ఏదో ఒక అనారోగ్యంతో ఎప్పుడూ డాక్టర్ దగ్గరకి తిరిగే మా ఆవిడ కూడా ధ్యానం చేసిన తర్వాత అనవసరం అయిన మందులు వాడటం మానివేసి ఇప్పుడు ఆరోగ్యంగా వుంది. మా ఇంటిపై "పిరమిడ్ ధ్యానకేంద్రం" కట్టించుకుని అందులో మేం ధ్యానం చేస్తూ, చుట్టుప్రక్కల వాళ్ళతో ధ్యానం చేయిస్తున్నాం!

ఆనాడు "ఒకే ఒక్కడు" లా ధ్యానప్రచారం మొదలుపెట్టి ఈ రోజు "లోకకళ్యాణ కారకుడు" గా ఎదిగిన పత్రీజీ విశ్వరూపాన్ని కళ్ళారా చూసిన నేను వారి ధ్యానప్రభంజనాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వారికి చిరకాల మిత్రుడిని అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను!

 

శ్రీ పరమాత్మ ధ్యానమందిరం
సెల్:
9704378141

Go to top