" మార్నింగ్ వాక్ "

 

ఒకరోజు యదావిధిగా .. ఉదయాన్నే నా భారీకాయానికి కొద్దిగా పని చెప్దామని "మార్నింగ్ వాక్" కు నా డొక్కు స్కూటర్‌తో అతికష్టం మీద బయల్దేరాను.

బర్కత్‌పురా చమన్ దగ్గర నాకిష్టమైన ఇరానీ చాయ్ త్రాగి స్కూటర్ అక్కడ పడేసి నడక స్టార్ట్ చేసాను. రోడ్ టర్నింగ్ లో ఒక షాప్ లోనుంచి ఒక మేక హృదయ విదారాక ఆర్తనాదం. కాదు.. కాదు ఏమీ చేయలేని దుస్థితిలో ఒకరకమైన చెప్పనలవి కాని.. నేనెప్పుడూ నా జీవితంలో వినవి .. కడుపులో ప్రేగుల్ని మెలిత్రిప్పే అరుపు నా చెవులకు వినిపించింది. అటుగా చూసాను. ఒకతను నిర్దాక్షిణ్యంగా మేకను నరకడానికి లాక్కెళ్తున్నాడు కసాయి దుకాణంలోకి. దాని బాధ ఆ దుష్టుడికి అందదు. అర్థం కాదు. ఒక్కక్షణం నాకు అనిపించింది ఆ ఘోరకలిని ఆపాలని .. ఆపలేనని అర్థమై .. హృదయం ఛిద్రమై నడక అయిష్టంగా సాగించాను. నా నిస్సహయత నాకర్థమైంది.

ఎందుకు? నోరులేని ఆ జీవిని చంపడం, తినడం అంత అవసరమా? ఈ మనుషులు .. కాదు .. ఈ రాక్షసులు .. ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చదువు, సంస్కారం, విజ్ఞానం అన్ని ఉండి కూడా ఈ ఒక్క విషయం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నారు. కరుణ లేని జీవితాలు కూడా జీవితాలేనా! జంతువుల కన్నా హీనంగా బ్రతికేస్తున్నాం. రాతిమనుషుల్లా జీవిస్తున్నాం.

గౌతమబుద్ధుడు .. గాంధీ గారు .. ఇపుడు పత్రి గారు సరిపోరేమో! ఈ మనుష్యుల్ని మార్చడానికి కొన్ని వేలమంది.. లక్షలమంది గౌతమబుద్ధుళ్ళు కావాలేమో !

తనకొడుక్కి కొద్దిగా దెబ్బ తగిలితే తట్టుకోలేడు. టీచర్ కొడితే పెద్ద యుద్ధానికే బయలుదేరే ఈ మనిషి నోరు లేని జీవాలని హింసించి, భుజించేముందు "అవి కూడా ఒక తల్లిబిడ్డలే" అన్న సంగతి స్ఫురించదా వీరికి? వాటి క్కూడా నొప్పి ఉంటుందని తెలియదా? ఎక్కడికెళ్తోంది విజ్ఞత? మన ప్రక్కనే ఉంటారు. మనతోనే తిరుగుతారు. అంతా భాగనే ఉంటూంది. కానీ ఈ జీవహింస విషయంలో మాత్రం అడ్డంగా వాదిస్తారు!!

చిన్నప్పుడు మా ఊరు .. మాచర్లలో "పాండవ వనవాసం" సినిమాలో బకాసురుడనే రాక్షసుడు ఊరివాళ్ళతో ఒప్పందంచేసుకుని రోజుకొకణ్ణి తినడానికి పంపాలంటే ..ఆ మనుషుల్ని రాక్షసుడి దగ్గరికి ఆ తల్లిదండ్రులు పంపే బాధాకరమైన సన్నివేశం చూసి, నా ప్రక్కనే ఉన్న రెడ్డిగారి ఫ్యామిలీ, నాయుడు గారి ఫ్యామిలీ కన్నీరు మున్నీరయ్యే సీన్ ఒక్కసారి మదిలో మెదిలింది కానీ ఆ రెండు కుటుంబాలు ఆదివారం మాంసభక్షణ పేరుతో చేసే నానారభస అందరికీ తెలుసు.

మనిషుల్ని చంపితే ఒకటి. జంతువుల్ని చంపితే ఒకటి కాదు కదా .. రెండూ జీవాలే! రెండింటికీ ఆత్మలున్నాయి, రెండింటికీ బాధ తెలుసు. ఎందుకీ తేడా? వాటి ఆత్మ ఘోష ఈ మానవుడికి ఎన్ని యుగాలైనా చేరదా? ఇక జన్మ సంస్కారం, ముక్తిమార్గం ఎలా అబ్బుతాయి? జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? అందుకే మనుష్య జీవరాసి పెరుగుతూనే ఉంది కానీ జీవన్ముక్తులు కరువయ్యారు.

ఒక నక్సలైట్‌ను పోలీస్‌లు ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చేస్తే పాపం ప్రజాహక్కుల సంఘం నేతలు విలవిలలాడుతారు. ప్రజలకేనా హక్కులు .. జంతువులకు లేవా? జంతువుల కోసం పోరాడేదెవరు? మన మధ్యలోనే మనప్రక్కన ఉన్న మనవాళ్ళే పోరాడాలి. ఎంత దుస్థితి!

పత్రిగారు "ధ్యానులే రాజ్యాధికారానికి అర్హులు" అని నినదిస్తే మొదటి సంశయించిన నేను దాని గూడార్థం ఇప్పుడు అర్థమై "ధ్యానులకు రాజకీయాలు తప్పదేమో" అనిపిస్తోంది. ప్రక్షాళన వాళ్ళే చెయ్యగలరు. అప్పటిదాకా మనుష్యులుగా ఈ జీవహింసను చూస్తూ భరించాలేమో! ప్రాతఃకాలపు హింసకు మనం సాక్షులుగా మిగలాలేమో!

 

రత్నాకర్
హైదరాబాద్

Go to top