" ధ్యానం ద్వారా క్రమశిక్షణ "

 

 

మనలో చాలా మందికి తల్లి, తండ్రి, కుటుంబం, సమాజంలో మనిషిగా ఒకస్థానం మరి కాస్త ఆత్మవిజ్ఞానం అన్నీ వున్నాయి.

కానీ ఇవేమీ లేకుండా కనీసం తల్లిదండ్రుల ప్రేమకు కూడా నోచుకోని చిన్నపిల్లలు, ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలు గవర్నమెంట్ జ్యువనైల్ హోంలో వున్నారు! ఇక్కడ ఇంటి నుండి తప్పిపోయిన, పారిపోయిన పిల్లలు, తల్లిదంద్రులు జైలులో వున్న తల్లిదండ్రులకు అవసరంలేని పిల్లలూ, ఇంకా చట్టప్రకారం నేరాలు ఆరోపించబడిన పిల్లలు, అనాధలు వున్నారు. వీరందరికీ ప్రభుత్వం నుండి తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు అందుతున్నాయి. కానీ వీరికి కావలసిన ప్రేమ, ఆత్మవిజ్ఞానం అందజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

అక్కడి సూపరింటెండెంట్ అయిన "వనజ" గారిని కలిసి ‘ధ్యానం’ కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి కోరాను. ఆమె ఆనందంగా "మా పిల్లలకు ధ్యానం కావాలి; మీకు వీలైతే ప్రతివారం వచ్చి ధ్యానం చేయించండి" అని అడగడంతో ప్రతి మంగళవారం నేను అక్కడికి వెళ్ళి పిల్లలతో ధ్యానం చేయించడం మొదలుపెట్టాను.

చాలా మంది పిల్లలు మొదటిసారే ధ్యానంలోనికి deepగా వెళ్ళిపోయి ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పారు. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ కనిపించిందని చెప్పింది. ఒక పాప ధ్యానం మొదలుపెట్టాక మళ్ళీ "ఓకే" చెప్పేదాకా ఏం జరిగిందో అస్సలు తెలియలేదనీ, లేచాక చాలా ఆనందంగా, హాయిగా వుందనీ చెప్పింది. కొందరికి రంగులు కనిపించాయనీ, కొందరి శరీరం అంతా తేలికగా హాయిగా ఉందనీ చెప్పారు. ప్రతి మంగళవారం నేను వచ్చినప్పుడే కాకుండా ప్రతిరోజూ ధ్యానం చెయ్యమని చెప్పటం జరిగింది.

ఇక్కడ ఉన్న టీనేజ్ పిల్లలతో సమస్యలు ఎదుర్కొంటున్న సిబ్బంది వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని కోరటం జరిగింది.

15 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది?" అని ప్రశ్నించిన పిల్లలతో ముందుగా ఆ 15 నిమిషాలు "హాయిగా ఉంది! అనిపించగలిగాను. ఇంకా ఎక్కువ సమయం ’ధ్యానం’లో ఉండటం వలన కలిగే లాభాలను వారు స్వానుభవంతో తెలుసుకుంటున్నారు.

ఇక్కడ వున్న సిబ్బంది వీళ్ళలో వస్తున్న మంచి మార్పులను గమనించి "ఈ ‘ధ్యానం’ ఏమిటి? ఎలా చేయాలి? ఆరోగ్య సమస్యలు తీరుతాయా?" అని వారికి వారే వచ్చి అడిగారు. ఈ సందర్భంగా సిబ్బంది కి కూడా ధ్యానశిక్షణా తరగతి నిర్వహించడానికి వచ్చిన "ధ్యానాంధ్రప్రదేశ్" మార్కెటింగ్ మేనేజర్ P. రమాదేవి మేడమ్ గారికీ ఇంకా C. విజయకుమారి గారికీ నా కృతజ్ఞతలు.

ఇక్కడి పిల్లలు ఇంతకుముందు ఒకరితో ఒకరు ఎక్కువగా కల్పించుచుకునే వారనీ, ఇప్పుడు అది బాగా తగ్గిందనీ మరి క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారనీ సూపరింటెండెంట్ "వనజ" గారు చెప్పారు.

‘ధ్యానం’ చాలా బావుందనీ నేను రాకపోయినా రోజూ ‘ధ్యానం’ చేస్తామనీ పిల్లలు చెప్పటం హైలైట్!

నేను ఒక మంచి పని చేసానన్న సంతృప్తిని ఇచ్చి, ఇంకా ఇలాంటి పనులు చెయ్యాలన్న స్ఫూర్తినీ, ఆనందాన్నీ నాకు ప్రసాదించిన ఈ పిల్లలందరికీ నా ధన్యవాదాలు.

" జ్యువనైల్ హోం లోని పిల్లల అనుభవాలు "

నా పేరు రేణుక. నేను రెండవ తరగతి చదువుతున్నాను. నాకు గీతక్క ధ్యానం నేర్పించింది. నాకు ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం కదులుతున్నట్లుగా వుంది. ఇంకా ధ్యానం చేయాలనిపిస్తుంది. రాత్రిపూట చాలా ఆనందంగా ఉంటుంది. నేను కూడా పెద్దయ్యాక అందరికీ ‘ధ్యానం’ నేర్పిస్తాను

నా పేరు త్రివేణి. నేను రెండవ తరగతి చదువుతున్నాను. నేను రోజూ ధ్యానం చేస్తాను. ‘ధ్యానం’ లో నాకు మా అమ్మ కనిపించింది. బ్లూ కలర్ చీర కట్టుకుని వుంది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి పట్టుకున్నాను. వెంటనే మాయమయిపోయింది. ఇంకా నాకు ధ్యానంలో కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది. రంగులు కన్పిస్తాయి. హాయిగా వుంటుంది.

 

గీత
కూకట్‌పల్లి
హైదరాబాద్

Go to top