" నిత్య ధ్యాన సాధన "

 

నా పేరు జయరాం. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను యోగా సాధన చేస్తున్నాను; కొంతమందికి నేర్పుతూ వారికి సహకరిస్తూంటాను. ఈ యోగా క్లాసుల ద్వారా పరిచయం అయిన మిత్రులు శిద్ధా సూర్యప్రకాశరావు గారు ‘పిరమిడ్ ధ్యానం’ పట్ల అవగాహన లేకపోయినా పత్రీజీ గారితో ఒక కార్యక్రమానికి ముఖ్యతిథిగా వెళ్ళి.. ఒంగోలులోనే.. ప్రసంగంలో "త్వరలో పిరమిడ్ కట్టిస్తాను" అని చెప్పడం, కొన్నాళ్ళకు అలాగే పిరమిడ్ కట్టించడం జరిగింది!

అనుకోకుండా బ్రహ్మర్షి పత్రీజీ ఒంగోలుకు వచ్చి ఈ పిరమిడ్‌ని ప్రారంభించటం జరిగింది, తద్వారా ప్రకాశరావు గారికి పిరమిడ్ ధ్యానంపై కొంత అవగాహన కల్గి సాధన చేస్తూ పిరమిడ్‌ల్లో ధ్యానానికి నన్ను ప్రోత్సహించేవారు. అయితే నేను ఆసక్తి చూపలేదు. "ఊరికే కూర్చుని ధ్యానం చేస్తే ఏం మార్పు వస్తుంది? ఏం జరుగుతుంది?" అని వాదించేవాడిని... అయితే ప్రకాశరావు గారు నాతో ఈ ధ్యానసాధన చేయించాలనే సంకల్పంతో అనేక రకాల ప్రయత్నం చేశారు. "ఇక లాభం లేదు, ప్రకాశరావు గారు వదిలేటట్లు లేరు" అని ఈ పిరమిడ్ ధ్యానం సంగతి చూద్దామని, బలవంతంగా నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాను. తర్వాత పిరమిడ్ సాహిత్యం చూడటం, చదవటం జరిగింది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా వస్తున్న అనుభవాల దృష్ట్యా, ఏకాగ్రత పెట్టాలనిపించి ధ్యాన సాధనను నిర్దిష్టంగా సాధన చేయటం ప్రారంభించాను.

ఈ పిరమిడ్ ధ్యాన సాధనలో నాకు మొట్టమొదట కల్గిన స్వానుభవం ఏమంటే 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోలేని నేను 30 నిమిషాలు ఒకే స్థితిలో కూర్చోగలగటం. ప్రస్తుతం ఒక గంట (60 నిమిషాలు) అవలీలగా ఒకే స్థితిలో కూర్చోగలుగుతున్నాను. తర్వాత ఈర్ష్యా, ద్వేషాలు, కోపతాపాలు అనేవి తగ్గి, నాలో పాజిటవ్ థింకింగ్ పెరిగింది. ఆలోచనా విధానంలో మార్పు కల్గింది. నాలో వున్న ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకోగల అవగాహన కల్గింది.

నేను చేసే దైనందిన కార్యక్రమాలలోగానీ, కుటుంబ వ్యవహారాలలో గానీ, సేవాకార్యక్రమాలలో గానీ ధ్యాన సాధన వలన సంపూర్ణత కల్గుతోంది. ధ్యాన సాధన, ద్వారా, ఒకదాని తర్వాత ఒకటి సముచితమైన మార్పులను స్వాగతించి ఆనందించగలుగుతున్నాను. ధ్యాన సాధనలో ఎంతోమందికి సముచిత సలహాలు ఇవ్వగలిగే స్థాయి ఎదగటం ఎంతో సంతృప్తినిచ్చింది. నాకున్న ధ్యానానుభవసారంతో నా శ్రీమతికీ, నా మిత్రులకూ ధ్యానసాధనపై ఆసక్తి ఉత్సాహాన్ని కల్గించ గలుగుతున్నాను.

నేను ధ్యాన సాధన ద్వారా శరీరాన్ని తేలిక చేసుకోవటమే కాకుండు నాలో మార్పును ఇతరులు గమనించి ప్రశ్నించినప్పుడు "ధ్యాన సాధన మహిమ" అని చెప్పగలగటం నాకు గర్వంగా వుంది. ప్రస్తుతం యోగ సాధన చేయకపోయినా అగుపించని వెలితి, కొరత నిత్య ధ్యానం చేయకపోవటం వలన కల్గుతుంది.

ధ్యానం గురించి ప్రోత్సహించి ఆసక్తి కల్గించిన మిత్రులు సూర్యప్రకాశరావు గారికీ "శ్వాస మీద ధ్యాస" అనే గొప్ప ధ్యాన ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తూ ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందజేయాలన్న గొప్ప సంకల్పంతో ఉత్తేజపరుస్తున్న పత్రీజీ గారికీ పిరమిడ్ మాస్టర్స్‌కూ, మిత్రులందరికీ హృదయ పూర్వకమైన ధన్యవాదాలు!

 

Ch. జయరాం
కో-ఆర్డినేటర్
ఒంగోలు

Go to top