" మన పిరమిడ్ వ్యాలీ.. ప్రకృతికే ఓ అద్భుత కానుక "

 

నా పేరు కళాలక్ష్మి. "తాడేపల్లిగూడెం పిరమిడ్ మాస్టర్‌గా మరి "పరిపూర్ణ జీవితం" పుస్తకాన్ని సంకలనం చేసిన వ్యక్తిగా చాలామందికి తెలుసు.

నేను చిన్నతనం నుండే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళి ఆయా గురువుల సందేశాలు వినేదాన్ని. కనిపించిన ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవడం జరిగేది. ముఖ్యంగా రమణమహర్షి, స్వామిరామతీర్థల పుస్తకాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. అలాగే ఆత్మజ్ఞానపరంగా థియోసాఫికల్ సొసైటీకి చెందిన మేడమ్ బ్లావట్స్కీ పుస్తకాలు నన్ను లోతుగా ఆలోచింపేజేసేవి. ఆధ్యాత్మిక లోతులు తెలుసుకోవాలనే తపనతో మంత్రజపం లాంటివి, మరి ఓంకార ధ్యానం, కూడా చేసేదాన్ని. ఒకసారి కాశీ నుండి వస్తూ వుంటే ఒక యోగీశ్వరులు "‘ఓంకార ధ్యానం’లో వుండటం కాదు ఓంకార నాదాన్ని నీలోనే వినగలగాలి" అని చెప్పారు. "మాంసాహారం మానేయాలి" అని కూడా వారు చెప్పడం జరిగింది. అప్పుడది నేను అర్థం చేసుకోలేక పోయాను. తరువాత "ఆనాపానసతి ధ్యాన సాధకులు ఓంకారం వింటారట" అని తెలుసుకుని ఆనాపానసతి ధ్యాన సాధన మొదలుపెట్టాను.

బ్రహ్మర్షి పత్రీజీ పరిచయభాగ్యంతో మా దంపతులకు సరైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది! ఈ భూమ్మీద ప్రతి క్షణాన్నీ ఎంత అద్భుతంగా జీవించవచ్చో పత్రీజీ ద్వారా మేం తెలుసుకున్నాం. ఎన్నెన్నో గ్రామాలు ధ్యానప్రచారం నిమిత్తం తిరుగుతూ, ప్రతి ఆదివారం మా ధ్యానకేంద్రంలో రెగ్యులర్‌గా ధ్యానాన్ని నేర్పుతూ మాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ‘బిజి బిజీ’ గా జీవితాన్ని గడుపుతున్నాం. అయితే నాకు 2007 నవంబరులో విపరీతమైన శారీరక అస్వస్థత, తీవ్రాతితీవ్రమైన అనారోగ్యం; నాకు ఎలాంటి బాధలు, భయాలు లేవు. నాకు నేను సాక్షీభూతంగా ఉండటం తప్ప ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. రోజు రోజుకూ దిగజారుతూన్నది నా ఆరోగ్యం. సమిష్టి నిర్ణయం మేరకు నన్ను తాడేపల్లిగూడెం నుండి హైదరబాద్ తీసుకెళ్ళి కార్పోరేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ పరీక్షలన్నీ చేసిన కూడా అనారోగ్యానికి కారణాలు తెలియరాలేదు.

అనారోగ్యం మరింత తీవ్రమై, దానికి కారణం తెలియక కుటుంబ సభ్యులంతా ఏమీపాలుపోక గందరగోళంగా ఉన్నప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ అసుపత్రికి రావడం జరిగింది.

సుమారు గంటపైన ఆసుపత్రిలో వుండి "మేడమ్..మీకు రెస్ట్ కావాలి. అందుకే ఈ అనారోగ్యం, గత జన్మలో చేసిన కర్మలు ధ్యానం ద్వారా, ధ్యానం ప్రచారం ద్వారా పోతాయి. కానీ ఈ జన్మలో చేసిన కర్మలను పోగొట్టుకుని ఇదే చివరి జన్మ చేసుకోవాలంటే ఈ బాధలన్నీ భరించాల్సిందే..." అంటూ "అయినా, మీరు చేయాల్సిన పనులు చాలా వున్నాయి. మీకు త్వరలోనే ఆరోగ్యం బాగువుతుంది. మీరు బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి కొన్నాళ్ళు హాయిగా ధ్యానం చేద్దురుగాని" అని చెప్పడం జరిగింది.

చాలా ఆశ్చర్యంగా మెల్లమెల్లగా నా ఆరోగ్యం కుదుటపడడం, డాక్టర్లను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. ఈ లోపు మాకు తెలిసివాళ్ళందరిలోనూ ఒకటే చర్చ! ధ్యానం చేస్తే సర్వరోగాలు పోతాయని, పూర్తి ఆరోగ్యం వస్తుందని క్లాసులు చెప్పే కళాలక్ష్మిని హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారనే విషయం మీద ఎడతెగని చర్చలు! నాక్కూడా రకరకాల సందేహాలు! బహుశా వాటికి సమధానాలు దొరకుతాయననేమో పత్రీజీ బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి ధ్యానం చేయమనడం.

ఆరోగ్యం కుదుటపడి, శారీరకంగా, నిస్సత్తువగా ఉన్నప్పటికీ ఏప్రిల్ మొదటివారంలో బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి బ్రహ్మర్షి పత్రీజీ చెప్పినట్టుగా గంటల తరబడి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఉదయాన్నే కాటేజ్‌లో రెండు గంటలు, తరువాత మెగా పిరమిడ్‌లో గంటల తరబడి ధ్యానం చేసేదాన్ని. మెల్లమెల్లగా నేను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. చివరికి ఒకరోజు నేను, మన విశ్వాలయం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ I.V. రెడ్డి గారి భార్య కలిసి పిరమిడ్ చుట్టూ వున్న మూడు కొండలు ఎక్కి దిగడం జరిగింది!

సుమారు 45 రోజులు విశ్వాలయంలో ధ్యానం చేయడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, అంతులేని ఆనందాన్ని స్వంతం చేసుకున్న నేను ఎన్నెన్నో అద్భుతమైన ధ్యానానుభవాలను కూడా పొందడం జరిగింది!

ఒక "పిరమిడ్ మాస్టర్" గా నాకు తీవ్రమైన అనారోగ్యం కలిగినప్పుడు "నాకు నేను సాక్షీభూతంగా ఉండడం" అనే ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని అనుభూతిగా పొందటం ఈ అనారోగ్యం నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. అలాగే వ్యక్తుల మధ్య వుండే సంబంధ బాంధవ్యాల గురించి లోతుగా ఉండే ప్రేమతత్వం గురించి సరైన అవగాహన కలిగింది.

మన ప్రకృతి ఒడిలో ఎన్నెన్నో అనుభవాలు పొంది తద్వారా ఆత్మ ఉన్నతిని సాధించటానికి ఈ భూమి మీదకు వచ్చాం. భూమి మీద నిరంతరం కోటానుకోట్ల ఆత్మస్వరూపాలు మరింత చైతన్యవంతంగా రూపుదిద్దుకొని మనిషి స్థాయి నుండి భగవంతుని స్థాయికి చేరాటానికి ప్రకృతి కల్పిస్తున్న ఎన్నెన్నో అద్భుతాలు ఉపయోగపడుతున్నాయి. అలాంటి ప్రకృతికి తోడ్పడటానికి రూపుదిద్దుకొంటున్నదే "మైత్రేయ బుద్ధా ధ్యాన విద్యా విశ్వాలయం" అని నాకు ధ్యానంలో అనుభవానికొచ్చింది. అలాగే ఈ విశ్వాలయం తయారు కావటానికి మనం చేస్తున్న అనేక రకాల ప్రయత్నాలే మనల్ని ప్రకృతి యొక్క ఋణబంధం నుండి విముక్తులను చేస్తాయని ధ్యానంలో తెలుసుకున్నాను.

ఇక విశ్వాలయంలో అద్భుతంగా రూపుదిద్దుకొంటున్న "పిరమిడ్" ..మరి ఇతర కట్టడాలు.. అలాగే రోజు రోజుకు క్రొత్త అందాలను సంతరించుకొంటూ ఆహ్లాదకరంగా తయారవుతున్న "పిరమిడ్ వ్యాలీ".. మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ తరపున బ్రహ్మర్షి పత్రీజీ సాక్షిగా ప్రకృతికి మనం సమర్పించుకొంటున్న ఓ అద్భుతమైన కానుక అనడంలో ఎలాంటి సందేహం లేదు!

అలాంటి "పిరమిడ్ వ్యాలీ" నిర్మాణం కోసం స్వంత పనులు మానుకొని మేనేజింగ్ ట్రస్టీ I.V. రెడ్డి గారు, మిగిలిన ట్రస్టీలు ఎంతగానో కృషిచేస్తున్నారు! అలాగే ఎంతో ధైర్యంగా R&B లో ఉన్నతమైన ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకొని కుటుంబంతో సహా బెంగుళూరులోనే వుంటూ అహర్నిశలూ పిరమిడ్ నిర్మాణం కోసం కృషిచేస్తున్న ప్రసాద్ గారు మిగిలిన పిరమిడ్ మాస్టర్లు.... వీరందరికి నా శతసహస్ర ప్రణామాలు!

ఈ "మెగా పిరమిడ్" పూర్తి కావాలన్నా, ఈ "పిరమిడ్ వ్యాలీ" విశ్వాలయంగా రూపుదిద్దుకోవాలన్నా, దేశ విదేశాల నుండి ధ్యానులు వచ్చి ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞ్జానం పొందాలన్నా ప్రతి పిరమిడ్ మాస్టర్ అకుంఠిత దీక్షతో ఎవరికి వారే స్వంత పనిలా భావించాలి. మెగా పిరమిడ్‌ను ఈ డిసెంబరులోపు పూర్తిచేసి విశ్వమానవాళికి బ్రహ్మర్షి పత్రీజీ చేతుల మీదుగా అంకిత మిచ్చేందుకు వీలుగా మనమంతా కృషిచేయాలి.

 

గారపాటి కళాలక్ష్మి
శ్రీ శ్రీనివాసా పిరమిడ్ ధ్యానకేంద్రం
తాడేపల్లిగూడెం,
పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : +91 08818-222840

Go to top