" ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకునేందుకు ఉపయోగపడే అద్భుతమైన దర్పణం
- ఓ మిర్రర్ - పత్రీజీ! "

 

నా పేరు హరికుమార్. వృత్తిరీత్యా డాక్టరును. ప్రవృత్తి రీత్యా పిరమిడ్ మాస్టర్‌ను. ఇది ఇప్పటి స్థితి. మరి ఒకప్పటి స్థితి?? 1995... ఆ రోజులలో ఒకరోజు నిద్ర మెలకువ కాని స్థితిలో నాకు ఎంతో ప్రీతిపాత్రమైన షిర్డీసాయి కన్పడి "ధ్యానం నేర్పించటం, చేయించటం ఒక ఎత్తయితే, ‘ధ్యాన మాస్టర్’ గా మరొకర్ని తయారుచేయటం అంతకంటే పెద్ద ఎత్తు. అదే ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణస్థితి. అలాంటి ‘నేర్పరి’ ‘కర్నూలు బుద్ధ పిరమిడ్’ లో వున్నాడు. వెళ్ళి ఆయనతో కలిసిపో" అన్నాడు.

"కలిసి రా" అనలేదు "కలిసిపో" అన్నాడు! దానిలో అంతరార్థం అప్పుడు అర్థం కాలేదు. తర్వాత తర్వాత అర్థం అయ్యింది తన దగ్గరకు తిరిగి రావద్దు పత్రీజీతో మమేకం అయిపొమ్మనాడని.

ఆ రోజు కర్నూలు పిరమిడ్‌లో అడుగిడిన నా పాదం మరింక వెనక్కి తిరిగిరాలేదు. తిరుగులేని తేజస్సుతో అక్కడవున్న అహంకారులను నిరహంకారులుగా తన తీక్షణమైన చూపులతో, మాటలతో, అంచెలంచెలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ పరిమళాలను వెదజల్లుతూ అంతర్ నిశ్శబ్దం వైపుకు తీసుకొని ..అవసరమైతే ‘యీడ్చుకొని’.. వెడుతూన్న పత్రీజీ కన్పించారు! నా ప్రథమ పరిచయంలో ఆయన అన్నమాట ఎప్పటికీ మర్చిపోను: డాక్టర్లు చేయవలసినపని సరిగ్గా చేస్తే బాబాలు, ఆధ్యాత్మిక గురువుల అవసరమే లేదయ్యా! ప్రతి డాక్టర్ మొదట ధ్యానిగా, ఆపై మాస్టరుగా కావాలి అన్నారు.

మనలో అంతర్గతంగా ఉండే మనకే తెలియని టాలెంట్‌ను బయటకు లాగడంలో పత్రీజీ మహాదిట్ట! వివిధ రకాల క్లిష్ట ప్రశ్నలకు ఎంతో సులువుగా, సహజంగా, స్పష్టంగా, సృజనాత్మకంగా ఎన్నో కాన్సెప్ట్‌ల జల్లులు కురిపించేవారు. "BEAT", "ఇన్నర్ డాక్టర్", "ట్రూత్ బ్లిస్" మొదలగుగాగల సరిక్రొత్త సంగతులు అవి!

ఆత్మపరంగా జ్ఞానబోధ సార్ చేస్తే, దేహపరంగా ఆహార బాధ పత్రి మేడమ్ తీర్చేవారు. కలిసి ముద్దలు చేసి చేతిలో పెట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో! ఎక్కడకు వెళ్ళినా, సార్ ఎవరో తెలియకపోయినా ప్రతివారూ ఆయనను కళ్ళప్పగించి చూసేవారు! ఎక్కడకు వెళ్ళినా ఆయనను విజయమే వరించేది! "మీ విజయరహస్యం ఏమిటి?" అని అడిగితే "ఏమీలేదయ్యా! సిన్సియారిటీ- సింప్లిసిటీ!" అని అతి సింపుల్‌గా చెప్పేవారు! "ధ్యాన జగత్" ని తప్ప మరేమీ ఆశించని పత్రీజీ ఎర్రబస్సులలో తిరిగి అందరికీ ధ్యానం నేర్పేవారు.

డాక్టర్ సహాయం లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా వుండేలా మనుష్యులను మలిచారు ఆయన! "మాస్టర్లను తయారుచేయటమే నా మాస్టరీ! మరి ఇతరుల లైఫ్ పర్పస్ తెలియచేయటమే నా లైఫ్ పర్పస్" అంటారు మన పత్రీజీ, పసిపిల్ల వాడిలాగా నవ్వుతూ...

"2500 సం||రాల తర్వాత అందరినీ సత్యజ్ఞాన ప్రకాశకులుగా తీర్చిదిద్దేందుకు ఉద్భవించిన మైత్రేయ బుద్ధుడు మీరేనా?" అని అడిగితే "అందరమూ - అందరికీ మైత్రేయ బుద్ధుళ్ళమే" అని చెబుతూ ఏకత్వ భావనకూ, అహంకార అతీతస్థితికీ పరాకాష్టగా నిలుస్తారు మన పత్రీజీ! అహంకారాన్ని త్యజించిన వారేకదా అసలుసిసలు ఆత్మజ్ఞాని!

ప్రతి వారి వాక్‌క్షేత్రాన్ని అనుక్షణం గమనిస్తూ పనిచేయటమే మోక్షమని ప్రోత్సహిస్తూ ఎవరి జీవితలక్ష్యం వారే త్రికరణశుద్ధితో ఆచరించేలా చేసే మోక్షప్రదాతే మన పత్రీజీ. ఎవరైన సరే... వారు తనకెంత ఇష్టులయినా సరే ఒక్క ఆశాస్త్రీయమైన, అసందర్భపు మాట మాట్లాడినా, సహజంగా తాము కాని విధంగా ప్రవర్తించినా చీల్చి చెండాడేస్తారు ఆయన! బుద్ధుడు ఎన్‌లైటెన్‌మెంట్ అయిన తరువాత "నాకింక తెలియజేయాల్సిన జ్ఞానం ఏదయిన ఉంటే చెప్పేవారిని చూడాలి" అని తన మూడవకన్ను తెరిచి చూస్తే తనకు తానే కన్పడ్డాడట! అదే అసమానస్థితి పత్రిసార్‌ది కూడా, అయినా కూడా వినయమే ఆయనకు భూషణం!

"ప్రాపంచికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా ఉన్నతి పొందాలంటే మన దగ్గర వున్నదంతా ఊడ్చియిస్తే చాలు" అని తరుచుగా అంటూంటారు. మనతో అయినా, స్వంత భార్యతో అయినా, స్వంత పిల్లలతో అయినా ఎంత ఎటాచ్‌డ్‌గా ఉంటారో అంత డిటాచ్‌డ్‌గా ఉండటం ఆయనకే చెల్లుతుంది! "పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్" బ్యానర్‌పై క్రొత్తగా క్లాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు సీనియర్స్ కొద్దిగా భయసంకోచాలకు లోనయితే పత్రీజీ స్టేజీ మీదకు వచ్చి డాక్టర్స్ అసోసియేష్‌న్ ఆవిర్భావం" చంద్రమండలంపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాదం మోపినట్లుగా" పోల్చి అందరికీ ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు!

స్త్రీలకూ, మగవారికీ కూడా సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలంటారు ఆయన. "మీ ఫ్రీవిల్ నా ఫ్రీవిల్ పరిధి‌లో ఉంటే నేను దేనికైనా రెడీ" అంటారు మన పత్రీజీ. స్టేజీమీద నేను యిచ్చే ప్రోగ్రామ్స్ సార్‌కు ఎంతో నచ్చేవి. "నిద్రను హరించేలా - అందరూ హర్షించేలా -హాయిగా ఉంటాయయ్యా మన హరిమాటలు" అని నాకు ప్రోత్సాహం యిచ్చేవారు!

మా బాబుకు నామకరణం చేయమని కోరినప్పుడు "మీవాడు సౌమ్యుడు, శుద్ధ సాత్వికుడు కాబట్టి ‘సౌమ్యేంద్ర’ అని పేరు పెడ్తున్నాను" అన్నారు. సొసైటీకి దూరమైన సీనియర్ల ప్రసక్తి వచ్చినప్పుడు, :నడిచే సమయంలో నాతో నడిచారు, యిప్పుడు పరిగెత్తే సమయం వచ్చింది; పరుగెత్తలేనివారు తాత్కాలిక విశ్రాంతి తీసుకుంటారు; అదంతా సహజమే" అంటారు.

ఆయన సన్నిధిలో ఉన్నంతసేపూ ప్రతి ఒక్కరినీ గుర్తిస్తూ, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ భోజనం చేసే వరకూ గమనిస్తూ గేటు దగ్గరి దాకావచ్చి వీడ్కోలు చెప్పగల ఆధ్యాత్మిక సంస్కారి ఆయన!

సార్ దగ్గర మెసలటం అంటే కత్తిమీద సామే. "మాట మీద ధ్యాస" పెరగాలంటే సార్ సహచర్యం తప్పనిసరి! నా వరకు నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో తెలుసుకునేందుకు ఉపయోగపడే అద్భుతమైన దర్పణం - ఓ మిర్రర్ - పత్రీజీ!

నేను ఈ మధ్యకాలంలో మూడు రోజులపాటు ఓ "హెల్త్ కాన్ఫరెన్స్" జరిపాను. ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చిన వారందరూ తమనితామే మరిచిపోయేంతగా ముగ్దులయారు. ప్రతిసారీ చెప్పినట్లుగానే ఈ సభలో కూడా పత్రిసార్ నా ఏకైక గురువనీ- అంతకు మించినవారు నాకెవ్వరూ లేరనీ చెప్పాను. ఆ కాన్ఫరెన్స్ విన్న సంస్కృతి ఛానెల్‌లో " జీవనమైత్రి" అనే కార్యక్రమం నిర్వహించే "స్వామి మైత్రేయ" నన్ను కలిసి "మీరు చెప్పిన తీరుకు ఎంతో ప్రభావితుణ్ణయ్యాను; మీకు నా అభినందనలు" అని చెప్పి "పత్రీజీ గురించీ, వారి అవిశ్రాంత, నిస్వార్థ ధ్యానప్రచారం గురించీ ఎన్నోసార్లు విన్నాను. దానితో పాటే ఆయనకు చాలా కోపమనీ పురాణాలలో చెప్పబడిన కొన్ని విషయాలను ఖండిస్తారనీ అలా ఏవేవో నెగెటివ్ మాటలు కొన్ని వినబడ్డాయి. కొంచెం వివరణ యిస్తారా?" అని అడిగారు.

నాకు కొంత కోపమొచ్చినా తమాయించుకున్నాను. అయినా పత్రిసార్ గురించి అసలు నిజాలు ఆయనకు చెప్పాను: అవి (1) పత్రీజీ మూర్ఖతను ఖండించేందుకే గొంతెత్తి అరిచే నిక్కచ్చి స్వభావి (2) పత్రీజీ అహంకారలను పటాపంచలు చేసే అప్రమత్తతను సంవృద్ధిపరిచే జెన్‌మాస్టర్ (3) పత్రీజీ ఎంత రూత్‌లెస్‌గా వుంతారో అంతకు ఎంతెంతో మించిన ఎలాంటి షరతులు లేని ప్రేమను కురిపించే కరుణామూర్తి (4) స్నేహితుడు అంటే సరైన నిర్వచనం పత్రీజీ. జగత్తుయావత్తూ అభినందించతగిన వ్యక్తి పత్రీజీ.

దానితో ఆయన ఎంతో నొచ్చుకొని "మీవంటి ఆణిముత్యాలవంటి శిష్యులను కలిగియున్న మీ సార్ నిజంగా వజ్రమే! వారిని కలిసి, వారితో కలిసి పనిచేయాలనిపిస్తోంది" అని ఒప్పుకున్నారు. నాకెంతో సంతోషం కల్గింది.

పత్రిసార్‌ని స్వయంగా కలిసి దగ్గరగా పరిశీలించి వివేకంగా ఆలోచించి అప్పుడే తీసుకోవాలి సరైన నిర్ణయం. అంతేకానీ వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని తీసుకునే నిర్ణయాలు ఇలాగే వుంటాయి మరి. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన మూఢ ఆధ్యాత్మిక నమ్మకాలనూ, ఆచారాలనూ, నిర్ధాక్షిణ్యంగా, నిర్మోహ మాటంగా ఖండిస్తారు పత్రిసార్! ఎవరైనా ఏమయినా అనుకుంటారేమో, తనను చెడుగా అర్థం చేసుకుంటారేమో అనే భయం మరి సంకోచం అన్నవి ఆయనలో ఏ కోశానా లేవు. తాను నమ్మిన సత్యాన్నీ, ఆచరిస్తున్న సత్యాన్నీ, అసలైన సత్యాన్నీ చాటి చెప్పటమే ఆయన జీవితధ్యేయం.

ఆధ్యాత్మికత అంటే పూజలు, యజ్ఞయాగాదులు దేవాలయాలు కట్టించడం, శాంతి చేయించటం అని చెప్తూన్న ఎంతోమంది కుహనా ఆధ్యాత్మిక గురువులకు విభిన్నంగా పూజలు వద్దనీ, నీకు నీవే దేవుడవనీ, ఉన్న దేవాలయాలు ధ్యానాలయాలు కావాలనీ, డాక్టర్లు - మందులు అసలే వద్దనీ నిక్కచ్చిగా తెలియచేసే దమ్మున్న, గట్స్ వున్న ఏకైకవ్యక్తి ఆధ్యాత్మికవేత్త మన పత్రీజీ! అలుపు అన్నది ముముక్షువు యొక్క మూలశత్రువు అనే దానికి తానే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ అహర్నిశలు ఊరూరా, ప్రపంచం అంతా తిరుగుతూ, మనల్ని అందరినీ ఏకత్రాటిమీద నడిపిస్తూ జీవన్ముక్తులుగా తయారుచేస్తున్న స్ఫూర్తిప్రదాత మన పత్రీజీ! "పాజిటివ్ మాటలే మనకు పరమాన్నం" అనీ-"ఏది చూసినా, ఏది విన్నా దానిలో పాజిటివ్‌నెస్‌నే తీసుకోవాలి" అనీ చెబుతూవుంటారు.

చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ! తల్లి యొక్క నిస్వార్థ, నిరంతర ప్రేమ, తండ్రి యొక్క ప్రోత్సాహ ఉత్సాహం సందేహాలను నివృత్తి చేసే గురుత్వం, "మీరు అభివృద్ధి చెందాలనుకుంటే చాలు అన్నివేళలా నా చేయూత వుంటుంది" అనే మిత్రత్వం.. వీటన్నిటి యొక్క మేలకలయికే మన పత్రీజీ!

గత 14 సంవత్సరాలుగా పత్రీసార్‌తో నేను ఎన్ని వందల గంటలు మాట్లాడుతూ గడిపానో నాకే గుర్తులేదు, కానీ నేను ఏనాడూ ఆయనలో ఒక్క అనారోగ్య లక్షణం కూడా చూడలేదు!"అమృతం గ్రోలినవారు" మాత్రమే ఇంత ఆరోగ్యవంతులుగా ఉండగలరు! "భౌతికంగా ఈజీగా దొరుకుతున్నానని.. అంత ఈజీగా తీసుకోకండి నన్ను" అంటారప్పుడప్పుడూ. పాపాత్ములతోనూ పరమాత్ములతోనూ సహజంగానే ఇమడగలరు ఆయన! శ్రీకృష్ణుడు అలానే ఇమిడిపోయాడు..కౌరవులలో మరి పాండవులలో కూడా! ఇమిడిపోయాడుగాని ఎక్కడా ఇరుక్కుపోలేదు! పత్రీజీ కూడా అంతే!

ఈ ఇమిడి పోవటం అంటే మామూలు విషయం కాదు. అనేకసార్లు మనం పరిస్థితులలో పరిసరాలలో ఇమిడిపోలేక పోతున్నాం. కానీ ఆయన అన్నిటికీ అతీతుడు..! తామరాకు మీద నీటిబొట్టు!! దటీజ్ పత్రీజీ...!

 

హరికుమార్
ఆంధ్రప్రదేశ్

Go to top