" ధ్యానం ద్వారా బడుగు బ్రతుకుల్లో వెలుగులు "

 

నా పేరు క్రిష్ణయ్య. నా వయస్సు 70 సంవత్సరాలు. చదువు సంధ్యలు లేని నేను మా స్వగ్రామం అయిన కడ్తాల్‌లో గొర్రెలు, మేకలు పెంచుకుంటూ కుటుంబ జీవనాన్ని గడిపేవాడిని. చిన్నప్పటి నుంచీ మాకు మంచీ చెడ్డా చెప్పేవారు లేకపోవడంతో త్రాగుడు, చుట్టలు, బీడీలు కాల్చడం వంటి దురలవాట్లకు లోనై నేను రకరకాల రోగాల పాలపడ్డాను. సంపాదించే డబ్బులు ఇంట్లో వాళ్ళ తిండికీ నా త్రాగుడికీ సరిపోక పోవడంతో నా భార్య పిల్లలతో కొట్లాడుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాను.

ఇది చాలదనట్లు .. ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో నా తుంటి ఎముక విరిగిపోయింది. పంజాగుట్ట ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు ఉండి వైద్యం చేయించుకుని అప్పుల పాలయ్యాను. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ‘ పులి మీద పుట్ర ’ లా గుండె నొప్పి వచ్చి మళ్ళీ ఆస్పత్రిపాలయ్యాను. రెండు సార్లు గుండెకు ఆపరేషన్ జరిగినా .. దగ్గు దమ్ము ఆయాసం మాత్రం తగ్గలేదు. రెక్కలకష్టం తప్ప మరే ఆధారం లేని నాకు చావే శరణ్యం అయ్యింది.

ఈ పరిస్థితుల్లో పిరమిడ్ సార్ " రామారెడ్డి " గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని ఇంట్లో అందరం ప్రతిరోజూ రెండు గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాము. కులరీత్యా గొర్రెల మేకల పెంపకం చేసి వాటిని చంపితినడం వల్ల నేను ఎన్నెన్ని పాపాలను మూట గట్టుకున్నానో అర్థం చేసుకుని నా స్వంత బిడ్డలను చంపి తిన్నట్లుగా బాధపడ్డాను.

శుద్ధ శాకాహారిగా మారి ధ్యానం చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే నా ఆయాసం, దగ్గు, తగ్గుముఖం పట్టాయి. నాకు ఉన్న త్రాగుడు, చుట్ట బీడీల వంటి చెడు అలవాట్లు నుంచి బయటపడటంతో మెల్లిగా ఆర్థికంగా కూడా కోలుకున్నాను. నా కుటుంబ సభ్యులతో చుట్టాలతో నాకుగా నేనే మంచిగా ఉండడంతో నన్ను చూసి వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకుంటూ శాకాహారులుగా మారుతున్నారు! చెడు అలవాట్లనుంచి బయటపడి పిల్లలను చక్కగా చదివించుకుంటున్నారు! ఇలా మా వంటి బడుగు జీవుల బ్రతుకుల్లో ధ్యానం ద్వారా వెలుగులను నింపుతూ మాకు మంచీ చెడూ నేర్పుతున్న పత్రిసార్‌కు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము!

నాలో వచ్చిన ఈ మార్పుకు సంతోష పడిన పిరమిడ్ సార్లు నాకు " కైలాసపురి " మెయిన్ గేట్ దగ్గర " నైట్ వాచ్‌మెన్ " డ్యూటీ ఇచ్చారు! ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంతో ఉంటూ వాచ్‌మెన్ ఉద్యోగం ద్వారా వస్తోన్న జీతంతో హాయిగా ఆనందంగా వున్నాను. గత డిసెంబర్ నెలలో జరిగిన ప్రపంచ ధ్యానమహాసభల వల్ల కడ్తాల్ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో ధ్యానం గురించి చాలా మందికి తెలిసింది.

ఆ పదకొండు రోజులు గ్రామ గ్రామాల్లోని ప్రజలు రోజూ ప్రొద్దున్నే కైలాసపురికి తరలి వచ్చి మూడు గంటలు ధ్యానం చేసుకుని మళ్ళీ పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు! ఇంత గొప్ప పిరమిడ్ మా ఊరికి దగ్గరలో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం.

 

 

పిప్పళ్ళ క్రిష్ణయ్య
కైలాసపురి
కడ్తాల్

Go to top