" ఇంతకంటే వేరేగా దేవుడు ఉండడేమో "

 

నా పేరు ధనశ్రీ. నేను ఉద్యోగ రీత్యా అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్నాను. నాకు నా చిన్నతనం నుంచీ అంటే నాకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే ధ్యానం గురించి తెలుసు.

మా నాన్నగారు ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతూండడంతో నా చదువుకు ఆటంకం కలుగకుండా నన్ను హాస్టల్‌లో ఉంచేవారు. హాస్టల్‌లో ఉంచేవారు. హాస్టల్‌లో విద్యార్థినులు, టీచర్లు తెల్లవారు జామునే లేచి హడావిడిగా పనులు చేసుకుంటూంటే నేను మాత్రం హాస్టల్ ఆవరణలో ఒక మూల కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చునే దాన్ని! రోజంతా హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా నా చదువు సాగుతూండేది. దానిని "ధ్యానం" అంటారని నాకు అప్పట్లో తెలియదు!

అయితే ఒక్కోసారి సమయం కుదరక పోవడంతో అలా ధ్యానానికి కూర్చోలేకపోయేదాన్ని. అప్పుడు ధ్యానం చేసిన రోజు ఉన్నంత ఆహ్లాదంగా ఆ రోజు నేను లేకపోవడం .. శ్రద్ధగా పాఠాలు వినలేక పోవడం చిరాకు, ఏకాగ్రత కుదరకపోవడం తేడాను స్పష్టంగా గమనించేదాన్ని. ఆ సంగతి అర్థం అయ్యాక .. ఇదీ అని తెలియక పోయినా రోజూ కాస్సేపు అలా కూర్చుండేదాన్ని.

ఆ తరువాత ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసుకుని, పెళ్ళయి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాక 2011 లో మా అమ్మ శ్రీమతి వరలక్ష్మి మరి మా నాన్న మాధవాచారి గార్ల ద్వారా "ఆనాపానసతి - శ్వాస మీద ధ్యాస" ధ్యానం గురించి తెలుసుకుని శాస్త్రీయంగా సరియైన ధ్యానం చేయడం మొదలు పెట్టాను. ఎన్నెన్నో ధ్యాన అనుభవాలు రావడంతో పాటు నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ నా మనస్సులో వస్తోన్న ప్రశ్నలకు సమాధానాలు నాలో నుంచే వస్తూండేవి. దాంతో నాకు ఎంతో ఆత్మతృప్తి లభిస్తూండేది మంచి మంచి నవీన ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంటర్‌నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని చదువుతూ మళ్ళీ మా అమ్మానాన్నలతో నా అనుభూతులను పంచుకునేదాన్ని. పత్రిసార్ సి.డి.లు విని పుస్తకాలు చదివి నేను ఎంతో నేర్చుకున్నాను! వారిని కలిసి .. వారితో మాట్లాడే అవకాశం కలిగినప్పుడు నాకు కలిగిన సంతోషం చెప్పలేను! దేవుడు అంటే ఎలా ఉంటాడో నాకు తెలియదుగానీ పత్రిసార్‌తో కాస్సేపు గడపగానే .. " ఇంతకంటే వేరేగా దేవుడు ఉండడేమో " అనిపించింది.

అలాంటి అద్భుతమైన గురువుతో కలిసి ఉండడం మన అదృష్టం. అంతగొప్ప గురువు సాంగత్యంలో ఉండడానికి మా అమ్మానాన్న " కైలాసపురి " లో ఇల్లు కట్టుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఇటీవలే ఇండియాకు వచ్చి కైలాసపురిలో మా ఇల్లు చూసి చాలా థ్రిల్ అయ్యాను; విదేశాల్లో చాలా వరకు ఇళ్ళు ఇలాగే ప్రకృతికి అతి దగ్గరగా ఉంటూంటాయి.

క్రితం నెల నేను USA నుంచి బ్రిటిష్ ఎయిర్ వేస్ ద్వారా ఇండియాకు వస్తున్నప్పుడు మధ్యలో కొంతసేపు లండన్ విమానాశ్రయంలో గడపాల్సి వచ్చింది. అక్కడ ప్రయాణీకుల కొరకు ప్రత్యేకంగా " మెడిటేషన్ రూమ్ " ఏర్పాటు చేయబడి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను! ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వాళ్ళు విధిగా ధ్యానాభ్యాసం చేయాల్సిన అవశ్యకత ఎంతైనా వుంది కనుక మనం అందరం కూడా ధ్యాన ప్రచారాన్ని ఇంకా బాగా చేద్దాం ..

 

T.నాగ ధనశ్రీ
టెక్సాస్ రాష్ట్రం
అమెరికా దేశం

Go to top