" మిరాకిల్స్ చేయవలసిన అవసరం ఆయనకు లేదు "

 

శ్రీ T. విజయకుమార్ 1992 లో..అనంతపురంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ యొక్క రెండవ కేంద్రాన్ని తమ ఇంటిపైన ఏర్పాటు చేసినవారు, పత్రిసార్ తో ఒక అత్యంత ఆత్మీయస్నేహితుడిగా మెలిగినవారు! 75వారాలపాటు 1992-93 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం T. విజయకుమార్ గారింట్లో పత్రిసార్ మెడిటేషన్ టీచ్ చేశారు! విజయకుమార్ గారితో, వారి కుటుంబంతో, పత్రిసార్‌కున్న అత్యంత సమీప సాన్నిహిత్యం, స్నేహం, పొందిన ఆనందం, మరి ఈ ధ్యాన సాహసయాత్రలో విజయ్‌కుమార్ గారి సుదీర్ఘ అనుభవజ్ఞానం "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకుల స్వంతం! శ్రీ T. విజయకుమార్ గారికీ, వారీ శ్రీమతికీ నా ధన్యవాదాలు!


మారం శివప్రసాద్ : నమస్తే విజయకుమార్ గారూ! సీనియర్ మోస్ట్ మాస్టర్ అయిన మీ ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. మీ గురించి, మీ కుటుంబం గురించి చెప్పండి!

T. విజయకుమార్ : నేను అనంతపురం వాస్తవ్యుడిని... నా భార్య సంధ్య, మా అబ్బాయి వినోద్‌కుమార్ M.C.A., మరి అమ్మాయి ప్రతిమ M.B.A.. నేను R&B లో స్టెనోగా జాబ్ చేస్తున్నాను.

నా చిన్నప్పటి ఫ్రెండ్ N.V. సంపత్‌కుమార్. 1992 ఏప్రిల్‌లో ఒకరోజు సాయంత్రం తన ఇంట్లో "సుభాష్ పత్రి" కి పరిచయం చేశారు. అప్పుడు పత్రిసార్ వెంట కర్నూలు ‘మాస్టర్ ప్రకాష్’ అనుకుంటాను వున్నారు. ధ్యానం గురించి నాకు పత్రిసార్ బోధించారు. అప్పటికి ఆయన అనంతపురంకి రావడం రెండోసారో, మూడోసారో అంతే! అప్పటికింకా సెంటర్ కూడా లేదు. "మా ఇంట్లో పైన సెంటర్ పెట్టుకోవచ్చు" అని చెప్పాను. అప్పటినుంచీ ఇప్పటిదాకా మా ఇంటిపైన ఆ సెంటర్ అలా నడుస్తూనే వుంది! కర్నూలు తర్వాత రెండవ పిరమిడ్ ధ్యానకేంద్రం కూడా ఇదే!

మారం శివప్రసాద్ : పత్రీజీ ప్రతి వారం అనంతపురంకు వచ్చేవారా?? మీ ఫ్యామిలీ అంతా ఆయనతో కలిసి ధ్యానం చేసేవారా??

T. విజయకుమార్ : అవును! చాలా సంవత్సరాలు అలా వచ్చేవారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రతి ఆదివారం వచ్చి, డైరెక్టుగా సెంటర్‌కు వచ్చేవారు. మా ఫ్యామిలీ అంతా ఒకేసారి ధ్యానం మొదలుపెట్టాం. బాగా వృద్ధులైన మా నాన్న, మా అమ్మ, మేమంతా! మా నాన్న గారికి అప్పుడు 96 సంవత్సరాలు. అయినా పత్రీజీ చెప్పినట్లు ఆయన ధ్యానం చేసేవారు! అంతకుమునుపు మా ఇంటికి చాలామంది స్వామీజీలు, గురువులు వచ్చేవారు. ధ్యానం గురించి మాకు తెలియదు కానీ, ఆధ్యాత్మిక మార్గంలో అంటే పూజలు మంత్రజపం, అన్నదానం వంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన కుటుంబం మాది.

మారం శివప్రసాద్ : మరి మీ కుటుంబం సభ్యులను ధ్యానం చేయమని చెప్పినప్పుడు వారి రెస్పాన్స్ ఎలా వుంది? వారి తొలి అనుభవాలు?

T. విజయకుమార్ : మా నాన్నకు గొప్ప ఆధ్యాత్మిక భావాలు వుండేవి. మా నాన్నకు మాస్టర్స కనబడ్డారు. మా అభ్భాయి అప్పుడు 6వ తరగతి, అమ్మాయి 4వతరగతి. "పిల్లలు ధ్యానం చేయవచ్చు" అని నాకు తెలియదు. సరే.. అందరం ధ్యానంలో కూర్చున్నాం. చాలా హాయిగా ఎంతో ఆనందంగా అనిపించింది. మొదటిక్లాసులో అందరి అనుభవాలు పత్రిసార్ అడిగారు. మా అమ్మాయి, "సర్! ఎవరో ఒక పంచ కట్టుకున్న పెద్దాయన నా ముందు కూర్చున్నారు, ధ్యానంలో నేను చూశాను" అని చెప్పింది. బహూశా చిన్న పిల్లల్లో మా అమ్మాయి మొదటి మాస్టర్ అనుకుంటాను... అలా మా అమ్మాయికి చాలా అనుభవాలు వస్తూ వుండేవి. మా అబ్బాయి కూడా బాగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. చక్కగా సూక్ష్మశరీరయానం చేసేవాడు! ఎన్నెన్నో విషయాలు చెప్తూండేవాడు! మొదటి నుంచీ, మాస్టర్స్ గైడెన్స్ మా పిల్లలిద్దరికీ వుండేది. మా శ్రీమతి కూడా రెగ్యులర్‌గా ధ్యానం చేస్తుంది.

మారం శివప్రసాద్ : మీ అబ్బాయి గొప్ప ‘ఆరా మాస్టర్’ అని నాకు ద్వారకానాథ్ మాస్టర్ చెప్పారు; అతడి ‘ఆరా రీడింగ్’ గురించి తెలియజేయండి!

T. విజయకుమార్ : అవును! మా అబ్బాయి మంచి ‘ఆరా రీడింగ్ మాస్టర్’! ‘ఆరా’ అంటే చాలావరకు మనం ‘ఆరా కలర్’ చూడడం అనుకుంటాం. మా వాడిలో ప్రత్యేకత ఏంటంటే, డైరెక్టుగా ‘పాయింట్స్’ వచ్చేస్తాయి వాడికి. అంటే ఎవరి ఆరా ఐతే చూస్తాడో, వాళ్ళ గురించి రీడింగ్ చేస్తాడు. వాళ్ళ స్టేటస్ ఎంటి? ప్రత్యేకత ఏంటి? వాళ్ళలోని లోటుపాట్లు ఏంటి? కొందరికి గతం, భవిష్యత్తు కూడా చెప్పేవాడు. వాళ్ళకే తెలియని వాళ్ళ వివరాలు కూడా మా అబ్బాయి ద్వారా వాళ్ళకు తెలిసేవి! ఈ విధంగా ‘ఆరా’ చూసిన వాళ్ళు ఇతరులు ఎవ్వరూ లేరూ. మా పిల్లల ద్వారానే నాకు ధ్యానం యొక్క శక్తి బాగా తెలిసింది. మాకు పుస్తకాల్లో కంటే కూడా ఈ అనుభవాల ద్వారానే చాలా ఎక్కువ విశేషాలు తెలిసాయి!

మారం శివప్రసాద్ : అప్పట్లో పత్రీజీ బోధన ఎలా వుండేది? ఇంకా ఎవరెవరు మాస్టర్లు పత్రీజీ వద్దకు వచ్చేవారు, మీ సెంటర్‌కు?

T. విజయకుమార్ : గుణాకర్, యోగానంద్, రమణయ్య, హరీష్ ఇంకా కొందరు చిన్న పిల్లలు ఒక గ్రూప్‌గా ప్రతి ఆదివారం వచ్చేవారు. అయితే పెద్దవాళ్ళు ముందు రాలేదు. కానీ పిల్లలు బాగా ధ్యానం చేసి అనుభవాలు పొందడం వల్ల, పెద్దవాళ్ళు ఇన్‌స్పైర్ అయి, వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు.

అప్పట్లో పత్రీజీ చాలా కాన్స్‌ప్ట్‌లు చెప్పేవారు. "చక్రాలు అంటే ఏంటి? ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి?" అంతా వివరించి చెప్పేవారు. కర్నూలులో ఎవరికైనా మంచి అనుభవాలు వుండే వాళ్ళను అనంతపురం పిలుచుకొని రావడం వాళ్ళతో చెప్పించడం, ఇవన్నీ "ఒక ధ్యానం క్లాస్" లాగా కాకుండా "ఒక ట్యూషన్ టీచర్" లాగా చెప్పేవారు. పత్రిసార్ ఒక గొప్ప గురువులాగా కాకుండా, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా మూవ్ అయేవారు! మా ఇంట్లో అయితే ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా మూవ్ అయ్యేవారు! అందరం కలిసి సినిమాలకూ, బయటకు డిన్నర్‌కూ వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ఆధ్యాత్మిక చర్చలే చర్చలు! ‘పెద్దవాళ్ళు’, ‘చిన్నవాళ్ళు’ అని తేడా లేకుండా అందరం షేర్ చేసుకునేవాళ్ళం. ఏదైనా క్రొత్త పుస్తకం చదివితే, అందులో మూడు నాలుగు పాయింట్లు ఎవరో ఒకళ్ళం లేవనెత్తే వాళ్ళం. దాని గురించి ఎంతో చర్చ జరిగి ఎన్నెన్నో సమాధానాలు లభించేవి!

పత్రీజీ ప్రతివారం చాలా పుస్తకాలు తెచ్చేవారు. సందేహాలు తీర్చేవారు. డబ్బు ఇచ్చినా, ఇవ్వకపోయినా అందరికీ పుస్తకాలు ఇచ్చేవారు. ఆయన 1992 నుంచి 75 వారాల్లో ఒక ముఫై, నలభై వేల పుస్తకాలు ఫ్రీగా పంచి వుంటారు! అసలు ఆయన డబ్బు విషయం పట్టించుకునే వారే కాదు. అప్పుడూ అంతే, ఇప్పుడూ అంటే! మొదట్లో ఉదయం క్లాసెస్ జరిగేవి. ఆ తర్వాత సాయంత్రం క్లాసస్ కూడా జరిగేవి. కొన్నిసార్లు రెండు, మూడురోజులు కూడా వుండేవారు.

మారం శివప్రసాద్ : పత్రిసార్ సింప్లిసిటీ గురించి చెప్పండి!

T. విజయకుమార్ : మా ఇంట్లో సౌకర్యాలు చాలా తక్కువ. కన్వీయంట్‌గా వుండదు. పాత ఇల్లు. అప్పటికీ, ఇప్పటికీ ఏ మార్పు లేదు. అయితే పత్రిసార్ ఎంతగా అడ్జస్ట్ అయ్యేవారో! "పాత ఇల్లు, సౌకర్యాలు లేవు" అనే అసంతృప్తి నేను ఆయనలో ఎప్పుడూ గమనించలేదు! ఆయనకు ధ్యానం కావాలి. ధ్యానం చేసేవాళ్ళూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవాళ్ళూ కావాలి.. అంతే! ఎక్కడుంటే అక్కడ తమ స్వర్గంగా భావించేవారు. ‘చిన్నవాళ్ళు’, ‘పెద్దవాళ్ళు’ అనకుండా చాలా శ్రద్ధగా బోధించేవారు, సందేహాలకు సమాధానాలు తీర్చేవారు. ఎంత శ్రమపడేవారో. క్రొత్త విషయాలు తెలుసుకుంటూంటే చక్కగా ప్రోత్సహించేవారు. అందరూ ఇంప్రెస్ అయ్యేవారు. ఎంతో బాగుండేవి!

మారం శివప్రసాద్ : అనంతపురం తర్వాత ఏయే సెంటర్స్ రెడీ అయ్యాయి? ధ్యాన ప్రచారం ఎలా వుండేది అప్పుడు?

T. విజయకుమార్ : క్రమంగా అనంతపురంలో మాస్టర్స్ తయారుకావడం మొదలయింది. ఆ తరువాత హిందూపూర్, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్, పామిడి, ధర్మవరం... ఇలా ఒకటొకటిగా చిన్న చిన్నగా క్లాసెస్ మొదలయ్యాయి అనంతపురం జిల్లా అంతా.

అయితే అప్పట్లో చాలా కష్టంగా వుండేది చెప్పడానికి. ఎవరూ అంత తొందరగా ముందుకు వచ్చేవారు కాదు. ఆ తరువాత సార్ ప్రొద్దుటూర్ సెలెక్ట్ చేసుకున్నారు. కర్నూలు నుండి ప్రొద్దుటూరు వెళ్ళి, అక్కడి నుండి అనంతపురం వచ్చేవారు. ప్రొద్దుటూరుకు కూడా పత్రిసార్ దాదాపు ఒక సంవత్సరం వెళ్ళారు! ఆ తరువాత ఉరవకొండలో వెంకటేశ్వర్లు గారు పరిచయమైన తర్వత అక్కడికీ వెళ్ళేవారు. క్రమంగా ఉరవకొండలో రెండవ పిరమిడ్ తయారైంది.

మారం శివప్రసాద్ : మీరేం పుస్తాకాలు చదివారు?

T. విజయకుమార్ : "ఒక యోగి ఆత్మకథ".. కొన్ని "ఓషో" పుస్తకాలు! ఆ తర్వాత పత్రిసార్ సజెస్ట్ చేసి ఇచ్చిన "లోబ్‌సాంగ్ రాంపా మాస్టర్" సీరీస్. ఆ పుస్తకాలు చదివిన తర్వాత నాకు "ఇంకేమి చదవవలసిన అవసరం లేదు" అనిపించింది. అంత బాగున్నాయి ఆ పుస్తకాలు! ప్రాక్టికల్‌గా నాకు కలిగిన అనుభవాలు. సబ్జెక్టు ప్రాక్టీస్ చేయవలసింది చాలా చెప్పారు "రాంపా మాస్టార్" అవి ప్రాక్టీస్ చేయడం, ఇతరులు ఎవరికైనా వచ్చే అనుభవాలను విశ్లేషించుకుంటూ వుండడం చేసేవాళ్ళం. "ధ్యానాంహ్రప్రదేశ్" రెగ్యులర్‌‌గా చదువుతాను.

మారం శివప్రసాద్ : మీ అనుభవాలు అందరితో షేర్ చేసుకునేవారా? కర్మసిద్ధాంతం మీద మీ అభిప్రాయం? ధ్యానం తర్వాత కర్మల అనుభవం ఎలా ఫీలయ్యేవారు?

T. విజయకుమార్ : వచ్చిన అనుభవాలను విశ్లేషించి, బాగా గొప్ప అనుభవమైతే షేర్ చేసుకునే వాళ్ళం. చాలామందికి హెల్త్ చాలా బాగుపడింది. "కర్మలు అనేవి మనం అనుభవించే తీరాలి" అని కొన్ని విషయాల్లో చక్కగా అవగాహన అయింది. అయితే "ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందిన తరువాత ఈ కర్మలను ఈజీగా, ఆనందంగా అనుభవించడం సాధ్యం" అని అనుభవపూర్వకంగా తెలిసింది. అదే అందరికీ చెప్పేవాళ్ళం. అప్పటికీ, ఇప్పటికీ కూడా. ఈ సెంటర్ 1992 లో మొదలయింది. ఇప్పటీకి ప్రతి ఆదివారం ఇక్కడ క్లాస్ వుంటుంది. అపరిమితమైన ధ్యానానందం ఇది!

మారం శివప్రసాద్ : "పిల్లలు వచ్చేవారు మొదట్లో సెంటర్‌కు" అన్నారు వాళ్ళల్లో చాలామంది పెద్దయి, మంచి మాస్టర్లు అయివుంటారు కదా!

T. విజయకుమార్ : అప్పుడు ధ్యానం చేసిన పిల్లలు క్రమంగా ఎంతో డెవలప్ అయ్యారు. మంచి క్వాలిటీస్‌తో మంచి చదువులు, మంచి ఉద్యోగాలు పొందారు. అయినా కూడా వీళ్ళందరూ చక్కగా ఇప్పటికీ ధ్యానప్రచారం చేస్తున్నారు. గుంతకల్ క్రిష్ణ, హరీష్, యోగానంద్, రమణయ్య, గుణాకర రెడ్డి, గుంతకల్ మురళీధర్ రాయదుర్గం రవి, హిందూపురం రవి.. వీరందరిలో తెలుసుకోవాలి అనే తపన చాలా ఎక్కువ. "ఎంత తెలుసుకుంటే అంత ఎదుగుతాం" అనుకునే మాస్టర్స్ వీళ్ళు. ఎప్పుడు కలుసుకున్నా మేమంత చక్కగా షేర్ చేసుకుంటాం మా అనుభవాలను; బాగా తయారు అయ్యారు ఈ సెంటర్ నుండి గ్రేట్ మాస్టర్స్.. ఎంతోమంది!

మారం శివప్రసాద్ : పదహారు సంవత్సరాలకు పైగా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్‌గా మీకు ఎంతో అనుభవం వుంది! మీ అనుభవాలను గ్రంథస్తం చేసారా మీరు?

T. విజయకుమార్ : నాకు గ్రంథస్తం చేయాలని కానీ, ఏదైనా వ్రాయాలని కానీ అనిపించలేదు. పత్ర్రిసార్ నుండి నేను నేర్చుకున్నది ధ్యానం చేయడం, చేయించడం, పుస్తకాలు చదవడం, మరి చదివించడం, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే.. సెంటర్ బోర్డ్ చూసి ధ్యానం గురించి తెలుసుకోవాలని వస్తే, వాళ్ళను సరిగా గైడ్ చేసి, ధ్యానం పట్ల చక్కటి అవగాహన కలిగేలా చేస్తాను.

మారం శివప్రసాద్ : "చిన్నపిల్లల్లో మీ అమ్మాయి బహుశా మొదటి మాస్టర్" అని చెప్పారు కదా! మీ అమ్మాయి అనుభవాలు చెప్పండి!

T. విజయకుమార్ : మా అమ్మాయికి ఎవరైనా చూస్తే, వారిని గురించి మూడు నాలుగు వేల డిటెయిల్స్ వచ్చేవి! స్వామి శివానంద, పుట్టపర్తి సాయిబాబా కూడా గైడెమాస్టర్స్‌గా వచ్చారు ఆమెకి. 1996 సంవత్సరంలో మా నాన్నగారు బాడీవెకేట్ చేశాక మాస్టర్స్ ధ్యానంలో ఆయన ఏ లోకాల్లో వున్నది మా అమ్మాయికి ధ్యానంలో చూపించారు. అంతేకాక మా బంధువులు ఎంతోమందిని బాడీ వెకేట్ చేసినవాళ్ళను చూపించారు. మా అమ్మాయికి అసలు తెలియని వాళ్ళను కూడా చూపించారు. మా అమ్మ సిస్టర్‌ని కూడా చూపారు. ఆమె మా అమ్మాయి గెడ్డం! పట్టుకుని, "మా చెల్లెలు బాగుందా?" అని అడిగిందట! ఆవిడ బ్రతికి వున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే గెడ్డం పట్టుకుని మాట్లాడేదట! ఇంకొకామె చాలా వృద్ధురాలు వచ్చి "బాగున్నావా?" అని అడిగిందట. ఆమె మా బంధువు. మా అమ్మాయికి ఆమె ఎవ్వరో అస్సలు తెలియదు. ఇలా ఇవన్నీ ధ్యానంలో మా అమ్మాయి చూసింది. మరి నాకు అర్థమయిందేమంటే "ధ్యానం అనేది అత్యున్నతమైన విషయం; ధ్యానం ద్వారా దేనికైనా సాధించవచ్చు" అని. ఆస్ట్రల్ ట్రావెల్స్‌పై ఎన్నో ఎక్స్‌పర్‌మెంట్స్ కూడా చేసేవాళ్ళం మేం. "అక్కడికి వెళ్ళి అది చూసిరా" అని. "ఫలానా మోటర్ సైకిల్ ఫలానా చోట పార్క్ చేసి వుంది. దాని నెంబరు చూసిరా.." అని. చాలాసార్లుకరక్ట్‌గా చెప్పేది. పత్రిసార్ కూడా మా అమ్మాయితో ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పర్‌మెంట్స్ చేయించేవారు.

కొన్నిసార్లు మా ఇంట్లోకి వస్తువులు కూడా వచ్చేవి! ఇంట్లో విభూతి, అక్షింతలు వచ్చేవి! ఒకసారి మా అమ్మాయి ఊజా బోర్డ్ వేసింది. ఆసారి పుట్టపర్తి సాయిబాబా వచ్చారు. మా అమ్మాయి అడిగింది, "మీరు వచ్చారు, మాట్లాడుతున్నారు సరే. ఇదెలా నమ్మేది?" అని. "నీకేం కావాలి?" అని అడిగారు ఆయన. "ఏమిస్తారు?" అంటే "విభూతి ఇవ్వనా?, అక్షింతలు ఇవ్వనా?" అన్నారు. "ఎప్పుడిస్తారు?" అంటే "రేపు ఉదయం 9గం||లకు ఫలానా ఫోటో దగ్గర చూడు!" అని. మరుసటి రోజు చూస్తే అక్కడ అవి వున్నాయి. మరి రెండు మూడుసార్లు ఇలా చూసిన తర్వాత క్రమంగా మా అమ్మాయి ఒకసారి సంకల్పం పెట్టుకుంది. "నాకు ఏ మిరాకిల్స్ వద్దు. ఇవి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. ధ్యానం బాగా వుంటే చాలు" అని, ఇక అప్పటినుంచి అవన్నీ ఆగిపోయాయి!!

కొందరు మాస్టర్లు వారివారి ఒకానొక సిద్ధిని ఈ విధంగా ప్రదర్శిస్తూ వుంటారు. దీనివల్ల "భక్తిమార్గం" మరింత వృద్ధి అవుతుంది. ఆయా మాస్టర్స్ పట్ల మరింత అంకితభావాన్నిపెంచుకుంటారు ఆ భక్తులు. అయితే అవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు, నమ్మకాలు. ధ్యానం ఒక్కటే సరియైన మార్గం, సత్యమైన మార్గం!!

మా అబ్బాయి చాలా హై లెవెల్ థర్డ్ ఐ మాస్టర్! క్రికిట్ స్కోర్ కూడా ముందే చెప్పేసేవాడు. అలా ఎన్నో విషయాలు ఎన్నోసార్లు చెక్ చేసుకుని తన విజన్స్ సత్యం అని తెలుసుకున్నాడు. మా అబ్బాయి. విజన్స్ నాకు ప్రూఫ్. ఎన్నోసార్లు వాడు చెప్పే విషయాలు నేను కూడా విని, కన్‌ఫర్మ్ చేసుకున్నాను. పత్రిసార్ కూడా మా అబ్బాయి విజన్స్ విని అడిగి మరీ చెప్పించుకునేవారు. అలాగే సార్ బావమరిది ద్వారకానాథ్ మావాడి "ఆరా సీయింగ్ పవర్" పట్ల ఎంతో సంతోషపడ్డారు. ఆయన వినోద్‌ను ఒకసారి మెడిటేషన్‌లో కూర్చోబెట్టి ‘ఆరా’ గురించి అడిగి వాడి క్లారిఫికేషన్ పట్ల చాలా సంతృప్తి చెందారు! మామూలుగా ద్వారకానాథ్ ఎవ్వరికీ ఏమీ చెప్పరు. అలాంటిది మా వాడికి గైడెన్స్ ఇచ్చేవారు!

మారం శివప్రసాద్ : 1992 ప్రాంతాల్లో ఆయనతో చాలా ఈజీగా, చాలా సులభంగా, చాలా క్లోజ్‌గా, చాలా ఎక్కువకాలం గడిపారు కదా మీరు. అప్పటి విషయాలు ఇంకా చెప్పండి!

T. విజయకుమార్ : ఆయన ప్రతి విషయానికీ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ధ్యానంలో ప్రతి ఒక్కరి అనుభవాలనూ శ్రద్ధగా వినేవారు. ఇప్పటికీ అంతే! వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ టీచ్ చేసేవారు అప్పట్లో. అంత సావకాశం వుండేది ఆయనకు. ఎవరికి ఏ చిన్న అనుమానం వచ్చినా క్లారిఫై చేసేవారు. నేను ఇంట్లో ఫ్రీగా వుండేవాడిని. ఉద్యోగం ఏమీ చేసేవాడిని కాను. "ఫ్లూట్ వాయించండి" అని అడిగితే వెంటనే వాయించేవారు! "కాఫీ త్రాగుదామా?"వెంటనే త్రాగేవాళ్ళం!

ఆయన ఏదో ఒకటి చెపుతూనే వుంటారు. విన్నవాళ్ళది భాగ్యం. విననివారిది ఖర్మం. "రాంపా’ ఇలా చేశాడు; సేత్ ఇలా చెప్పాడు; కృష్ణుడు వివరించింది భగవద్గీతలో ఇలావుంది" అని చెప్పేవారు. ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందుకనే మాకంతా కూడా ప్రాక్టికల్‌గా వుండడం అలావాటయ్యింది. కనుక మా బోధన కూడా అలానే వుంటుంది.

మారం శివప్రసాద్ : సార్ అప్పట్లో జాబ్ రిజైన్ చేశారు కదా! మరి అప్పట్లోనే కర్నూల్లో పిరమిడ్ కట్టారు. డబ్బుకు ఇబ్బంది వుండేది కదా మరి. ఆయా సందర్భాల్లో ఆయన ఎలా వ్యవహరించేవారు? ఫ్యామిలీతో ఎలా వుండేవారు?

T. విజయకుమార్ : ఆయనకొక పాత డొక్కు స్కూటర్ వుండేది. అది చాలాసార్లు మొరాయించేది. ఒకసారి డబ్బు కట్టక టెలిఫోన్ కూడా డిస్‌కనెక్ట్ అయ్యింది ఆయన ఇంటికి. స్కూటర్‌లో పెట్రోలు లేకపోయినా, టెలిఫోన్ డిస్‌కనెక్ట్ అయినా చేతిలో అవసరానికి డబ్బులేకపోయినా, ఆయనలో ఏ ఫీలింగ్ వుండేది కాదు! అసలు ఏవీ వ్యక్తపరిచేవారు కాదసలు! ఈయన ఉద్యోగం రిజైన్ చేశారని వాళ్ళ అన్నయ్య, ఇతర బంధువులు, పత్రి మేడమ్ అందరూ కూడా ఎప్పుడూ ఎక్కడా కామెంట్ చేయలేదు.

మారం శివప్రసాద్ : అప్పట్లో క్లాసెస్ ఎలా వుండేవి? ఏ టైవ్‌లో కండక్ట్ చేసేవారు? వన్‌డే వర్క్‌షాప్ వుండేదా? అప్పుడు కూడా భోజనాలూ అవీ పెట్టేవారా క్లాసులో? ఎలా ఆర్గనైజ్ చేసేవారు?

T. విజయకుమార్ : అప్పట్లో క్లాసెస్ ఇలా చేయాలని ఏమీ క్లియర్‌గా ఆయనకు కూడా బహుశా తెలియదేమో! "రమణ మూర్తి" అని ఒక సీనియర్ మాస్టర్ వున్నాడు.. ఇక్కడే అనంతపురంలో..మొట్టమొదటి "వన్‌డే వర్కషాప్" ఆయనే ఆర్గనైజ్ చేశారు. నాకంటే సీనియర్ ఆయన. ఎక్స‌లెంట్ ఆర్గనైజర్! బ్రేక్‌ఫాస్ట్, టీ, లంచ్ అన్నీ ఆయనే అరేంజ్ చేసి ఉచితంగా వన్‌డే వర్క్‌షాపు నిర్వహించారు. వేమన గురించిన వర్క్‌షాప్ కూడా ఇక్కడే అనంతపురంలో రమణమూర్తి ఏర్పాటుచేశారు పత్రిసార్‌కు. ఆ వేమన వర్క్‌షాపులోనే ఉరవకొండ వెంకటేశ్వర్లు పత్రిసార్‌‌ను మొట్టమొదట కలిశారు. ఆ తరువాత వెంకటేశ్వర్ల ఫ్యామిలీ ఎంటర్ అయ్యింది అలా!

మారం శివప్రసాద్ : "పత్రిసార్ చాలా ఫ్రెండ్లీగా వుండేవారు" అని చెప్పారు కదా! అప్పటికీ ఇప్పటికీ ఆయనలో తేడా ఏమైన వుందా?

T. విజయకుమార్ : ఒకరోజు నేను, సార్‌ మరి సంపత్ రోడ్లో నడుచుకుంటూ వస్తున్నాం. ఏదో ఒక పాత జీప్ రోడ్లో వుంది శిథిలమై. ముగ్గురం దాని ప్రక్కనే కూర్చున్నాం. కబర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంటికొచ్చాం. ఆయన ఎప్పుడూ ఏ ప్రత్యేకతా కోరుకోలేదు. ఇన్‌డివిడ్యువాలిటీని మెయింటెయిన్ చెయ్యడం గానీ, డిగ్నిటీ ఫీల్ కావడం కానీ ఏమీ వుండదు. ఎటొచ్చీ అప్పుడు సావకాశంగా దొరికేవారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటన వల్ల టాప్ మోస్ట్ బీజీగా అయ్యారు. అంటే. అప్పట్లో ఆయన్ను చక్కగా అర్థం చేసుకోవడానికి సమయం, వీలు వుండేది. ఇప్పుడు వీలు, సమయం ఆయనకూ లేవు. మన మనుషులకూ తక్కువే. స్నేహానికి ఆయన గొప్ప నిర్వచనం!

"ఆనాపానసతి మెడిటేషన్" వల్ల ఎవరైనా సరే ఆ "కాస్మిక్ ఎనర్జీ బేస్" కి కనెక్ట్ అవుతున్నారు. ఎవరికైన ఏదైనా సందేహం వుండి వారు ధ్యానంలో కూర్చుంటే వారికి ఎనర్జీ బేస్ నుండే రిప్లై వస్తోంది. మనకు పత్రీజీయే కనపడుతూ, చెపుతున్నట్లుంటుంది. రిప్లై మాత్రం ఆ బేస్ నుండి వస్తోంది. ఎవరైనా ఏదైనా కోరుకుంటే కూడా, వారి సంకల్పం, కోరిక తీర్చతగింది, తీరతగిందీ అయితే ఆటోమాటిక్‌గా ఆ బేస్ నుండి తీరుతోంది.

సార్ ని అడగండి-"నేను ఏమీ చేయలేదు. నాకేమీ తెలియదు. నాకు సంబంధం లేదు" అంటారు. అయన చాలా చాలా కష్టపడ్డారు. రాత్రింబవళ్ళు శ్రమించారు. ఇప్పుడు ఆయన అలా చేసుకుంటూ వెళుతున్నారు అంతే! అదే అప్పటికీ, ఇప్పటికీ ఆయనలోనూ, ఆయనను చూసే మనలోను వున్న తేడా. అప్పుడు చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతోంది. లక్షలాదిమంది ఆయన పిలుపుమేరకు పరుగెడుతూ ధ్యానప్రచారం చేస్తున్నారు! కోట్లమంది ధ్యానం చేస్తున్నారు!

ఇప్పుడు ఆయన మల్టీడైమెన్షనల్ ‌స్టేట్ అయిపోయారు. ఒక క్లాసు జరిగితే, ఆయన వచ్చి కూర్చుని వెళ్ళిపోతే కూడా చాలు, మిగతాది అదే జరిగిపోతుంది, జరిగిపోతోంది కూడా. ఏ అద్భుతాలు, మిరాకిల్స్ చేయవలసిన అవసరం ఆయనకు లేదు. అవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి అంతే. కారణం "కాస్మిక్ ఎనర్జీబేస్"! మిగతావాళ్ళకు ప్యాపులారిటీ కావాలి. వారు చేయకతప్పదు!

మారం శివప్రసాద్ : ధ్యానం గురించి అపట్లో ..1992-93-94 ప్రాంతంల్లో.. మీరేం అనుకునేవారు? ఇక్కడ మొదటి పెద్ద పిరమిడ్ నిర్మాణం జరిగింది కదా. దాని విశేషాలు చెప్పండి!

T. విజయకుమార్ : పత్రీజీ వల్ల "ప్రపంచంలో ధ్యానం తప్ప మరేం లేదు" అనే స్థితికి వెళ్ళిపోయాం అప్పట్లో మేమంతా. పత్రీజీ చెప్పే కాన్స్‌ప్ట్, ఎన్నో స్పిరిచ్యువల్ బుక్స్ చదవడం, ఇక అంతా అదే లోకం! ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఆయనతో ఎంతో తీరికగా, క్లోజ్‌గా, లీజర్‌గా, రిలాక్స్‌డ్‌గా గడిపేవాళ్ళం! ముఖ్యంగా నేను, సంపత్‍కుమార్, రమణమూర్తి, ప్రతాప్! క్రమంగా ధ్యానం పట్ల మాకున్న మక్కువ ఇక్కడ పెద్ద పిరమిడ్ నిర్మాణం జరిగేలా రూపుదిద్దుకుంది. సంపత్ కుమార్ పిరమిడ్ స్థలం కోసం, ఆ తర్వాత నిర్మాణం కోసం చాలా చాలా కృషి చేశారు. ప్రతాప్, నేను, ఇలా అందరం ఆ పనిలో భాగస్వాములమే. ఆ ఇన్స్పిరేషన్ అలా వుండేది.

మారం శివప్రసాద్ : శ్రీ సదానందయోగి గురించి పత్రీజీ మీకంతా ఏం చెప్పేవారు?

T. విజయకుమార్ : పత్రీజీ ఉద్యోగరీత్యా ఎక్కువగా టూర్‌లోనే ఉండేవారు. అయితే "కర్నూలు లో ఉన్నప్పుడూ మాత్రం వీలయినంత ఎక్కువ సమయం సదానందయోగి తో గడిపేవాడిని" అని పత్రీజీ చెప్పేవారు. "వారికి భోజనం, టీ, సిగరేట్లు తెచ్చి పెట్టేవాడిని; సదానందయోగి చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడిని" అని చెప్పేవారు.

మారం శివప్రసాద్ : మీ అమ్మాయి, అబ్బాయి ద్వారా మరి అపట్లో పత్రీజీ మిరాకిల్స్ ఏమైనా చూశారా!

T. విజయకుమార్ : పత్రీజీ ఎప్పుడూ మిరాకిల్స్ చేసినట్లు కానీ, చూపించినట్లు కానీ వుండరు. తాను చూపేమార్గంలో వాటంతట అవే మిరాకిల్స్ అనుభవంలోకి వస్తాయి. Meditation itself is a miracle! ధ్యానం చక్కగా చేస్తూ దానిపై విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో, క్రమంగా ఆ మిరాకిల్స్ ‌కూడా ఆగిపోతాయి. దృశ్యం శ్రవణం.. ఆపై శూన్యం... అని తెలుసుకోవాలి. మిరాకిల్స్ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకాలే.

ప్రాపంచిక విషయాలు ఏ విధంగా మనల్ను చీకాకు పరుస్తూ వుంటాయో, స్పిరిచ్యువాలిటీలో కూడా క్రమంగా మిరాకిల్స్ కూడా డిస్ట్రబెన్స్ అనిపిస్తాయి. స్పిరిచ్యువల్ ప్రోగ్రెస్‌లో మిరాకిల్స్ ప్రాపంచికం. అవి క్రమంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆపడమే కాక కొన్నిసార్లు జ్ఞానభ్రష్ఠత్వానికి కూడా దారితీస్తాయి. చాలా మంది మిరాకిల్స్ మీదనే, అనుభవాల మీదనే దృష్టి పెట్టి ఆగిపోతారు లేదా జారిపోతారు.

ధ్యానం చేస్తూ, శారీరక, మానసిక ఆరోగ్యం, పనుల్లో నైపుణ్యం పొంది కార్యసిద్ధితో సాగిపోయేవారు ఎక్కువగా ఆలోచించివలసిన పనిలేదు. ప్రోగ్రెస్ జరుగుతూపోయేకొద్దీ "సిద్ధులు" అంటే "పవర్స్" ఆటోమేటిక్ గా వస్తూ వుంటాయి. వాటిని క్రమంగా అధిగమిస్తూ ముందుకు పోవాలి. అవి మన ఆత్మ పురోగతికి అడ్డుకాకూడదు. భౌతిక జీవితంలో వ్యాపారం, రాజకీయాలు, పదవులు అనే మత్తులో మనం ఎలా పడిపోతామో స్పిరిచ్యువాలిటీలో సిద్ధుల మత్తులో అలా పడిపోతారు సాధకులు చాలామంది.

ఉదాహరణకు మనం ఎవరికైనా హీలింగ్ చేస్తే బాగా హీల్ అయిందనుకోండి, అలా కొన్నిసార్లు జరిగితే మనకు "హీలింగ్ కెపాసిటీ వచ్చింది" అని అర్థం. అలాగే థర్డ్ ఐ ఓపెన్ అయి గతజన్మలు, ఫ్యూచర్ మరెన్నో తెలుస్తాయి. ఇవి తెలియడం వల్ల మనకు "ఈ పవర్స్ వచ్చాయి" అని అర్థమవుతుంది. పత్రీజీ మనల్ను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. మనం పొందిన ఏ డెవలెప్‌మెంట్ వల్ల కూడా మనం అహంకారం పొందకుండా, సిద్ధులలో మునిగి పోకుండా వుంటే, ఒకనాటికి మనమూ కొంత గొప్పస్థాయి పొందగలం.

పత్రీజీ ఎందుకు మిరాకిల్స్ చూపడం లేదు? మనం కూడా స్వయంగా ఆ స్థితికి సాధించుకోవాలి!!

పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శసూత్రాలు ఒకసారి గుర్తు చేసుకుందాం! ఏవైతే ఒక ఆత్మజ్ఞాని అవలంబించాలో వాటిని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇంత ఖచ్చితంగా చెప్పినవారు పత్రీజీ తప్ప మరెవరూ లేరు! గురుశిష్య సంబంధాలు లేవు; అందరూ ఒక్కటే; వ్యక్తి పూజ లేదు; కర్మకాండలు అవసరం లేదు.. ఈ విషయాలు స్పష్టంగా, సూటిగా ఆయన చెప్పారు. తాను ఆచరిస్తూ అందరితో ఆచరింపజేస్తున్నారు. అందుకే మనం ఆయన వెంట వెళ్ళగలుగుతున్నాం.

మారం శివప్రసాద్ : పత్రీజీ లో జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోరు! ఈ విషయంలో మీ అనుభవం?

T. విజయకుమార్ : పత్రీజీలో ‘కృతజ్ఞత’ అనేది హయ్యస్ట్ లెవెల్లో వుంటుంది. ఆయన ఇచ్చే గౌరవం చాలా గొప్పగా వుంటుంది. ఒకసారి హైదరాబాద్‌లో ఆయన ఇంటికి లంచ్‌కి వెళ్ళాను. ఆయన నా కోసం ఎదురు చూస్తూ వున్నారు. నన్ను చూసి లేచి చెయ్యి పట్టుకుని తీసుకుని తాను కూర్చున్న ఈజీ ఛైర్‌లో కూర్చోబెట్టారు. ఆ తరువాత ఎప్పుడో గుర్తు చేసుకున్నాను నేను ఆ విషయం. అనంతపురంలో ఎప్పుడు మా ఇంటికి వచ్చినా నేను రెగ్యులర్‌గా కూర్చునే కుర్చీలో కూర్చునేవారు పత్రీజీ. ఆయన ఆ విషయం గుర్తుపెట్టుకుని తాను కూర్చున్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు! పదార్థాలన్నీ ప్లేట్‌లో వడ్డించి, తింటూ వుంటే మళ్ళీ మళ్ళీ దగ్గరుండి వడ్డించారు! మేము మా ఇంటికి పత్రిసార్ వచ్చినప్పుడు చేసిన సత్కారం కంటే కొన్నిరెట్లు ఎక్కువ సత్కారం ఆయన నాకు చేశారు! ఆయనతో అటువంటి క్వాలిటీస్ మరి అంత జ్ఞాపకశక్తి అద్భుతం!

మారం శివప్రసాద్ : గ్రేట్ మాస్టర్స్ పట్ల పత్రీజీ అభిప్రాయం?

T. విజయకుమార్ : పత్రీజీకి యోగులందరి పట్లా అమితగౌరవం!

మారం శివప్రసాద్ : ధ్యానం చేసేవారికీ, ధ్యానప్రచారం చేసేవారికీ ఒకానొక సీనియర్ మోస్ట్ మాస్టర్‌గా మీ సలహా!

T.విజయకుమార్ : "నేను సదా నేర్చుకునేవాడినే" అని ప్రతిమాస్టర్ గుర్తుంచుకోవాలి. "అంతా సాధించేశాను" అని ఎవరైనా అనుకుంటే, "ఏమీ సాధించలేదు" అని అర్థం. ధ్యానప్రచారం చేసేవారు ఎవరికి తగినట్లుగా వారికి బోధించాలి. ఒక్కొక్కసారి అవసరం ఒక్కొక్కలా వుంటుంది. అలాగే ఎవరి సమస్యలు వారికి వుంటాయి. కనుక వారు వారికి తగినట్లుగా బోధించగలిగితే మరింత త్వరగా కొత్తవారు ధ్యానంలో నిమగ్నమవుతారు.

పత్రీజీ స్వయంగా చేసినంతగా ధ్యానప్రచారం ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు బహుశా! ముందు ధ్యానం చేయాలంటే చాలా కష్టసాధ్యమయ్యేది. ధ్యానాన్ని ఇంత సులభంగా బోధించినవారు, ఇంత విరివిగా అందించిన వారు పత్రిజీ మాత్రమే!

మనుష్యుల్లో కల్మషాలు, వైరుధ్యాలు, వైషమ్యాలు సర్వసహజంగా వుంటాయి. మెడిటేషన్ చేస్తూ వుంటే వారిలో మార్పు సహజంగానే వస్తూ వుంటుంది. ప్రతి ఒక్కరికీ ధ్యానం నేర్పించాలనే తపన పత్రీజీది! ‘ధ్యానం’, ‘జ్ఞానం’, ‘మోక్షం’ అని పదాలను వల్లించే వారే కానీ వాటిమధ్య వున్న విషయజ్ఞానాన్ని వివరంగా అంతకుముందు పత్రీజీ లాగా ఎవ్వరూ బోధించలేదు! పత్రీజీ మాత్రమే " ప్రతి కామన్‌మ్యాన్‌కూ, ప్రతి ఒక్కరికీ ధ్యానం అవసరం" అని అందరిలోకి ధ్యానాన్ని తీసుకుని వచ్చారు!

మారం శివప్రసాద్ : మీ ఆధ్యాత్మిక జీవితంలోని ముఖ్య విషయాలు కానీ, అనుభవాలు కానీ చెప్పండి!

T. విజయకుమార్ : 1992 లో నాకు, మా తండ్రిగారికి కూడా ధ్యాన పరిచయం అయింది. ఆ తర్వాత మూడు నెలలకే మా తండ్రిగారు మరణించారు. వారి డేడ్‌బాడీని మోసుకుని వెళ్ళాం. ఆ తరువాత రోజు నుంచి నా తొడల్లో విపరీతమైన నొప్పి వచ్చింది. అదెట్లా వుండిందంటే ఒకసారి కూర్చుని మళ్ళీ లేవాలంటే విపరీతమైన నొప్పి. లేవడానికి 15 నిమిషాలు పట్టేది. ఎందుకంత నొప్పి వచ్చేదో నాకర్థం కాలేదు.

రాత్రి పడుకుని వుంటే మధ్యరాత్రి మెలకువ వచ్చింది. భౌతికంగా ఒక వ్యక్తి, పంచకట్టుకుని వున్నారు. షర్టు లేదు. విభూతి పెట్టుకుని వున్నారు. నా మంచం మీద కూర్చుని, నా కాలు తన చేతుల్లోకి తీసుకుని అంతా నిమిరారు. "ఎవరో యోగిలా వున్నారు, ఇంత గొప్పవారు నాకాళ్ళు నిమురుతున్నారే! ఎంతసేవ చేస్తున్నారు!" అనుకున్నాను. ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు. నేనూ ఏమీ అడగలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను -"ఆయన వచ్చి హీల్ చేసి వెళ్ళారు. అంటే నా నొప్పి తగ్గాలి కదా" అని లేచి కూర్చుని కాలు విదిలించాను.. నొప్పి లేదు! ఆ రోజు 50% రిలాక్స్‌డ్‌గా వుంది. మరుసటిరోజుకు మొత్తం నొప్పిపోయింది. ఈ అనుభవం 16 ఏళ్ళయినా ఇంకా బాగా కళ్ళముందు జరిగినట్లే గుర్తుంది.

ఈ రూమ్‍లో ఒకప్పుడు మంచాలు లేవు. క్రిందనే పడుకునే వాళ్ళం. ఒకసారి పడుకుని వుంటే రెండు కాళ్ళు ఒకటి అయ్యాయి. సెకన్లలో నేను నీళ్ళల్లో వున్నాను. నేను నీరుగా అయిపోయిన అనుభూతి. నీటి ఎలిమెంట్ ని ఎంజాయ్ చేశాను ఆ రోజు! ఆ రోజు! ఆ గట్టు మీద కొన్ని చెట్లున్నాయి. ఆకులు మీద పడుకున్నా, ఏమీ ఫీలింగ్ లేదు. నేను నీరు అయిన ఫీలింగ్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు, ఏదైనా స్పర్శ తగిలినా, ఆ స్పర్శ భావన ఏమాత్రం లేదు. ఆ నీటిలో ఫ్లో కానీ, ఉధృతం కానీ ఏమీ అనిపించలేదు. కొన్ని క్షణాలు ఆ అద్భుత అనుభూతిని ఎంజాయ్ చేశాను. ఇలా ఆస్ట్రల్ ట్రావెల్‌లో నాకు ఎక్స్‌పీరియన్స్ అయిందేమంటే "నేను దేహాన్ని కాను, ఆత్మను" అని!

క్రమక్రమంగా నా స్వభావంలో చాలా మార్పు వచ్చింది. ఒక స్థితి మెయిన్‌టెయిన్ చేయడం. విజన్స్ కంటే కూడా ఈ భౌతిక స్థితిలో మంచి మార్పులు అవసరం. ఆ స్థిరత్వాన్ని నేను పొందాను.

మారం శివప్రసాద్ : మీరు అధికంగా ఆనందించే విషయాలు??

T. విజయకుమార్ : ‘ధ్యానం’ ‘పిరమిడ్’, ‘ధ్యాన బోధన’.. ఇవే నన్ను ఆనందింపజేసే విషయాలు. తరువాత ఈ కంప్యూటర్ యుగంలో ప్రజలకు "పుస్తకాలు చదవడం" అనేది బాగా తగ్గిపోయింది. అయితే అనంతపురంలో బుక్‌స్టాల్స్‌లో స్పిరిచ్యువల్ బుక్స్ సేల్స్ చేయించడం మొదటినుండీ చేశాను నేను. స్పిరిచ్యువల్ బుక్స్ బుక్‌స్టాల్స్‌లో సేల్ చేయడం క్రమంగా రాష్ట్రమంతా ప్రాకింది. ఇవాళ బుక్‌స్టాల్స్‌లో టెక్స్ట్‌బుక్స్‌తో పాటు సేల్స్ అయ్యేవి ఆధ్యాత్మిక పుస్తకాలు మాత్రమే! ఆ విషయం గుర్తు చేసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా వుంటుంది.

మారం శివప్రసాద్ : పత్రీజీ తో పొందిన అనుభూతులు ఇంకా చెప్పండి!

T. విజయకుమార్ : పత్రీజీ ఒక మహా ఎన్‌సైక్లోపీడియా! ఎప్పుడూ వర్తమానంలోనే వుంటారు. "అది అలా ఎందుకు జరిగింది?అని ఎప్పుడూ అడగరు ఆయన! "ఫలానా క్లాస్ సరిగ్గా ఎందుకు జరగలేదు?" అని ఆయన అడగరు! శ్రద్ధగా క్లాస్ కోసం మనం ప్రయత్నం చేశామా లేదా అని మాత్రమే చూస్తారు ఆయన. ఈ క్లాస్‌కు మనం పదివేలమంది వచ్చేలా చూడాలి అని చెపుతాం. అయితే, అక్కడ ఏడెనిమిది వందలమంది మాత్రమే వచ్చి వుంటారు.

"అవునయ్యా! ‘పదివేలమంది’ అని మనం చెప్పడం వల్ల కనీసం ఏడెనిమిది వందలమందైనా వచ్చారు లేకపోతే ఒక వందమంది మాత్రమే వచ్చి వుండేవారు" అంటారు పత్రిసార్.

అప్పట్లో చైన్ మెడిటేషన్, ఊజాబోర్డ్ వేయించడం ఇలా ఎన్నెన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేయించేవారు. ఒక్కొక్కరి అనుభవాలు ఓపికగా విన్నవారు. ఎవరు ఏ అనుభవం పొందినా దాన్ని విశ్లేషించి, వారిని ప్రశంసించి, చప్పట్లు కొట్టించేవారు. ఇది పత్రీజీలో ఎంతో గొప్ప గుణం .. కొత్తవారు అయినా, పాతవారు అయినా శ్రద్ధగా అందరివీ వినేవారు!

మారం శివప్రసాద్ : "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్ ఎలా వుంది? మీరు రెగ్యులర్‌గా చదువుతున్నారా? మ్యాగజైన్ పైన మీ అభిప్రాయం?

T. విజయకుమార్ : "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్ చక్కగా వుంటోంది! ఎన్నో విషయాలు అందులో వస్తూండడం వల్ల ఎవరికైనా ధ్యానం గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేకుండా, ఆ మ్యాగజైన్ ఇస్తే చాలు అంతా చెప్పినట్లవుతుంది. సత్యాలన్నీ తెలిసిపోతాయి. ధ్యానం చేయడానికి, సందేహాలు తీర్చుకోవడానికి ఎంతో వీలవుతోంది. ఎంకరేజింగ్‌గా వుంటుంది ఈ మ్యాగజైన్ రెగ్యులర్ గా చదువుతూ వుంటే.

మారం శివప్రసాద్ : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం?

T. విజయకుమార్ : "ధ్యానాంధ్రప్రదేశ్" చక్కటి ఆధ్యాత్మిక పత్రిక. అందరితో కొనిపించి, చదివించండి. ధ్యానంలో కలిగే అనుభవాల కంటే, ధ్యానం ద్వారా భౌతిక జీవితంలో కలిగేమార్పులు ముఖ్యం. కనుక మీ స్వభావాల్లో మార్పులు వస్తాయి. వాటిని చక్కగా గమనించి మరింత మరింత ప్రోగ్రెస్ కావాలి ప్రతి ధ్యానీ!

Go to top