" సత్యపూర్వకమైన స్థితిలో ఉండే సద్గురువులు.. అన్నింటికీ అతీతులు "

 

భగవాన్ సత్యసాయి బాబా వారి తెలుగుప్రసంగాలను 23 సంవత్సరాల పాటు అనేకానేక వేదికల పై ఆంగ్లంలోకి ప్రత్యక్షంగా తర్జుమా చేసి బాబాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రొఫెసర్ K. అనిల్ కుమార్.. గొప్ప సాహితీవేత్తలు. అవతారపురుషుల లీలలనూ, వారి సందేశాలనూ, ఇంటర్వ్యూలనూ గ్రంథస్థం చేసిన ఈ బహుభాషాకోవిదులు.. పిరమిడ్ ధ్యానప్రపంచానికి కూడా ఆప్తులు! 2012, డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడ్తాల్‌లో జరిగిన ప్రపంచధ్యాన మహాసభల్లో 26 తేదీన ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన తమ అమూల్యమైన సందేశంతో అక్కడ హాజరైన లక్షలాది ధ్యానులను ఆనందపారవశ్యంలో ముంచిన ప్రొ|| అనిల్ కుమార్ గారికి ఆత్మప్రణామాలు అర్పిస్తున్నాం! అడిగిన వెంటనే "ధ్యానాంధ్రప్రదేశ్" కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..


మారం : భగవాన్ సత్యసాయి వారికి అత్యంత సన్నిహితులు అయిన మీరు "ఇన్నర్ వ్యూ" ద్వారా పిరమిడ్ ధ్యానప్రపంచంతో మీ భావాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ గురించి తెలియజేయండి స్వామీ!

ప్రొ||అనిల్ కుమార్ : పరమయోగీశ్వరులు బ్రహ్మర్షి పత్రీజీ బ్రహ్మజ్ఞాన మార్గంలో జీవితాలను సార్థకం చేసుకుంటూన్న మీ పిరమిడ్ మాస్టర్లందరికీ ముందుగా నా ఆభినందనలను తెలియజేసుకుంటున్నాను.

కుటుంబపరంగా చూస్తే.. నేను గత మూడుతరాలుగా ప్రముఖ సంఘసంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్ గారు స్థాపించిన "బ్రహ్మసమాజం" ప్రభావంతో పునీతమైన కుటుంబానికి చెందిన వాడిని. మా పితామహులు శ్రీ కామరాజు హనుమంతరావుగారు, మా తండ్రిగారు శ్రీ కామరాజు బాపయ్య, అమ్మగారు శ్రీమతి సరోజినీదేవి, మాతామహులు శ్రీ పాలపర్తి నరసింహంగారు.

మా పితామహులు, మాతామహులు ఇద్దరూ ప్రముఖ బ్రహ్మసమాజ ప్రచారకులు కావడంతో నేను కూడా పూర్తిస్థాయి బ్రహ్మసమాజ సిద్ధాంత మార్గంలోనే పెరిగాను. వాళ్ళిద్దరూ ఆంధ్రదేశానికి చెందిన ప్రముఖ సంఘసంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారి సమక్షంలో.. స్వయంగా వారి చేతులు మీదుగానే తమతమ వివాహాలను జరిపించుకున్నారు!

మా పితామహులు కామరాజు నరసింహంగారు.. "ధర్మజ్యోతి" అనే మాసపత్రికకు 45 సంవత్సరాలపాటు సంపాదకులుగా ఉంటే .. మా మాతామహులు పాలపర్తి నరసింహంగారు "ధర్మసాధాన" అనే మాసపత్రికకు 50 సంవత్సరాల పాటు సంపాదకులుగా ఉన్నారు. ఇద్దరూ కూడా జీవిత కాలమంతా ధర్మమార్గంలోనే తమతమ ఆధ్యాత్మిక జీవితాలు గడుపుతూ.. సంఘసంస్కరణలో ముందుండి తమ లౌకిక జీవితాలను కూడా సార్థకం చేసుకున్న మహనీయులు.

కలకత్తాలోని బ్రహ్మసమాజంలో సాధారణ కార్యకర్తలుగా శిక్షణపొందిన వీళ్ళిద్దరూ.. ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం, బెంగాలీ భాషల్లో మంచి ప్రావీణ్యం పొంది.. ఎన్నెన్నో ఉద్గ్రంథాలు రచించారు. ఒకరు ఉభయగోదావరి జిల్లాలో బ్రహ్మసమాజ ప్రచారకులైతే.. మరొకరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ ప్రచారాన్ని సాగిస్తూండేవారు. అలాంటి కుటుంబంలో జన్మించడంతో నాకు కూడా చిన్నప్పటినుంచే ధార్మిక జీవనం అన్నది అలవడింది.

నేను వృక్షశాస్త్రంలో B.Sc. చదివి, సైకాలజీలో M.Sc. చేసాను. గుంటూరు.. "ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ" లో 26 సంవత్సరాల పాటు "లెక్చరర్" గా పనిచేసాను. ఆ తరువాత భగవాన్ సత్యసాయి ఆదేశం మేరకు బెంగళూరు.. సత్యసాయి కళాశాలకు ఆరు సంవత్సరాల పాటు ప్రిన్సిపాల్‌గా పనిచేసి.. అటు తరువాత "పుట్టపర్తి సాయి విద్యాసంస్థ" లో 17 సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పనిచేసాను. ఇప్పుడు నా వయస్సు 70 సంవత్సరాలు.

నా భార్య శ్రీమతి విజయలక్ష్మి B.Sc. B.Ed. చదివిన విద్యావంతురాలు! నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్న గృహిణి! మాకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరూ ఉన్నత చదువులు చదివి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో వివిధ ప్రాంతాల్లో చక్కగా స్థిరపడ్డారు. కూతుళ్ళూ, అల్లుళ్ళూ.. కొడుకూ, కోడలూ .. అందరూ బాబా నీడలో పెరిగినవారే!

మారం : మీరు సత్యసాయిబాబాని ఎక్కడ, ఎలా కలుసుకున్నారు?

ప్రొ||అనిల్ కుమార్ : నా భార్య అనారోగ్యం కారణంగా నేను బాబా మార్గం లోకి రావడం జరిగింది. 1972లో ఒకసారి నా భార్య విపరీతమైన అనారోగ్యానికి గురిఅయ్యింది. ఎంతమంది డాక్టర్లుకు చూపించినా, ఎన్ని మందులు వాడినా ఆమె శరీరం స్వస్థత పొందలేదు. అంతకు ముందే బాబావారి గురించి విని ఉండడం చేత ఇద్దరం కలిసి పుట్టపర్తి వెళ్ళాము.

స్వామివారి దర్శనం చెసుకున్నప్పటి నుంచీ నా భార్య ఆరోగ్యం కుదుటపడసాగింది. కొద్ది సమయంలోనే ఆవిడ పూర్తి స్వస్థత పొందడంతో మేము తరచూ పుట్టపర్తికి వెళ్ళిరావడం చేస్తూండేవాళ్ళం.. అయితే 1978 వరకూ బాబా నా మొహం చూడడం గానీ, నాకు పాదనమస్కార భాగ్యం ఇవ్వడంగానీ జరుగలేదు. నేను కూడా కాస్త దూరంగానే ఉండేవాడిని కానీ ఇద్దరం ప్రతి పండుగకూ, పర్వదినాలకూ పుట్టపర్తికి వెళ్తూనే వుండేవాళం. 1978 లో బాబా నన్ను మొట్టమొదటిసారి పలుకరించారు.

చిన్నప్పటి నుంచీ ఆడ్యాత్మిక వాసనలతో, బ్రహ్మసమాజ మార్గంలో నేను పెరిగి ఉండడంతో.. తరుచుగా పురాణ శ్రవణాలలో పాల్గొంటూండేవాడిని. చిన్మయానందస్వామి గీతోపన్యాసాలు, రామకృష్ణుల సాహిత్యం, రమణ మహర్షుల తత్వబోధ చిన్నప్పటినుంచే చదువుతూ ఉండేవాడిని.ఆ వయస్సులోనే అందులోని సత్యాలు నా హృదయంతో ముద్ర వేసుకోవడంతో.. బాబావారి సందేశాల్లోని స్పష్టత, సత్యాన్ని సూటిగా వివరించే వారి స్వభావం నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. వారి సర్వ మత సమైక్యత, విశాల ప్రేమ నన్ను ఆకర్షించాయి.

మారం : వారి సాన్నిహిత్యంలో మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా అభివృద్ధి చెందింది?

ప్రొ||అనిల్ కుమార్ : సత్యసాయి బాబా వారికి సన్నిహితుడిని అయ్యాక నాకు వివిధ భౌతిక విషయాల్లో ఆధ్యాత్మికపరమైన స్పష్టత ఏర్పడింది. వారిని అత్యంత సమీపంగా గమనిస్తూ నేను ఎంతో నేర్చుకున్నాను. ఆంధ్రదేశమంతా సత్యసాయి బోధనలను ప్రచారం చేస్తూ 20 సంవత్సరాల పాటు తిరిగాను. ఈ పర్యటన సందర్భంగా రోడ్డుపై, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, గుళ్ళల్లో, పార్కుల్లో.. ఎక్కడ వీలైతే అక్కడ పడుకుంటూ.. ఏది దొరికితే అది తింటూ ఒక యజ్ఞంలా గడిపాను. లారీల్లో, ట్రాక్టర్లల్లో, ఎడ్లబండ్లపై.. ఒక్కోసారి నడుచుకుంటూ ప్రచార ప్రయాణాలు చేసిన సందర్భాలు ఎన్నో!

సత్యసాయి సందేశం ప్రచారం చేయడమే ఊపిరిగా జీవిస్తున్న నన్ను పిలిచి .. 1989 లో బెంగళూరు "సత్యసాయి కాలేజీ"కి ప్రిన్సిపాల్‌గా నియమించారు. అక్కడ ఆరేళ్ళు పనిచేసాక 1995లో పుట్టపర్తిలో విద్యాసంస్థలకు బదిలీ చేసి .. 23 సంవత్సరాల పాటు .. అంటే బాబా నిర్యాణం చెందేంతవరకూ .. నన్ను తమ ప్రక్కనే ఉంచుకుని తమ ఉపన్యాసాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి ప్రత్యక్షంగా తర్జుమా చేసే మహద్భాగ్యాన్ని నాకు కలుగజేసారు. వేదికపై వారి ప్రక్కనే ఉంటూ వారి ఒక్కోక్క పలుకునూ అతి సన్నిహితంగా వింటూ .. వారి మాటగా ప్రపంచానికి అందించడం నా జన్మజన్మల సుకృతం!

వారితో సంభాషణ జరిపినప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలిగేది. మనకు "ఎంతో ఆత్మీయులుగా వుంటూ ఈ ప్రపంచంలో మన మంచిని కోరేవారు ఇంతకంటే మరొకరు లేరు" అనిపిస్తూండేది. "ఈయన మన వారు సుమా!" అన్న భావనతో వారి సాన్నిహిత్యం మనలోని మంచిని పెంచుతూ ఉంటుంది. అలాంటి సద్గురువు సేవ వల్ల ఇతరత్రా వాటిపై మన దృష్టి అంటే .. ధనదాహం, పదవీవ్యామోహం వంటివాటిపై ఆసక్తి, తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.

ఇలా నేను బాబా వారితో కలిసి, పూనె, డిల్లీ, ముంబాయి, మద్రాసులతో పాటు వారి వేసవి విడిది కోడైకెనాల్‍కు కూడా తరచూ వెళ్ళేవాడిని. వారి దైవప్రణాళికలో ఒక ఉపకరణంగా ఉండే మహాభాగ్యాన్ని దక్కించు కోవడం నా జన్మజన్మల సుకృతం!

మారం : "‘యోగం - భోగం’ ఈ రెండింటి ప్రాతిపదికగా మానవ జీవితం గడపాలి" అనేవారు సత్యసాయి! ఇంకాస్త వివరంగా మీ నుంచి తెలుసుకోగోరుతున్నాను.

ప్రొ||అనిల్ కుమార్ : చాలా మంచి ప్రశ్నవేసారు! ఇది సమస్త మానవాళి అవగాహనకు సంబంధించిన ప్రశ్న! శ్రీకృష్ణుడి నుంచి మొదలు పెడితే వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, ఓషో, సత్యసాయి, పత్రీజీ .. ఇలా వీరంతా యోగంలో అత్యంత అంతర్ముఖంగానూ, భోగంలో అత్యంత వైభోగంగానూ, జీవించడం మనకు దృష్టాంతంగా కనిపిస్తుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అలాగే జీవించాలి!

లౌకికంగా భోగంలో, అంతర్ముఖంగా యోగానుసంధానం ద్వారా ఆధ్యాత్మికంగా ఉంటూనే .. ఆ రెండింటీనీ సమన్వయం చేయగలగాలి. అదే జీవితసాధన! కేవలం భోగమే జీవిత పరమావధిగా జీవిస్తే అతడు పరమ లౌకికుడవువుతాడు. కేవలం యోగమే పరమావధిగా జీవిస్తే.. వ్యక్తిగత సాధకుడుగా మిగిలిపోతాడు. అలా కాకుండా లౌకికతను కూడా సంప్రాప్తించుకుంటూ వ్యక్తిగత సాధనతో పాటు ఇతరులను కూడా ఉన్నతమైన మార్గంలో నడిపించగలిగిన మార్గదర్శకుల్లా మనం ఉండాలి. అందుకే "సంసారంలోనే నిర్వాణం" అన్నారు పెద్దలు!

మారం : మరి సత్యసాయి లాంటి బ్రహ్మచారుల మాటేమిటి?!

ప్రొ|| అనిల్‌కుమార్ : ఆయన బ్రహ్మచారీ కాదు .. సంసారీ కాదు. ఒక శరీరధారిగా బ్రహ్మచారి కానీ .. ఎందరెందరో సంసారుల బాధ్యతలను నిర్వహించిన ‘విశ్వసంసారి’ ఆయన!!

మారం : చాలా బాగా చెప్పారు! అయితే .. "ఆత్మోద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ భూమి మీద జన్మ తీసుకుని దైవప్రణాళికను అమలు చేస్తున్న అవతారపురుషులు సమాజం చేతిలో ఎందుకు ఆపనిందలపాలు అవుతున్నారు?

ప్రొ|| అనిల్‌కుమార్ : రాముడు, కృష్ణుడు, గౌతమబుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, రాఘవేంద్ర స్వామి, షిరిడీ సాయిబాబా, మలయాళస్వామి, ఓషో, సత్యసాయి, వేమన, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్‌గిరి, ఆదిశంకరులు, ఇదిగో ఇప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ.. ఇలా యోగీశ్వరులందరూ దేశకాలమాన పరిస్థితితుల్లో ప్రజలచే నిందింపబడిన వారే! అయితే, ఈ నీలాపనిందలు కూదా గురువుల సంకల్పాలే అనుకోవచ్చు! భక్తితీ కూడిన జ్ఞానంతో ప్రహ్లాదుడూ, వరంతో కూడిన అజ్ఞానంతో హిరణ్యకశ్యపుడూ .. ఇద్దరూ.. విష్ణుసాయుజ్యాన్ని పొందినవారే!

సత్యసాయి బాబా వారి విషయమే తీసుకుంటే.. చిన్నప్పటి నుంచీ వారికి ఎన్నో పరీక్షలు! వారికి విషం పెట్టిన వారొకరైతే .. వారు వున్న పాకకు నిప్పుపెట్టిన వారొకరు. ద్రుష్ప్రచారాలకైతే కొదవేలేదు. శ్రీకృష్ణునికైతే పుట్టినప్పటి నుంచీ గండాలే!

అయితే ఇలాంటి పరీక్షలు వచ్చిన ప్రతిసారీ వారికి మరింత ప్రచారం జరిగి మరిన్ని లక్షల మంది భక్తులు వచ్చేవారు. "కాస్త ఓపిక పడితే జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా లోకకళ్యాణానికే దారి తీస్తుంది" అన్నది జగమెరిగిన సత్యం!

మారం : సత్యసాయి బాబా మీద ఒకప్పుడు తీవ్రస్థాయి నిరసనలు వెల్లువెత్తాయి! అలాంటి స్థితిలో పరమ గురువులయిన వారు ఎలా ప్రతిస్పందించే వారు?

ప్రొ|| అనిల్‌కుమార్ : బాబా అయినా, మరే ఇతర పరమ గురువు అయినా .. వారికి ఒక లెక్కకాదు .. ప్రశంసా ఒక లెక్కకాదు. "ఓ బాబా", "ఓ బ్రహ్మర్షీ", "ఓ గురుదేవా", "మీరు ఎంతో గొప్పవారు" అని చాలామంది అన్నీ తెలిసినట్లు పొగుడుతారు! వాళ్ళ గొప్పతనం ఇతరులకు తెలిసినా తెలియక పోయినా వాళ్ళు గొప్పవాళ్ళే! ఆ విషయం గుర్తించడం మన దృష్టిలో గొప్పకానీ .. వాళ్ళకు అదేం గొప్పకాదు. అలాగే నిందలు వేసినప్పుడు కూడా అది మన దృష్టిలో బాధకానీ వారికి అదేమీ చెందదు. నిందాస్తుతులకు అతీతంగా ఉంటూ .. పొగడ్తలకు పొంగకుండా .. నిందలకు కృంగకుండా నిశ్చలంగా సాగే ఆదర్శవంతమైన జీవితమే ఏ యోగీశ్వరులదైనా!

ఇటువంటి సందర్భంలో భక్తుల ఆవేదనను గమనించిన బాబా ఒకసారి.. "రెండు కొండలు మధ్య ఒక యోగీశ్వరుడు నిలుచున్నాడు. ఒకవైపు కొండంత ఎత్తున ప్రశంసలు పెరిగాయి, మరొకవైపు కొండంత ఎత్తున అభిశంసనలు పెరిగాయి. కీర్తి కొండంత ! అపకీర్తి కొండంత ! కీర్తిస్తూ కొందరు ఆనందం పొందుతున్నారు, నిందిస్తూ మరికొందరూ ఆనందం పొందుతున్నారు. ఏదో రకంగా అందరూ ఆనందంగా ఉండడమే నాకు ఆహారం. అదే నాకు కావలసింది" అన్నారు బాబా చిద్విలాసంగా!

చాలా సందర్భాలలో బాబాను వేదిక మీద "స్వామీ! మీ దయవల్ల నేనింత వాడిని అయ్యాను .. ‘మీరది చేసారు’, ‘మీరిది చేసారు’, ‘మాకు ప్రాణదానం చేసారు’" అంటూ లక్షలాది భక్తులు ప్రశంసిస్తూన్నప్పుడు .. ఆయా సందర్భాల్లో వారు పొంగిపోయినట్లుగా, ఉబ్బి తబ్బిబ్బలయినట్లుగానీ నేను చూడలేదు. అలాగే పత్రికల్లో, గోడల మీద పిచ్చిపిచ్చి వ్రాతాలు వ్రాసి, టి.వి.ఛానెళ్ళల్లో అసందర్భపు ప్రేలాపనలు ప్రేలుతూంటే బాబా వాటిని పట్టించుకున్న సందర్భాలు లేవు. అసలు వాటిపట్ల వారు ఎంతమాత్రం స్పందించకపోయేవారు.

మానావమానాలూ, దూషణ భూషణ తిరస్కారాదులూ, మన మనఃస్థితిని బట్టి ఏర్పాడ్డాయి కనుక బాధ సహజమే! అయితే నిర్వికార, నిర్గుణ, సనాతన సత్యపూర్వకమైన స్థితిలో ఉండే సద్గురువులు అన్నింటికీ అతీతులు!

ఒకానొక సందర్భంలో బాబా వారు వేదిక మీద ఉపన్యాసం ఇస్తూన్నప్పుడు ఒక వ్యక్తి బాబాను ఇరకాటంలో పెట్టాలనుకుని "స్వామీ! ఒకసారి మీరు కూర్చున్న కారు పెట్రోల్ అయిపోయి దారిలో ఆగిపోయినప్పుడు మీరు పెట్రోల్ టాంక్‌లో నీళ్ళు పోయించి.. మీ వ్రేలును పెట్టి ఆ నీళ్ళను పెట్రోలుగా మార్చారని విన్నాం! మరి సముద్రంలో ఉన్న నీళ్ళను కూడా మీరు పెట్రోలుగా మార్చేస్తే మన దేశానికి ఉన్న దరిద్రం తీరిపోతుంది కదా?" అని అడిగాడు అతి తెలివిగా!

అందుకు బాబా "నేను మార్చాననుకో! కానీ .. నీ బోటి తుంటరివాడు ఒక అగ్గిపుల్ల గీచి విసరేస్తే సముద్రం భస్మీపటలం కాదూ?! అప్పుడు దేశం గతేం కాను?!"అన్నారు.వాడేదో తెలియని మూర్ఖత్వంతో ప్రశ్నించినా .. దేశకాల మాన పరిస్థితులను ఔపోసన పట్టిన జ్ఞానమూర్తులు .. అవసరం అనుకుంటే సమాధానం చెప్తారు .. లేకపోతే మౌనంగా వుంటారు.

ఒక భక్తుడు ఒకసారి.. "స్వామి! మిమ్మల్ని నిందిస్తూంటే నేను వినలేకపోతున్నాను .. ఏం చేయమంటారు?" అని వాపోయాడు. అప్పుడు బాబా "వినడానికి దేవుడు నీకు రెండు చెవులు ఇచ్చినట్లే .. నచ్చనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు కదా! అక్కడ కూర్చుని ఎవరు వినమన్నారు? ఇక్కడికి వచ్చి ఎవరు బాధపడమన్నారు? ఎవరో ఏదో అన్నారనీ, దాన్ని మళ్ళీ ‘వారిలా అన్నారు .. వీరిలా అన్నారు’ అనీ ఎవరు ప్రచారం చేయమన్నారు?!" అంటూ సున్నితంగా మందలించారు.

మారం : భక్తి కర్మ జ్ఞాన మార్గాల గురించి మీ నుంచి ఇంకా తెలుసుకోగోరుతున్నాం!

ప్రొ||అనిల్ కుమార్ : "మనం బాహ్యంగా ఎన్ని పూజలూ, ఎన్ని పునస్కారాలూ, ఎన్ని క్షేత్రదర్శనాలూ మరి ఎన్ని ప్రదక్షిణలూ చేసినా .. మనలోని అసలైన దివ్యత్వాన్ని మనం గుర్తించనంత వరకూ అవి అన్నీ కూడా వ్యర్థమే! బాహ్యకర్మలన్నీ అంతర్మఖం చేసి .. మనలోని మూలతత్వాన్నీ, దివ్యత్వాన్నీ అనుభూతి చెందడమే ఆధ్యాత్మికత యొక్క ప్రథమ మూలసూత్రంగా గుర్తించాలి" అని బాబా పదే పదే చెప్పేవారు. 1940 అక్టోబర్ 20వ తేదీన మొట్టమొదటి సారిగా తమను అవతారపురుషులుగా ప్రకటించిన వెంటనే బాబా కూడా "గురుచరణ కీర్తన" తో తమ మానస భజనను ప్రారంభించారు. గురువు పాదాలను శరణుపొంది .. అహంకార, అసూయలను వదిలివేయమన్నారు.

"సంకీర్తన" భక్తీ మార్గంగా, "సేవ" కర్మమార్గంగా "దివ్యప్రవచనాలు" జ్ఞాన మార్గంగా తమ జీవితాన్ని త్రివేణీ సంగమంలా మలచిన బాబా .. ప్రప్రంచ మానవాళికి మార్గదర్శకులయ్యారు. నామస్మరణ, సంకీర్తనల ద్వారా, వారు భక్తిమార్గాన్ని పరిపుష్టం చేశారు; విద్య, వైద్య మరి భారీ మంచినీటి ప్రాజెక్టుల ద్వారా కర్మమార్గాన్ని విశేషంగా ఆచరించారు.

ఇక వారు మానవాళికి అందించిన జ్ఞానప్రసంగాలు .. దాదాపు 60 పైగా సంపుటాలు ప్రపంచంలోని అనేక భాషల్లో విస్తారంగా ప్రచురించబడి, ఎందరినో జ్ఞానమార్గంలో పయనింపజేసాయి .. చేస్తున్నాయి. ఇలా "ఎవరి ఇష్టానుసారంగా వారు భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల్లో ముక్తిని పొందవచ్చు" అని వారు సకల మానవాళికీ ప్రబోధించారు .. మరి ఆచరణలో చూపించారు.

ఒకప్పుడు పుట్టపర్తి పట్టుమని వందమంది కూడా లేని చిన్ని పల్లెటూరు. ఇప్పుడు సమస్త ప్రపంచం పుట్టపర్తిలోనే వుంది. అదంతా కూడా బాబా బోధించి, ఆచరించి చూపించి భక్తి, కర్మ, జ్ఞాన మార్గాల ఫలితమే!

"కడ్తాల్" కూడా అంతే! పత్రీజీ గత ముప్పై సంవత్సరాలుగా జరిపిన అవిరామ కృషివల్ల అక్కడ ఎంత పెద్ద పిరమిడ్ సాక్షాత్కరించిందో మనకు తెలుసు! వారి విశేష ధ్యానప్రచారం వల్ల గత డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ ధ్యానమహాసభలకు లక్షలాదిగా జనం తరలి రావడం ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక మహాఘట్టం!

ఇలా ప్రపంచాన్నంతటినీ ఒక్కత్రాటి మీద నడిపించడమే అవతారపురుషుల మూల ఉద్దేశ్యం!

పుట్టపర్తి అయినా, కడ్తాల్ అయినా, షిరిడీ అయినా, ఈ రోజు ప్రపంచపటంలో ప్రముఖంగా వుంది అంటే అది ఆ అవతారపురుషుల దివ్యత్వ ప్రకటన మాత్రమే!

మారం : వివిధ ఆధ్యాత్మిక సంస్థలు సత్యాన్ని ప్రకటించే రీతుల్లో వున్న భిన్నత్వాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు.

ప్రొ||అనిల్ కుమార్ : "ఏకం సత్ - విప్రాఃబహుధా వదంతి" అంటే "సత్యం ఒక్కటే కానీ అది అనేక రీతులుగా ప్రకటించబడుతుంది" అన్న శాస్త్ర నియమాన్ని అనుసరించి .. బ్రహ్మసమాజం కానీండి, సత్యసాయి ప్రేమ మార్గం కానీండి, షిరిడీసాయి తత్వసారం కానీండి, బ్రహ్మర్షి పత్రీజీ ధ్యాన మార్గం కానీండి .. దారులు వేరువేరైనా అక్కడ ప్రకటించబడుతోంది ఒకే సత్యం!

సజ్జన సాంగత్యాదుల వల్లనే ఎవరికి వారు తమలోని దివ్యత్వాన్ని తట్టిలేపుకుని .. ఆ ప్రకారంగా జీవించడం మొదలు పెడతారు. అదే "అయమాత్మా బ్రహ్మ", "మమాత్మా సర్వభూతాత్మా" అన్న సత్య వాక్యాలకు సరియైన కార్యాచరణ ప్రణాళిక!

సత్యసాయి సాన్నిహిత్యంలో ఉన్నా కూడా నాకు.. బైబిల్ చదువుతూంటే మరి టి.వి.ల్లో బైబిల్ సందేశాలు వింటూవుంటే అందులో బాబా గారి మాటలే వినపడతాయి. రామకృష్ణా మిషన్ వారి ప్రచురణలు, వివేకానందులు ప్రసంగాలు చదువుతూంటే అవి నాకు బాబా సందేశాలుగానే అనిపిస్తాయి. రమణులను చదువుతూంటే స్వామే కనపడతారు. ఖురాన్ సూక్తులు వింటూంటే బాబానే నాకు ప్రేమగా బోధిస్తున్నట్లు అనిపిస్తాయి.

కనుక సత్యం ఒక్కటే! దాని ఛాయ, పోలికలు మాత్రం అన్ని చోట్ల కనపడుతూంటాయి. అదే అద్వైతం, అలౌకికం! గురువులందరూ ఈ విషయాన్నే మనకు అనేక కోణాల్లో దర్శింపజేస్తారు.

మారం : ప్రపంచం అంతా బాబా దగ్గరికి వచ్చింది! పత్రీజీ .. ప్రపంచం దగ్గరికి వెళ్ళారు!!?

ప్రొ||అనిల్ కుమార్ : రెండూ ఉన్నతమైనవే! అవతారమూర్తులు ఒక్కొక్కరు, ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. రాముడు అడవికి వెళ్ళాడు; కృష్ణుడు అంతఃపురాలల్లో, పట్టణాల్లో ఉన్నాడు. రమణ మహర్షి జీవితమంతా అరుణాచలం కొండల్లోనే ఉండిపోయాడు .. తిరువణ్ణామలై దాటలేదు. షిరిడీ సాయి జోలె పట్టుకున్నాడు; జిల్లెల్లమూడి అమ్మ, పాకలపాటి గురువుగారు అన్నం ప్రధానంగా తీసుకున్నారు. అరవిందులు తత్వబోధను ఎంచుకుని పరోక్షరాజకీయాల్లో పాల్గొన్నారు. మెహర్‌బాబా మౌనంగా ఉంటూనే గురువులను తయారు చేసారు.

వివేకానందులు ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తం చేస్తే .. వారి గురువులు రామకృష్ణులు తమ మఠాన్ని దాటలేదు. యోగానందులు అమెరికాలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు, ఓషో భోగం, యోగం యొక్క సమానత్వాన్ని నిరూపించారు. ఇలా ఒక్కొక్కరు తమతమ యూనివర్సిటీల నుంచి ఒక్కొక్క సబ్జెక్టును తీసుకుని ఈ భూమిమీదికి వచ్చి ఆ రంగంలో తమతమ పరిశోధనలను జరుపుతూ ఉంటారు.

సమాజపరంగా కానీండి, తత్వపరంగా కానీండి అవతారపురుషులంతా కూడా ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల మధ్య, ప్రజలతో కలిసి జీవించిన వారే కనుక ప్రజలు కూడా వారికి సన్నిహితంగా వస్తున్నారు. విశ్వమానవాళికి ఉద్ధరణ మార్గం చూపడమే వీరి అవతారలక్ష్యం కనుకనే వారు ప్రజలతో మమేకమై జీవస్తుంటారు.

దివ్యత్వాన్ని ఈ భూమ్మీద ప్రకటించడానికి ఎంచుకున్న తమదైన విధానంలో వారు తమతమ ప్రణాళికలను అమలు పరుస్తూ వుంటారు. ఆయా దివ్యమూర్తుల సాంగత్యంలో మనం ఎంతవరకు పురోగమిస్తున్నాం, ఎంతవరకు ఉద్ధరించబడుతున్నాం మరి ఎంతవరకు పరిణామం చెందబడుతున్నాం అన్న విషయాలను మనం పరిశీలించుకోవాలి. నదులన్నీ వేరైనా అందులో ఉన్న జలం ఒక్కటే అన్ని నదులు చివరికి కలిసేది సముద్రంలోనే అన్నది ఎంత సత్యమో ఇదీ అంతే! సత్యసాయివారిది ఒక బాట అయితే పత్రీజీది ఇంకోబాట .. గమ్యం మాత్రం ఇద్దరిదీ ఒక్కటే!

భగవాన్ సత్యసాయి కూడా తరచూ ధ్యానం గురించి చెప్తూండేవారు: "దేశకాలమాన పరిస్థితులను అధిగమించి మనస్సు శూన్యం చేసుకుని తాదాత్మ్య స్థితిలో ఏ పనిచేసినా అది ధ్యానమే" అనేవారు! ధ్యానం మన సనాతన ధర్మానికి సమకాలీన సారధి. ఈ ఒరవడిని పత్రీజీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా శ్వాస మీద ధ్యాసగా సులభసాధ్యమైన, ఆచరణాత్మకమైన రూపంలో అందరికీ చేరుస్తున్నారు. "పిరమిడ్ ధ్యానం" కులాతీత, మతాతీత విధానంగా రూపొందడం వల్ల అది సర్వాంగీకారంగా సంప్రదాయబద్ధంగా, విశ్వజనీనంగా సాగుతూ లక్షలాది మందికి ఆదర్శప్రాయం అయ్యింది.

మొట్టమొదటిసారిగా నేను డిసెంబర్ 26వ తేదీన కడ్తాల్ శ్రీ మహేశ్వర పిరమిడ్ ప్రాంగణానికి వచ్చినప్పుడు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్న వేలాది మందిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఆకాశాన్ని తాకే విధంగా నిర్మించిన ఆ పిరమిడ్ శక్తి కట్టడం ఒక గొప్ప అద్భుతం! ఆ రోజు ఆ మహా సభలో శ్రీ సరస్వతీ సభావేదికపై నుంచి నా ద్వారా మాట్లాడింది బాబా వారే! నాతో పలికించిందీ మళ్ళీ వేలాది మందిలో చేరి విన్నదీ బాబాయే! కనుకనే ఆ రోజు నా కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరూ సంతృప్తిని చెందారు.

మారం : పత్రీజీతో మీ పరిచయం గురించి చెప్పండి!

ప్రొ||అనిల్ కుమార్ : కడ్తాల్‌కు వచ్చినప్పుడు వారు నన్ను వేదికపైకి స్వయంగా ఆహ్వానించి, నా ప్రవచనాన్ని అత్యంత శ్రద్ధగా కూర్చుని .. విన్న తీరు చాలా గొప్పవిషయం. కార్యక్రమం పూర్తయ్యాక నా బసకు వచ్చి.. నాకు స్వయంగా భోజనం వడ్డించి అమ్మలా నా ప్రక్కన కూర్చుని కొసరి, కొసరి తినిపించడం, నాతో స్నేహంగా ప్రవర్తించడం నన్ను ముగ్ధుడిని చేశాయి. ఒక సామాన్యుడినైన నన్ను లక్షలాది మంది ప్రజానీకానికి గొప్ప గురువైన వారు అంత గౌరవంగా, ఆదరణగా చూడడం వారి గొప్పతనానికి పరాకాష్ఠ!

వారి ఆధ్యాత్మిక సేవ ఈ యుగానికే మహాఉద్యమం. లక్షలాది మంది ప్రజలు అత్యంత స్వీయ క్రమశిక్షణతో శ్రద్ధగా ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం పత్రీజీ పట్ల వారి గౌరవానికి నిదర్శనం. "రాబోయే కాలంలో ఇంకా ఇంకా లక్షలాది మంది ప్రజలు ఈ ధ్యానమార్గంలోకి వస్తారు" అని ఆ ప్రభంజనం చూస్తే నాకు అర్థం అయ్యింది. అంతేకాదు పిరమిడ్ సొసైటీలో ఎందరెందరో మాస్టర్స్ ధ్యానప్రచారం మొదలుకుని పిరమిడ్ కేంద్రాల నిర్వహణ, పత్రికల నిర్వహణ, శాకాహార ర్యాలీల నిర్వహణ, కార్యక్రమాల నిర్వహణలను బాధ్యతగా అత్యంతగా నిబద్ధతతో చేపట్టడం నేను గమనించాను.

"ఇదంతా కూడా ధ్యానయోగం ద్వారా కలిగిన ‘సెల్ఫ్ రియలైజేషన్’ యొక్క ప్రభావమే" అని నేను నమ్ముతున్నాను. ఒక "ప్రత్యేక సైన్యం" లా పనిచేస్తోన్న పిరమిడ్ మాస్టర్లు మిగతా ఆధ్యాత్మిక సంస్థల కార్యకర్తలకంటే ఖచ్ఛితంగా భిన్నంగా ఉన్నారు. అందుకే ధ్యానం అన్నది ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి తప్పనిసరి.

మారం : జీవహింస గురించి శాకాహారం గురించి బాబా ఏం చెప్పారు?

ప్రొ||అనిల్ కుమార్ : "మానవ శరీరానికి మాంసాహారం తగదు" అని బాబా నిర్ద్వందంగా చెప్పేవారు.

శాకాహారం సాత్విక మనస్సునూ, సాత్విక మనస్సు సాత్విక సంకల్పాలనూ రూపొందిస్తుంది. సాత్విక సంకల్పాలు సత్కర్మలకు దారితీస్తాయి. అలాంటి సత్కర్మలే మనకు సత్ఫలితాలను అందిస్తాయి మరి అవే మన జనన మరణ చక్రాన్ని నిర్దేశిస్తాయి. ఈ విశ్వప్రణాళిక అంతా కూడా కేవలం మనం తినే ఆహారం వల్లనే సంభవిస్తోంది కనుకనే.. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. "As the food .. so the head; As the head..so the God" అనే వారు బాబా! పదే పదే స్వామి ప్రవచనాలను విని స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా కోట్లాదిమంది భక్తులు శాకాహారులుగా మారారు.

అహింసా దేవత యొక్క రూపాన్ని వివరిస్తూ బాబా .. "హింస అంటే కేవలం జంతువులను చంపి వండుకు తినడమే కాదు. మన మనోవాక్కాయ కర్మల ద్వారా ఇతరులను ఎంతమాత్రం బాధించినా అది జీవహింసే! అయితే మాంసాహార సేవనం అన్నది మానవుల్లోని హింసాప్రవృత్తిని మరింతగా ప్రేరేపిస్తూ సర్వవినాశనానికి దారితీస్తుంది" అని చెప్పేవారు. కాబట్టి మనలోని తమో, రజో గుణాలను ప్రకోపిస్తూ మనకు వ్యక్తిగతంగానే కాకుండా సమాజపరంగా కూడా సర్వఅనర్థాలను కలుగజేసే మాంసాహారాన్ని విడనాడడం అత్యంత అవసరం.

మారం : పత్రీజీ లాగే బాబా వారు కూడా సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారా?

ప్రొ||అనిల్ కుమార్ : అవును! "అసలు విశ్వమంతా కూడా సంగీతమే" అనేవారు బాబా! అంతా రసమయమే అంటూ.. "రసవైసహా రసహ్యేవాయం లబ్ద్వానందీ భవతి" అంటోంది తైత్తిరీయోపనిషత్! ధ్యానం ద్వారా భగవత్ సామీప్యాన్ని అందించే ప్రతి క్షణం సంగీతమే కనుక గురువులు, యోగులు అందరూ సంకీర్తనలకు అంతటి ప్రాముఖ్యాన్ని ఇస్తూంటారు. ధ్యానంలో కూర్చుని కూడా ఆలోచనా స్రవంతిలో మునిగి తేలే మనస్సును సంగీతం పైనో వేణునాదం పైనో లగ్నం చేసి సహజ శ్వాసను గమనిస్తూ శూన్యస్థితికి చేరుకున్నప్పుడు ఐహికచింతలు, ధనకాంక్షలు, దేహదృష్టి అన్నీ మాయమైపోతాయి. మనమే సంగీతం, సంగీతమే మనం అన్న ధ్యాన స్థితిలో ఉండిపోతాం.

పత్రీజీ కూడా తమ వేణునాద ధ్యానంతో అందరినీ మైమరపిస్తున్నారు. కడ్తాల్ లో లక్షలాదిమంది ధ్యానులు నిశ్శబ్దంగా కూర్చుని తదేక దీక్షతో ధ్యానం చేస్తున్నప్పుడు కనువిందుగా చాలా ముచ్చటగా అనిపింది. "నాకు కూడా అలాంటి నిశ్చలస్థితి కలుగుతే బాగుండును" అనిపించింది.

మారం : 2012 డిసెంబర్ నుంచి ప్రారంభమైన "సత్యయుగం" గురించి మీ నుంచి తెలుసుకోగోరుతున్నాం!

ప్రొ||అనిల్ కుమార్ : ఏ క్షణం అయితే మనం సత్యాన్ని గుర్తించామో ఆక్షణం నుంచే మన యొక్క వ్యక్తిగత ‘సత్యయుగం’ ప్రారంభమైనట్లే! ఎంత మంది ఆత్మసత్యాన్ని గురించి ఎన్ని జన్మలుగా బోధిస్తున్నా మనం దానిని గుర్తించలేదంటే ఇంకా మనం వ్యక్తిగత సత్యయుగం ప్రారంభానికి కూడా నోచుకోలేదన్నమాటే! సత్యాన్ని తెలుసుకున్న మన యొక్క ఎరుకతో కూడిన ప్రచార ప్రయత్నాల వల్ల సమాజంలోని ఇతరులు కూడా సత్యాన్ని గుర్తిస్తే .. అది సామాజిక సత్యయుగానికి నాంది అవుతుంది. అంతరంగంలోని సత్యాన్వేషణ .. బాహ్యరంగంలోని సత్యాన్వేషణల యొక్క సమిష్టిఫలితమే "సంపూర్ణ సత్యయుగ" స్థాపన!

మారం : సత్యసాయి బాబాకు అత్యంత సన్నిహితులుగా, అంతరంగికులుగా వారు జీవించి ఉన్నప్పుడూ .. ఇప్పుడూ మీ అనుభూతి ఏమిటి?

ప్రొ||అనిల్ కుమార్ : వారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగే అవకాశాన్ని బాబా నాకు కలిగించడం నా మహాభాగ్యంగా భావిస్తున్నాను. అవతారపురుషుల ప్రవచనాలను ప్రపంచవ్యాప్తం చేయడంలో నా పాత్ర ఉండడం నా జన్మ జన్మల అదృష్టం. వారి మహాభినిష్క్రమణం తొలిరోజుల్లో నాలో నేను చాలా దుఃఖపడేవాడిని. అయితే టి.వి. ఛానెల్స్, పత్రికల వాళ్ళు నా వెంటపడి మరీ ఆమూడు రోజులూ నాతో కొన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నారు. వాటిని చూసి, చదివి చాలా మంది "మీ ఇంటర్వ్యూలు మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి" అనడంతో నేను కూడా క్రమంగా సమాధానపడ్డాను.

"దేహపరంగా వారు నాకు దూరం అయినా ఆత్మపరంగా మరింత దగ్గరయ్యారు" అన్న అనుభూతి నాకు కలిగింది. వారి సందేశాలను మరింత విశ్వవ్యాప్తం చేయాలన్న నిర్ణయం నాలో బలంగా కలగడం బాబా ఆదేశంగా భావించి ఆ పనిలో నిమగ్నమై వుంటున్నాను .. ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిలిపైన్స్, ఫిజీ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో బాబా ప్రవచనాలనూ, సందేశాలనూ విస్తృతంగా ప్రచారం చేసాను. వెళ్ళిన ప్రతిచోటా " బ్రతికితే భగవంతుడి కోసం బ్రతుకు; లేకుంటే ఆ బ్రతుక్కి అర్థమే లేదు" అని బాబా సందేశాన్ని వినిపించేవాడిని! ఇదే నా జీవితం మరి ఇదే సార్థకం!

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం?

ప్రొ||అనిల్ కుమార్ : ఇంతవరకూ నేను ఎన్నో పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాను. వాళ్ళంతా బాబా చేసే అద్భుతాలను గురించీ, బాబాను ఎవరెవరు కలుసుకున్నారు అన్న విషయాలను గురించీ అడిగేవారు. కానీ ఆత్మజ్ఞాన శీర్షికలతో అలరారుతూ మంచి భవిష్యత్తును కలిగివున్న ఒక గొప్ప ధ్యాన-ఆధ్యాత్మిక మాసపత్రిక అయిన "ధ్యానాంధ్రప్రదేశ్"కు చక్కటి ఆధ్యాత్మిక సమాచారంతో కూడిన ఇంటర్వ్యూ ఇవ్వడం నాకెంతో నచ్చింది! అప్రతిహతంగా సాగుతోన్న పత్రీజీ ధ్యానప్రచార ఉద్యమంలో.. ప్రస్తుత జన్మలను పునీతం చేసుకుంటూన్న మీ అందరికీ నా అభినందనలు!

Go to top