" భూలోకం ఒక మహా స్వేచ్ఛా క్షేత్రం! "

 

"భక్తి" T.V. ఛానెల్లో అక్టోబర్ 21, ఆదివారం ఉదయం 11.30 నుంచి 12.00 వరకు ప్రసారమైన బ్రహ్మర్షి పత్రీజీ ఇంటర్వ్యూ మొదటిభాగం ధ్యానాంధ్రప్రదేశ్‌లో క్రిందటివ్యాసంలో ప్రచురించాం. ఇప్పుడు శేషభాగం, రెండవభాగం ప్రచురిస్తున్నాం. మన చీఫ్ ఎడిటర్ J.K భారవి గారి ప్రశ్నల శరాలకు పత్రీజీ సమాధానాలు ఎంతో వైవిధ్యంగా వున్నాయి! ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకుల కోసం, ఆ ఇంటర్వ్యూ సారాంశం.


J.K. భారవి : "నమస్కారం గురువుగారు!"

పత్రీజీ : "స్వామీజీ! నమస్కరం!

J.K. భారవి : "మీరు ఈ ధ్యాన ప్రచారం చాలా సంవత్సరాల క్రితం నుండే చేస్తునారు కదా, అప్పుడు మరి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు..?

పత్రీజీ : "కొంతమంది కుటుంబసభ్యులు అప్పటికీ, ఇప్పటికీ విరుద్ధంగానే వున్నారు. కొంతమంది అప్పటికీ, ఇప్పటికీ పోల్చుకుంటే కొంచెం సుముఖంగానే వున్నారు. కొంతమంది కుటుంసభ్యులు అప్పటికీ, ఇప్పటికీ ఉత్సాహంగా వున్నారు. అలా వుంటుంది ఎప్పుడూ. కుటుంబం పెద్దది కదా, సభ్యులు రకరకాలు!"

J.K. భారవి : "ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్న పద్ధతిలో...మీ అనుచరులు, మీ ఫాలోయర్స్..."

పత్రీజీ : "నాకెవ్వరూ ‘ఫాలోయర్స్’ లేరు; నాకు మిత్రులున్నారు"

J.K. భారవి : "మిత్రులు...‘శిష్యులు’ కూడా వున్నారు"

పత్రీజీ : "మిత్రులే.. నాతో పాటు కలిసి చేసేవాళ్ళంతా నా ఫ్రెండ్స్. అంతే!"

J.K. భారవి : "ఇక్కడ అద్భుతమైనటువంటి..ఒక గొప్ప దృష్టి ఇక్కడ వచ్చిందండి మీమీద. నేను చాలా సార్లు విన్నాను, ‘ఎవరూ నన్ను గురువుగారు అనకండి’ అని అంటారట మీరు! ‘గురువుగారు’ అనకపోతే ఎలా మరి?"

"మీ ముఖంలోని తేజస్సుని చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది, మీరేమో తిడతారట. అసలు.."

పత్రీజీ : "‘తిట్టడం’ అంటే..సామ, దాన, దండ, భేద..అనే ఉపాయాలు నాలుగు వున్నాయి. సామం కన్నా గొప్ప ఉపాయం దానం, దానం కన్నా గొప్ప ఉపాయం తిట్టు, అంటే దండనం. దాని కన్నా గొప్ప ఉపాయ విషయం కొన్ని రోజులు దూరంగా వుంచడం!"

J.K. భారవి : "అమ్మ చిన్నప్పుడు తిట్టితే వరం.. ఆటైపులో అన్నమాట."

పత్రీజీ : "కేవలం ఒక ఉపాయం అది"

J.K.భారవి : "అసలు" ‘గురువు’ అంటే ఎవరు?"

పత్రీజీ : "మీరు ఇప్పుడు రమణమహర్షి దగ్గరకు వెళ్ళివుంటే, ఆయన మీతో ఏం చెప్తారో తెలుసా... ‘గురి అన్నదే గురువు’. అని. ‘గురి’ అంటే ‘శ్రద్ధ’ అదే జీవితంలో సరియైన పెట్టుబడి; ఆ మన పెట్టుబడే మనకు గురువు! ఎవరికి సంగీతం పట్ల గురి వుంటే, ఆ గురి వాళ్ళకి గురువు. ఒక క్లాస్‌లో ఒక అధ్యాపకుడు పాఠాలు చెప్ప్పుతున్నారనుకోండి, ఇద్దరు విద్యార్థులు శ్రద్ధ పెట్టి వింటూ ఉంటారు, మిగతా వాళ్ళంతా వారి, వారి ధ్యాసల్లో వారు ఉంటారు. అధ్యాపకడు చెప్పింది వాళ్ళకి వినబడదు. ఎందుకంటే వారు ‘పరధ్యాస’ లో ఉన్నారు. ఇద్దరు శిష్యులు మటుకు, గురితో వింటున్నారు. ఆ ‘గురి’ అన్నదే వారికి ‘గురువు’ గా మారింది! అంటే ఆ ‘గురి’ లేకపోతే, ఆ ‘గురువు’ లేడక్కడ! ఆ ‘గురువు’ను సృష్టించింది వీరే! వీరి గురి లేకపోతే, అక్కడ గురువు గురువే కాదు. కనుక, రమణ మహర్షి ఏమన్నాడంటే, ‘గురియే గురువు’ అన్నాడు. ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నవారు. ఏ లోకంలోకి వెళ్ళినా-ఏ కాలంలోకి వెళ్ళినా అక్కడ చెప్పబడేది కూడా ఇదే..‘గురియే గురువు’."

J.K. భారవి : "మరయితే ఇప్పుడు లోకంలో ప్రచారం ఉన్నట్లుగా ‘ఫలానాయన గురువు’, ‘ఆయన చెప్పిందే మనం నడుచుకోవాలి’ లాంటివి?"

పత్రీజీ : "ఆయన గురువే!- ఎందుకు కాడు? ఆయన గురువు; ఆయన దగ్గర ‘గురి’ ఉంది కనుక ఆయన ‘గురువు’ కాకుండా ఎలా ఉంటాడు!"

J.K. భారవి : "చాలా అద్భుతం సార్! ఇది..‘గురి’ అన్నది.. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గురువులా???"

పత్రీజీ :"అంతే! అయితే మీరు ‘గురువు’ అన్నపదానికి ప్రతిపక్ష పదం చెప్పండి చూద్దాం?"

J.K. భారవి : "‘శిష్యుడు’"

పత్రీజీ : "కాదు...ఇంకోటి చెప్పండి"

J.K. భారవి : "????"

పత్రీజీ : "‘గురువుకి ప్రతిపక్ష పదం ‘లఘువు’ గురువంటే బరువైన వాడు! లఘువు అంటే తేలికైన వాడు. ఒకానొక మనిషి సంగీత గురువంటే..సంగీతం పట్ల గురి ఉందాయనకి కనుక... సంగీతం గురువయ్యాడు!

"మా తండ్రిగారున్నారు! నేను సంగీతం నేర్చుకునేటప్పుడు ఆయన ఎప్పుడూ అంటూండేవారు... ‘ఏమొస్తాయిరా సంగీతానికి? డబ్బులు వస్తాయా?’ అని ఆయనకు సంగీతం అంటే ఇష్టం ఉండేది కాదు... నేను సంగీతం గురువు గారి దగ్గరకు వెళ్ళటం. అంటే సంగీతమంటే ఆయనకు ‘గురి’ లేదు. కనుక ఆయన సంగీతమనే క్షేత్రంలో ఒకానొక ‘లఘువు’. మా తల్లిగారు ‘సంగీతం నేర్చుకో! నేను చిన్నప్పుడు నేర్చుకోలేదు! నువ్వన్నా నేర్చుకో!’ అని నావెంట పడింది. అంటే ఆవిడకు సంగీతం పట్ల ‘గురి’ ఉంది. కనుక ఆవిడ ఒక సంగీత గురువు!

"అలాగే ఏ రంగంలో అయినా సరే! ధ్యానంలో కూడానూ...ధ్యానం పట్ల ఎవరెవరికి ‘గురి’ ఉంటుందో వారంతా ధ్యాన గురువులే! కృష్ణుడికి ధ్యానం పట్ల ‘గురి’ ఉంది! కనుక ఆయన ఒక ధ్యాన గురువు. ఏ విధంగా గురువు?? ‘గురి’ ఉన్నావాడు కనుక గురువు!"

J.K. భారవి : "ఎంతమందికి అర్థం అవుతుందో గానీ మీరు చెప్పేది, చాలా క్రొత్త సిద్ధాంతం స్వామీజీ!"

పత్రీజీ : "ఇది చాలా పాత సిద్ధాంతమే."

J.K. భారవి : "గురు బ్రహ్మ..గురు విష్ణు...గురు దేవో.."

పత్రీజీ : "గురుబ్రహ్మ అంటే ‘గురియే బ్రహ్మ’ అని అర్థం. అంటే మన శ్రద్ధ అన్నదే అన్నింటికీ జన్మనిచ్చేది! ఈ గురే మన యొక్క విద్యను పుట్టిచ్చేది! ‘గురు విష్ణు’ అంటే గురియే ఆ స్థితిని పొడిగించేది. ఆ గురి తీసివేస్తే, ఆ స్థితి విలువ కోల్పోతుంది.

"ఆ గురి అనేది సాక్షాత్తు పరబ్రహ్మ! పరబ్రహ్మను చూపిచ్చేది కూడా ఈ గురిఅన్నదే! ఆ ‘గురి’.. ఆ శ్వాస మీద ‘ధ్యాస’ అన్నది లేకపోతే శరీరముంటుంది..! కానీ పరబ్రహ్మ అనుభవం వుండదు!

"ఎక్కడ గురి ఉంటుందో, అక్కడే శాస్త్రముంటుంది. విద్య వుంటుంది. ‘గురుదేవో’ అంటే, ఆ గురే మనలను పై దేవలోకాలకు తీసుకెళ్తుంది!"

"‘గురుసాక్షాత్ పరబ్రహ్మ’... మూల సత్యం అంటేనే ‘గురి’! మూల చైతన్యమే ‘గురి’ స్వరూపంగా కలిగివుంది! కనుక అలాంటి గురువుకు నమస్కారం! అంటే ఆ శ్రద్ధకు నమస్కారం!"

J.K. భారవి : "వేదంలో ‘మాతృదేవో భవ’.. ‘పితృదేవో భవ’.. ‘ఆచార్య దేవోభవ’.. అని చెప్తారు కదా.. ‘ఆచార్యు’డంటే గురేనా? అది వేరేనా?"

పత్రీజీ : "ఆచార్యుడంటే.. ‘యః యాచినోతి ఆచరతి, ఆచార యతి చ సః ఆచార్య’ ఎవరైతే జ్ఞానాన్ని యాచిస్తారో, ఆచరిస్తారో, ఆచరింపచేస్తారో వారు ఆచార్యులు. గురువయినవాడు ఆచరింప చేయకపోవచ్చు! కాని వాడికి గురి వుంది! ఆచరింప చేస్తే, వాడు ఆచార్యుడు! శంకరాచార్యులవారికి ఆత్మజ్ఞానం పట్ల గురి మాత్రమే కాదు.. అందరిచేతా ఆచరింపచేసారు కనుక ఆచార్యుడు! ఒకానొక గురువుకు ఇంకొకళ్ళను కూడా గురువులా తయారుచేసే లాంటి ‘ఆ గురి’ వుంటే ఆచార్యుడే! మీకు గురువు కావాలనే గురే కాకుండా, అందరు కూడా గురువులు కావాలనే గురి వుంటే మీరు కూడా ఆచార్యులే!

J.K. భారవి : "ధ్యానం చేస్తే మనం ఎవ్వరి దగ్గరికి వెళ్ళాలనుకంటే వాళ్ళదగ్గరికి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చా??"

పత్రీజీ : "వాళ్ళే మీ దగ్గరికి వస్తారు! వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగే శక్తి మీకు లేదు. కానీ మీ దగ్గరకొచ్చే శక్తి వాళ్ళకుంది. అయితే, వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను చూసేశక్తి మీరు సంపాదించుకోవచ్చు! అదే ధ్యానం!"

J.K. భారవి : "మీరు చెప్తూంటే విషయాలు అన్నీ చాలా చాలా క్రొత్తగా అన్పిస్తున్నాయి! అద్భుతంగా అన్పిస్తున్నాయి!"

పత్రీజీ : "రావణాసురుడు ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన కైలాసానికి వెళ్ళలేదు! శివుడే ఈయన దగ్గరికి వచ్చాడు!"

J.K. భారవి : "అంటే, ఆయనను రప్పించే శక్తి..."

పత్రీజీ : "ఆయనను ఎవ్వరూ రప్పించరు! దేవలోకాల వాసులు తమకు తామై వస్తారు. వారు ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు వారిని చూసేశక్తి మనం సంపాదించుకోవాలి! రప్పించేశక్తి ఎవ్వరికీ లేదు! ఒక ఆత్మ ఇంకొక ఆత్మను రప్పించజాలదు! ‘రప్పించట’ మంటే అది మహాబలాత్కారం! ఆ పదజాలం కూడదు! వారు వచ్చినా కూడా చూడలేని స్థితిలో మనం వుంటాం, ధ్యానం చేయకపోతే!"

J.K. భారవి : "వస్తే ఎలా చూడగలం సార్?"

పత్రీజీ : "మూడోకన్ను తెరుచుకుంటే వాళ్ళు కనపడతారు! మూడో కన్ను ఎందుకంటే... వాళ్ళు భౌతిక దేహంతో రారు కదా! వాళ్ళ దగ్గర భౌతికదేహం లేదు కదా!"

J.K. భారవి : "అంటే భగవద్గీతలో ‘దివ్య పదాని తే చక్షువు’ అని అర్జునుడికి పరమాత్ముడు ‘ప్రక్కనే వుండి కూడా నీవు చూడలేవు! చూడాలంటే వేరే కన్ను కావాలి! అది ఇస్తాను, అన్నాడు."

పత్రీజీ : "నాటకీయంగా ‘ఇస్తా’నన్నాడు! ఎవ్వడూ ఎవ్వడికీ ఏదీ ఇవ్వలేడు! చమత్కారం వేదవ్యాసుడిది!"

J.K. భారవి : "నా మూడో కన్ను తెరుచుకోవాలంటే మీరు గురువుగా తెరిపించలేరా??"

పత్రీజీ : "మీ గురువు తెరిపిస్తాడు! మీ గురియే మీకు గురువు. "గురితో సాధన చేస్తూ, చేస్తూ వుంటే.. అప్పుడు క్రమక్రమేణా మూడవకన్ను విప్పారితమౌతూ వుంటుంది."

J.K. భారవి : "ఓహో...అద్భుతం! మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ధ్యానం మీద మక్కువ ఎక్కువ! ఆయన ‘నేను పూర్వజన్మ చూసుకున్నాను’ అని చెప్పాడు...!"

పత్రీజీ : "ఔను.. నవ్వుతారేమిటి?అంటే మీకు నవ్వులాటగా ఉందా ఇదంతా?"

J.K. భారవి : "నవ్వులాట కాదండి.. అంటే ధ్యానంలో ‘నేను ఫలానా జన్మ తీసుకున్నాను’ అని తెలుస్తుందాండి..???"

పత్రీజీ : "ఔను, బుద్ధుడు తెలుసుకోలేదా??"

J.K. భారవి : "ఔను...కానీ.. ఆ కాలం వేరు - ఈ కాలం వేరు కదా?"

పత్రీజీ : "నిజానికి ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తాయి. ఎందుకంటే.... భూమి అనేది ప్రస్తుతం ఒక ప్రత్యేక మహాశక్తి కక్ష్యలోకి పోతోంది. దాన్ని ‘ఫోటాన్ బాండ్’ అంటారు. అందరూ కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికీ అనుభవాలు వస్తున్నాయి, అప్పటికన్నా.."

J.K. భారవి : "హిమాలయాల్లో- బాబాలు వాళ్ళందరూ ఉంటారు కదా- స్వామీజీలు ఉంటారు కదా-వాళ్ళ గురించి చెప్పండి!"

పత్రీజీ : "ప్రతిచోటా ఉంటారు స్వామీజీలు"

J.K. భారవి : "హిమాలయాల్లో మాత్రమే కాదా?"

పత్రీజీ : "హైదరాబాద్‌లో కూడా ఉంటారు, నాంపల్లిలో ఉంటారు; ‘నాంపల్లి బాబా’ గురించి తెలీదా మీకు??"

J.K. భారవి : "నాంపల్లి బాబా’ పేరు విన్నా!అంటే వీళ్ళకు హిమాలయాల్లో ఉండే స్వాముల రేంజ్ ఉంటుందా?"

పత్రీజీ : "‘వాళ్ళ అంత రేంజ్’ ఉండదు... కొంచెం ఎక్కువ ఉంటుంది!"

J.K. భారవి : "అంటే ధ్యానం చెయ్యడానికి హిమాలయాలకు పోనక్కరలేదు??"

పత్రీజీ : "జనారణ్యంలో ఉండి యోగి అయినవాడు మామూలు వృక్షారణ్యంలో ఉండే యోగికన్నా ఎక్కువ! తట్టుకునే శక్తి ఎంతో ఎక్కువగా ఉంటేనే కానీ ఇక్కడ ఉండలేరు వాళ్ళు-ఇక్కడ ఉన్నారూ అంటే...వాళ్ళ శక్తి ఎక్కువ, వాళ్ళ సాధన ఎక్కువ! లంకలో సీతకి ఏమీ జరగలేదంటే ఆవిడ శక్తి ఎక్కువ కదా! లేకపోతే అల్లరి జరిగిపోయేది. ఆవిడ శక్తి ఎక్కువ గనుక లంకలో వున్నా ఆవిడకేమీ జరుగలేదు."

J.K. భారవి : "‘బాబా’ సినిమా చూశాను సార్... అది బాగా అనిపించింది కానీ ఆ ముద్రలకేమైనా ప్రత్యేకమైన అర్థం ఉంటుందాండి?"

పత్రీజీ : "ఇప్పుడు మీరు దేవాలయాల్లోకి వెళితే విగ్రహాలకు, ‘అభయముద్ర’ ‘వరదముద్ర’ లాంటివి ఉంటాయి కదా! ‘అభయం’ అంటే... ‘భయరహితంగా...ఉంటే... మీకు కావలసిన వరాలన్నీ వస్తాయి’ అని వాళ్ళ భావన. ఎప్పుడు భయపడ్తూ ఉంటే ఏ వరాలూ రావు. మనలోని భయం తీసివేస్తే రావలసిన వరాలన్నీ మనకు వస్తాయి అని!

‘బాబా’ ముద్ర’-లో చిటికెన వ్రేలుకు అర్థం-భౌతిక సరీరం! ఉంగరపు వ్రేలు మనస్సుకు సంబంధించినది. ఇక మధ్యవ్రేలు-మధ్యలో ఉండే వ్రేలు రెండింటికన్నా పెద్దగా ఉన్న వ్రేలు, ఇది బుద్ధికి సంకేతం! శరీరంకన్నా మనస్సు గొప్పది, మనస్సుకన్నా...బుద్ధి గొప్పది!

ఈ ఐదు వ్రేళ్ళుల్లో మధ్యవ్రేలు బుద్ధి! ఎవరైతే ఎక్కువ తినకుండా, తక్కువ తినకుండా మధ్యస్థంగా ఉంటారో, ,ఎవరైతే ఎక్కువ మాట్లాడకుండా-తక్కువ మాట్లాడకుండా మధ్యస్థంగా ఉంటారో-ఎక్కువ నిద్రపోకుండా తక్కువ నిద్రపోకుండా మధ్యస్థంగా ఉంటారో - అన్నిటిలో.. మధ్యస్థంగా వుంటారో మధ్యనుండే ఆ మధ్యముడు అన్నమాట, అదే బుద్ధి! అందుకే ‘పాండువులలో మధ్యముడి నేను’ అంటాడు కృష్ణుడు!-‘అతి సర్వత్ర వర్జయేత్’! ‘అతి’ ఉన్నవానికి బుద్ధిలేదు...బుద్ధికి సంకేతం ‘మధ్య వ్రేలు’ ఫింగర్ అన్నమాట!

"తర్వాత నాలుగవది చూపుడు వ్రేలు అంటే - అందరినీ పిలిచినప్పుడు - ‘నువ్వు రావోయ్’ అని చూపుడు వ్రేలు చూపించే అంటాం! చూపుడువ్రేలు ఆత్మకు సంకేతం. నువ్వెవరు..? నువ్వు ఒక ఆత్మ! కనుక, నీ ఆత్మను సరిగ్గా చూసుకో సుమా, నీ దేహాన్ని వదిలిపెట్టు - నీ మనస్సును పక్కనపెట్టు- నీ బుద్ధిని కూడా పక్కనపెట్టు... నిన్ను నువ్వు సరిగ్గా చూసుకో! సర్వ ధర్మాన్ పరిత్యజ్య...శరీరధర్మం, మనోధర్మం, బుద్ధి ధర్మం, ఈ మూడు ధర్మాలు వదిలిపెట్టేసి...‘నిన్ను నువ్వు శరణు వేడుకో’ అనే దానికి ఈ చూపుడు వ్రేలే సూచన.

"ఇకపోతే బ్రొటనవ్రేలు సర్వాత్మకు సంకేతం! ఆ వ్రేలు ‘అలక్ నిరంజన్’!

"‘బాబా ముద్ర’లో... ఏంవుంది? ఈ మనస్సునీ, ఈ బుద్ధినీ ప్రక్షాళన చెయ్యడం కోసం ఇలా చిటికెనవ్రేలు-చూపుడువ్రేలు-ఇవి కదల్చకుండా ఉంగరంవ్రేలు, మధ్యవ్రేలు మడిచి ముద్రపెట్టేడన్నామాట! ప్రక్షాళనం చెయ్యవలసినది- ఆత్మను కాదు, శరీరాన్ని కాదు.. ప్రక్షాళన చెయ్యవలసినవి మనస్సుని, మరి బుద్ధిని! చంచలమైన మనస్సుని, మరి అపరిపక్వ బుద్ధిని!- సర్వాత్మకు అర్పణం చెయ్యాలి! వాటిని సర్వాత్మకు అర్పణం చేస్తే... ఆ సర్వాత్మ వాటిని అదిమి పట్టుకుంటుంది! అప్పుడు సర్వాత్మచంచల మనస్సునీ- అపరిపక్వ బుద్ధినీ శుద్ధి చేస్తుంది - తన గుప్పిట్లో పెట్టుకొని శుద్ధి చెయ్యగా, చెయ్యగా..ఇప్పుడు చాకలివాడికి మనం బట్టలు వేస్తాం- వాడు ఎంతకాలం పెట్టుకుంటాడు బట్టల్ని...?"

J.K. భారవి : "మురికిపోగానే ఇచ్చేస్తాడు"

పత్రీజీ : "అలాగే ఇది కూడానూ.. ఈ సర్వాత్మకూడానూ.. ఈ మనస్సునీ, బుద్ధినీ ఉతికి ఆరేయడం పూర్తి చేసిన తర్వాత వదిలి పెట్టేస్తుంది.! మీ మనస్సు -మీ బుద్ధి శుద్ధి కాగానే-‘నేను’ అనేది మాయమైపోతుంది సర్వాత్మలోకి! ఈ ‘బాబా ముద్ర’ అనేది మార్గం - ‘చిన్ ముద్ర’ అనేది ధ్యేయం! ‘బాబా ముద్ర’తో అనేది మార్గం - ‘చిన్ ముద్ర’ అనేది ధ్యేయం. ‘ బాబా ముద్ర’తో ఆ చాకలోడు ఉతికే ప్రక్రియలో వుంటాడు - ‘చిన్ ముద్ర’ అనేసి ఉతికిన బట్టలు వేసుకున్న బ్రతుకుకి ప్రతీక - అండర్‌స్తాండ్..?

"మామూలు చెయ్యి... ఒక బేబీ సోల్ యొక్క ఒక శైశవాత్మస్థితి - అనేక జన్మలపరంపరలో మొట్టమొదటి జన్మపరంపరలు ఉంటాయికదా ‘శైశవాత్మ’ అంటాం. తర్వాత కొన్ని రోజులకి ‘బాలాత్మ’ - మరికొన్ని రోజులకి యువాత్మ.. ఇంకా కొన్ని జన్మలు పోయిన తర్వాత ప్రౌఢాత్మ - మరి కొన్ని జన్మల తర్వాత వృద్ధాత్మ - మళ్ళీ తర్వాత విముక్తాత్మ - పరమాత్మ."

J.K. భారవి : "అయితే శైశవ, కౌమార, యవ్వన, వృద్ధాప్య అనేవి ఆత్మకు కూడా వర్తిస్తాయా?"

పత్రీజీ : "‘ఆత్మ’కు వర్తించవు కానీ.. జీవాత్మకు వర్తిస్తాయి! దీన్నే ఏమంటారంటే - ‘పారడాక్స్’ అంటారు!"

J.K. భారవి : "గురువుల్లో రకరకాల గురువులు ఉంటారా?"

పత్రీజీ :"గురువుల్లోనూ రకరకాలు ఉంటారు.. లఘువుల్లోనూ రకరకాలు ఉంటారు! ‘రకరకాలు’ ఎందులో లేవు? రకరకాల పండ్లు ఉన్నాయి- రకరకాల కాయలు ఉన్నాయి - రకరాకాల పిందెలున్నాయి!"

J.K. భారవి : "గురియే గురువుని మీరు ఎప్పుడైతే చెప్పేశారో అంతా బాగా అర్థమయినట్లుంది నాకు!!"

పత్రీజీ : "అందుకే ఒక మనిషికి గురువు కాదు మిత్రుడు! పరస్పరం పరమ మిత్రులు కావచ్చు - స్వల్పకాల మిత్రులు కావచ్చు - తాత్కాలిక మిత్రులు కావచ్చు! మిత్రత్వంలో మిత్రత్వం మాత్రమే ఉంది కానీ ఎవ్వరూ ఎవ్వరికి గురువులు కారు- జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు కదా -ఎవ్వరూ ఎవ్వరికీ గురువుకాదని!"

J.K. భారవి : "అంటే ఈ కాంట్రవర్సీస్ వల్ల ‘బాబా ముద్ర’తో జనం కన్‌ఫ్యూజ్ అవుతున్నారేమో??"

పత్రీజీ : "ఎవరూ కన్‌ఫ్యూజ్ కావటంలేదు - ఎవరికి కావల్సింది వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు! వాళ్ళ వాళ్ళ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు కరెక్టుగానే చేస్తున్నారు!

"ఎవరు ఏంచెప్పినా అది కరెక్టు! లేకపోతే వాడు ఎందుకు అలా చెప్తాడు? ఇప్పుడు నేను మోసగాడినా! మోసగాడిగా కనపడ్తున్నానా? ఎవ్వరూ మోసగాళ్ళగాదు! వాళ్ళల్లో ఉన్న పరిమిత అనుభవం వల్ల వాళ్ళకు తెలిసిన పరిమిత సత్యాన్ని వాళ్ళు యధాశక్తితో ప్రకాశింపచేస్తున్నారు! ఆ పరిమిత సత్యం కావలసిన వాళ్ళకి అది మహాప్రకాశం, మహాప్రసాదం! ఒకటవ క్లాసులో మీరొక టీచర్ దగ్గర చిదివారు- ప్రస్తుతం ఆ టీచర్ మీకు చెప్పడానికి పనికొస్తాడా? అన్నీ అంతే!"

J.K. భారవి : "అంటే మనిషి యొక్క మానసిక పరిపక్వత అన్నది బుద్ధి వికాసం అవుతున్న కొద్దీ..?

పత్రీజీ : "అవును! ఒక కొండ ఉంది... ఒకతను కొంత ఎక్కాడు, వాడికి కొంత కనపడుతుంది- కొంచెం ముందుకు ఎక్కితే ఇంకొంచెం ఎక్కువ కనబడుతుంది- ఎక్కువ కనపడితే ఎక్కువ వుందని చెప్తాడు - ఎక్కువ చూపించగలడు! తక్కువ కొండ ఎక్కితే - తక్కువ చూడగలడు - తక్కువ చూపించగలడు - చివరాఖరున పైనున్నవాడు అంతా చూపించగలడు - బుద్ధుడు సాంతంపైకి ఎక్కినవాడు కనుక అంతా చూపించాడు! మరి మథ్యలో ఉన్నవాళ్ళు...?

J.K. భారవి : "అక్కడివరకే.."

పత్రీజీ : "మరి వాళ్ళు ‘అసత్యం’ అంటే ఎలాగ? అది వాళ్ళను దూషించటమే అవుతుంది! అది పూర్తిగా తప్పు!"

J.K. భారవి : "ప్రపంచాన్ని మొత్తం ధ్యానసమయం చేయడమే మీ ఆశయం క్రింద... దాన్ని ఒక పీరియడ్ క్రింద కూడా పెట్టుకున్నారు మీరు...2012"

పత్రీజీ : "టార్గెట్ అని పెట్టుకోకపోతే మనం ఎక్కువ పని చెయ్యలేం - ఎప్పుడు కూడానూ ‘టార్గెట్’ అనేది మనం ఎంత కష్టతరంగా పెట్టుకుంటే... అంత ఎక్కువగా మనం పని చెయ్యగలం! అందుకోసమే అలా పెట్టుకున్నాను."

J.K. భారవి : "మీ టార్గెట్ ఇప్పుడు మీరు ఎంతశాతం సాధించి వుంటారు?"

పత్రీజీ : "ఆ రోజుకైపోతుంది అంతే - ఆ రోజుకన్నా ఒక్క రోజు ముందు కూడానూ -సగమే అవచ్చు. కానీ, ఆ రోజుకు మాత్రం సంపూర్ణంగా అయిపోతుంది అని విశ్వాసం! ‘లెక్కలు’ బట్టి కాదు ఆత్మ సంకేతాలను బట్టి!"

J.K. భారవి : "నిజంగా ఒక మహా అందమైన సంకల్పం..మీరు ఊహిస్తున్న ప్రపంచాన్ని 2012 రోజు మొత్తం ప్రపంచం ధ్యానమయమై ఉండగా ఎలా ఉంటుందో చూడాలని... ఒక దృశ్యమేదో కనిపిస్తోంది! ఎంత హాయిగా ఉంటుందో...బాధలు, కష్టాలు, నష్టాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండవు; పగలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు; అందరూ అందరికీ గురువులే...! అందరూ ఆనందంలో ఉంటారు! అందరూ ఒక హాయిని అనుభవిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. మెంటల్‌గా బాగా చాలా...బలోపేతంగా ఉంటారు, యుద్ధాలు వుండవు!

"అయితే ఇంకొక ప్రశ్న... ఇప్పుడు ధ్యానంలోకి ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూడా వస్తున్నారు కదండీ...! అంటే కొన్ని పద్ధతులు, అలవాట్లు- ఇప్పుడు నాన్‌వెజ్ తినేవాళ్ళు కొందరుంటారు కదా...వాళ్ళు కూడా ధ్యానం చేయవచ్చా?"

పత్రీజీ : "రావణాసురురు చేశాడు కదా - ఆయన రాక్షసుడు కదా- అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాడుకదా! మంచి ఎవడికి కావాలి... చెడు చేసే వాడికే కావాలి! మంచి ఇంకా ఎవడికి కావాలి.. మంచి చేసేవాడికి కూడా కావాలి! మంచి ఎవరికి వద్దు?"

J.K. భారవి : "అందరికీ కావాలి"

పత్రీజీ : "కనుక ధ్యానం కూడ అందరికీ కావాలి!

J.K. భారవి : "అందరికీ అవసరమంటారు- కానీ... ఈ ‘నాన్‌వెజ్’ తింటే? తేడాలు ఏమీ లేవా మరి?"

పత్రీజీ : "ఏ కర్మ ఫలితం ఆ కర్మకు వస్తుంది! చెడు కర్మకి- చెడు ఫలితం... అహింసా ప్రవృత్తికి మంచి ఫలితం!- రావణుడికైనా ధ్యానా ప్రవృత్తికి శంకరుడు వచ్చాడు! మంచికెప్పుడూ మంచి ఫలితమే!"

J.K. భారవి : "శాకాహారులై ఉన్నందువల్ల ధ్యానంపై ఎక్కువ గురి కుదురుతుందా?"

పత్రీజీ : "శాకాహారులుగా ఉన్నప్పుడే... నిజానికి ధ్యానమనే గురి వచ్చేది- మాంసాహారిగా ఉన్నప్పుడు కూడా ఒకరికి ధ్యానంలో గురి వచ్చింది అంటే... వాడు జన్మల్లోనే ధ్యాని అయ్యాడు గనుక ఆ గురి వచ్చింది!"

"ఎంతగా జంతువులనుమనం చంపుకు తింటామో- అంతగా దాని ఫలితాన్ని అనుభవిస్తునే ఉంటాం! ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని హింస చేసే స్వేచ్ఛ వుంది! హింస చెయ్యచ్చు. మన స్వేచ్చను ఎవ్వరూ తీసివేయరు! మనం ఏదైనా ఎక్కడైనా చెయ్యవచ్చు ఈ భూలోకమే ఒక మహా స్వేఛ్ఛా జీవన క్షేత్రం! స్వేచ్చ అంటే ‘స్వ ఇచ్ఛ’ అంటే ‘స్వంత ఇష్టం! భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునితో....‘యధాచ్చసి తధా కురు; నీ ఇష్టం ఎలా ఉందో అలా చెయ్’ అన్నాడు కదా! మన స్వేచ్ఛను మనకు లేకుండా చేసే నాధుడు- పైలోకాలలో వున్న దేవుడు ఎవ్వడు లేడు - సృష్టిలో మనకు ఏం చెయ్యాలని అనిపించినా అలా చేసే స్వేచ్చ మనకు పూర్తిగా ఉంది. అదే ఆత్మ యొక్క ప్రచండ తేజం- కానీ దాని పరిణామాన్ని మటుకు మనం తప్పక అనుభవించాల్సి వుంటుంది."

J.K. భారవి : "మొత్తానికి మీరు చెపుతున్న పద్ధతి చాలా బావుంది! దానికి తగ్గట్టుగా...ఒకప్పుడు జీసెస్ తమ అభిప్రాయాల్ని ప్రపంచ వ్యాప్తం చెయ్యాలనుకున్నాప్పుడు ఆయన దగ్గర 12 మంది మిత్రులే వున్నారు- అలాగే బుద్ధుడికి 5,6 వందలమంది కంటే ఎక్కువ ఉన్నట్టు చరిత్రలో లేదు. కానీ ఇవాళ మీతో ఇంతమంది...!

"మీ బాటల్లో, మీరు చూపిస్తున్న దారిలో, కొన్ని వేలమంది తయారయ్యారు -వాళ్ళ చేతులు పట్టుకొని, లక్షలమంది మీరు చెప్పిన ఈ ధ్యానంలో శాంతిని పొందగలుగుతున్నారు! మీ ఆశయాల, ఆదర్శాలకు అనుగుణంగా 2012 రావాలి- ఈ ప్రపంచం మొత్తం ధ్యానసమయం కావాలని కోరుకుంటున్నాం!"

పత్రీజీ : "అంతా కాలమహిమ! పైన తధాస్తు దేవతలున్నారు-తధాస్తు!"

Go to top