" రవీంద్రనాథ్ ఠాగూర్ లా కనిపిస్తారు పత్రీజీ! "

 

శ్రీమతి విమలా మేడమ్ సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారైనా, ఆధునిక భావాలు, ప్రపంచ పోకడలు బాగా తెలిసిన మహిళ. ఆవిడ, పత్రీజీ సోదరి సుధా మేడమ్ భర్త రామకృష్ణ గారికి స్వయానా మేనమామా గారి భార్య. పత్రీజీ కుటుంబానికి సుధా మేడమ్ వివాహం కంటే ముందు నుంచీ, అంటే షక్కర్‌నగర్‌లో వారున్నప్పటి నుంచీ బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి.

వారి వయస్సు దాదాపు 70 సంవత్సరాలు వుంటుంది. అయినా బాగా ఆరోగ్యంగా, హుషారుగా వున్నారు. బాగా ధ్యానం చేస్తారు. ప్రశాంత జీవనం. విమలా మేడమ్ కు పత్రీజీ అంటే వాత్సల్యం, ఆరాధన, గురుభావం! "మా ఆత్మీయ బంధువు పత్రీజీ; ఇంతగొప్ప గురువు మా సుధ తమ్ముడు అనుకుంటేనే గర్వంగా వుంటుంది మా బంధుమిత్రులందరిలో".. పత్రీజీని గుర్తుచేసుకున్నప్పుడు అందావిడ, పత్రీజీ కుటుంబం గురించి ఆవిడ చెప్పిన వివరాల్లోకి వెళదాం మరి!

మారం : నమస్కారం విమలా మేడమ్ గారూ! మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా వుంది. మొట్టమొదటగా మీ కుటుంబం గురించి చెప్పండి!

విమలా మేడమ్ : మావారు స్వర్గీయ శ్రీ కోటేశ్వరరావు గారు, సుధా మేడమ్ భర్త "కోడూరి రామకృష్ణ" గారికి మేనమామ. మేము కాగజ్‌నగర్‌లో వుండేవాళ్ళం, మా వారి ఉద్యోగరీత్యా. వారు రిటైర్ అయిన తర్వాత మా స్వంత ఇల్లు సీతాఫల్‍మండిలో కట్టుకోవడానికి వచ్చేశాం. నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు. ముగ్గురు కూతుళ్ళు కూడా హైదరాబాద్‌లోనే వున్నారు. కొడుకు మాత్రం ఉద్యోగరీత్యా సింగపూర్‌లో వున్నాడు.

మారం : మీకు ఏ సంవత్సరం నుండి పత్రీజీ కుటుంబంతో పరిచయం?

విమలా మేడమ్ : "షక్కర్‌నగర్" లో రామక్రిష్ణ గారి తండ్రి హనుమంతరావు, పత్రీజీ తండ్రి రమణారావు గార్లు "నైజామ్ షుగర్ ఫ్యాక్టరీ" లో పనిచేసేవారు. అప్పుడప్పుడూ నేను, నా భర్త, రామక్రిష్ణ గారింటికి వెళ్ళేవాళ్ళం బంధుత్వరీత్యా. పత్రీజీ ఫ్యామిలీ, మావారి బావగారైన "కోడూరి హనుమంతరావు" గారి ఫ్యామిలీ ఎంతో క్లోజ్‌గా వుండేవాళ్ళు. ఆ విధంగా పత్రీజీ, వారి అన్న వేణు, సుధ ముఖ్యంగా వాళ్ళమ్మగారు స్వర్గీయ సావిత్రమ్మ గారు నాతో ఎంతో చనువుగా మసలేవాళ్ళు.

మారం : మీరు ధ్యానం ఎవరి ద్వారా నేర్చుకున్నారు?

విమలా మేడమ్ : మా అల్లుడు రామకృష్ణను పెళ్ళి చేసుకోవడం వల్ల సుధతో నా పరిచయం స్నేహంగా మారింది. ఎన్నో విషయాలు చెప్పేది.. తాను డాక్టరు మరి సైకియాట్రిస్ట్ కావడం వల్ల. ఆమె నుండే నేను ధ్యానాన్ని నేర్చుకున్నాను. ఇక ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మా స్నేహం మరింత ఎక్కువయింది.

మారం : సావిత్రమ్మ గారితో మీరు కలిసేవారా? వారిని గురించి చెప్పండి!

విమలా మేడమ్ : సావిత్రమ్మ గారు కల్మషం లేని మనిషి. ఎంతో అప్యాయంగా మాట్లాడేవారు. సావిత్రమ్మ గారు ఉన్నంతవరకు అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వారు ఎన్నో కబుర్లు, విషయాలు ముచ్చటించేవారు. ఆవిడ ఎంతో జ్ఞానవంతురాలు. చాలా జాగ్రత్తగా పిల్లలను పెంచుకుంటూ వచ్చింది. ఇక సుధ అమెరికా నుండి వస్తే మాత్రం, నేను తరచుగా వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. సావిత్రమ్మ గారితో కూడా చాలాసేపు మట్లాడేదాన్ని!

మారం : పత్రీజీని మొదటగా ఎప్పుడు చూశారు మీరు? ఎక్కడ? అప్పుడు ఆయన వయస్సు?

విమలా మేడమ్: 1961 ప్రాంతంలో నేను పత్రీజీని మొదట షక్కర్‌నగర్‌లో చూసాను. క్రమంగా ఆయన చదువు పూర్తి కావడం, కోరమాండల్‌లో ఉద్యోగం రావడం, కర్నూలు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ‘టక్‘ చేసుకుని, ‘టిప్‌టాప్’ గా వుండేవారు. ఇప్పుడు ఆయన గంభీరంగా వుంటారు. అప్పుడు చాలా చలాకీగా వుండేవారు. నేను మొదలు కలిసినప్పుడు ఆయనకు 14,15 ఏళ్ళుండేవి.

మారం : పత్రీజీ కుటుంబం మీకు వాళ్ళతో బంధుత్వం లేకముందు నుండి తెలుసును కదా.. మరిన్ని విశేషాలు చెప్పండి వారి కుటుంబం గురించి!

విమలా మేడమ్ : పత్రీజీ "స్వర్ణ" ను పెళ్ళి చేసుకోవడానికి మునుపు, ఆమెను వాళ్ళ వదిన చెల్లెలే అయినా ఇష్టపడి యాదగిరిగుట్టలో పెళ్ళి చేసుకున్నారు. అప్పటికే సుధ పెళ్ళి అయిపోయి వుండింది, కనుక పత్రీజీ కుటుంబంతో అనుబంధం మరింత పెరిగింది. క్రమంగా సుధ నాకు ధ్యానం నేర్పింది. యాభై లేదా అరవై నిమిషాలు ధ్యానం చేస్తాను. కనీసం నెలకొకసారి వెళ్ళి, సావిత్రమ్మ గారు వున్నప్పుడు కదా వారితో గడిపేదాన్ని. సుధ గురించి, పత్రీజీ గురించి, ధ్యానం గురించి మామధ్య ఎన్నో విషయాలు దొర్లేవి. వాటి గురించే ముచ్చటించుకునేవాళ్ళం. కలిసి ధ్యానం చేసేవాళ్ళం.

మారం : మీరు సావిత్రమ్మ గారి పాటలు వినేవారా? వారి కుటుంబసభ్యులు అందరితో మీరు సన్నిహితంగా వుండేవారా?

విమలా మేడమ్ : రమణారావు, సావిత్రమ్మ దంపతులు చాలా ఉత్తములు. వారి పెద్దకూతురు "ఉష" ఇల్లు కూడా వారింటికి దగ్గరలోనే. నేను అక్కడికి కూడా వెళ్ళి ఉషతో కాసేపు గడిపేదాన్ని. సావిత్రమ్మ గారికి సంగీతం అంటే చాలా ఇష్టం బాగా పాడేవారు. ఆమె సంగీతప్రీతి పత్రీజీ సంగీతంలో నిష్ణాతుడు కావడానికీ, అద్భుతంగా ఫ్లూట్ వాయించడానికీ పురికొల్పింది. పత్రీజీ అన్నగారు "వేణువినోద్" కూడా చాలా సరదా మనిషి.

మారం : పత్రీజీ, మరి వారి అన్న వేణు ఇద్దరూ ఫ్లూట్ వాయించేవారు కదా.. మీరు పత్రీజీ మరి వేణుగారి ఫ్లూట్ కూడా వినేవారా!

విమాలా మేడమ్ : బాగా! పత్రీజీ మరి వేణు ఇద్దరూ పోటీపడి ఫ్లూట్ వాయించేవాళ్ళు! ఇద్దరూ ఫ్లూట్ వాయిస్తూంటే ఎంత ముచ్చటగా వుండేదో. ఎంతో రమ్యంగా వాయించేవాళ్ళు. మరి పత్రీజీకి సంగీతం బాగా నేర్చుకోవడం వల్ల ఫ్లూట్ ఎంతో అద్భుతంగా వాయించడం వల్ల, ధ్యానానికి సంగీతం జోడించడం పూవుకు తావి అబ్బినట్లయింది! సంగీతంలో వున్న ఎనర్జీ, ధ్యానం వల్ల వచ్చే కాస్మిక్ ఎనర్జీకి తోడుకావడం వల్ల ధ్యానం మరింత మాధుర్యం అయిందని నా అభిప్రాయం. క్రమంగా ఆ ఫ్లూట్ వింటూంటే "శ్రీకృష్ణుని వేణుగానం"లాగా అనిపించేది!

మారం : పత్రీజీ సిటిలో క్లాస్‌లకు మీరు వెళ్ళేవారా!

విమలా మేడమ్ : అప్పుడప్పుడూ వెళ్ళేదాన్ని. సుధ వచ్చినప్పుడు మాత్రం తప్పక ఆమెతో కలిసి వెళ్ళేదాన్ని.

మారం : మీ బంధువులు పత్రీజీని గురించి ఏమనుకుంటారు? ఎటువంటి చర్చలు వస్తాయి మీ మధ్య పత్రీజీ గురించి? మీరు ధ్యానం బోధిస్తారా?

విమలా మేడమ్ : పత్రీజీని చూస్తే, బంధువులందరికీ గుర్తు వచ్చేది ఆయన ఫ్లూట్! మా బంధువర్గమంతా కూడా ఎప్పుడైనా కలుసుకుంటే, పత్రీజీ కుటుంబం గురించి చర్చ వస్తే, అది ఆయన ఫ్లూట్ గురించే. ఒకప్పుడు అంతా కలుసుకున్నపుడు, "మరింత సాధన చేసి వుంటే పత్రీజీ ప్రపంచ ప్రఖ్యాత ఫ్లూట్ విద్వాంసులు అయ్యేవారు" అనుకునేవాళ్ళం. ఈ మధ్యకాలంలో అందరూ "ఆయన ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరు, ఆయన మా ఆత్మీయబంధువు" అని చెప్పి గర్వపడుతున్నారు! నేను అందరికీ చెపుతూ వుంటాను మా బంధువులకు ఇంత సులభమైన, పైసా ఖర్చులేని ధ్యానం చేయమని. వారు ధ్యానం చేసినా చేయకపోయినా పత్రీజీ ఆధ్యాత్మిక స్థాయిని గుర్తుచేసుకుని గర్వపడతారు.

మారం : ధ్యానంలోని మీ అనుభూతులను గూర్చి చెపుతారా?

విమలా మేడమ్ : నాకు ధ్యానం చేస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్ వుంటుంది. ఈ అనుభూతి వర్ణించడానికి వీలుకానంత బాగా వుంటుంది.

మారం : సుధా మేడమ్ గురించి చెప్పండి!

విమలా మేడమ్ : సుధా చాలా గొప్ప వ్యక్తి. కల్మషం లేని వ్యక్తి. వర్ణించటానికి అలవికానటువంటి సద్గుణాలు వున్నాయి ఆవిడకి. ఆ ఫ్యామిలీలో వారి అత్తగారు, మామగారు, అయిదుగురు ఆడపడచులు, ఇద్దరు అన్నదమ్ములు వున్న పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అందరికీ తలలో నాలుకలాగ మసలి ఆ కుటుంబానికి సేవ చేసింది. ఇప్పుడు అమెరికాలో ధ్యానసేవ చేస్తోంది. తరచుగా ఫోన్ చేస్తూ వుంటుంది: "ఇవాళ అక్కడికి వెళ్ళి క్లాసు చెప్పాను. ఇవ్వాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాను" అని చెపుతూ వుంటుంది. ఈ వయస్సులో నేను పెద్దగా తిరగకపోయినా, సుధా చెప్పే విషయాలు విని ఆనందిస్తూంటాను. ఒక ఆదర్శ స్త్రీమూర్తి సుధ!

మారం : పత్రీజీని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఒక్కప్పటి ‘సుభాష్"కు ఇప్పటి ‘పత్రీజీ’ కి వున్న తేడా?

విమలా మేడమ్ : మా బంధువులందరిలో పత్రీజీ నాకు ఎంతో గొప్పగా కనిపిస్తారు. మావన్నీ బాగా చదువులు, గొప్ప ఉద్యోగాలు వున్న కుటుంబాలు. చాలామంది విదేశాల్లో వున్నారు, సెటిల్ అయ్యారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి కూడా ఆధ్యాత్మికతవైపు మళ్ళీ అందులోనూ ‘టాప్ మోస్ట్’ అయిన వారు పత్రీజీ! "రవీంద్రనాథ్ ఠాగూర్" లాగా కనిపిస్తారు పత్రీజీ నాకు!

ఒకప్పుడు "పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి ధ్యానం అంటూ తిరుగుతున్నాడు" అని మా వాళ్ళంతా విసుక్కునేవారు. మల్లెపూలు మొగ్గగా వున్నప్పుడు ఎవ్వరికీ దాని సువాసన అర్థం కాదు. విచ్చుకున్న తర్వాతనే కదా దాని సౌరభం తెలిసేది!

మారం : సావిత్రమ్మగారి వంట అంటే పత్రీజీ ఎంతో ఇష్టపడేవారు! ఆమె బాడీ వెకేట్ చేసేముందు మీరామెను కలిసారా!

విమలా మేడమ్ : నేను సావిత్రమ్మ గారి తో చెప్పేదాన్ని: "మీ పెద్దబ్బాయి వేణు ఉన్నతోద్యోగం, భోగం; మరి పత్రీజీ ఏమో యోగం, త్యాగం" అని. ఆ మాటలు విని ఆవిడ ఎంతో సంతోషించేది. ఆవిడ చాలా యోగ్యురాలు. "నలుగురు పిల్లలూ ఆణిముత్యాలు; ఇంకేం కావాలి నాకు?" అనేవారు. ఆ వయస్సులో కూడా ఆవిడ పనులు ఆవిడ చేసుకునేవారు. షక్కర్‌నగర్‌లో నేను ఆవిడను మా బంధువు కాకమునుపు చూసినప్పుడు ఇంటిని ఎలా నీట్‌గా పెట్టుకునేవారో, ఆవిడ పెద్ద వయస్సు వచ్చినా కూడా ఆ నీట్‌నెస్‌ను అలా మెయిన్‌టెన్ చేసేవారు!

సావిత్రమ్మ గారికి అత్యంత ఇష్టమైన విషయం వంట. ఇంటికి వచ్చిన వారికి వండి వడ్డించడం ఆమెకు అత్యంత ప్రీతి. పత్రీజీ హైదరాబాద్‌లో వున్నప్పుడు పత్రిసార్‌కు ఇష్టమైన ఐటమ్స్ చేయడం, వచ్చిన వారందరికీ వండడంలో ఆమె ఎంతో ఆనందం పొందేది.

పత్రీజీ ఇంట్లో వున్నప్పుడు ముందే ఎంతమంది వస్తారో అంచనా వేస్తూ అన్నీ ఆరేంజ్ చేసుకొని వంట చేసేవారావిడ. నిజం చెప్పాలంటే, పత్రీజీ "హైదరాబాద్ ఎప్పుడు వస్తానా, ఎప్పుడు అమ్మ చేతివంట తింటానా" అని అనుకునేవారంటే అతిశయోక్తి కాదేమో! ఆమె మాటల్లో ఈ విషయం ధ్వనించేది. కొడుకు వచ్చే ముందురోజే మెన్యూ ప్రిపేర్ చేసుకునేది.

శరీరం త్యజించడానికి ముందు ఒక రెండు నెలలు మాత్రం ఆవిడ ఇబ్బందిపడింది. ఆఖరురోజుల్లో చేసిన కర్మలు ఏవైనా అనుభవించి వెళ్ళిపోవడం మేలు అనుకునేది ఆవిడ. అలాగే అందరూ ఇండియాలో వున్నప్పుడే వెళ్ళిపోయింది.. ధన్యజీవి! ఆవిడ భర్తను కూడా.. ఆయన దీర్ఘకాల అనారోగ్యంతో వున్నా కూడా.. ఆయన్ను బాగా గమనించుకుని, అనుసరించుకుని పోయేది. అరుదైన అర్హతలున్న మహిళ!

మారం : రమణారావు గారి గురించి చెప్పండి! వారు మరణించినప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారా?

విమలా మేడమ్ : రమణారావు గారు మరణించినప్పుడు నేను వారింట్లో వున్నాను! నాకు బాగా గుర్తు. పత్రీజీ చేతుల్లోనే ఒరిగిపోయి, బాడీ వెకేట్ చేసేరు ఆయన! ఎంత అదృష్టవంతుడో.. మరి ఒక మహా యోగపురుషుడు.. అందులో కొడుకు..ఆయన పత్రిగారి చేతుల్లోనే ప్రాణం విడవడం. ఆ రాత్రంతా కూడా నేనక్కడే వున్నాను.

మారం : ఇంకా విశేషాలు చెప్పండి!

విమలా మేడమ్ : "వేణు" బాగా జోక్‌గా మాట్లాడేవాడు. పత్రీజీ మితభాషి గంభీరంగా వుండేవారు. మొదటినుండి పత్రీజీ చాలా కష్టపడిన మనిషి. వుద్యోగం లేనప్పుడు ఒక పూట తిని, ఒకపూట తినకుండా వుండి, ఎవ్వరికీ చెప్పుకోకుండా జీవించారు పత్రీజీ, మరి స్వర్ణ కూడా. ఇద్దరూ చాలా ఆత్మాభిమానం కలవాళ్ళు. పత్రీజీలోని పవర్ అనుకోండి, దైవశక్తి అనుకోండి.. ఆయన ఎంతో గొప్పవారయ్యారు. సుధ ఆయన గుణాలను పుణికి పుచ్చుకుంది. "ఆయన నాకు తమ్ముడిగా కంటే కూడా గొప్ప గురువుగానే బాగా నచ్చారు" అంటుంది సుధ. సుధకు పత్రీజీ అంటే ఎంత ఇష్టమో! ఇప్పుడు మాకు అందరికీ ఆయన పట్ల గురుభావమే వుంది. ఆయన ప్రక్కన వున్నప్పుడు ఆయనతో షేక్‌హ్యాండ్ తీసుకుంటే, ఎంతో స్పిరిట్‌గా వుంటుంది. ఒక తరంగం వ్యాపించినట్లు వుంటుంది!

మారం : మీరు తిరువణ్ణామలైకి వచ్చారు కదా! ఆ వారం రోజులూ మీరు పొందిన అనుభూతులు?

విమలా మేడమ్ : ఎంత చెప్పుకున్నా తక్కువే! పత్రీజీ గురించి తక్కువ అభిప్రాయం వున్నవాళ్ళూ, ఆయన గురించి సరిగ్గా అవగాగన లేనివాళ్ళూ మన ధ్యాన మహాయజ్ఞాలకు వస్తేనే వారి వైభవం, స్థాయి, పిరమిడ్ ధ్యానుల విశ్వవ్యాప్త సమాహారం తెలుస్తుంది. తిరువణ్ణామలై వేదిక, ఆ ఏర్పట్లు, ఆ సభ, పత్రీజీ ఆ సభను నిర్వహించిన వైనం చూస్తే, "దేవేంద్రుని సభ బహుశా ఇలాగే వుంటుంది కాబోలు" అని నాకు అనిపించింది! ఇక డైనింగ్ సెక్షన్, ఆ ఆహారపదార్థాలు, ఆ వడ్డన చూస్తే "నలుడు, భీముడు మానవ రూపాల్లో మరలా వచ్చి నిర్వహించారేమో" అనిపించింది! సుధా మేడమ్ మరి పత్రీజీ ఇతర బంధువులు ఎంతగా ఆనందించారో నేను వర్ణించలేను!

మారం : సావిత్రమ్మ గారి గుణాలు ఏమేం అబ్బాయి పత్రీజీకి?? పత్రీజీ బంధుమిత్రులతో ఎలా వుంటారు?

విమలా మేడమ్ : సావిత్రమ్మ గారి ఓర్పు, ఓపిక, సంగీతం, సహనం, నెమ్మదితనం అన్నీ పుణికి పుచ్చుకున్నారు పత్రీజీ. అందరు బంధువులతో కూడా ఎంతో ప్రేమాభిమానాలతో వూంటారు. ఎవరైనా శుభకార్యాలకు పిలిస్తే వారికి వీలుంటే, ప్రోగ్రాం ముందుగానే అంటే కనీసం ఒక నెల ముందు తెలిస్తే తప్పక తమ షెడ్యూలు అడ్జస్ట్ చేసుకుని వస్తారు. షెడ్యూలు కుదరకపోతే స్వర్ణను పంపిస్తారు. వారిని బాగా అర్థం చేసుకుంటేనే ఆయన బోధ పడతారు. ఆయన్ను అర్థం చేసుకోవాలంటే ఆయన మనస్సుతో ఇవతల వాళ్ళు కూడా కలవాలి. ఎంతో సాదా, సీదాగా వుంటారు ఆయన. ఆయన ఎంతో ప్రయత్నం చేసి అంత గొప్ప గురువు అయ్యారు. ఆయనలా ప్రయత్నం చేస్తే మనమూ మాస్టర్స్ అవుతాం.

పత్రీజీ చాలా విషయాల్లో సర్దుబాటు అవుతారు. ఎంత గొప్ప అవగాహన! ఆయనకు వున్న శక్తి కేవలం స్వయంకృషి వల్ల మాత్రమే వచ్చింది. ఆయన ఇంత ధ్యానప్రచారం చేస్తూన్నారంటే ఆ స్వయంకృషే దానికి కారణం.

ఎన్ని ఊర్లు తిరిగారు ఆయన! ఎంతమందితో అడ్జస్ట్ అయ్యారు! తిన్నారో తినలేదో! ధ్యానప్రచారం కోసం ఎటువంటి వారితో కూడా ఎంత సర్దుబాటుతో తననుతాను కంట్రోల్ చేసుకున్నారో! ఎన్ని రోజులు ఎంతెంత తిరిగారో! ఇప్పుడు ఇంత వైభొగం వెనుక ఎన్ని సంవత్సరాల నిరంతర కృషి! తలచుకుంటేనే వొళ్ళు పులకిస్తుంది!

మారం : మీరు అమెరికా వెళ్ళారా? ఎప్పుడు?

విమలా మేడమ్ : వెళ్ళానండీ. సుధా కూతురు పెళ్ళికి వెళ్ళాను. ఒక నాలుగయిదు నెలలు వున్నాను. బాగా ఎంజాయ్ చేశాను.

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం?

విమలా మేడమ్ : నేను భాగవతం బాగా చదివాను. భగవద్గీత చదివాను. శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించాడు. జీవన విధానాన్ని, స్వధర్మాన్ని, కర్మాచరణను, మార్గాన్ని బోధించారు. మరి పత్రీజీ ఏమో "శ్వాసమీద ధ్యాస "భోధించారు. శ్రీకృ‌ష్ణుని లాగే వేణువును ధరింఛాడు! మరి వేణువు ఎప్పడూ ఖళీగా వుంటుంది. దానిని శ్వాసతోనే పూరించాలి. శ్వాసను గమనించమని చెపుతూ, వేణువుతో శ్వాసానుసంధానం చేస్తున్నారు పత్రీజి! కృష్ణుని చుట్టూ పాండవులు, యాదవులు, అష్టపత్నులు, గోపికలు వుండేవారు పత్రీజీ చుట్టూ ధ్యానులు వుంటున్నారు!

ఆ కాలంలో కృష్ణుడు భగవద్గీత బోధిస్తే ఇప్పుడు పత్రీజీ సనాతమైన, వినూత్నమైన, కాలగుణమైన జ్ఞానాన్ని జనులకు అత్యంత సులభంగా బోధిస్తున్నారు. నాకు వీరిద్దరూ ఒకటిగానే అనిపిస్తారు!

"ధ్యానాధ్రప్రదేశ్" ద్వారా చాలా ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తున్నాయి. కనుక ఒక్కరూ "ధ్యానాంధ్రప్రదేశ్" కొని చదావాలి! సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేస్తూ చెపుతూ తమ సమాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్యూ!

Go to top