" మా ఊరు - ధ్యాన ఆదర్శ గ్రామం "

 

అనంతపూర్ జిల్లా ఉరవకొండ మండలంలోని " నింబగల్లు " జీవసమాధి చెందిన యోగుల యోగశక్తికి ప్రసిద్ధి చెందిన గ్రామం. సిద్ధప్పమఠం, యోగిప్రసాద మఠం అనబడే శక్తిక్షేత్రాలతో విలసిల్లుతోన్న ఈ గ్రామంలో ప్రతిసంవత్సరం కర్నాటక నుంచి భక్తులు వచ్చి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తూ వుంటారు. మా ఊరి జనాభా ఇంచుమించు 2000.

ఇంతటి యోగ చరిత్ర ఉన్న మా నింబగల్లు గ్రామంలో జన్మించిన నేను నా చిన్నప్పటి నుంచి ఆ యా మఠాల్లో ఎంతో కోలాహలంగా ఉత్సవాలు జరగడం చుసేవాడిని! కానీ " యోగులు " అంటే ఎవరో మాత్రం అర్థం అయ్యేది కాదు. 1999 సం||లో మొదటి సారి నాకు ధ్యాన పరిచయం జరిగి " యోగం " అంటే ఏమిటో తెలిసింది.

వెంటనే మా గ్రామానికి సమీపంలో వున్న ఉరవకొండ.. " లోబ్‌సాంగ్‌ రాంపా పిరమిడ్ " లో 41 రోజుల మౌనధ్యానం ఏసి ఎన్నెన్నో గొప్ప గొప్ప ధ్యానానుభవాలను పొందాను. అన్నీ వదిలి పెట్టేసి అడవులకు వెళ్ళిపోయి భౌతిక శరీరాన్ని తాడవ పీడనలకు గురిచేసిన యోగులు, సిద్ధులు పొందిన దివ్యదర్శనాలనూ, సూక్ష్మశరీరయానాలనూ .. నేను ఉరవకొండలోని పిరమిడ్‌లోనే పొందడం జరిగింది.

ఎందరెందరో పిరమిడ్ మాస్టర్లను కలిసి వారి నుంచి జ్ఞానాన్ని పొంది నా జన్మను ధన్యం చేసుకున్నాను. నేను పొందిన ఇంతగొప్ప ధ్యానానందాన్ని నా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం నా జన్మ బాధ్యతగా తలచి .. నింబగల్లులోని నా మిత్రులందరికీ ధ్యానం నేర్పించాను.

అందరం కలిసి దేవాలయంలో కానీ, ఊరవతల కొండలపైకి వెళ్ళి కానీ కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం. ఊళ్ళో ప్రత్యేకంగా ఒక ధ్యానమందిరం ఉంటే గ్రామస్థులందరికీ ఉపయోగంగా ఉంటుందని తలచి ఉరవకొండ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ G.వెంకటేశ్ గారి సహకారంతో 2001 సంవత్సరంలో ఒక ధ్యానమందిరాన్ని మిత్రులందరం కలిసి ప్రారంభం చేసుకున్నాం.

అప్పటికి కొన్నేళ్ళుగా గ్రామంలో వర్షా భావ పరిస్థితులు నెలకొని ఉండడంతో కొందరు గ్రామస్థులతో కలిసి " ఏడు రోజుల సంకల్ప ధ్యానయజ్ఞం " నిర్వహించాం. రోజుకు 100 మందికి అన్నదానం చేస్తూ ఒక ఉత్సవంలా దానిని నిర్వహించాం.

కార్యక్రమం చివరిరోజు మా సంకల్ప బలాన్ని అభినందిస్తూ ప్రకృతి పులకించిందా అన్నట్లు మధ్యాహ్నం 2 గం||ల నుంచి మరుసటి రొజు ఉదయం 5 గం||ల వరకు కుండపోతగా వర్షం కురిసి గత కొన్నేళ్ళుగా వర్షాభావంతో అల్లాడుతోన్న భూములన్నీ పులకించి పోయాయి! వర్షం నీటితో చెరువు కళకళలాడింది! ఈ కార్యక్రమాలు దిగ్విజయం కావడంతో మా గ్రామస్థులందరూ ధ్యానం వల్ల సాధ్యం కానిది ఏది లేదని మమ్మల్ని అభినందించడం జరిగింది. అప్పటి నుంచి మా గ్రామంలో ధ్యాన కార్యక్రమాలు మరింత ముమ్మరం అయ్యాయి. పౌర్ణమి ధ్యానాలు, మండల ధ్యానాలతో పాటు ఏ సమస్యనయినా ఆత్మశక్తితో ఎదుర్కునే శక్తి స్వరూపుల్లా మేం ఎదగడం జరిగింది.

2003 సం||లో 41 రోజుల " మౌన ధ్యాన శిక్షణా కార్యక్రమం " చేపట్టి రెండవ సారి నవంబర్ 9వ తేదీన సర్వహంగులతో నిర్మించిన " యోగి వేమన పిరమిడ్ ధ్యానకేంద్రం " పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పత్రి సార్ నేతృత్వంలో నిర్వహించిన శాకాహార ర్యాలీ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎంతగానో చర్చనీయాంశమైంది. నింబగల్లును " ధ్యాన ఆదర్శగ్రామంగా పత్రీజీ ప్రశంసించడం ఎంతో ఆనందదాయకం!

అప్పటి నుంచి పిరమిడ్‌లో 41 రోజుల మౌన ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు రావడం మొదలైంది. వారికి భోజనవసతి కల్పిస్తూ తగిన సూచనలు ఇవ్వడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ " శ్రీనివాసన్ " మరి " వెంకటేశ్ " గార్లు కూడా అక్కడే ఉంటూ పిరమిడ్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు.

2011లో పిరమిడ్ కాంపౌండ్‌లోపల " సప్తర్షి పిరమిడ్స్ " పేరుతో ఒక్కొక్కటి 5X5 నిర్మాణ కొలతలతో ఏడు పిరమిడ్‌లను నిర్మించి 2011 మార్చి 12 వ తేదీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ప్రారంభించుకుని పిరమిడ్ పార్టీ జెండా పండుగను నిర్వహించుకున్నాం. సుమారు 500 మందితో రెండవసారి పత్రీజీచే ధ్యాన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాం! ఆ తరువాత మా ధ్యానప్రచార కార్యక్రమాలు గ్రామంలో స్కూల్స్, కాలేజీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు విస్తరించాయి.

శాకాహార ర్యాలీలు, పిరమిడ్ పార్టీ ర్యాలీలు విశేషంగా నిర్వహిస్తూ 2004 సం||లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో " పిరమిడ్ పార్టీ " తరపున మూడు అసెంబ్లీ నియోజిక వర్గాలకు మరి అనంతపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి రెండు నియోజిక వర్గ పరిధుల్లో ధ్యాన సమాచారానికి సంబంధించిన లక్షలాది కరపత్రాలను ఇంటింటికీ పంచడం జరిగింది. ఎన్నికల పేరుతో ఉరవకొండ మండలంలో ఒక సునామీలా ఈ ధ్యాన ప్రచారోద్యమం జరిగింది.

ఆ తరువాత 2006లో అంతకు ముందు నిర్మించిన తాత్కాలిక పిరమిడ్ స్థానంలో శాశ్వత పిరమిడ్ నిర్మాణాన్ని మొదలు పెట్టి 2008 కల్లా పూర్తి చేసాం. లైబ్రెరీ హాల్, కిచెన్, బాత్ రూమ్స్, పిరమిడ్ చుట్టూ ప్రహరీ గోడ, మధ్యలో చక్కటి ‘ లాన్ ’ తో పాటు చుట్టూ చెట్లు నాటడం వంటి పనులు పూర్తి చేసుకున్నాను. 2009, మార్చి 12 వ తేదీన ప్రియతమ గురువు పత్రీజీ దివ్యహస్తాల మీదుగా 2012 లో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 8X8 రూఫ్ టాప్ పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని గ్రామంలో ఒక జాతరలా జరుపుకున్నాం!

2013లో నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మరొక రూఫ్‌టాప్ పిరమిడ్ 12X12 సైజులో ధ్యానం - ప్రకృతి వైద్యం కోసం నిర్మించుకుని హిమాలయ యోగి " శ్రీ శివదాస యోగి " గారిచే ప్రారంభోత్సవం జరిపించుకున్నాం! ఈ సందర్భంగా శివదాస యోగిగారు " శ్రీ యోగి వేమన పిరమిడ్ ధ్యానకేంద్రం " లో నూతనంగా ప్రారంభించిన " నిరంతర అన్నదాన పధకాన్ని " ప్రారంభించడం జరిగింది. శరీరానికి సంబంధించిన సేవ కూడా చేస్తూ మా జన్మలను తరింపజేసుకుంటున్నాం.

మా ప్రయత్నాన్ని హర్షిస్తూ ఎంతోమంది దాతలు, గ్రామస్థులు ఈ పథకానికి చేయూతనిస్తున్నారు. ముందు ముందు ధ్యానప్రచారంతో పాటు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాం.

చిన్నవయస్సులోనే మాకు ధ్యానం నేర్పించి మమ్మల్ని ఇంతటి ఆత్మజ్ఞానుల్లా మలచిన పత్రీజీ అండ మాకు కొండంత బలంగా మేము ముందుకు సాగుతున్నాం. సామాన్య యువకుల్లా ఉబుసుపోకు కబుర్లతో గ్రామంలో తిరుగుతోన్న మాలాంటి జీవితాలకు ఒక పరమార్థాన్ని ఏర్పరచి మా నింబగల్లు గ్రామానికే మమ్మల్ని ఆదర్శంగా తీర్చిదిద్ది మాతో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలను చేయిస్తూన్న మా మార్గదర్శి ప్రయతమ పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ..

 

G.హరి
అనంతపురం
సెల్ : +91 9399966067

Go to top