" నిత్యసంతోషిగా మలచిన ..ఆ అభినవ ఆధ్యాత్మిక ధన్వంతరి పత్రీజీ "

 

సందేహం : "దేవుడికి పూజలు చేయటాన్ని ఎందుకు ఖండించాలి?"

సమాధానం : "మనమే దేవుడు కాబట్టి ; పూజ చెయించు కోవటానికి అక్కడ ఎవరూ లేరు కాబట్టి"

సందేహం : "దేవుళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాదంటార?"

సమాధానం : "మనకంటే ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు."

సందేహం : "‘శ్వాస మీద ధ్యాస ధ్యానం’ మాత్రమే ఎందుకు గొప్పది?"

సమాధానం : "అంతకంటే గొప్పది మరొకటి లేదు కాబట్టి."

సందేహం : "మానవజన్మ మాత్రమే ఉత్తమం అంటే ఒప్పుకుంటారా?"

సమాధానం : "ఛస్తే ఒప్పుకోను! ఏ జన్మకి ఆ జన్మే ఉత్తమం!"

సందేహం : "బ్రహ్మణకులం అంటే మీకు అయిష్టమా?"

సమాధానం : "కులమన్నదే లేనప్పుడు ఒకానొక కులం పట్ల ఇష్టాయిష్టాల ప్రసక్తి ఏముంది? బ్రహ్మతత్వం తెలియకుండానే కులం రీత్యా ‘మేము బ్రాహ్మణులం’ అని విర్రవీగేవాళ్ళంటే అయిష్టం."

సందేహం : "సత్యసాయిబాబా దైవాంశ సంభూతుడా?"

సమాధానం : "ఎవరు కాదు? ప్రతివారు అదే. ఆయనా అదే. తెలుసుకోగలగాలి అంతే."

సందేహం : "ఇక్కడ పుట్టి ఇక్కడ చచ్చే ఈ మాంసపిండంపై ప్రేమ అవసరమా?"

సమాధానం : "ఖచ్చితంగా అవసరం. దేహం వుంటేనే దేహి కూడా వుంటాడు. దేహం ‘తోలుతిత్తి’ కాదు.. ‘దేవాలయం’. దాని సహాయంతోనే ‘దైవం మనమే అని తెలుసుకోగలం."

సందేహం : "మనస్సు, బుద్ధి, ఆత్మలకు గలభేధం వివరిస్తారా?"

సమాధానం : "మనస్సు పుట్టి పెరిగిన పరిసరాల ప్రభావం వలన, బుద్ధి జన్మపరంపరలో చేసిన కర్మలనుసరించి వుంటాయి. ఆత్మ శరీరంలోనే వుంటూ మనస్సునూ, బుద్ధినీ కూడా కలిగి వుంటుంది. ఇదే తేడా."

సందేహం : "ప్రేమ, స్నేహం.. ఈ రెండింటిలో మీరు దేనికి ఎక్కువ విలువనిస్తారు? ఎందువలన?"

సమాధానం : "నిస్సందేహంగా స్నేహానికే విలువనిస్తాను. స్నేహం స్వేచ్ఛనిస్తుంది. ప్రేమ స్వార్థం కోరుతుంది. అందుకే సృష్టిలో వున్నది.. వుండవలసింది స్నేహమే."

సందేహం : "ధ్యానం చేసేటప్పుడు ‘సంకల్పం’ పెట్టుకుంటే మంచిదా?"

సమాధానం : "ప్రతి సంకల్పమూ శూన్యమవటమే ధ్యానం. ఏదో ఒక సంకల్పం లేక కోరిక పెట్టుకుంటే వచ్చేది ఒక్కటే. కోరితే వచ్చేది ఒకటి, కోరకపోతే వచ్చేది కోటి. ఆనక మీ ఇష్టం."

సందేహం : " ‘ఎరుక’ అంటే ఏమిటి? "

సమాధానం : "ఎరుక అంటే అప్రమత్తత... తెలివి.ధ్యానంలో కనపడే ప్రతి దృశ్యాన్నీ నఖశిఖపర్యంతం గమనించగలగటమే ఎరుక."

సందేహం : "ధ్యానానికీ, నిద్రకూ తేడా ఏమిటి?"

సమాధానం : "నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన వరం; ధ్యానమనేది మనకు మనమే ఇచ్చుకునే వరం."

సందేహం : "ఎక్కువ శాతం స్నేహశీలంగా వుంటూనే అప్పుడప్పుడూ కొందరిని, కొన్నిసార్లు మీరు తిడుతూ, కొడుతూ వుంటారని అంటారు! ఎందుకలా?"

సమాధానం : "ఎందుకంటే స్నేహంలో అదీ ఒక భాగమే కాబట్టి. హితం కోరేవాడె స్నేహితుడు. కొందరికి కొన్నిసార్లు మొట్టితే గానీ, తట్టితే గానీ జ్ఞానోదయం కాదు. కొట్టితేనే, తిట్టితేనే జ్ఞానోదయం అవుతుంది. సామ, దాన, భేద దండోపాయాలు అందుకే మరి.

సందేహం : "కొంతమంది స్వామీజీలు కాళ్ళు పట్టుకుంటే పదివేలు, ఇంటికి వస్తే ఇరవైవేలు అంటూ భక్తులను దోచుకోవటం తప్పు కాదా?"

సమాధానం : "వాళ్ళు రేట్లు పెట్టడంలో తప్పులేదు. మీరు వాళ్ళ దగ్గరకు పోవటంలో తప్పు వుంది. వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఏదో మంచి జరిగిపోతుందనే మీ అజ్ఞానమే వారికి ఆహారం."

సందేహం : "స్వర్గం, నరకం ఉన్నాయా?"

సమాధానం : "అవి రెండూ ఊహలలో ఉన్నాయి. యదార్థంలో లేవు."

సందేహం : "బ్రహ్మవ్రాతను తప్పించ తరమౌతుందా?"

సమాధానం : "బ్రహ్మ ఏ వ్రాతనూ వ్రాయడు! ఎవడి వ్రాతను వాడే వ్రాసుకుంటాడు. వ్రాసుకునేది తానే - ధ్యానం ద్వారా దాన్ని తెలుసుకునేది తానే! అహం బ్రహ్మాస్మి!"

సందేహం : "మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది?"

సమాధానం : "మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకొన్న చొక్కా తీసివేస్తే ఏమవుతుంది? చొక్కా అయితే లేదు గాని శరీరం ఉందిగా. శరీరానికి బట్ట ఎలాగో ఆత్మకు శరీరం అలాగే. మరణానంతరం కూడా ఆత్మ శాశ్వతం."

సందేహం : "మంచి, చెడులను గురించి అభిప్రాయం?"

సమాధానం : "ఏది మంచి? ఏది చెడు? చూసేదానిని బట్టి చూడబడేది వుంటుంది. అమావాస్య తెలుగువారికి చెడ్డది. తమిళయన్స్‌కు మంచిది. ఉన్నది ఒక్క అమావాస్యే. మరి వేరు, వేరు ఫలితాలను ఎలా యిస్తోంది? భావాన్ని బట్టే భాగ్యాభాగ్యాలు."

సందేహం : "పవిత్రత అంటే ఏమిటి?"

సమాధానం : "దేశ కాలమాన పరిస్థితులను బట్టి..వాళ్ళకున్న మానసిక స్థితి - జ్ఞానాన్ని బట్టి ‘పవిత్రత అంటే ఇది’ అని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పవిత్రతకు సరైన నిర్వచనం లేదు."

సందేహం : "తప్పొప్పుల గురించి వివరిస్తారా?"

సమాధానం : "నా దృష్టిలో తప్పులు మూడే

(1) సరైన ధ్యానం సాధ్యమైనంతగా ఎక్కువ చేయకపోవడం

(2) మాంసాహారం తినటం

(3) పరుల తప్పులను ఎత్తి ఆడిపోసుకోవటం. ఈ మూడింటికీ సరైనా న్యాయం చేయగల్గినప్పుడు...ప్రపంచ భాషా నిఘంటువు నుండి ‘తప్పు’ అనే పదం తప్పుకుంటుంది."

పైన వ్రాసిన "సందేహాలు-సమాధానాలు" చదివారుగా! సందేహాలు సరే ప్రతి"సందేహాలరావు" కూ వచ్చేవే! మరి ఈ సమాధానాలు?? సాక్షాత్తు సత్యలోకాల సమాచార స్రవంతిలా లేవూ?? ఎవరబ్బా.. ఇంత విశిష్ట - విలక్షణ -విన్నూత సమాధానలు యిచ్చింది?? ఒకే ఒక్క నిమిషంలోపే మీరు ధనాధన్ జవాబు యిచ్చేస్తారని నాకూ తెలుసు. ఈ నిమిషంలోపు నేను మరికొంచెం వ్రాసుకుంటా.

ఇవతల పుల్లతీసి అవతల పెట్టటానికి కూడా బద్దకిచ్చే నేను కాస్తో - కూస్తో కార్యదక్షతకు బద్ధుడను అవటానికి కారణమైన బుద్ధుడు ఎవరు??

ఎవరయినా వాళ్ళ బాధ చెప్పకోవటానికివస్తే "నాకెందుకు నీగోల?" అని ప్రక్కకు పోయే నేను- "నీ బాధే - నా బాధ ! చెప్పు, చెప్పు!" అంటూ ఇతరుల్ని ప్రోత్సహించేలా నన్ను ప్రేరేపించింది ఎవరు??

ఏడు సంవత్సరాల క్రితమే మంచానపడి... ఆలుబిడ్డలను ఆగచాట్లు పెట్టాల్సిన నన్ను తట్టిలేపి - ఆరోగ్యవంతుడిగా - నిత్యసంతోషిగా మలచిన ..ఆ అభినవ ఆధ్యాత్మిక ధన్వంతరి ఎవరు??

మరో ఐదు జన్మలు ఎత్తి ఎన్నో కష్టనష్టాలకు గురికావల్సిన నాకు ధ్యానప్రచారప్రభును కట్టబెట్టి యిదే ఆఖరిజన్మగా సరిపెట్టిన ఆ కారుణ్యమూర్తి ఎవరు??

నలభై ఆరవ సెకండు వచ్చేసింది.. దానితో పాటు మీ సమాధానమూ వచ్చేసింది. అవును. మీరయినా, నేనయినా, యిప్పుడూ - ఎప్పుడూ అనేదీ, అనాల్సిందీ ఒక్కటే

 "దటీజ్ పత్రీజీ!!"

 

S. రాజశేఖర్
పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్ సెంటర్
R.P. Road
సికింద్రబాద్

Go to top