" మానవ జీవితంలో దివ్యత్వాన్ని మేల్కొల్పుతున్న దివ్యమూర్తి! "

పత్రీజీ మార్గదర్శకత్వంలో 1993 వ సంవత్సరంలో, మిత్రుల సహకారంతో నేను "గుంతకల్ స్పిరిచ్యువల్ సొసైటీ" స్థాపించడం జరిగింది.

మనిషి పుట్టిన నాటి నుంచి మరణించేవరకు పెంచబడుతున్న విధానం, పెరుగుతున్న పద్ధతి అంతా ఒకే ఒక్క పాయింటు మీద ఆధారపడుతూ వుంది. అదేమిటంటే-డబ్బు-డబ్బు-డబ్బు"..డబ్బే జీవితం అనుకుంటున్న ఈ పరుగుల ప్రపంచంలో, గొప్ప హోదా మరి మంచి జీతం గల ఉద్యోగాన్ని 1990లో తృణప్రాయంగా వదిలేసి స్వంతంగా ఛార్జీలు పెట్టుకుని పత్రీజీ ఊరూరూ తిరుగుతూ ప్రతివారం గుంతకల్‌కు వస్తూ ఉచితంగా ధ్యాన జ్ఞాన బోధలు చేస్తూండేవారు!

ఈయన చర్యలు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. "ఈ పనివల్ల పత్రిసార్‌కు ఎటువంటి లాభం లేదు. అయినా సరే ఈయన ఎందుకు మాకోసం ఇంత కష్టపడి వస్తున్నాడు? ఎందుకు అంతపెద్ద వుద్యోగం వదులుకున్నాడు?" తెలుసుకోవాలని అనుకుని, అడిగాను. "ఆయన చాలా వివరంగా సమాధానం చెప్తారు" అనుకుని చెవులు రిక్కించి వినడానికి సిద్ధమయ్యాను.

పత్రీజీ : "మురళీ! ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ‘సత్యం’ అన్నది అనుభవంలోకి వచ్చాక, మిగతా అన్ని ప్రాపంచిక విషయాలు చాలా చిన్నవిగా కనపడతాయి. ధ్యాన ప్రచారమే మన అత్యవసర ధర్మంగా వుంటుంది. ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. ఇదంతా సత్యానుభవమే " అని చాలా సాధారణ విషయంగా చాలా సింపుల్‌గా, " ఇది ఎవరికైనా సాధ్యమే " అన్న విధంగా ఏ హంగామా లేకుండా చెప్పారు. దటీజ్ పత్రీజీ !!

తన ఎదుట ఎవ్వరయినా చిన్న తప్పు చేస్తే, చేసిన వాళ్ళు ధనికులా, పేదవాళ్ళా, పరిచయస్తులా, అతి సన్నిహితులా అన్న తారతమ్యాలు లేకుండా... ఏ సందర్భంలోనైనా అంటే మహాసభ అయినా, ఇంట్లో అయినా, బజార్లో అయినా..ఆ తప్పును నిష్కర్షగా ఎత్తిచూపి, సరిదిద్దడం ఆయనలోని ప్రత్యేకత. దటీజ్ పత్రీజీ!! ఈయన నిష్కర్షతను జీర్ణించుకోలేక కొందరు తాత్కాలికంగా దూరమవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత పత్రిగారు ఎత్తిచూపిన తప్పునూ, సత్యదోషాన్నీ అవగాహన చేసుకొని మళ్ళీ వారి దగ్గరికే రావడం మహావిచిత్రం! దటీజ్ పత్రీజీ!!

చక్కగా చేసిన ఏ చిన్నపనైనా దానిని బహుచక్కగా మెచ్చుకోవడం ఆయన ప్రత్యేకత. "ఇంటినీ, వొంటినీ, ఇంటికి వచ్చిన అతిథులనూ ఏ విధంగా చూసుకోవాలి?" అని ఆయనను చూసి నేర్చుకోవాలి. పని చిన్నదా, పెద్దదా అని కాకుండా, ఎంచుకున్న పనిని ఎంత పర్‌ఫెక్టుగా చేయగలమో అంత పర్‌ఫెక్టుగా చేయగలగడం, ప్రతి ఒక్కరిలో వున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించి, వాళ్ళకి వాళ్ళు మరి సమాజానికి ఉపయోగపడేలా చేయడంలో వారికి వున్న ప్రతిభ అసామాన్యం! దటీజ్ పత్రీజీ!!

60 వసంతాలలో, వేలకుపైగా గ్రంథాలను ఔపోసనపట్టి, అరిషడ్ వర్గాలను జయించి, ఆరు జన్మల బోధిసత్వజ్ఞానాన్ని జోడించి మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌ను "ధ్యానాంధ్రప్రదేశ్" గా మార్చిన ధ్యానమూర్తి!

ఎవరు వచ్చినా, రాకపోయినా, సహాయ సహకారాలు అందించినా, అందించకపోయినా "నా దారి ధ్యానజగత్" అంటూ నిరంతర ప్రయాణంలో సాగుతున్న జగత్ బాటసారి! నిరంతర సత్యాన్వేషి, ధ్యానపిపాసి బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ! తనకు తెలిసిందే చెప్పాడు, చెప్పిందే చేసాడు. ఈయన ‘వక్త’ కాదు- ప్రవక్త!

క్షణక్షణం, అనుక్షణం వర్తమానంలో జీవిస్తూ, "గతం గురించి చింత వద్దు, భవిష్యత్తుపై వద్దు, శ్వాస మీద ధ్యాస వుంచు..."అంటూ నిరంతర ప్రబోధం చేస్తూ మానవ జీవితంలో దివ్యత్వాన్ని మేల్కొల్పుతున్న దివ్యమూర్తి!

‘స్వదేశం’, ‘విదేశం’ అన్న భావన లేకుండా ప్రపంచంలోని అన్ని ఉత్తమోత్తమమైన గ్రంథరాజాలను మన ముంగిటికే అందజేస్తూ మన జ్ఞానార్తిని తీరుస్తున్న జ్ఞానమూర్తి!

పిరమిడ్ జ్ఞాన మహా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ గ్రేట్ మాస్టర్స్‌గా తయారవడానికి నిరంతర ప్రేరణ ఇస్తున్న - గ్రేట్ మాస్టర్స్ మేకర్!

"అందరూ దివ్యస్వరూపులే, అందరూ కారణజన్ములే, ఎవరికి వారే గురువులు, ఎవరి విలువలు వారే గుర్తించండి" అంటూ ప్రబోధిస్తున్న పరమగురువులు పత్రీజీకి శతకోటి పాదభివందననాలు.

 

- మురళీధర్,
అనంతపురం,
సెల్ : +91 9490539388

Go to top