" ఏనాడు ఇది నాకు భారం అని నేను భావించలేదు ! "

 

ఈ రోజుల్లో ఏదేని పత్రిక నడపాలంటే ఎంతో ఆర్థిక పుష్టి, అనుభవం మరి తీరిక వుండి ఒడిదుడుకులు తట్టుకోగల సత్తాను కూడా కలిగి వుండాలి. కానీ ... " ఒక ఇల్లు ", " ఒక సంసారం" తప్ప మరే వ్యాపాకమూ లేని అతి సామాన్య గృహిణి సీనియర్ పిరమిడ్ మాస్టర్ " P.రమాదేవి మేడమ్ " ధ్యానం ద్వారా తనలోని ఆత్మశక్తిని తెలుసుకుని ఈ రోజు ఇంత గొప్ప ఆధ్యాత్మిక మాసపత్రికను అద్భుతంగా నడిపిస్తున్నారంటే ... అలాంటి ఆణిముత్యాలను వెతికి గుర్తించే నేర్పరి ... పత్రీజీకి హ్యాట్సాఫ్! " ధ్యానరత్న D. కేశవరాజు గారు " మేడమ్ రమాదేవి గారితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు .. మీ కోసం ...


D. కేశవరాజు గారు : రమాదేవి గారూ! మీరు ఎప్పటి నుంచి "ధ్యానాంధ్రప్రదేశ్" ని చూసుకుంటున్నారు? ఈ బాధ్యత పట్ల ఎలా ఫీలవుతున్నారు?

P.రమాదేవి : ‘2012 కల్లా ధ్యానజగత్’ అనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతూ బ్రహ్మర్షి పత్రీజీ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో రకాలుగా వారికి తోడ్పాటునందిస్తున్నారు. నాకు ఈ రకంగా సేవచేసే భాగ్యం కలిగినందుకు ఆనందంగా వుంది ! 2001 డిసెంబరులో సార్ ఈ పత్రిక బాధ్యత నాకు అప్పచెప్పినప్పుడు "నేను చెయ్యగలనా, లేదా" అనే ఆలోచన కూడా లేకుండా "ఓకే సర్" అని ఆయన ఆదేశాన్ని శిరసావహించాను.

2001 సంవత్సరంలో 1500 కాపీల సర్క్యులేషన్‌తో మొదలైన ‘ధ్యానాంధ్రప్రదేశ్’ ముఖ్యంగా ధ్యానులకూ, ధ్యానాభిలాషులకూ, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికీ అద్భుత జ్ఞానాన్ని పంచే కరదీపికగా మారి మెల్లమెల్లగా ఇప్పుడు పదివేల పత్రికలు ప్రింట్ చేసే స్థాయికి ఎదిగింది! ఏనాడూ ఇది నాకు భారం అని నేను భావించలేదు. ఇది నా జన్మజన్మల భాగ్యంగా భావిస్తున్నాను!

తెలుగులో "ధ్యానాంధ్రప్రదేశ్", ఇంగ్లీషులో "స్పిరిచ్యువల్ ఇండియా", తమిళంలో "ధ్యాన తమిళనాడు", కన్నడలో "ధ్యాన కస్తూరి", హిందీలో "ధ్యాన భారత్" మొదలైన ఆధ్యాత్మిక పత్రికల ద్వారా అపారమైన ఆధ్యాత్మిక సారాన్ని ప్రపంచంలోని ఆధ్యాత్మిక శాస్గ్త్రవేత్తల సందేశాలను సవివరంగా అందిస్తున్నాం .. దానిని మన మాస్టర్స్ సద్వినియోగ పరుచుకుని ఆత్మజ్ఞాన సముపార్జన చేసుకోవాలని కోరుకుంటున్నాను.

D. కేశవరాజు గారు : "ధ్యానాంధ్రప్రదేశ్" చందాదారులను ఎలా పెంచాలనుకుంటున్నారు?

P.రమాదేవి : ధ్యానులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ధ్యానప్రచారం చేస్తున్నవారు, జిల్లా కో-ఆర్టినేటర్స్ "ధ్యానం"గురించి పనిచేస్తున్న విధంగానే "పత్రిక" అభివృద్ధికి కూడా కొంత సమయాన్ని కేటాయించాలి! అయితే, అన్ని విధాలా సేవ చేయటానికి "ధ్యానాంధ్రప్రదేశ్ టీమ్" రెడీగా వుంది.

ఖమ్మం సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నర్సింహరావు గారు జిల్లా గ్రంథాలయ ప్రెసిడెంట్, సెక్రెటరీలతో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రంథాలయాలకు మన పత్రిక పంపుతున్నాం!

కాకినాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధా మేడమ్ అధికారులతో మాట్లాడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయాలకు మన పత్రిక పంపించే ఏర్పాటుచేశారు.

"జీవిత ప్యాట్రన్స్" చెల్లించే డబ్బును "శాశ్వతనిధి" గా ఏర్పాటుచేసి మున్ముందు తక్కువ ధరకే మంచి క్వాలిటీతో పత్రికను అందివ్వగలం. ఈ విషయాన్ని మన మాస్టర్స్ గుర్తించి "జీవిత ప్యాట్రన్స్" గా చేరి, ఇతరులను గూడ చేర్పించాలని కోరుకుంటున్నాను. "జీవితప్యాట్రన్" కు అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక పుస్తకాలు, సిడీలు, క్యాసెట్స్ పత్రీజీ చేతులు మీదుగా అందమైన బ్యాగుతో అందిస్తాము.

రెసిడెన్షియల్ పద్ధతిలో మూడు రోజుల ధ్యానశిక్షణా కార్యాక్రమాలకు ఆద్యులు ధ్యానరత్న శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు, భీమవరం! వారు శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధ్యానాంధ్రప్రదేశ్ సంవత్సరం చందా ఇచ్చి వారిలో స్వాధ్యాయం పట్ల బ్రేక్ లేకుండా చూస్తున్నారు! ఇలా ప్రతి జిల్లాలో అంకితభావంలో పత్రిక కోసం స్వఛ్ఛందంగా పనిచేస్తూ సర్క్యులేషన్ పెంచుతూ ఈ పత్రికకు వెన్నెముకగా అనేకమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు! మరి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని వర్క్‌షాప్స్ నడిపేవాళ్ళంతా పత్రికను ఇవ్వాలనుకుంటే పాత మ్యాగజైన్స్ ని కూడా తక్కువ ధరకు సప్లై చేయడానికి మేం రెడీగా వున్నాం.

ఈనాడు మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి .. అంటే ధ్యాన ప్రచారమే కదా మనల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేసింది! మరి అలాంటి ధ్యాన ప్రచారాలు ఏఏ మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నాయో, ఎంతమంది మాస్త్టర్లు అంకితభావంతో ఈ ప్రచారాలు చేస్తున్నారో, ప్రతి ఒక్కరికీ వీలైనంతగా తెలియజేయడం కోసం మాత్రమే ఖచ్చితంగా ఈ పత్రిక!!

Go to top