" లక్షలమందిని మాస్టర్లుగా తీర్చిదిద్దుతున్న గ్రేటెస్ట్ గ్రాండ్ మాస్టర్ మన పత్రీజీ!! "

 

 

నా పేరు అక్కిరాజు మధుమోహన్. నేను ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ‌లో సీనియర్ మేనేజర్ (సిస్టమ్స్) గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాను.

18-09-1998 వ తేదీన సికింద్రాబాద్ లోని లయన్స్ భవన్ జరిగిన ధ్యాన శిక్షణా తరగతి మొట్టమొదటిసారి పత్రిసార్‌ని కలవడం నా జీవితంలో మరువలేని మధురమైన రోజు!

అప్పటికే చాలా ఏళ్ళుగా నేను అనేకానేక అనారోగ్య సమస్యలతో బాధపడ్తూ ఎన్నెన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎన్నో మందులు వాడి మరెంతో డబ్బు ఖర్చుపెట్టి ఇక విసిగి, వేసారి ఉన్న దశలో Dr.T.K.N. చారి అనే సైకియాట్రిస్ట్ ను కలవడం జరిగింది. ఆయన "ఆనాపానసతి అనే ధ్యానం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది" అని చెప్పి నాతో ధ్యానాభ్యాసం చేయించేవారు. అప్పట్లో నేను "ధ్యానం అంటే కేవలం శారీరక రోగాలను బాగుచేసుకోవడానికి పనికివచ్చే ఒక యోగపద్ధతి" అని మాత్రమే అనుకునేవాడిని.

మరి నాకున్న పరిజ్ఞానం అప్పట్లో అంతే కదా!

కానీ నా భాగ్యవశాత్తు ఏనాడైతే నేను పత్రీజీ ని కలిసానో, ఆయన ప్రవచనాలు విన్నానో ఇక ఆనాటినుంచే నేనెవరినో, నాకు కావలసిందేంటో, నేనెందుకు పుట్టోనో ... అనే ఆత్మవిచారంఅ నాలో మొదలైంది!

ఎప్పుడైతే "అవును! ఇదే నాకు జ్ఞానాన్నందించి నా జీవిత నౌకను ఒక తీరానికి చేర్చగలిగే అద్భుతమైన చుక్కాని" అని అనుకున్నానో అప్పుడు కానీ నా ఆత్మకు శాంతి కలుగలేదు! అలా నా ఆధ్యాత్మిక ప్రయాణానికి దిశానిర్దేశనం చేసారు పత్రీజీ.

చేసే ప్రతిపనిలో కూడా అది ప్రాపంచికమైనా కానీ, ఆధ్యాత్మికమైనా కానీ ఒక మాస్టర్ లాగా చేయాలని నిరంతరం పత్రీజీ బోధిస్తూంటారు! మరి అలాగే తను చేసి మరీ చూపిస్తూంటారు!

ఒకసారి హైదరాబాద్ తిరుమలగిరి లోని ఇంట్లో మొట్టమొదట సారిగా 40 రోజుల ధ్యానమండలి దీక్ష కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు పత్రి గారు మరి సంగీత మహా గురువులు డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు మా ఇంటికి తెల్లవారుఘామున 5.30గ|| లకు రావడం ఒక అపూర్వమైన సన్నివేశాం!!

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విశ్వగురువైన పత్రిసార్ అంతకు ముందురోజే 40 కి.మీ ప్రయాణం చేసి, ఆల్వాల్ వెళ్ళి, సీనియర్ మాస్టర్ T. మురళీధర్ గారింట్లో ఆ రాత్రి గడిపి, తెల్లవారుఝమునే సరియైన సమయానికి ఖచ్చితంగా మా ఇంట్లో జరిగే ధ్యాన కార్యక్రమానికి రావడం ... మాకెంతో ఆశ్చర్యాన్నీ మరి ఆనందాన్నీ కలుగజేసింది! "ప్రోగ్రాం చిన్నదా, పెద్దదా" అని కాకుండా ఎంతమంది హాజరవుతున్నారనేది లేకుండా, ఏ సమయంలోనైనా సరే వస్తానని మాటిస్తే చాలు,పాటించి తీరే ఆయన అంకితభావం మరి నిబద్ధత ... ఒక్క ఆయనకే చెల్లు! ఆయన "ఇలా చెయ్యి" అని చెప్పరు "దటీజ్ ది మార్క్ ఆఫ్ ఎ మాస్టర్" అని చేసి మరీ చూపిస్తారు!

ఇక ‘సింప్లిసిటీ’ కి మానవరూపం ఇస్తే అచ్చం అది ‘పత్రీజీ’ లాగే ఉంటుందని ఘంటాపథంగా చెప్పగలను నేను!!

ఎందుకంటే మరి రోజు క్లాసు తర్వాత పత్రీజీని కారులో వారింటికి తీసుకుని వెళ్తూంటే పెట్రోల్ అయిపోయి రోడ్డు మధ్యలో కారు ఆగిపోయింది. వెంటనే సార్ దిగి కారును తోస్తూ రోడ్డు ప్రక్కగా కారును పార్కింగ్ చేయడానికి నాకు ఎంతో సహాయం చేశారు!!... అసలు "నేనొక గురువును" అన్న భావమే ఆయనలో లేదు ... ఇక సామాన్యునిలా, ఒక అవసరంలో ఆదుకునే స్నేహితునిలా మాత్రమే అప్పుడు ఆయన ప్రవర్తించారు ... దటీజ్ పత్రీజీ!

ప్రతి ఒక్కరి అనుభవాలనూ అమిత శ్రద్ధగా వింటూంటారు సర్! పెద్దలూ, పిల్లలు అని కాకుండా అందరి అభిప్రాయాలనూ చిరుమందహాసంతో వింటూ, వివరణలు ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తూంటారు. శ్రద్ధగా వినడమనే కళను అసలు సార్ దగ్గరే నేర్చుకోవాలి!! ట్రెక్కింగ్‌ల్లో ఇలాంటి అవకాశాలు మనకు అనేకానేకం దొరుకుతుంటాయి! ఇష్టమైన వేణునాదాన్ని వినిపిస్తూ, ధ్యానం చేయిస్తూ ఎన్నెన్నో విషయాలు బోధిస్తూ "ఓహో! దీంట్లో ఇంత అంతరార్థముందా?!" అనిపిస్తూ ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన ఆత్మస్థైర్యాని నిరంతరం నింపుతూంటారు పత్రీజీ!

"అన్ని కళల్లో ప్రతి ఒక్కరికీ ఉండాలి" అని చెప్పే గురువు ఈ ప్రపంచంలో మరి పత్రీజీ ఒక్కరేనేమో! సంగీత సాధన, నృత్య సాధన మరి ధ్యాన సాధన ఉంటే చాలు జీవితం మధురాతి మధురంగా ఉంటుందని చెప్తూంటారు. "Be a Master", "Be a Buddha" అంటూ బోధించే పత్రిసార్ ప్రతిఒక్కరిలో ఉన్న లీడర్‌షిప్ క్వాలిటీస్ ని, ఆర్గనైజింగ్ స్కిల్స్ నీ వాళ్ళకై వాళ్ళే తెలుసుకునేట్లు చేయడమే కాకుండా మరి వాటిని మెరుగుపరుచుకునేట్లుగా కూడా అవకాశాలిస్తు వుంటారు.

2004 డిసెంబరు లో హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ లోని "ధ్యాన విజయోత్సవాలు" మరి 2006 డిసెంబరు లో "షిర్డీ ధ్యాన విజయోత్సవాల్లో" నాకు మరి నా శ్రీమతి విజయలక్ష్మికి సంగీత కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను అప్పగించడం మా పూర్వజన్మ సుకృతం! ఈ కార్యక్రామాల నిర్వహణల్లో మాకు పూర్తి స్వేచ్ఛనిస్తూనె మళ్ళీ మాకు అవసరం వచ్చినప్పుడల్లా ఒక తండ్రిలా చక్కటి గైడెన్స్ ఇచ్చేవారు. ఇలా మనం చేసే ప్రతి అడుగుపై మనతోనే నిఘా పెట్టించగల గొప్ప గురువు మన పత్రీజీ!

హైదరాబాద్ లో "రెసిడెన్షియల్ పద్ధతి" లో రెండు రోజుల ధ్యాన శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించమని చెప్పి ఇల్లు వెతకటం, కేర్ సెంటర్ లైబ్రెరీ ఏర్ప్పటు చేయడం .. మరి దానికై బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ సభను ఏర్పాటు చేయడం ... వీటన్నింటికీ వారం రోజుల మాత్రమే టైం ఇచ్చి, ఇలాయుద్ధ ప్రాతిపదికన పనులు ఎలా చక్కబెట్టాలో నేర్పించి, సంకల్పబలానికి ఉన్న శక్తేమిటో మనం తెలుసుకునేట్లు ప్రాక్టికల్స్ చేయించారు ... అసలైన గురువు మన పత్రీజీ! ఈనాడు మీకందరికీ ఆధ్యాత్మిక సేవలందిస్తున్న " విశ్వామిత్ర ధ్యాన ఆశ్రయం " ఈ సంకల్ప బలానికి ప్రతీకయే! శ్రీ ధూళిపూడి చంద్రశేఖర్, శ్రీమతి వాణి, మరి శ్రీ ఆచారి గార్లు ఈ మహాయజ్ఞంలో నాకెంతో సహాయ చేస్తూ మరి టీమ్ వర్క్‌లో ఉన్న ఆనందాన్ని నాకు పంచుతున్నారు! ఇలా ప్రతి విషయంలో ఆయనిచ్చే శిక్షణ "జ్ఞానాంబుధిని చిలికే కవ్వం" అనడంలో అతిశయోక్తి లేదు!!

2007 వ సంవత్సరంలో హైదరాబాద్ దగ్గర కడ్తాల్లో ఒక మెగా పిరమిడ్ రావాలన్న సంకల్పంతో పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ హైదరాబాద్ స్థాపించి అందులో ఒక ట్రస్టీగా నన్ను నియమించి నా శక్తి సామర్థ్యాలకు మరోమారు పరీక్షపెడుతూ నన్నొక శిల్పంలా తీర్చిదిద్దుతున్న వైనం నాకెంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది! "అసలు నేనేనా ఇన్ని పనులు చేస్తుంది?" అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.

ఇలా మనందరిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి సరియైన బాధ్యతలను మనకు అప్పజెప్తూ పనులు చేయిస్తూ ప్రపంచాన్నంతా యోగసామ్రాజ్యంగా మలుస్తున్న ఉత్తమోత్తమ గురువులు పత్రీజీ "ప్రతి వ్యక్తికీ స్వాతంత్య్రం అన్నది ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే సంభవం " అని ఎలుగెత్తి చాతుతున్న ఆధ్యాత్మిక విప్లవవీరులు మన పత్రీజీ! లక్షలమందిని మాస్టర్లుగా తీర్చిదిద్దుతున్న గ్రేటెస్ట్ గ్రాండ్ మాస్టర్ మన పత్రీజీ!!

 

అక్కిరాజు మధుమోహన్
హైదరాబాద్

Go to top