" మన పెన్నిధి మన పత్రీజీ "

 

నా పేరు వసుంధరా దేవి. R.P.రోడ్, సికింద్రాబాద్ కేర్ సెంటర్ "రాజశేఖర్" నా తోడబుట్టిన తమ్ముడు.

పత్రీజీతో నా మొదటి పరిచయం శ్రీశైలం ట్రెక్కింగ్. వారు అందరికీ షేక్ హ్యాండు ఇచ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి వేసిన మొదటిప్రశ్న "నడువగలరా?" అని; వందలమందిలో నాకు ఒక్కదానికే తీవ్రమైన మోకాళ్ళ - కీళ్ళ నొప్పులు వున్నాయనీ, నాది నడవలేని స్థితి అనీ మొదటిక్షణంలోనే కనిపెట్టిన కనికట్టు కళ్ళు ఆయనవి!

"మీరు ఉన్నారుగా సార్" అని నేను అన్నానేగాని నా మాటలో వున్న దృఢత్వం మనస్సు‌లో లేదని ఆయన నిరూపిస్తున్నారా అన్నట్లుగా కొంచెం సేపటికే నడవలేక కూర్చుండిపోయాను. "కష్టపడుతున్నారు, వద్దులే మేడమ్" అని నాపై కరుణరసం కురిపించారు. నా మీ అందరి భూత భవిష్యత్తు వర్తమానాలు కరతామలకంగా తెల్సినా -తెలియనట్లు‌గా - మన శారీరక, మానసిక దౌర్భాగ్యాలను చూచాయగా మనకే తెలియచెప్పే "ఆ గొప్పతనమే ‘పత్రీజీ’ సొంతమా?" అనిపిస్తోంది.

2007 మార్చి నుండి రాత్రిపూట ఆకలి అపరిమితంగా అవుతూవన్నా అనం సహించక మానివేసాను. పళ్ళరసాలు తీసుకుందామన్నా కూడా ముందే వాంతి వచ్చినంతపని అయ్యేది. ఒక సంవత్సరం పాటు ఒంటిపూట భోజనంతో బ్రతుకు ఈడ్చాను. 2008 మార్చి నుండి పగలు భోజనం కూడా సహించకుండా పోయింది. ఎలా కడుపు నింపుకోవాలో - నింపుకోకుండా ఎలా బ్రతకాలో తెలియని స్థితి. అసలే తిండి పిచ్చి నాకు. ఎంత ఖరీదు అయినా తెచ్చుకోగల స్థోమత వున్నా తినగల పరిస్థితి మాత్రమే లెదు. ఎందరో డాక్టర్లు, ఎన్నెన్నో శల్య పరీక్షలు. ఫలితం మాత్రం శూన్యం. రోజురోజుకు చిక్కి శల్యమై మనిషా? ... ఎముకల గూడా? అన్నట్లుగా మారిపోయాను.

ఈ మధ్యనే నా తమ్ముడు రాజశేఖర్ భార్య భవానీ దేవి "కేర్ సెంటర్ కి వచ్చి ఎన్నో వందలమంది బాగుపడుతున్నారు నువ్వు కూడా ‘ రా ’" అని పట్టుపట్టింది. ఆమె ఏ మాటా ఉబుసుపోక అనదు. తనకెంతో బలంగా అనిపిస్తేనే అంటుంది. కానీ నా తమ్ముడు "అక్కా! రక్తసంబంధాలు, చుట్టరికాలు ప్రాపంచికమైనవి. పత్రీజీ ఆత్మానుబంధాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ ఎన్ని వందలమంది బాగుపడినా అది కేవలం పత్రీజీ వాక్కులు నా నోటివెంట రావటమే తప్ప నా ఘనత పిసరంత కూడా లేదు. నా నోటినుండి వచ్చే పత్రిసార్ మాటలు ఒక్కోసారి సౌమ్యంగా, ఒక్కోసారి కఠినంగా వస్తాయి అవన్నీ కేవలం ఎదుటివారి బాగుకొరకే మరి నీవు తట్టుకోగలవా" అన్నాడు.

"అలాగే" అన్నాను.

అప్పుడు తమ్ముడు నా రెండు చేతులూ తన చేతులలోకి తీసుకుని "యిద్దరమూ ధ్యానం చేద్దాం" అన్నాడు. ఏదో లోకంనుండి విన్పిస్తున్నట్లుగా తమ్ముడు మాటలు మంద్రస్వరంలో విన్పిస్తున్నాయి. "పత్రిసార్ చెబుతున్నారు" అంటూ "నువ్వు మూడు జన్మలక్రితం ఒక ఋషికి సేవలు చేస్తూ అహంతో ఆయన కడుపులో కాలుతో తన్నావంట. చేసిన తప్పు తెలుసుకుని మరు రెండు జన్మలలో ఆ పాపం కొరత పోగొట్టుకొన్నావంట. మిగతాది కూడా పోగొట్టుకోవటానికి కొన్ని నియమాలతో 59 రోజులు రోజుకు రెండుసార్లు రెండు గంటలు చొప్పున ధ్యానం చేయాలట" అంటూ ఆ పద్ధతులు వివరించాడు.

ఈ పని మొదలుపెట్టిన రెండు రోజులకే నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. చేయలేను అన్పించినా ధ్యానమహిమ విశేషాలు అనేక వందలమంది నోళ్ళ నుండి కూడా విన్నాను కనుక మొండికేసి చేయటం మొదలు పెట్టాను. ఇంక ఏం చెప్పను?! ఈశ్వరుడు మరి పత్రిసార్ కూడా రకరకాల దివ్యదర్శనాలు ఇవ్వటం మొదలుపెట్టారు! నెమ్మది,నెమ్మదిగా ఒక్కొక్క బాధ, ఒక్కొక్క బాధ, క్రమక్రమంగా తగ్గటం ప్రారంభమయ్యింది. ఇంక తినలేక పోవటం ఒక్కటే మిగిలింది. మరి ఇది ఎలా! జగన్మాత మమత కదా మన పత్రిమాతది. సెప్టెంబరు 5 వ తేదీన "ఇంక హాయిగా అన్నం తినండి మేడమ్" అన్నారు ఆయన ధ్యానంలోనే.

ఇప్పుడు హాయిగా తింటున్నాను! హుషారుగా తిరుగుతున్నాను! నా జనసత్వాలు దాదాపుగా నాకు తిరిగి వచ్చేసాయి! తర్వాత 28-09-08 న ఏకతాధ్యానానికి విచ్చేసారు పత్రీజీ. ఏకతాధ్యానం అనంతరం శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు ఇచ్చినట్లుగా, నేను యిచ్చిన చిన్న చాక్లెట్‌ను ఎంతో సంతోషంగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ "ధ్యానం వలన లాభాలు" అనే పలుకు ఛలోక్తిగా పలికి పరోక్షంగా ధ్యానంలో నేను శారీరకంగా పొందిన లాభాన్ని గుర్తు చేసారు పత్రీజీ!

నేను పత్రిసార్‌ను కలవకముందు చాలామంది గురువులను కలిసాను. వాళ్ళలో కొందరి దగ్గర నాకు కొంత ప్రశాంతత, మరికొంత ఆనందం లభించాయి. కానీ ఎవరి చెంత అత్యంత నిశ్చలానంద బ్రహ్మానందం లభిస్తుందో అ పవిత్ర సన్నిధే మన పెన్నిధి మరి ఆ పెన్నిధే మన పత్రీజీ!

 

వసుంధర దేవి
సికింద్రాబాద్

Go to top