" ఆత్మస్థైర్యం మన ఏకైక సందేశం "

 

నా పేరు ధూళిపూడి చంద్రశేఖర్. వృత్తి వ్యాపారం. ప్రవృత్తి ధ్యాన ప్రచారం. 2005 ఏప్రిల్ 3న శ్రీ అక్కిరాజు మధుమోహన్ గారు ప్రారంభించిన 9 వారాల ఉచిత ధ్యానశిక్షణ కార్యక్రమంతో ప్రారంభమైన నా ధ్యాన జీవితం అనేక రకాల అనుభవాలతో సాగుతోంది!

నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా నాన్నగారికి వారి స్నేహితుడు కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇచ్చారు. ఆ పరమశివుడు మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ లింగానికి అభిషేకం చేసే పని నాకు అప్పగించడం జరిగింది. ఆ తరువాత ఇంకొక స్నేహితుడి ద్వారా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దర్శనం. అప్పటి నుంచి స్వామీజీ వారి కార్యక్రమాలకు వెళ్ళటం .. అక్కడి పూజలు, స్తోత్రపారాయణం, భజనలు, నన్ను విపరీతంగా ఆకర్షించేవి. ఆ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడిని.

మేము వృత్తి రీత్యా 1992 లో మచిలీపట్నం (కృష్ణా జిల్లా) వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనేవాణ్ణి. సరిగ్గా ఇదే సంవత్సరం .. అంటే సుమారు 1992/93 నుంచి .. నాలో ఎదో ‘అలజడి’ ప్రారంభమైంది. "నేను చెయ్యవలసినది ఇది కాదు, నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, నా దారి ఇది కాదు" అని అనుక్షణం నాలో నాకే సంఘర్షణ ప్రారంభమైంది.

ఇంతలో మా నాన్నగారి అనారోగ్య కారణంతో 1997లో మళ్ళీ హైదరాబాద్‍కు రావడం జరిగింది. 1999 సంవత్సరంలో చిన్న వయస్సులోనే వారు శరీరాన్ని వదలటం జరిగింది.

ఇక నాకు ఇంటి బాధ్యతలు ... 2000 సంవత్సరంలో చెల్లి విహాహం తర్వాత 2001 నుంచి నాకు వ్యాపారపరంగా నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. నేను యీ బాధల నుంచి తప్పించుకోవటం కోసం ఎవరు ఏది చెబితే అది, అలా రోజూ 2గం||ల నుంచి 3గం||లు పూజలు చేసేవాడిని.

నా ఇబ్బందులు చూసి మా చెల్లలు "ధ్యానం చేసుకో; మనస్సు ప్రశాంతంగా వుంటుంది; పనులు సాఫీగా అవుతాయి" అని చెప్పడం మొదలుపెట్టింది. ఆవిడ బాధ పడలేక ఏదో ఒక అరగంట కూర్చుని లేచిపోవడం జరిగేది. కానీ ఆ ధ్యానం ఒక సరియైన పద్ధతిలో చెయ్యలేదు. కానీ నాకు కూడా "ధ్యానం నెర్చుకోవాలి" అని ఉండేది. అలా 2005లో 9వారాల ధ్యాన శిక్షణ కార్యక్రమంతో సరియైన విధానంలో నా ధ్యాన ప్రస్థానం ప్రారంభమైంది.

మూడవ వారంలో మా చెల్లలు వచ్చి "నేను కూడా నీతో ధ్యానానికి వస్తాను; నన్ను తీసుకువెళ్ళు" అంది ధ్యానం అయిన తర్వాత ఆమె ఒక అనుభవం చెప్పింది: "నాకు ధ్యానంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ కనపడ్డారు, ‘నీ అన్న చేరవలసిన చోటుకి చేరాడు; అతని గురించి ఇంకా బెంగ పెట్టుకోవద్దు అని నీకు చెప్పమన్నారు".

అప్పుడు నాకు అర్థమైంది. "ఇన్ని రోజులు దేనికోసం వెతుకుతున్నానో అది దొరికింది" అన్న సంతోషం. అప్పటి నుంచి పూజల సమయాన్ని ధ్యానం చేయటానికి కేటాయించుకోవటం జరిగింది. కొద్ది రోజుల్లోనే పత్రీజీ గారి ప్రేమను పొందటం, 2006లో పత్రీజీ గారు స్థాపించిన "విశ్వామిత్ర పిరమిడ్ ధ్యాన ఆశ్రయం" ద్వారా నాకు కూడా ధ్యానప్రచారం చేసే భాగ్యం లభించడం జరిగింది.

నాకు కూడా మాస్టర్స్ యొక్క దర్శనాలు, వారి సందేశాలు లభిస్తూ వుండేవి. పట్టుదలతో 2006లో సుమారు 840 గంటలు ధ్యానం చెయ్యడం, మంచి అనుభవాలుకలగడం, పత్రీసార్ చెప్పిన సాధన-స్వాధ్యాయం- సజ్జన సాంగత్యాదులు చేస్తూ సార్ చెప్పిన వాటిని పాటిస్తూ రావడం జరిగింది!

ఇటువంటి సమయంలో అనుకోకుండా 2007లో నాలోకి దగ్గు, ఆయాసం వచ్చి చేరాయి. నా పరిస్థితి ఏమిటంటే గట్టిగా నడవలేను, మెట్లు ఎక్కలేను, సరిగ్గా భోజనం చెయ్యడం కూడా ఇబ్బందే. 2008 లో తప్పనిసరి పరిస్థితులలో మా అమ్మగారి తృప్తికోసం డాక్టర్లు దగ్గరికి వెళ్ళడం జరిగినది. టెస్ట్‌ల కోసం వేల రూపాయలు వదిలాయి కానీ రోగం మళ్ళీ పూర్వం లాగానే ఉండేది. 2008 జూన్ నుంచి ఆయాసం తీవ్రత మరీ ఎక్కువ అవ్వడం జరిగింది. నా పరిసస్థితి .. చివరకు ఇల్లు వదిలి బయటికి రావటానికి సైతం భయపడవలసి వచ్చేది. దాని వలన చివరికి మందులు మానివేసి 15, ఆగస్టు 2008న "11 రోజులలో నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తిరిగివస్తాను" అని చెప్పి ధ్యాన ఆశ్రయానికి రావడం జరిగింది. ఇక్కడకు వచ్చేటప్పుడు మా అమ్మగారు "నీవు దానిని తగ్గించుకుని రావాలి" లేకపోతే నీ సంగతీ, నీ ధ్యానం సంగతీ చెప్తాను" అని హుంకరించింది. నాది మాత్రం ఒక్కటే పట్టుదల .. "ధ్యానం అనే ఆయుధం నా చేతిలో ఉంది, దాని ద్వారా నాలోని ఆత్మచైతన్యశక్తిని మేల్కొల్పి విజయం సాధిస్తాను" అనే అచంచలమైన నమ్మకాన్ని వెంటపెట్టుకుని మొండిగా రావడం జరిగినది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ 11 రోజులలో నా అనుభవాలు :

17వ తేదీ రాత్రి ఇద్దరు స్త్రీలు "మేం ధ్యానం చేసుకుంటాం" అంటూ రావడం, చాలా చిత్రంగా మాయం కావటం జరిగింది. 18వ తేదీ రాత్రి ఆయాసం బాగా పెరిగి అంతరంలోంచి ఓ లోస్వరం ... "నీకు వేరే శరీరాన్నిస్తాను .. ఈ శరీరాన్ని వదిలిరా" అనడం వినిపించింది. అయితే రకరకాలుగా ప్రయత్నించి, చివరిగా స్థైర్యాన్ని కూడగట్టుకుని, "నేను ఈ శరీరంతోనే సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తాను" అని సంకల్పించుకున్నాను.

ఆగస్టు 19 వతేదీ రాత్రి స్పష్టమైన హీలింగ్ అనుభవం ... తరువాత పూర్తిగా స్పృహకోల్పోతున్న అనుభూతి ... చివరికి మళ్ళీ ఆత్మస్థైర్యంతో మెలకువను తెచ్చుకోవడం ..."నిజమా" అన్నంత ఆశ్చర్యంగా జరిగాయి!

ధ్యానంలో కూర్చుని పత్రీసార్‌ని ఒక ప్రశ్న వేశాను. "సార్! రాత్రి నేను చాలా ఇబ్బందిపడ్డాను, మిమ్మల్ని పిలిచాను అయినా కూడా ఎందుకు స్పందించలేదు?" అని. దానికి పత్రిసార్ సమాధానం..."ఆ సమయంలో నేను వస్తే నీవు ఇంకా నిన్ను కాపాడుకునేది ఎప్పుడు? నిన్ను నువ్వు తెలుసుకునేది ఎప్పుడు?"

మరి దీనిని బట్టి మనమందరం మన స్వంత చైతన్యశక్తిని తెలుసుకుని భగవద్గీతలో కృశ్ణుడు చెప్పినట్లు "ఉద్ధరేదాత్మనాత్మానాం" "ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి!" అన్నది తెలుసుకోవడం మన ప్రథమకర్తవ్యం. పత్రిసార్ ఒక సందర్భంలో ఇలా అన్నారు-"మనం పిరమిడ్ మాస్టర్లం! ఆత్మస్థైర్యం మన ఏకైక సందేశం!

పత్రిసార్ ‘జగత్ కళ్యాణం’ కోసం కృషిచేస్తూ శ్రీశైలం రోడ్డులో మహేశ్వరా మెగా పిరమిడ్‌ని నిర్మించబోయే అఖండమైన యజ్ఞంలో భాగంగా నేను, నా సహధర్మచారణి శ్రీవాణి ... మా శక్తి మేరకు కడ్తాల్, వెల్‌జాల్ మరి చుట్టుప్రక్కల వున్న అనేకానేక గ్రామాల్లో బసచేస్తూ అక్కడ జరిపే విస్తృత ధ్యాన ప్రచారంలో పాలుపంచుకునే అవకాశం రావడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాము.

ధూళిపూడి చంద్రశేఖర్

Go to top