"బోధన్ బోధిసత్వుడు"

"బ్రహ్మర్షిపత్రీజీతో ప్రత్యేక ఇంటర్వ్యూ"

"బ్రహ్మర్షి పత్రీజీ ‘షక్కర్నగర్’ లో నవంబర్ 11 న 1947 వ సంవత్సరంలో జన్మించారు" అని మనందరికీ తెలుసు. వారి బాల్యం, హైస్కూలు చదువు, ఫ్లూట్ మరి సంగీత అభ్యాసం, వారి వున్నత విద్యాభ్యాసం, ఉద్యోగం, పదవీ విరమణ, వారి ధ్యాన ప్రచారోద్యమం ఎప్పుడు ఎలా వ్రేళ్ళునికుని వుంది, 1979లో వారి ధ్యానప్రచార ప్రారంభ పర్వం .. ఇలా ఎన్నో విషయాల గురించి పత్రీజీ యొక్క స్వంత పదాలలో!

మారం శివప్రసాద్


మారం శివప్రసాద్ : పత్రీజీ! ఆత్మప్రణామాలు! చిన్నప్పటి నుంచే మీలో ఆధ్యాత్మిక తృష్ణ వూండేదా?

బ్రహ్మర్షి పత్రీజీ : ‘ఆధ్యాత్మిక తృష్ణ’ అని చిన్నప్పటి నుండి ఎవ్వరికీ తెలియదు! పెద్దయిన తర్వాత ఆ పదప్రయోగం గురించీ, దాని అర్థం గురించీ కొద్దికొద్దిగా తెలుస్తూంటుంది. నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల వయస్సు వున్నప్పుడే నేను "My Experiments with Truth" అన్న మహాత్మాగాంధీజీ గారి పుస్తకం చదివాను. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి "శాంతినికేతన్" గురించి ఎన్నో ఊహించుకుంటూ వుండేవాడిని. "చెట్ల క్రింద సంగీతం నేర్చుకోవాలి!డాన్స్ వుండాలి. విద్యాలయం గురుకులంలా వుండాలి" అని చిన్నప్పటీనుండీ నా మనస్సులో వుండేది!

గాంధీజీ పుస్తకం నన్ను చాలా ఆకర్షించింది. అలాగే శాంతినికేతన్ .. ఆ రోజుల్లో ఇండియానంతా ఒక వూపు వూపింది. వీరిద్దరే కదా పేరెన్నిక గన్నమహానుభావులు. వాళ్ళే ప్రభావితం చేశారు, నన్ను కూడా!

మారం : మీ సంగీత అభిరుచి గురించి చెప్పండి!

బ్రహ్మర్షి పత్రీజీ : నాకు ‘వయోలిన్’ వాయించాలని చిన్నప్పుడు చాలాకోరికగా వుండేది. కానీ మా అన్నయ్య బలవంతం మీద ఫ్లూట్ నేర్చుకున్నాను, తాను ఒకటి తలిస్తే, దేవుడొకటి తలుస్తాడు అన్నట్లు.

షక్కర్నగర్‌లో మా ఇంటికి తబలా నేర్పించడానికి, హార్మోనియం నేర్పించడానికి "మాస్టర్ శివరాంజీ" అనే గురువుగారు వచ్చేవారు. మా అమ్మ ఆయన దగ్గర నేర్చుకుంటూ, అందరికీ తాను హార్మోనియం ఇంట్లో నేర్పించేది. నేను ఆయన దగ్గర ‘తబలా’ నేర్చుకున్నాను. మా అమ్మ ఆయన వద్ద కొన్ని మీరా భజనలు నేర్చుకుంది .. హిందూస్తానీ భజన్స్ అవి. అమ్మ పాడుతూ వుంటే చాలా చాలా నచ్చేవి! అలా మొదలయింది నా సంగీత అభిరుచి 1956 ప్రాంతాల్లో!

మారం : ఆ మధ్య మనం షక్కర్నగర్ వెళ్ళినప్పుడు నాకు మీరు ‘రామాలయం’ చూపించారు. ఆ పరిసరాలను చూసి ఎంతో గుర్తుచేసుకుని ఆనందపడ్డారు కూడా!

బ్రహ్మర్షి పత్రీజీ : ప్రతి శనివారం మా ఇంట్లో గన్నేరు పూలు అన్నీ కోసి, అమ్మ మాలలు కట్టిన మీదట రామాలయంకి వెళ్ళి ఇచ్చే డ్యూటీ నాది. ఆ గుళ్ళో పాలరాతి విగ్రహాలు చాలా కళగా వుంటాయి. రామాలయం ఓ పెద్ద సాంస్కృతిక కేంద్రం. శ్రీరామనవమికి తొమ్మిది రోజులు వుత్సవాలు జరిగేవి. రాత్రంతా రామాయణానికి సంబంధించిన హరికథలు జరిగేవి! తెలుగులోనూ, హిందీలోనూ కూడా! అలాగే సంగీత కచేరీలు జరిగేవి! బాగా ఎంజాయ్ చేసేవాడిని!

మారం : మీ ఆటలు/క్రికెట్ గురించి చెప్పండి!

బ్రహ్మర్షి పత్రీజీ : చిన్నప్పటి నుండే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లలనంతా ప్రోగుచేసి మరీ క్రికెట్ ఆడేవాడిని, ఏడెనిమిది సంవత్సరాల వయస్సు నుండే, వీలున్నప్పుడల్లా దాదాపు ప్రతిరోజూ!

టేబుల్ టెన్నిస్, చెస్ అంటే మరీ ఇష్టం. ఎప్పుడూ ఇంట్లో పండ్ల చెట్ల మీద గడిపేవాడిని. మా కాలనీలో ప్రతి ఇంట్లోనూ రకరకాల ఫలాల చెట్లుండేవి. జామచెట్ల మీద కూర్చుని, కాయలు తింటూ, ఎంజాయ్ చేసేవాడిని. అలాగే మా బావ కోడూరి రామక్రిష్ణ గారిల్లు చాలా దగ్గర మా కాలనీలోనే. దాదాపు రోజూ వాళ్ళింటికి వెళ్ళేవాడిని.

మారం : మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి!

బ్రహర్షి పత్రీజీ : మా తండ్రిగారిది చాలా విశుద్ధమైన జీవితం. పిల్లలందరికీ చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించమని ఎప్పుడూ చెప్పేవారు. ఆయనకు "షిజోఫ్రీనియా" జబ్బు వుండేది. ఆరునెలలు మెంటల్ హాస్పిటల్లో వుంటే, ఆరునెలలు మాత్రమే ఉద్యోగం చేసేవారు. అతన వల్ల కుటుంబం కూడా బాగా కష్టపడేది. మా తల్లిగారు చాలా మృదుస్వభావి. అందరినీ బాగా ప్రేమగా, శ్రద్ధగా చూసుకునేది. తన బాధను ఎప్పుడూ తనలోనే దాచుకునేది.

మా ఫాదర్‌కు చదువుపైన ఇంట్రస్ట్ అయితే మదర్‌కి కల్చరల్ ఆక్టివిటీస్ ఇంట్రెస్ట్! మా కుటుంబంలో అందరం హైలీ ఎడ్యుకేటెడ్‌గా మరి సంగీతప్రియలుగా, కల్చరల్ ఆక్టివిటీస్‌తో వుండేట్లు తీర్చిదిద్దబడ్డాం!

మారం : మీరు బోధన్ రోజులు గుర్తుచేసుకున్నప్పుడు, షక్కర్‌నగర్‌లో ఇల్లు, మరి చిన్నతనం గురించి చెప్పండి!

బ్రహ్మర్షి పత్రీజీ : నాకు అయిదారేళ్ళ వయస్సు నుండి నా చిన్నతనం నాకు గుర్తుంది. అప్పుడు పెరిగిన వాతావరణం, ఆ చెట్లు, ఆ ఫ్యాక్టరీ, రామాలయం, మసీదు అంతా! చుట్టుప్రక్కల అందరూ, అన్నిమతాల, ఎన్నో రాష్ట్రాల వాళ్ళు! నెలకొకసారి జీపులు వేసుకుని అన్ని ఇళ్ళవాళ్ళం పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. షక్కర్‌నగర్ చుట్టు పట్ల చాలా పిక్నిక్ ప్రదేశాలు వున్నాయి. ఉదాహరణకు "అలీసాగర్"! అక్కడికి వెళ్ళి వుదయం నుండి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం. నెలకొకసారి తప్పనిసరిగా వుండేది పిక్నిక్ విహారం!

మారం : మీ హైస్కూల్ జీవితం?

బ్రహ్మర్షి పత్రీజీ : ప్రైమెరీ స్కూల్ ఏమో 5వ తరగతి వరకూ షక్కర్‌నగర్ లోనే, ఇంటిముందే, ఒక గర్ల్స్ హైస్కూల్లో! 6వ తరగతి నుండి బోధన్‌లో రోజూ నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళం; అప్పుడప్పుడూ ఏదైనా జీప్‌లో! 10వ తరగతి నుండి స్కూల్ ఫైనల్ వరకు అంటే 1960 నుంచి 1963 వరకు సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీ హస్కూల్‌లో చదివాను.

మారం : మీరు ఫ్లూట్ ఏ సంవత్సరం నుండి నేర్చుకోవడం మొదలుపెట్టారు?

బ్రహ్మర్షి పత్రీజీ : ఏప్రిల్ 13, 1963 లో .. నేను మొదటిసారి ఫ్లూట్ పట్టుకున్నది! మా అన్నయ్య నన్ను ఆయన గురువు గారైన శ్రీ T.S. చంద్రశేఖరన్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మా అన్న గారు ఆయన వద్ద అప్పటికే ఫ్లూట్ నేర్చుకుంటూ వుండేవాడు. మొదటి మూడురోజులు ఫ్లూట్ వాయించినప్పుడు ‘గాలి’ మాత్రమే వచ్చింది.ఆ తర్వాత మెల్లిగా సౌండ్ వచ్చింది ! శ్రీ చంద్రశేఖరన్ గారి వద్ద పదేళ్ళపాటు ఫ్లూట్ కర్నాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నాను.

మారం : మీకు IAS చేయాలని ఎందుకు అనిపించింది?

బ్రహ్మర్షి పత్రీజీ : ఎందుకు అనిపించకూడదు? మా అన్నగారు గొప్ప ఇంజనీరింగ్ సైంటిస్ట్. మా సిస్టర్ మెడికల్ డాక్టర్! సైకియాట్రిస్ట్! మా అన్నగారి పట్టుదల వల్ల IAS కు అప్పియర్ అయ్యాను, మూడుసార్లు! IAS అంటే ఎన్నో పుస్తకాలు చదవాలి; ఎంతో జనరల్ నాలెడ్జ్ వుండాలి; మూడు సంవత్సరాలు ఏకధాటిగా రాత్రింబవళ్ళు చదివాను. ప్రొద్దున అనగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వెళితే ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చేవాడిని!

B.Sc లో వున్నప్పుడే నేను B.Sc స్థాయి పుస్తకాలు కాకుండా M.Sc స్థాయి పుస్తకాలు చదివేవాడిని! ఉదాహరణకు డార్విన్ థియరీ సిలబస్‌లో ఉందనుకోండి ... నేను లైబ్రెరీకి వెళ్ళి ఆ సబ్జెక్ట్‌కి సంబందించిన చార్లెస్ డార్విన్ మూలగ్రంథాలన్నీ చదివేవాడిని. కాలేజ్ స్థాయి నుంచే ఒరిజినల్ పుస్తకాలన్నీ చదివే అలవాటు. IAS లో మరింత విస్తృతంగా అన్ని సబ్జెక్టుల గురించి చదివాను. తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలు వేలువేలు చదివాను.

మారం : హిందీ కూడా చదివారా? హిందీ చాలా బాగా మాట్లాడతారు. మీరు ఒక కవి లాగా ధారాళంగా!

బ్రహ్మర్షి పత్రీజీ : చిన్నప్పటి నుండే మా ఇంట్లో అందరూ హిందీ నేర్చుకున్నారు మా అమ్మ పట్టుదల వల్ల. హిందీలో ‘ప్రథమ’, మధ్యమ’, ఉత్తమ’ పరీక్షలు మా ఇంట్లో అందరూ పాసయ్యారు. అయితే హిందీ పుస్తకాలు ఎక్కువగా చదవలేదు. సంగీతం, మ్యూజిక్, డాన్స్‌తో పాటు హిందీ కూడా కొంచెం వచ్చింది.

మారం : హిందీ చిన్నప్పుడే చదువుకోవడం, సంగీతం నేర్చుకోవడం, సైన్స్ ఫిలాసఫీ పుస్తకాలు విపరీతంగా చదవడం .. నెలకు 25 రోజులు టూర్ వుండే ఉద్యోగం చేయడం .. ఇవన్నీ కూడా ధ్యానప్రచారానికి మంచి పునాదులు అయ్యాయి కదా!

బ్రహ్మర్షీ పత్రీజీ : ఇండియా మొత్తం ప్రపంచపటంలో ఉత్తమమైన ప్రదేశం అనీ, ఇండియాలో జనాభా ఎక్కువ అనీ, ఇండియాలో జన్మతీసుకోవడం!మరి ఉత్తర భారత్ & దక్షిణ భారత్ సరిహద్దులో వున్న షక్కర్‌నగర్లో పుట్టడం అన్నది అన్ని భాషలు రావడం కోసమేనేమో! మరి షక్కర్‌న గర్లో మా కాలనీలో ఒక తమిళియన్, ఒక కన్నడ, ఒక పంజాబీ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, హిందూస్ ..అందరూ వున్న కాలనీలో పుట్టి పెరగడం, అన్ని రాష్ట్రాల సంస్కృతులు అలవాటు కావడం కోసమేనేమో! ఇంటి ప్రక్కనే మసీదు, దూరంగా శ్రీరామదేవాలయం; ప్రక్కనే మసీదు కనుక రోజూ ‘ఆజా’ వినపడుతూండేది. ముస్లిం సంస్కృతి, హిందూ సంస్కృతి .... అన్ని మతాల సమన్వయం కోసమేనేమో!

ఇప్పుడు నాకు అర్థమవుతోంది... ఇదంతా కారణలోకాలలో ఆత్మ యొక్క ముందస్తు ప్రణాళికే అని! కాలేజీలో కూడా నాకు ఎక్కువమంది ఫ్రెండ్స్ ముస్లింవాళ్ళే వుండేవాళ్ళే వుండేవారు. ముస్లిమ్స్ సింపుల్ పీపుల్! వారి మాంసాహారం తప్పిస్తే, నేను ముస్లిమ్స్‌ని బాగా ఇష్టపడేవాడిని!

మారం : మీరు సదాచారసంపన్నమైన, సంస్కారవంతమైన బ్రాహ్మణకుటుంబంలో పుట్టారు. ఈ విధంగా జన్మతీసుకోవడానికి కారణం?

బ్రహ్మర్షి పత్రీజీ : సున్నితమైన జీవితానికి సంస్కృతే సరైన పునాదులు వేస్తుంది. సంస్కృతి ఎక్కడైతే బాగా వుందో-సంగీతం, ధ్యానం, కళలు, చదువులు ... అక్కడ తప్పకుండా యోగులు జన్మ తీసుకోవడం జరుగుతుంది. నేనూ అలాగే! అలాగే మూర్ఖమైన చదువులు, పూజలు ఉన్న బ్రాహ్మణత్వాన్ని కూలద్రోయడానికి కూడా అందులో జన్మించడం జరిగింది.

మారం : 1979 లో మీరు ఇతరులకు ధ్యానం గురించి బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు అనుకున్నారా మీరు ఒకనాటికి ప్రపంచ స్థాయి పరమగురువు అవుతారని? "కేవలం నలుగురున్నారు నా బోధన ద్వారా ధ్యానం చేసినవారు మొదట్లో" అని కొన్ని సందర్భాల్లో చెప్పారు మీరు!

బ్రహ్మర్షి పత్రీజీ : ప్రపంచవ్యాప్త దృక్పథమేదీ లేదప్పుడు. కేవలం మనకు తెలిసిందంతా దొరికినవాళ్ళకు బోధించుకుంటూ పోవడమే! చిన్నప్పటి నుండీ నా అలవాటు ... తెలిసింది ప్రక్కవాళ్ళకు సుత్తి కొట్టి మరీ చెప్పడం! చిన్నప్పుడు నేను మా కాలేజీలో హైయర్ పుస్తకాలు చదివేవాడిని కనుక కెమిస్ట్రీ వాళ్ళకు కెమిస్ట్రీ బోధించేవాడిని. లెక్కల వాళ్ళకు లెక్కలు, హిస్టరీ వాళ్ళకు హిస్టరీ! చిన్నప్పటి నుండి నేను క్రికెట్‌లో కెప్టెన్‌ని. అందరికీ క్రికెట్ నేర్పించేవాడిని, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ .. నాకు అర్థమైంది ఇతరులందరికీ అర్థం కావాలని తపన! అలాగే క్రొత్తగా ధ్యానం వచ్చింది అప్పట్లో. "కొత్తపిచ్చోడు ప్రొద్దెరుగడు" అన్నట్లుగా అందరికీ ధ్యానం చెప్పాలనుకునేవాడిని. సబ్జెక్ట్ తెలిసింది చెప్పాలి. ధ్యానం గురించి చెప్పడం మొదలెట్టాను! అంతేకానీ! "ప్రపంచవ్యాప్త దృక్పథాలు" అంటూ ఏమీ లేవు అప్పుడు!

మారం : డబ్బు గురించి మీ నిరాసక్తత అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుండీ అంటేనా?

బ్రహ్మర్షి పత్రీజీ : ఇంట్లో చిన్నప్పటి నుండీ ఎవ్వరికీ డబ్బు గురించి ఆలోచనలు లేవు కదా! ఎప్పుడూ చదువు, సంగీతం, సంస్కృతి- వీటి మీదే విశేష ఆసక్తి. Ph.D.' చేయాలి, ‘ఇంజనీరు’ కావాలి, ‘సైంటిస్ట్’ కావాలి .. ఇలా. మాది డబ్బు మీద ఆసక్తి వున్న ఇల్లు కాదు. ఆ వాతావరణం నుంచి నా గుణాలు కూడా అలాగే వచ్చాయి.

మారం : 1992లో ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత మీ కుటుంబం గురించి మీరేం ఆలోచించారు?

బ్రహ్మర్షి పత్రీజీ : రాజీనామా చేయకముందు కూడా నేను ఏమీ ఆలోచించలేదు. ఉదాహరణకు: నేను 1975 లో "కోరమాండల్ ఫర్టిలైజర్స్" చేరాను. మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ‘లోన్’ ఇస్తారు. డ్రైవర్స్‌తో సహా అందరూ కంపెనీ నుంచి అప్పు తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారు. రెండు, మూడు లక్షలు ఇచ్చేవారు. నేనెప్పుడూ లోన్ తీసుకోలేదు. ఇల్లు కట్టుకోలేదు. "ఇల్లు వద్దు, ఏమీ వద్దు" అనేవాణ్ణి. నన్ను"పిచ్చివాడు" అనుకునేవారు అందరూ!!

మారం : మరి మేడమ్, పిల్లలు అడ్జస్ట్ అయ్యేవారా?

బ్రహ్మర్షి పత్రీజీ : తప్పుతుందా మరి? అది వాళ్ళ జీవిత ప్రణాళిక!

మారం : మీరు భూసారశాస్త్రంలో Post Graduate కదా! మీ MSc. (Ag) గురించి కొంచెం చెప్పండి!

బ్రహ్మర్షి పత్రీజీ : 1966 లో B.Sc. అయిన తర్వాత నాకు M.Sc కెమిస్ట్రీ సీట్ రాలేదు. నా మిత్రులందరూ M.Sc. Chemistry చేశారు. మా సహోదరి కూడా! ‘కెమిస్ట్రీ’ అంటే నాకు చాలా ఇష్టంగా వుండేది. ఆ తర్వాత B.Sc. (Ag) చేశాను. ఆ తర్వాత నాకు Soil Chemistry లో M.Sc. (Ag)లో సీట్ రావడం నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్! వ్యక్తిగతంగా నాకు అత్యధిక తృప్తిని ఇచ్చిన శాస్త్రం Soil Chemistry! 1966 లోనే M.A. ఇంగ్లీష్ లిటరేచర్‌లో సీట్ వచ్చింది. ఆరునెలలు అది చేసిన తర్వాత, మా అన్నయ్య సలహాతో దాన్ని మానేసి B.Sc(Ag) చేరాను.

మారం : తెనాలిలో ఇన్‌కమ్‌టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా 1970 సం||లో మొదటి ఉద్యోగం చేసి కొన్ని నెలలకే మీరు దానికీ రాజీనామా చేశారు అని విన్నాను?

బ్రహ్మర్షి పత్రీజీ : 1970 లో తెనాలిలో ఇన్‌కమ్‌టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్ అయిన తర్వాత, ఆ జాబ్ చేస్తూ IAS కి ప్రిపేర్ అయ్యేవాడిని. అయితే రెండూ చేయడానికి సమయం చాలేది కాదు. అన్నయ్యతో చెబితే "వదిలేయిరా, వెధవ ఉద్యోగం! రాజీనామా చేసి IAS పూర్తి చేయి" అన్నాడు. అంతే రాజీనామా చేసి ని IAS అప్పిరయ్యాను మూడుసార్లు!

మారం : మీరు కోరమాండల్ ఉద్యోగానికి ఎప్పుడు రిజైన్ చేసారు?

బ్రహ్మర్షి పత్రీజీ : 1992 జనవరి 16 వ తేదీన నా రాజీనామా పత్రం సమర్పించాను 1992 ఏప్రిల్ 16 ..! అది నా చిట్టచివరి వర్కింగ్ డే!

మారం : కర్నూల్లోనే పిరమిడ్ కట్టాలి అని మీకెందుకు అనిపించింది? దానికి ప్రేరేపణ ఏమిటి? పిరమిడ్ నిర్మాణం చేస్తున్న సమయంలో మీ అనుభూతులు?

బ్రహ్మర్షి పత్రీజీ : కర్నూల్లోనే వుద్యోగం చేయడం, అక్కడి నుండి ధ్యానప్రచారం ఎక్కువమందితో ప్రారంభించి వుండడం .. వుద్యోగరీత్యా, ధ్యానప్రచారం ద్వారా అక్కడ చాలామంది మిత్రులు ఏర్పడి వుండడం వల్ల కర్నూల్లోనే మొదటి పిరమిడ్ నిర్మాణానికి కారణభూతమైంది.

ఆ నిర్మాణం కూడా చాలా చాలా త్వరగా జరిగింది. 1990 డిసెంబర్ 31వ తేదీన ఆ పిరమిడ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసాం. నాలుగయిదు నెలలకంతా పిరమిడ్ పూర్తి అయింది! సంవత్సరం లోపలే మిగతాది పూర్తయింది.

ఈ పిరమిడ్ నిర్మాణానికి ముఖ్యకారణభూతుడు శ్రీ B.V. రెడ్డిగారు. ఆయన ధ్యానం నేర్చుకున్న తర్వాత, "మీకోసం ఏదైనా ఒక ‘పెద్ద పని’ చేయాలనిపిస్తోంది; ఏం చేయమంటారు?" అని అడిగారు. "నాకొక పిరమిడ్ కట్టించి ఇవ్వండి" అని అడిగాను. "రఘునాథ్ థియేటర్ దగ్గర నుండి వున్న స్థలమంతా నాదే, ఈ స్థలంలో మీరు ఎక్కడ కావాలని కోరితే అక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం చేయించి ఇస్తాను" అన్నారాయన. "సమీర్ బాబా సమాధి" చుట్టూ వున్న స్థలం పిరమిడ్ నిర్మాణానికి నేను ఎంచుకున్నాను. B.V. రెడ్డి గారు వెంటనే పనిమొదలు పెట్టి నిర్మాణం చేయించి ఇచ్చారు. ఇంకా ఎందరో మహానుభావులు ఆ పిరమిడ్ నిర్మాణానికి సహకరించారు! శ్రీ B.V. రెడ్డి గారు ఏది పట్టుకున్న, వెంటనే చేసేస్తారు! అంత మంకుపట్టుదల గల మనిషి ఆయన! అందుకే "బుద్ధా పిరమిడ్" అంత తొందరగా పూర్తయింది!

మారం : పిరమిడ్ పూర్తయిన తర్వాత "ఒక్కొక్కరినీ పిరమిడ్‌లోకి పంపి, వారు ధ్యానం చేసినంతసేపు మీరు, బయట పుస్తకం చదువుతూ కూర్చుని, వారు పిరమిడ్ లోంచి బయటకు వచ్చిన తర్వాత, ఒక్కొక్కరి అనుభవాలు ఎంతో ఓపికతో విని మీరు చాలా ఆనందించేవారు" అని ప్రతి మేడమ్ చెప్పారు!

బ్రహ్మర్షి పత్రీజీ : కరెక్ట్! ప్రక్కవాళ్ళు పొందిన ఆనందం చూసి ఆనందించే మనస్తత్వం మనది! పిరమిడ్‌లో ధ్యానం చేసి వచ్చిన వారి యొక్క అనుభవాలు విని నేనే ఆ అనుభవాలు పొందినంత ఆనందాన్నీ, అనుభూతినీ పొందేవాడిని!

మారం : మీరు ప్రతి ఒక్కరినీ చాలా ఓపికగా వింటారు. ఎంతో శ్రద్ధగా వింటారు. ముఖంలో అసహనం కనపడదు. ఎంతసేపయినా వింటారు. మీలాగా వినేవాళ్ళు 0.01% కూడా ఉంటారా అని నాకు సందేహం!

బ్రహ్మర్షి పత్రీజీ : చిన్నప్పటి నుండి నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాను. ఏదో ఒక్ మూల నక్కి కూర్చునేవాడిని. మాట్లాడడానికి నాలుక ఒప్పుకునేది కాదు. నాలుక ఫ్రీగా వుండేది కాదు. అలాగే అలవాటయ్యింది.

మారం : మీ అక్కగారు సుధమేడమ్‌తో చేసిన ఇంటర్వ్యూలో మీకు చిన్న వయస్సులోనే "జీవితం అంటే ఏమిటి? జీవితం తర్వాత ఏమిటి?" అనే జిజ్ఞాస ప్రశ్నలుండేవని?

బ్రహ్మర్షి పత్రీజీ : నాక్అవి సరిగ్గా గుర్తులేవు కానీ, స్కూల్ ఫైనల్ అయిన తర్వాత రెండు నెలలు వేసవి సెలవులు వస్తే .. అప్పుడు మా అన్నయ్య వేణువినోద్ వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా వుండేవారు .. అక్కడికి వెళ్ళాను. అప్పుడు పండిత్ రాధాక్రిష్ణన్ వ్రాసిన "ఇండియన్ ఫిలాసఫీ" రెండు సంపుటాలు, నా పదిహేనవ యేట శ్రద్ధగా చదివాను.

నా పదవయేటనే విశ్వనాథ సత్యనారాయణ గారి రచన "వేయిపడగలు" పుస్తకం చిదివాను. అది నా ప్రీతిపాత్రమైన నవల. అందులోకి ధర్మారావు, పసరిక, పెద్ద అరుంధతి, చిన్న అరుంధతి .. ఈ పాత్రలు నన్ను చాలా ప్రభావితం చేశాయి! ఆ తర్వాత మళ్ళీ ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. అలాగే డిటెక్టివ్ పుస్తకాలు, అందులో పాత్రలు ‘భగవాన్’, రాంబాబు’, ‘కిరణ్మయి’ వారి పరిశోధనలు, బాగా ఇంట్రెస్టింగ్‌గా చదివేవాడిని. అలా "పుస్తకాల పురుగు" గా చిన్నప్పటి నుండే వున్నాం మనం.

మారం : కర్నూలు మాస్టర్ గుణాకర్ తదితరులు చెపుతూంటారు, "పత్రీజీ ఎప్పుడూ కట్‌త్రోట్" అని!

బ్రహ్మర్షి పత్రీజీ : 1979లో "మాస్టర్ వాకిన్" అయినప్పటినుంచి మాత్రమే ‘కట్‌త్రోట్’ ! అంతకముందు మనం చాలా చాలా సాఫ్ట్!!

మారం : ‘వాకిన్’ అవటం గురించి కొంచెం వివరించండి!

బ్రహ్మర్షి పత్రీజీ : ఒక ఆత్మ పోయి మరొక ఆత్మ ఓ శరీరంలోకి మధ్యంతరంగా వచ్చినప్పుడు దాన్నే ‘వాకిన్ ఆత్మ’ అంటాం.

మారం : అప్పుడు కుటుంబం, మరి అంతకుమునుపు సంబంధించిన జ్ఞాపకాలు ఎలా వుంటాయి?

బ్రహ్మర్షి పత్రీజీ : బ్రెయిన్ కణాల్లో ఆ జ్ఞాపకాలన్నీ నిక్షిప్తమై వుంటాయి కనుక, ఆ ‘స్మృతి’ వుంటుంది. అయితే కుటుంబం సభ్యులతో విశేషంగా భావోద్వేగాలు, అటాచ్‌మెంట్స్ ఏమీ వుండవు. బంధరహితంగానే వుంటావు! నువ్వు ఆ కుటుంబానికి సంబంధించిన వాడివికావు కదా! నువ్వు ఆ కుటుంబంలో పుట్టలేదు.. ఆ కుటుంబంలో పెరగలేదు! తామరాకు మీద నీటిబొట్టులా .. అలా వుంటుంది. ఆ స్థితి!

మారం : సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి "ఇండియన్ ఫిలాసఫి" చదివిన తర్వాత ఏమైన ప్రశ్నలు వచ్చేవా మీలో? స్పిరిచ్యువల్ ట్రెండ్ వుండేదా? ఆత్మల గురించిన విశ్లేషణ ఏమైనా వుండేదా మీలో అప్పుడు?

బ్రహ్మర్షి పత్రీజీ : ఒకే ఒక సంశయం మాత్రం వుండేది.. "‘మైండ్’ కూ, ‘బ్రెయిన్’ కూ గల తేడా ఏంటి?" అనే ప్రశ్న! "బ్రెయిన్‌కీ, మనస్సుకీ తేడా ఏమిటి?" అనే ప్రశ్న ఎప్పుడూ అలా వుండేది.

మారం : మైండ్‌కూ, బ్రెయిన్‌కూ వున్న తేడా ఏంటి?

బ్రహ్మర్షి పత్రీజీ : "బ్రెయిన్- మస్తిష్కం" అనేది భౌతిక శరీరం యొక్క ఒకానొక భాగం, అంటే! అయితే "మైండ్ - మనస్సు" అనేది ఈ శరీరంలో వున్న మన ఆత్మయొక్క ప్రతిబింబం. భారతీయ తత్వశాస్త్రంలో ‘వేదాంతం’ వుంది కానీ, ఆత్మల గురించిన వివరణ ఎక్కువగా లేదు కదా. ఒక యోగి అయితేనే ఆత్మల గురించిన ప్రత్యక్ష పరిజ్ఞానం వుంటుంది. ఎప్పుడైతే "యోగుల పుస్తకాలు" చదవడం మొదలుపెట్టానో అప్పుడే "ఆస్ట్రల్ బాడీ - ఆస్ట్రల్ ట్రావెల్స్" .. వీటి గురించి అనేకానేక గొప్ప విశేషాలు తెలిసాయి.

మారం : ప్రపంచయాప్తంగా ధ్యానప్రచారం చేయాలని ఎప్పటినుండి అనిపించింది?

బ్రహ్మర్షి పత్రీజీ : 1999 లో కర్నూల్లో "మొదటి ధ్యానమహాయజ్ఞం" పూర్తయిన తర్వాత, 2000 సంవత్సరంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి, "2004 ధ్యానాంధ్రప్రదేశ్", "2008-ధ్యానభారత్", "2012-ధ్యానజగత్" అనే ప్రణాళికలు!

మారం : మీ ‘ఆటీట్యూడ్’ లో ఒక్కోసారి ఒక్కోమాస్టర్ ప్రభావం కనిపిస్తూ వుంటుంది. అంతలోనే మరొకటిగా మారిపోతుంది. వివరించ ప్రార్థన!

బ్రహ్మర్షి పత్రీజీ : నాకు అన్నింటికన్నా ఎక్కువ ఇష్టమైన విషయం అందరు మాస్టర్లనూ, వారి గొప్పతనాన్నీ అధ్యయనం చేయడం. ఏదైతే బాగా ఆధ్వయనం చేస్తామో దాన్నే మనం పుణికి పుచ్చుకుంటాం! ఉదా|| మీరు మహాభారతం చదివారనుకోండి- ఆ పాత్రలనూ, మరి రామాయణం చదివారనుకోండి - అందులోని పాత్రలనూ, పాత్రలనూ మరి పుణికి పుచ్చుకుంటారు; రమణమహర్షి పుస్తకాలు చదివితే - మీకు ఆ మాటలే గుర్తువస్తూంటాయి సహజంగానే!

మారం: విభిన్న యోగుల పుస్తకాలు మీరు ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. విభిన్న యోగులు విభిన్న అభిప్రాయాలను ప్రకటిస్తూంటారు కదా ... ఇందరి అభిప్రాయాలు, అది కొంచెం అస్పష్టతనూ, కొంచెం ఘర్షణనూ క్రియేట్ చేస్తూంటాయి కదా! మరి సాధకులు వాటిని ఎలా అధిగమించాలి?

బ్రహ్మర్షి పత్రీజీ: "ప్రతి ఓటమీ ఓ గెలుపుకు నాంది" అంటాం కదా! అలాగే ప్రతి గందరగోళమూ ఒక అవగాహన వైపు, ఒక స్పష్టత వైపు మనల్ని తప్పకుండా తీసుకువెళ్తుంది! అందువల్ల ‘ఓటమి’ గానీ, ‘గందరగోళం’ గానీ మౌలికంగా తప్పేమీ కాదు.

మారం : సరిక్రొత్తగా ధ్యానానికి వచ్చిన వారిని కూడా మీరు చక్కగా వింటారు. అది అంత అద్భుతంగా ఎలా సాధ్యమైంది మీకు??

బ్రహ్మర్షి పత్రీజీ : కోరమాండల్‌లో పని చేసేటప్పుడు, రైతులను అప్పుడప్పుడు పెద్దపెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకెళుతూండే వాళ్ళం. ఉదా|| ఇక్కడ హైదరాబాద్‌లో ‘ఇక్రిసాట్’ వుంది. అక్కడికి కూడా రైతులను తీసుకెళ్ళే వాళ్ళం. ‘ఇక్రిసాట్’ ప్రపంచప్రసిద్ధి అయిన అమెరికా సంస్థ. అలా రైతులు వచ్చినప్పుడు ఇక్రిసాట్ యొక్క మొట్టమొదటిస్థాయి అధికారి (డైరెక్టర్) వచ్చి రిసీవ్ చేసుకునేవాడు.

అతడు ఏం చెప్పాడు తెలుసా? - "అత్యున్నత స్థాయి అధికారి మాత్రమే సంస్థలోని మొదటిస్థాయి వారికి సమాచారాన్ని సరిగ్గా అందించగలరు" అని! ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా గుర్తు.

మారం : ప్రతి వూళ్ళో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మిమ్మల్ని కలిసినప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ "పత్రీజీ నాకే ఆత్మీయులు" అని భావిస్తూ వుంటారు. ఇది ఎలా సాధ్యమైంది?

బ్రహ్మర్షి పత్రీజీ: మనం ‘అద్దం లా వున్నాం కనుక! ఏ ఇంట్లోనయినా, ఎవరినయినా చూస్తే వాళ్ళు ఎక్కువగా ప్రేమించేది ‘అద్దం! The mirror! ఎందుకంటే అద్దంలో వాళ్ళ ముఖమే కనబడుతుంది కనుక! అది వాళ్ళకు ఎంతో బావుంటుంది కనుక! మనం ‘అద్దం’ లా వున్నాం కనుక, ప్రతి ఒక్కరినీ మనం అలా చూడగలుగుతున్నాం కనుక, అది సాధ్యమైంది! "అద్దం కాన్సెప్ట్" ఇది!!

మారం : ఎవరు ఏం మాట్లాడినా మీరు వాళ్ళను తప్పుగా చూడరు! "ఇలా వుండు, అలా వుండు" అని శాసించరు!

బ్రహ్మర్షి పత్రీజీ : నేను ద్వేషించేది మాంసాహారాన్నీ మరి జీవహింసనూ మాత్రమే! జంతు వధ, పక్షి వధ, మాంసభక్షణ .. ఇవే నాకు కోపం తెప్పించ్చే విషయాలు. వీటి పట్ల నాకు నిలువెల్లా ద్వేషం. చీల్చి చెండాడుతాను! మిగిలినదేనినైనా, ఎవరిననా, ఏ విషయాన్ని అయినా సంతోషంగా స్వీకరిస్తాను నేను!

మారం : ఇది ఎలా సాధ్యం? జన్మజన్మల సంస్కారమా?

బ్రహ్మర్షి పత్రీజీ : "సంస్కారం" అంటేనే జన్మజన్మల నుండి వచ్చేది!

మారం : మీరు ‘రేపటి’ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా?

బ్రహ్మర్షి పత్రీజీ : ‘రేపటి’ గురించి బాగా ఆలోచిస్తాను; అయితే ‘వర్తమానం’ లో మాత్రమే జీవిస్తూంటాను!

మారం : ‘నిన్నటి’ గురించి మీ అభిప్రాయం?

బ్రహ్మర్షి పత్రీజీ : "నిన్న" ను అధ్యయనం చేసి, అందులోంచి పూర్ణసారం తీసుకుంటాను! దానిని వర్తమానంలో సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ వుంటాను.

మారం : మీరు మాటలు మధ్యలో "అల్లాహో అక్బర్" అనీ, "రామచంద్రా" అనీ అంటూ వుంటారు!

బ్రహ్మర్షి పత్రీజీ : గతజన్మలో నేనొక ముస్లిమ్‌ని. మరి అందుకే ఈ జన్మలోనూ "అల్లాహో అక్బర్!" అని నా నోటి నుండి వస్తూ వుంటుంది సహజంగా! ఈ జన్మలో హిందువుగా పుట్టాను. దానికి తగినట్లుగానే మా ఊళ్ళోని రామాలయంతో మా కుటుంబానికి చిన్నతనం నుంచీ వున్న అనుభూతులు ఎక్కువ కనుక "రామచంద్రా!" అని నా నోటినుండి వస్తూ వుంటుంది.

మారం : పిరమిడ్ ప్రపంచానికి మీ సందేశం??

బ్రహ్మర్షి పత్రీజీ : హాయిగా, నిశ్చింతగా బ్రతకాలి ప్రతి ప్రాణీ! ప్రతి భూచరం! ప్రతి జలచరం! ప్రతి ఖేచరం! హాయిగా బ్రతకాలి ప్రతి మనిషీ!! ప్రతి కుటుంబం హాయిగా జీవించాలి!!!

Go to top