" బోధన్ బోధిసత్వుడు "

బ్రహ్మర్షి పత్రీజీ పెదనాన్న గారు, స్వర్గీయ డా||P.N. బిందు గారి ఆఖరి కుమారుడు శ్రీ "పత్రి ఆనందసాగర్"! వారి శ్రీమతి " ఊర్మిళ " .. స్వయంగా స్వర్ణమాలా పత్రి గారి అక్క! పత్రీజీ కజిన్ బ్రదర్‌గా, కో-సన్‌ఇన్‌లాగా, పత్రీజీకీ ఆనందసాగర్ గారికీ మధ్య అత్యంత సమీప సాన్నిహిత్యం! పత్రీజీ తండ్రి, పెదతండ్రి, ఉమ్మడి కుటుంబంగా వున్నప్పుడు, షక్కర్‌నగర్ నుండి చదువుకోసం హైదరాబాద్ వచ్చిన మొదట్లో "సుభాష్" తమ పెదనాన్న "పత్రి నరసింహబిందు" గారింట్లో కొంతకాలం వున్నారు. ఆ తరువాత మళ్ళీ ఆనందసాగర్ గారి మరదలు అయిన "స్వర్ణమాల" గారిని పెళ్ళి చేసుకోవడం వల్ల మరింత ఏకమయిపోయి రెండుకుటుంబాలు.శ్రీ ఆనందసాగర్, శ్రీమతి ఊర్మిళా ఆనందసాగర్‌లతో చేసిన ఈ ఇంటర్వ్యూ వల్ల, మన "బోధన్ బోధిసత్వుడు".. ఆయన ఆధ్యాత్మిక పయనంలోని తొలిరోజులు, ఆయన బాల్యం, ఇంకా ఎన్నో విశేషాలు ఎన్నో కోణాల నుండి తెలుసుకునే అవకాశం ఈ ఇంటర్వ్యూ వల్ల కలుగుతోంది. శ్రీ ఆనందసాగర్, శ్రీమతి ఊర్మిళా గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు!

మారం శివప్రసాద్


మారం శివప్రసాద్ : ఆనందసాగర్ గారూ! నమస్కారం! మీ గురించి చెప్పండి సార్!

ఆనంద్‌‍సాగర్ : మా నాన్నగారు, మరి పత్రీజీ గారి నాన్నగారు "రమణారావు" గారు అన్నదమ్ములు. మా చిన్నాన్న గారంటే నాకు చాలా చాలా ఇష్టం! నేను M.B.A. చేసాను. నేను Decolam తయారు చేసే కంపెనీలో ప్రొడక్షన్ ఆఫీసర్‌గా మొదలుపెట్టి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్‌ఛార్జీగా 37 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యాను. చాలా పెద్ద కంపెనీ అది. ఇప్పుడు ఆ కంపెనీయే లేదు! నేను "పత్రీజీ"కి కజిన్ అవుతాను. నా వయస్సు 67 సంవత్సరాలు.

మారం : మేడమ్! మీరేం చదివారు? ఏం చేశేవారు?

శ్రీమతి ఊర్మిళ : నాపేరు పత్రి ఊర్మిళ! స్వర్ణమాలా పత్రి నా స్వంత చెల్లెలు! మరి మావారు పత్రిగారికి కజిన్ బ్రదర్ కావడం, స్వర్ణ నా స్వంత చెల్లెలు కావడం వల్ల కుటుంబంతో మాది చిరకాల బాంధవ్యం!

నేను కొన్నేళ్ళుగా ఆంధ్రమహిళాసభలో "డేఫ్ అండ్ డంబ్" వాళ్ళకు టీచర్‌గా పనిచేసి ప్రస్తుతం ఇల్లు చూసుకుంటూ మా మనమడితో కాలక్షేపం చేస్తూ వున్నాను. నేను గ్రాడ్యుయేట్ నండి!

మారం : ఆనంద్‌సాగర్ జీ! పత్రీజీ గురించి వివరంగా చెప్పండి!

ఆనంద్‌సాగర్ : పత్రీజీ నాలుగయిదేళ్ళు వయస్సున్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు! పత్రిగారిని "బుచ్చి" అని పిలిచేవాళ్ళం! అలాగే ఆయనికి ఒక తమ్ముడు "అరవింద్" వుండేవారు. అతడిని మేము "చిట్టి"అని పిలిచేవాళ్ళం. కర్మలు తీరడం వల్ల, 1964 సంవత్సరంలో, 15 ఏళ్ళ వయస్సులో పైలోకాలకు వెళ్ళిపోయాడు. ఇక పత్రీజీ అన్న వేణువినోద్ నా క్లాస్‌మేట్!

పత్రీజీ బాల్యం షక్కర్‌నగర్ లో గడిచింది. ఆయన చదువు కోసం హైదరాబాద్ వచ్చిన తరువాత నాకు బాగా పరిచయం. బాగా సఖ్యత "బుచ్చి"తో మాకు! హి ఈజ్ ఏ బ్రిలియంట్ చాప్! వాళ్ళనాన్న రమణారావు.. అదే మా చిన్నాన్న -ఆయన మొట్టమొదటి షుగర్ టెక్నాలజిస్ట్ పాత హైదరాబాద్ స్టేట్.. ఓల్డ్ నైజామ్ స్టేట్ నుంచి! ఆయన తన మొత్తం జీవితాన్ని గడిపింది షక్కర్‌నగర్.. "నిజాం షుగర్స్" ఫ్యాక్టరీలో! అప్పట్లో ఉస్మానియా ఫేమస్ పర్స్‌న్స్ అయిన Dr.N.V. సుబ్బారావు గారు, రావళ్ళ సత్యనారయణ గారు రమణారావు గారికి క్లాస్‌మేట్స్!

మా చిన్నాన్న గారి అందరు సంతానం స్వతహా చాలా బ్రిలియంట్! పత్రిగారి అన్న వేణువినోద్ HSC లో స్టేట్ ఫస్ట్. ఇంటర్మీడియట్‌లో స్టేట్ సెకండ్. ఇంజనీరింగ్ స్టేట్ సెకండ్. I.I.T. బాంబేలో, M.Tech చేసిన తరువాత, ఇంగ్లాండ్ మాంఛెస్టర్‌లో స్కాలర్‌షిప్‌తో Ph.D. చేశారు. 1978లో ఆయన హాంకాంగ్ వెళ్ళి హాంకాంగ్ యూనివర్సిటీలో ఓపెన్ కాంపిటీషన్‌లో సెలక్ట్ అయి, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ, రిటైర్ అయిన తరువాత U.S.A వెళ్ళారు!

ఇక "బుచ్చి" అదే... పత్రీజీ విషయం. ఆయన దేనిలోనూ తక్కువ వాడు కాడు. అన్నీ ఎక్కువే! మూడుసార్లు IAS కు Written test పాస్ అయ్యారు. అయితే ఆయనకు అన్ని అర్హతలూ వున్నాయి. "గ్రూప్-1" లో సెలెక్ట్ అయ్యారు, అయితే కోర్టు కారణాల వల్ల జాప్యం అయ్యింది. 1970 లో తెనాలిలో ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్‌పెక్టర్ అయి, ఆయన మనస్తత్వానికి ఆ ఉద్యోగం నచ్చక రిజైన్ చేసి హైదరాబాద్ తిరిగివచ్చి Ag-M.Sc., చేసాడు. ఆ తర్వాత 1975 లో కోరమాండల్‌లో మంచి ఉద్యోగంలో చేరాడు. ఇవన్నీ మీకు తెలుసుకదా! వారి అక్క "సుధ" ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో M.Sc. చేసి, అక్కడే Ph.D. మూడేళ్ళు చేసి, పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి ఇండియాకు తిరిగి వచ్చి, బెంగుళూరులో రామయ్య కాలేజీలో మెడిసిన్ చేసింది! మళ్ళీ అమెరికా వెళ్ళి మెడిసిన్‌లో సైకియాట్రీ చేశారు. మరి వాళ్ళ పెద్దక్క వృద్ధాప్యంలోనైనా ఫైన్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు! వాళ్ళ కుటుంబమే మహామేధావులండి! మా చిన్నాన్న గారి జీన్స్ అలాంటివి! మా చిన్నాన్నకు "చదువు" అంటే మహాఇష్టం!

అన్ని బాషల్లోనూ మంచిపట్టు వుండేది సుభాష్‌కి. ధారాళంగా చాలా విషయాలు చెప్పేవాడు స్పిరిచ్యువాలిటీలోకి రాకమునుపే.. చాలా పుస్తకాలు చదివేవాడు కదా. ఏదైన ఒక విషయం చెప్పాలనుకుంటే, దాన్ని గురించి ధారాళంగా చక్కగా వివరించేవాడు. పత్రీజీ పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవాడు.

మారం : పత్రీజీ, వేణువినోద్ ఇద్దరూ ఫ్లూట్ వాయించడంలో నిష్ణాతులు కదా! మీరు వినేవారా వారిద్దరి ఫ్లూట్‍ని?

ఆనంద్‌సాగర్ : 1957-58 నుంచి వీళ్ళు బాగా గుర్తు. జాయింట్ ఫ్యామిలీ విధానంలో ఒకటి రెండేళ్ళు వాళ్ళు చదువుకుంటూ, హైదరాబాద్‌లో మా ఇంట్లో వున్నారు. ఆ తరువాత వాళ్ళ చదువుల గురించి సికింద్రాబాద్‌లో వుండేవారు.

హైదరాబాద్ విద్యానగర్ నుండి వేణు మరి సుభాష్ పత్రి ఇద్దరూ తెల్లవారుఝామున 4.30గం||లకు లేచి, సైకిల్‌పై సికింద్రాబాద్ వెళ్ళి శ్రీ T.R. మహాలింగం గారి శిష్యులైన "శ్రీ T.N. చంద్రశేఖరన్" గారి వద్దకు "ఫ్లూట్" నేర్చుకోవడానికి వెళ్ళేవారు సంవత్సరాల తరబడి, చాలా నిష్ఠగా! వీళ్ళద్దరూ కలిసి వేణువు వాయిస్తే చూడముచ్చటగా వుండేది!

"బుచ్చి" ఫ్లూట్ వాయిస్తే చాలా మధురంగా వుండేది! మేం కూడా ఒక గంటకు తక్కువగా వాయిస్తే ఒప్పుకునే వాళ్ళం కాదు. అప్పుడు మేమంతా అనేవాళ్ళం - "సుభాష్... కృషితో ప్రముఖ ఫ్లూట్ విద్వాంసుడు T.R. మహాలింగం గారి లాగానే లేక వారిని కూడా అధిగమించి పోతాడు" అని! పత్రీజీ ఫ్లూట్ చూసి అన్న వేణువినోద్ చాలా గర్వించేవాడు, గర్విస్తున్నాడు కూడా!

మారం : పత్రీజీపైన వారి అమ్మ సావిత్రమ్మ గారి ప్రభావం గురించి చెప్పండి!

ఆనంద్‌సాగర్ : వీరి కుటుంబ సంస్కారం చాలా గొప్పది. మా పిన్ని "సావిత్రమ్మ" గారు... ఆవిడ చాలా పొదుపు... ఉన్నదాంట్లో ఇల్లు చక్కబెట్టుకోవడంలో ఘనాపాటి! అది చాలా చిన్న ఇల్లయినా సరే.. ఉదయం నీట్‌గా అన్నీ మడత పెట్టుకోవడం, చక్కగా తీర్చిదిద్దు కోవడం... ఎంతో అద్భుతంగా వుండేది, వాళ్ళ ఇంటి వాతావరణం! అందరికీ అన్నీ బాగా నేర్పించేది. సుధ వాళ్ళమ్మను చూసి, అంత పొందికగా జీవించడం నేర్చుకుంది. ఆ దొడ్డఇల్లాలు "సావిత్రమ్మ" నిజంగా చాలా ప్రముఖపాత్ర వహించింది ఆ కుటుంబ సంరక్షణలో! ఎంతో ఒద్దికగా, ప్రోత్సాహకరంగా, పెంచింది అందరినీ! మా పిన్నిగారి సంస్కారం, వినయం పత్రిగారిలో మూర్తీభవించి వున్నాయి! పెద్దలపట్ల వినయం ఇప్పటికీ సుభాష్‌లో చూస్తాం! ఇదంతా ఆవిడిచ్చిన శిక్షణే!!

మారం : పత్రీజీ చిన్నాప్పుడు ఎల వుండేవారు? చిన్నతనంలో ఆధ్యాత్మికత వారికి పరిచయం వుండేదా?

ఆనంద్‌సాగర్ : మా తండ్రి గారు.. ఈ విషయాల్లో.. అంటే ఆధ్యాత్మిక విషయాల్లో చాలా శ్రద్ద చూపించేవారు. ఆయన R.M.P డాక్టర్‌గా జీవితంకాలం గడిపారు. ఆయనే జాయింట్ ఫ్యామిలీ హెడ్! ఆయన చక్కటి వక్త, మరి రచయత!1961 లో ఒక వేదాంతజ్ఞాన సమ్మేళనంలో పోటీపెడితే, స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలో అప్పుడు మా తండ్రి "స్థితప్రజ్ఞత" గురించి వ్రాశారు. ఆయనకు మొదటి బహుమతి వచ్చింది ఇండియా మొత్తం మీద!పత్రీజీ చిన్నప్పటీ నుంచి ప్రతి విషయంలోనూ మా తండ్రి గారి లాగే చాలా పట్టుదలగా, ఉత్సుకతగా వుండేవారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధగా వుండేవాడు. ఎక్కువ మౌనంగా వుండేవాడు!

1979లో అనుకుంటాను ఒక్కసారి "ఆకస్మిక పరిణామం" వచ్చిందాయనకి, ఒక "వాల్మీకి" కి వచ్చినట్లుగా! ఆయన కర్నూల్లో చాలా సంవత్సరాలు వున్నారు కదా; మేం కూడా నాలుగైదుసార్లు కర్నూలు వెళ్ళాం ఒక ఫ్యామిలీ విజిట్‌గా.

మారం : ఎలా వుండే వారాయన కర్నూల్లో?

శ్రీమతి ఊర్మిళ : డా|| న్యూటన్‌ను మేం కర్నూల్లోనే కలుసుకున్నాం. B.V. రెడ్డి గారిని పరిచయం చేశాడు సుభాష్ మాకు మేం కర్నూలు వెళ్ళినప్పుడు. మేం సుభాష్‌ను కలిసినప్పుడు కానీ, ఆయన మమ్మల్ని కలిసినప్పుడు కానీ ధ్యానం గురించే బాగా చెప్పేవాడు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం వుండేది. రోజుకు రెండు పుస్తకాలైనా చదివేవాడు! ఏదైనా మాట్లాడితే తాను చదివిన స్పిరిచ్యువల్ బుక్స్‌లోని విషయాలు మాతో చెప్పేవాడు.

మారం : మిమ్మల్ని మెడిటేషన్ చేయమని చెప్పేవాడా మేడమ్?

శ్రీమతి ఊర్మిళ : హైదరాబాద్ వచ్చినప్పుడు అస్తమానం మా ఇంటికి వచ్చి "మీరు ధ్యానం చేయండి. ఎప్పుడూ ‘పనులు’, ‘లోకాభిరాయణ’ మేనా?! మెడిటేషన్ చేయండి. ఇదిగో ఈ పుస్తకాలు చదవండి" అని మరీమరీ చెప్పేవారు. "టైమ్ వృధా చేయవద్దు" అని తాను బుక్స్ చదివి అండర్‌లైన్ చేసి, ఆ మ్యాటర్ మాకు వివరించేవారు! మెడిటేషన్ వల్ల వచ్చే లాభాలు బాగా వివరించేవారు! ఏవైనా సెషన్స్‌కి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం మామూలే! మగవాళ్ళు రాకపోయినా, మేము వెళ్ళేవాళ్ళం!

మేమనుకునే వాళ్ళం "ఈయన తప్పకుండా ఏదో ఒక గొప్ప మహానుభావుడవుతారు.. ఒక ‘సత్యసాయిబాబా’ లాగా" అని! ఆయన ఎప్పుడూ హడావిడి పడలేదు. క్రమంగా ఆయనలో చాలా మార్పు వచ్చింది. క్రమక్రమంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు ఆయన ఆధ్యాత్మిక ప్రచారంలో! రాను రాను వారి వార్తలు తెలిసేవి... "ఉద్యోగం మానేశారు" అని, "పిరమిడ్ కట్టిస్తున్నారు" అని, "పూర్తికాలం ఆధ్యాత్మికతలో మునిగిపోయారు" అని! రజనీష్ గురించి, పరమహంస యోగానంద గురించి చాలా ఎక్కువగా చెపుతూండేవారు మాకు! మేమూహించినట్లే చాలా గొప్పవాడయ్యాడు మా ‘బోధన్ బోధిసత్వుడు!’

మారం : పత్రి మేడమ్ గురించి మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? మీ స్వంత చెల్లెలు కదా ఆవిడ!

శ్రీమతి ఊర్మిళ : "సుభాష్ గారి ఆసక్తులు అన్నీ మారుతున్నాయి, వారి దారి పూర్తిగా వేరుగా అయిపోయింది".. అని స్పష్టంగా తెలిసినా, వారు ఉద్యోగం విరమణ చేసినప్పుడు మాత్రం వారి తల్లితరపు నుండి బంధుమిత్రులు, మేం అందరం చాలా బాధపడ్డాం. "ఏమిటీ ఈయన?! స్వర్ణ, పిల్లల పరిస్థితి ఏంటి?? ఇద్దరు ఆడపిల్లలు కదా" అని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. బాగా కోపం కూడా వచ్చింది మాకు. అయితే క్రమక్రమంగా మాకు అర్థమైంది: "అందరికీ ఇలా జీవించడం సాధ్యం కాదు, ఈయన ఒక మహానుభావుడు.. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చినవారు" ఆ కోణంలో చూడాలి అని!

ఎప్పుడూ ఒకటే ధ్యాన ధోరణిలో వుండేవారాయన! "ఎలా వున్నారు?" అని అడిగితే కూడా వారికి కోపం వచ్చేది! "‘ఎలా వున్నారు’ అని అడుగుతావేమిటి?" అనేవారు. ఒక ధోరణిలో వెళ్ళిపోయాడాయన. ఎంతసేపూ ఒకేమాట! అదే వేదం! అదే ధ్యాస! ధ్యానం! ధ్యానం! ధ్యానం! ఒక్కోసారి అనుకునేవాళ్ళం "ఈయనకేమన్నా పిచ్చెక్కిందా?" అని. కానీ "అందరి పిచ్చి వదిలించడానికి వచ్చారాయన" అని క్రమంగా మాకందరికీ అర్థమయింది!

మారం : మరి ఈయన ఈ ధోరణి పత్రీజీ తల్లిదండ్రులకి ఎలా అనిపించింది?

శ్రీమతి ఊర్మిళ : రమణారావు గారుఆయన ధోరణిలో ఆయన వుండేవారు. సావిత్రమ్మగారు మొదట్లో బాధపడ్డా, క్రమంగా చాలా చాలా సంతోషపడ్డారు. గర్వపడేవారు! ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ఒక యోగి తల్లిలా, ఒక గురుమాతగా అపూర్వ గౌరవం లభించేది. గురువుగారి తల్లిగా ఆమె ఎంతో ఆదరింపబడ్డది! చిన్నప్పటి నుండీ ఆమె పడిన ఘర్షణ, ఆమె పడ్డ తపన, కుటుంబాన్ని పెంచడంలో ఆమె ఓర్పు, సహనం, రమణారావు గారికి మానసిక తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆమె కుటుంబాన్ని కాపాడుకున్న వైనం.. ఇన్ని సంఘర్షణల అనంతరం ఆమె సంతానమంతా గొప్ప స్కాలర్స్ కావడం, పెద్దపెద్ద ఉద్యోగాలు చేయడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఆమెని ఎంతో ఆనందింపజేశాయి! ఇక పత్రీజీ పొందిన అపూర్వ ఆధ్యాత్మిక స్థాయికి ఆమె ఎంతగానో ఆనందించింది! ఒక గొప్ప "గురువు" తల్లిగా ఆమె ధన్యజీవి!

ఆనంద్‌సాగర్ : కొన్ని రోజులు పత్రీజీ "థీయోసాఫికల్ సొసైటీ"లో వుండేవారు. హనుమాన్ టేక్‌డీలో వుండేది ఆ సంస్థ సెంటర్ అప్పుడు. రామక్రిష్ణ మఠం కూడా ఎప్పుడూ వెళ్ళేవారాయన. రామక్రిష్ణ పరమహంస, వివేకానంద సాహిత్యం చాలా చదివాడాయన! ఇక భగవద్గీతను ఆయన అమూలాగ్రం చదివేశారు! పరమహంస యోగానంద పుస్తకం "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి" పుస్తకంలోని విషయాలు తరచూ చెప్పేవారు. ఇక "లోబ్‌సాంగ్ రాంపా" ఆయననెలా ఎంతగా ప్రభావితం చేశారో అందరికీ తెలిసిందే. మొత్తంమీద ఒక యాభై వేలకు పైగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేరాయన!! ఒక స్కాలర్, ఒక్ ప్రొఫెసర్, ఒక కౌన్సిలర్.. ఇలా చాలా చాలా గొప్ప గుణాలు వున్నాయి పత్రీజీలో! అందుకే అంత శరవేగంగా దూసుకొనిపోయారు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి.

మారం : మీ బంధువర్గమంతా ఆయన్ను గురించి ఏమనుకుంటారు?

ఆనంద్‌సాగర్ : ఒక విషయాన్ని గురించి ఎంతబాగా వివరించి చెప్పవచ్చో దానికంటే గొప్పగా ప్రజెంట్ చేయగలుగుతారు పత్రీజీ. ఆ సమర్థత వుందాయనలో. ఇంకొకటి.. సాటిలేని శారీరక ధారుడ్యం! ఎవ్వరికీ సామాన్యంగా అది సాధ్యం కాదు. మా బంధువర్గమంతా కలుసుకున్నప్పుడు మేం సుభాష్ గురించి చెప్పుకునే ముఖ్యవిషయం ఇదే. ఆ శారీరక బలం వల్లనే ఆయన ఇంతగా తిరుగుతున్నారు.. 365 రోజులు!

"గర్వం" అనేదానికి ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వరు. ఎడ్లబండిలో కూడా వెళ్ళగలడు ఆయన. సైకిల్‌గాని, మరేదైనా గానీ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏది అనుకూలంగా వుంటే దాంట్లో వెళ్తారాయన! ఆ కుటుంబ డబ్బుకిచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ!

ఆ స్థాయిలో వుండేవాళ్ళను ఎంతోమందిని చూస్తూ వుంటాం మనం, ఎంతో దర్పంగా వుంటారు! కానీ పత్రీజీ చాలా సామాన్యంగా ఉండేవాడు. అదీ ఆయన గొప్పతనం. అందుకే జనాలకు అంతదగ్గరగా ఉండగలుగుతున్నారు. ఎప్పుడూ తనని తాను అధికంగా ఫీల్ అవడు.

మారం : పత్రీజీని చూసినప్పుడు కొంతమంది "ఈయనకు కోపం ఎక్కువ" అంటారు. మరికొందరు "పెద్దలపట్ల, ఇతర గురువుల పట్ల ఈయన ఎంతో వినయంగా వుంటారు" అని ముక్కుమీద వ్రేలువేసుకుంటారు. కామెంట్ ప్లీజ్!

ఆనంద్‌సాగర్ : హఠాత్ పరిణామం వచ్చిందాయనికి, ఒక్కసారిగా! ఆయన చాలా బిజీగా వుండడం వల్ల 1990 తర్వాత నేరుగా మాకు సాంగత్యం తక్కువ. ఆయన ప్రపంచం మొత్తం తిరగడం వల్ల బంధువుల్లో కలవడం కూడా చాలా తక్కువ అయింది. అయితే ఆయన సహజస్వభావం ఏమంటే.. వినయం, సంస్కారం, అణకువ. ఈ రోజున కూడా వేణును చూస్తే ఆయన ఎంతగా గౌరవిస్తారో మీకందరికీ తెలుసుకదా. మామూల బాంధవ్యాల్లో కోపతాపాలు వుండవు. అంతర్ చైతన్యస్థితిలో అసంకల్పితంగా మాత్రమే ఆయన తన కోపాన్ని వ్యక్తం చేస్తారు. అది అసలు వ్యక్తి పద్ధతి. అవకతవకలుగా వుంటే ఆ ఆత్మకు అభివ్యక్తీకరించే క్రమశిక్షణాచర్య మాత్రమే అది.

మారం : "పత్రి" వంశవృక్షంలోని ఒక వ్యక్తిగా, ఒక కజిన్‌గా, ఒక కో-సన్‌ఇన్‌లాగా మీరు ఎలా ఫీలవుతారు ఇప్పుడు ఆయన పట్ల?!

ఆనంద్‌సాగర్ : ఇంటిపేరు, నామరూపాలు ముఖ్యం కాకపోయినా, "పత్రి" అనే మా ఇంటిపేరు ప్రపంచవ్యాప్తంగా ధ్రువతారలాగా మెరుస్తోంది సుభాష్ వల్ల! "సుభాష్ పత్రి" వల్ల కుటుంబానికి వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపు చూసి మేమందరం ఎంతైనా గర్వపడుతున్నాం. ఒక "గాంధీ", "నెహ్రూ" లాగా మా ఇంటిపేరు మార్మోగిపోయింది "పత్రీజీ" వల్ల దేశవిదేశాల్లో!!

మారం : మీకు ఆయనలో నచ్చని గుణం?

ఆనంద్‌సాగర్ : ఒకే ఒక్క విషయంలో.. ది మా బంధువర్గాల్లో పెళ్ళిళ్ళకు ఆయన దాదాపు హాజరుకావడం లేదు! మా మరదలు స్వర్ణ హాజరవుతూ వుంటుంది. మేమందరం చాల అసంతృప్తిగా ఫీలవుతాం ఈ విషయంలో. ఎందుకంటే, మామూలుగానే పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళలో పిల్లలను ఆశీర్వదించాలని కోరుకుంటాం. అలాంటిది "పత్రీజీ" ఒక గొప్పయోగి, ఆధ్యాత్మిక సుప్రసిద్ధ గురువు, "మా స్వంత వాడు" అని మురిసిపోతున్న మా దగ్గరి బంధువర్గమంతా కూడా "కనీసం పెళ్ళిళ్ళు లాంటి కార్యక్రమాలలో అయినా ఆయన తప్పకుండా పాల్గొనాలి" అని మా అభిలాష! ఆయన చాలా చాలా బిజీగా వుంటారు. ఒప్పుకుంటాను. కానీ పెళ్ళిళ్ళు చాలా ప్రత్యేక సందర్భాలు కదా! అలాగే "వేణువినోద్" అమెరికా నుండి వచ్చినప్పుడు "ఒక్క వారమైనా పూర్తిగా సుభాష్ వేణుతో గడిపితే బాగుంటుంది" అని నా కోరిక!

మారం శివప్రసాద్ : సర్! మీరు మీ చిన్నతనంలో షక్కర్‌నగర్ వెళ్ళేవారా? రమణారావు గారితో మీరెలా వుండేవారు?

ఆనంద్‌సాగర్ : చాలా సార్లు వెళ్ళానండి. ఐ వాజ్ ఫేవరేట్ ఆఫ్ మై అంకుల్ శ్రీ రమణరావు! నేను ఆయన కొడుకుల కంటే కూడా క్లోజ్‌గా వుండేవాడిని ఆయనతో! అక్కడ థియేటర్‌లలో రోజూ పౌరాణిక సినిమాలు చూసేవాళ్ళం. ఆయన, నేను ఒకే స్టూల్ మీద ప్లేట్స్ పెట్టుకుని భోంచేసేవాళ్ళం. ఒకసారి మా హాంకాంగ్ కజిన్ వచ్చినప్పుడు రమణారావు గార్కి ఒక రిస్ట్‌వాచీ తెచ్చి ఇచ్చాడు. నేను దాన్ని ఇమ్మని అడిగాను ఆయన్ను. "పోరా! నువ్వు కొనుక్కోపో, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా" అన్నారాయన. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఆ వాచీని నాకు ఇచ్చేశారు. అంత అనుబంధం వుండేది నాకు మా అంకుల్ తో!

మారం : పత్రీజీలో మీరు గమనించిన కొన్ని స్పెషాలిటీస్? మీరు వారి పట్ల ఇంప్రెస్ అయిన కొన్ని విషయాలు?

ఆనందసాగర్ : పత్రీజీ ఎక్స్‌ప్లనేటరీ కెపాసిటీ మార్వలెస్!ఆయన సంకల్పశక్తి, ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం అంతా కూడానూ సరస్వతీ కటాక్షం. అందరికీ వుంటాయి ఐడియాస్! కాని క్రమబద్ధంలో పెట్టి టకా టకా టకా linking తో వాటిని ప్రెజెంట్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసేవారు! 1986, 1987 లోనే గంటల తరబడి చెప్పేవారు. అలాగే ఫ్లూట్! విభిన్న రాగాలను ఒకదాని తర్వాత మరొకటి గంటల తరబడి వాయించేవారు. World class flute artist కావలసిన ప్రజ్ఞ అది!

మారం : వేణు వినోద్ గారి పట్ల పత్రీజీ ఎలా ప్రవర్తిస్తారు? పత్రీజీ పట్ల వేణుగారి ఒపీనియన్?

ఆనంద్‌సాగర్ : పత్రీజీ రెస్పెక్ట్స్ వేణువినోద్ ‌మచ్! తులసీదళం పుస్తకం కూడా "వేణువినోద్" కే అంకితం ఇచ్చారు కదా పత్రీజీ! అలాగే వేణు లైక్స్ పత్రీజీ మచ్! పత్రీజీకి "లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్" వచ్చినప్పుడు వేణు మా ఇంకో కో సన్‌ఇన్‌లాతో కలిసి వార్దా కూడా వచ్చారు. ఒకరిపట్ల మరొకరికి వున్న ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తుంది ఇది!

మారం : మేడమ్! మీకు తెలిసిన పత్రీజీ గురించి చెప్పండి! వారి పెళ్ళయిన క్రొత్తలో విషయాలు, ఆ తరువాత!

శ్రీమతి ఊర్మిళ : మా పెళ్ళి 1968 లో అయ్యింది. అప్పటికే మా అక్క మృదుల వేణువినోద్ గారి భార్య కావడం వల్ల పత్రీజీ మా ఇంటికి వస్తూ పోతూ వుండేవారు. మరిదిగా బాగా ఆప్యాయతతో వుండేవారు. మా ఇంటికి అస్తమానం వెళుతూ మా చెల్లెలు స్వర్ణతో ఫ్రెండ్‌షిప్ చేశారు. క్రమంగా అది ప్రేమగా మారి వాళ్ళిద్దరీ పెళ్ళి1974 లో "యాదగిరిగుట్ట"లో జరిగింది. ఆయన ఎప్పుడూ కామ్‌గా, క్వైట్‌గా వుండేవారు. తరుచుగా మా ఇంటికి వచ్చేవారు. బాగా కబుర్లు చక్కగా చెప్పేవారు. చాలా పుస్తకాలు చదివేవారు. పుస్తకం చేతిలో లేకుండా ఆయన్ను ఎప్పుడు చూడలేదు 1976 తర్వాత!

ఎవరి విషయాల్లో ఇంటర్‌ఫియర్ అవడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ చేసేవారు కాదు. ఆయనకు పెళ్ళయిన తరువాత కొంతకాలం వుద్యోగం లేదు. అయినా ఆయన ప్రశాంతంగానే వుండేవారు. తనకు వుద్యోగం లేదనీ కానీ, గడవడం కష్టంగా వున్నా కూడా ఎవ్వరికీ చెప్పేవారు కాదు. ఆ తర్వాత ఆయనకు కోరమాండల్ ఫర్టిలైజర్స్‌లో మంచి వుద్యోగం వచ్చింది. మొదటి హైదరాబాద్‌లో వుండి, కొన్నాళ్ళ తర్వాత కర్నూలు వెళ్ళిపోయారు. అక్కడికి రమ్మని మెడిటేషన్ చేయమని పిలిచేవారు. మావారు వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు నేను కర్నూలుకు వెళ్ళేదానిని, ధ్యానం చేసేదాన్ని. క్రమంగా ఆయన 1990 ప్రాంతాల్లో వుద్యోగం మానేయడం, పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయి కర్నూలులో పిరమిడ్ కట్టడం జరిగింది. క్రమక్రమంగా ఆయన పేరు , ప్రతిష్ఠ చాలా చాలా పెరిగాయి, మీ అందరికీ తెలుసు, ధ్యానానికీ, ధ్యాన ప్రచారానికీ ఆయన జీవితాన్ని ఎలా అంకితం చేసారో!

మారం : పత్రీజీ ఉద్యోగం మానేయకముందు, మానివేసిన తర్వాత స్వర్ణమాల గారి పరిస్థితి ఎలా వుండేది? ఆవిడ ఫీలింగ్స్ ఎలా వుండేవి? ఇద్దరు ఆడపిల్లలతో ఉద్యోగం మానివేసిన భర్తతో పత్రి మేడమ్ ఎలా నెగ్గుకొచ్చారు?

శ్రీమతి ఊర్మిళ : తను చాలా బాధపడింది కొన్నాళ్ళు... " ఉద్యోగం మానేస్తానంటున్నారు, ఎవరు చెప్పినా వినడం లేదు, ఇద్దరు ఆడపిల్లలు వున్నారు" అని. ఆయనలో మాత్రం ఏ చలనమూ లేదు. పైగా ఇంటికి పదిమందిని పిలిచేవారు. ఇంట్లో పప్పు, ఉప్పు వున్నాయా లేదా అని కూడా చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరినీ "భోంచేసి వెళ్ళాలి " అని చెప్పేవారు. ఆయనికి భోజనం పెట్టడమంటే మహా, మహా ఇష్టం! అయినా ఎలాంటి బాధలు పడిందో ఏమో, స్వర్ణ ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పేది కాదు. ఎప్పుడైనా అవసరమైతే చేబదులు తీసుకునేది అంతే. ఇక్కడికీ, కర్నూలుకూ వచ్చి వెళితే ప్రయాణానికీ, ఇతరాలకు ఎంతో డబ్బు అవసరం అయ్యేది, కానీ తానే ఎలాగో మ్యానేజ్ చేసుకునేది. ఎప్పుడూ భర్త పట్ల బాధను వ్యక్తం చేయడం కానీ, కంప్లయింట్ చేయడం కానీ చేయలేదు. అందరినీ ఆదరించి, అందరికీ వండిపెట్టేది. ఎంత ఇబ్బందులు పడినా, సర్దుకుని పోయింది. గెలుచుకుంది. పైగా అప్పుడప్పుడే "పిరమిడ్" కన్‌స్ట్రక్షన్ మొదలయ్యింది. ఆ నిర్మాణ అవసరాలు చాలా వుండేవి. ఎలా గడుపుకుందో పాపం!

మారం : ఇప్పుడు మీ చెల్లలు ను చూస్తే మీకేమనిపిస్తుంది?

శ్రీమతి ఊర్మిళ : She is Great! ఎంతో అదృష్టవంతురాలు. "పత్రీజీ చేసే పుణ్యం అంతా స్వర్ణకే చెందుతుంది" అనిపిస్తుంది. ఇంత బాగా ఆయన చేసే విశ్వసేవ వల్ల, ప్రపంచవ్యాప్తంగా పత్రీజీకి కలిగిన, కలుగుతున్న పేరు ప్రతిష్ఠల వల్ల మా చెల్లెలు స్వర్ణ నిజంగానే "స్వర్ణసింహాసనం" అధిరోహించిందని చెప్పవచ్చు! స్వర్ణ ఓర్పుకూ, సహనానికీ, ఎన్నో సంవత్సరాలు ఎంతో శ్రమించి జీవితపోరాటం చేసినదానికీ అంతకు లక్షరెట్లు లభించింది! చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ! చాలా గొప్పగా ఫీలవుతాం మేమంతా స్వర్ణ గురించి!

మారం : పత్రీజీ కుటుంబ సమీపబంధువుగా, ఒక మాస్టర్‌గా ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం?

శ్రీమతి ఊర్మిళ : మన భారతదేశం కర్మభూమి. తపోభూమి. ఎంతోమంది యోగులను ప్రసాదించిన ధన్యభూమి. ఈ భూమిపైన జన్మించిన "పత్రీజీ అనుసుయాయులు" మీరంతా కూడా, పత్రీజీ చేస్తున్న "ధ్యాన జగత్" కార్యక్రమంలో పాలుపంచుకుంటూ, ఆయన ఆశయాన్ని సఫలం చేస్తున్నారు! మీకు నా సందేశం అనవసరం!

మారం : మీ వదనంలో ఎంతో ప్రశాంతత వుంది! మీ గురించి ఇంకా చెప్పండి!

శ్రీమతి ఊర్మిళ : నేను గ్రాడ్యుయేట్ నండి. డిప్లొమా కూడా చేశాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడికి వినికిడి శక్తి, మాట్లాడే శక్తి తక్కువ. డెఫ్& డంబ్ వాళ్ళకి టీచర్‌గా 22 ఏళ్ళు చేశాను. వాళ్ళకు మాటలు నేర్పాను. సేవచేశాను చాలా తృప్తిగా. ఇప్పుడు ఇంటిపట్టున ఉంటూ, మా మనవడిని చూసుకుంటున్నాను.

నేనెప్పుడూ నా మనస్సును నిర్మలంగా వుంచుకుంటాను! పట్టువదలని విక్రమార్కుడిలాగా ధ్యానం చేస్తాను! మా చిన్నవాడికి ప్రాబ్లమ్ వున్నా, నేను, మావారు ఎంతో ప్రశాంతంగా వున్నాం!

"మనల్ని మనం ఉద్ధరించుకోవాలి" అని నేను మనస్పూర్తిగా విశ్వసించాను. దాన్నే పాటించాను. నా ముఖంలో అంత ప్రశాంతత కనిపించడానికి కారణం ఇదే! ధ్యాన మహిమ!

మారం : ఆనంద్‌సాగర్ గారూ! చివరిగా మీ సందేశం!

ఆనంద్‌సాగర్ : వచ్చేవి, పోయేవి మూడు... పేదరికం, వ్యాధి, డబ్బు; వచ్చిన తరువాత వదిలిపోనివి మూడు.. కీర్తి, జ్ఞానం, విద్య; పోతే రానివి మూడు.. కాలం, యవ్వనం, పరువు; వెంటవచ్చేవి మూడు.. నీడ, పాపం, పుణ్యం! భక్తిలో భక్తుడు భగవంతుడికి ఒక ప్రతిరూపం అవుతాడు! ధ్యానంలో యోగి స్వయంగా తానే దివ్యుడవుతాడు! మనిషి రాకెట్లు సృష్టించవచ్చు, మరేదైనా సృష్టించవచ్చు! భగవత్ సృష్టిలో మాత్రమే ప్రాణం వుంటుంది! అదే మనమంతా!

విద్య-జ్ఞానం-కీర్తి- ఈ మూడూ పత్రీజీకి వున్నాయి He is the combination of all these three!

Go to top