" ఆనందుడి లాంటివాడు "

A.V. సాయికుమార్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ

శ్రీ సాయికుమార్ రెడ్డి నిగర్వి సంతోషి. ఆనందయోగి. బ్రహ్మర్షి పత్రీజీకి అత్యంత సన్నిహితులైన మాస్టర్లలో ఒకరు. 1996నుండి పత్రీజీ సాహచర్యంలో వారికి "పర్సనల్ సెక్రటరీ"గా వుంటూ, ఉత్తరభారతంలో P.S.S.M. కార్యకలాపాలన్నీ చూస్తూ వుంటారు. "ధ్యాన జగత్" కార్యక్రమంలో భాగంగా దుబాయ్, ఇంగ్లాండ్, ఈజిప్ట్ లాంటి దేశాల్లో కూడా పత్రీజీ ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్‌లో ఒక ప్రముఖపాత్ర శ్రీ సాయికుమార్ రెడ్డి గారిది. పిరమిడ్ మాస్టర్లందరితో సన్నిహిత సంబంధాలు, చిరునవ్వుతో అందరితో కలిసి పోయేతత్వం, పత్రీజీ చుట్టూనే పరిభ్రమించే జీవితం ఆయనది. "స్పిరిచ్యువల్ ఇండియా" మ్యాగజైన్‌కి ఆయన సారధి. ఆ మ్యాగజైన్‌ను ప్రతి రెండు నెలలకు క్రమం తప్పకుండా ప్రపంచానికి అందించే వారిధి ఇంగ్లీషు స్పిరిచ్యువల్ బుక్స్ అమ్మడం, మరెన్నో ఇంగ్లీష్ బ్రోచర్స్ ప్రింట్ చేయించడం వారు చేస్తున్న ఇతర ముఖ్యమైన సేవలు.

బ్రహ్మర్షి పత్రీజీతో "శ్రీ సాయికుమార్ రెడ్డి గారిని నేను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను, సర్" అన్నప్పుడు "శ్రీ A.V.సాయికుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన నాకు ‘బుద్ధుని వద్ద ఆనందుడి లాంటివాడు’. ఆనందడు తాను బుద్ధుని సమీప సహచరుడిగా వుండబోయే ముందు రెండు ఆంక్షలు పెడతాడు. అలాగే నాకు సెక్రటరీగా తాను వుండాలనీ, తననెప్పుడూ వెళ్ళిపొమ్మని చెప్పకూడదనీ నాకు ఆంక్షలు విధించి నాతోపాటు నడుస్తున్న మహానుభావుడు!!" అన్నారు పత్రీజీ. బ్రహ్మర్షి యొక్క హావభావాలు, అలవాట్లు, విభిన్న ప్రకృతులు, అనంతజ్ఞాన సందేశాలు.. అతి దగ్గరగా చూసిన మాస్టర్ శ్రీ సాయికుమార్ రెడ్డి! మరి ఇంటర్వ్యూలోకి వెళదాం.. అవన్నీ తెలుసుకుందాం..!మారం :
శ్రీ సాయికుమార్ రెడ్డి గారు! పత్రీజీతో మీ తొలిపరిచయం ఎలా అయింది? మీరు మొట్టమొదటిసారిగా ధ్యానం ఎప్పుడు ఎవరి ద్వారా నేర్చుకున్నారు?

సాయికుమార్ : 1996 లో తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారి నేను "అన్నామలై" అనే పిరమిడ్ మాస్టర్ ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. అనామలైగారు తిరుపతిలో ధ్యానం క్లాసు జరుగుతూ వుంటే, నన్ను "కంచి రఘురామ్" గారి వద్దకు తీసుకెళ్ళారు. అలా నేను "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" లోకి రావడం జరిగింది.

ఆ తరువాత రెండూ నెలలకు అనుకుంటాను పత్రీజీని 1996 లో భీమాస్ హోటల్లో కలిసాను. ఆయనను మొదటిసారి కలిసినప్పుడు, "ఏమయ్యా! నువ్వు ధ్యానంలోకి రావడానికి కారణం ఏమిటి?" అని అడిగారు నన్ను. "నా కుటుంబ పరిస్థితి బాగాలేదు సర్! నేను చాలా దెబ్బతిన్నాను" అన్నాను. "పోతేపోయింది లేవయ్యా వెధవ డబ్బు! నువ్వు వచ్చేసెయ్!" అన్నారు సార్. అలా చెప్పిన మీదట క్రమంగా సెక్రటరీగా ఇమిడిపోయాను వారితో.

ఒక శిలను ‘శిల్పం’ గా మార్చారు పత్రీజీ. ఒక ఎండిపోతున్న చెట్టు మళ్ళీ చిగురించి పూతవేసి, కాయలు కాచి, మధురమైన మామిడి పళ్ళనిస్తోంది అంటే వారి సాహచర్య ఫలితమే! అలా అలా వారి సాహచర్యంలో పండిపోయిన నేను వారి "పర్సనల్ సెక్రటరీ" గా వుండగలగడం అంటే నేను నా జీవితోద్దేశ్యాన్ని పూర్తి చేసుకోవడమే!

మారం : మరి మీకు ఈ బుక్స్ అమ్మాలి అనే ప్రేరణ ఎలా వచ్చింది?

సాయికుమార్ : పత్రీజీని మొదటిసారి చూసినప్పుడు, మానసికంగా బాగా క్రుంగిపోయిన నాకు క్రొత్త ఉత్సాహం వచ్చింది. "నేను మళ్ళీ మామూలు మనిషిని కావచ్చు" అనిపించింది. పత్రిసార్ పరిచయం అయిన తర్వాత ఆయన పుస్తకాలు ఇచ్చేవారు చదవమని. ఆ తరువాత మనవాళ్ళలో కొందరు "పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?" అని చర్చించుకోవడం, దొరికిన కొన్ని పుస్తకాలు జిరాక్స్ తీసుకుంటే, అవి నీట్గా రాకపోవడం. "నేను అంతకుమునుపు పుస్తకాల వ్యాపారం చేసివున్నాను.. నేను ఆర్థికంగా కూడా స్థిమితంగా లేనుకదా! ఈ పుస్తకాలు తెచ్చి అమ్మితే ఎలా వుంటుంది?" అనుకున్నాను.

వెంటనే పత్రీజీని కలిసి అడిగాను "సర్! నాకు ఈ పుస్తకాలు అన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసు. అవి కొని తెచ్చి, మీ వెంట తిరుగుతూ ఈ పుస్తకాలు అమ్ముతాను" అన్నాను. వారు అంగీకరించారు వెంటనే!

ఆ రోజు నుంచీ ఈ రోజు వరకు నేను అంచలంచెలుగా ఇంగ్లీషు పుస్తకాలు అమ్ముతూ, పాంఫ్లెంట్స్ ప్రింట్ చేస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ పత్రీజీ పర్సనల్ సెక్రటరీగా నార్త్ ఇండియా అంతా తిరుగుతూ, ధ్యానం ప్రచారం చేస్తూ, నా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాను.

మారం : "యోగులు విలక్షణంగా వుంటారు" అని మనకు తెలిసిన విషయమే, మరి పత్రీజీ శైలి గురించి మీ అనుభవం?

సాయికుమార్ : పత్రిసార్‌ది అనితరసాధ్యమైన శైలి! జెన్ మాస్టర్స్ వద్ద గ్రేట్ అవేర్‌నెస్ వుంటుంది. జెన్ మాస్టర్స్ ఇన్‌డైరెక్టుగా చెపుతారు. గుర్జీఫ్ వున్నారు - ఆయన తన దగ్గరకు వచ్చిన వారిని వెంటనే స్వీకరించరు. చాలాసార్లు తిట్టి, వారి సహనాన్ని పరీక్షించి "సత్యాన్వేషణకు సరియైన వ్యక్తి అవునా? కాదా?" అని నిశ్చయించుకున్న తర్వాతనే వారిని అంగీకరిస్తారు. సూఫీ వ్యవస్థలో ఒక ఇమ్మెన్స్ పేషన్స్ వుంటుంది. ఇక ఒక శిష్యుడిని ఎంచుకోవడంలో మార్పా, మిలారెపాను ఎంతగా పరీక్షిస్తారో మనకు తెలుసు కదా.

పత్రిసార్లో వీరందరు గురువులు, మరెందరో మహనీయ పురుషులు, యోగుల మిళితమైన విలక్షణశైలిని మనం గమనించగలం. ఒక్కొక్క మాస్టర్తో ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తారు పత్రిసార్. ఒక మాస్టర్తో చాలా సహనంతో ప్రవర్తిస్తారు. ఒక్కొక్కరు అహంభావంతో వస్తారు. అయితే వారి గత జన్మల సంస్కారం, వారిలోని గొప్పతనాన్ని గుర్తించి, "ఇప్పుడు, ఈ వాసనల వల్ల వారిలా వున్నారు, వీరిని మోల్డ్ చేస్తే, గత సంస్కారాలు గుర్తుకువచ్చి ఫైన్‌ట్రాక్‌లోకి వస్తారు" అని వారిలో చక్కగా వారివారి స్టైల్‌లోనే డీల్‌చేసి, క్రమంగా ఎంతో ఓర్పుతో వారిని మోల్డ్ చేసి, తన ట్రాక్‌లోకి తీసుకుని వస్తారు. అంత అద్భుతనైపుణ్యం పత్రిసార్‌ది. బోధనలో కూడా అంతే!

మారం : పత్రీజీ నవరసాలనూ పండించగలరు. మీరు అబ్జర్వ్ చేసిన యాంగిల్స్?

సాయికుమార్ : భీభత్సంతో సహా అన్ని రసాలూ పండించగలరు ఆయన. ఒక తప్పు ఎవరైనా చేస్తే, ఆ పరిస్థితి ఇబ్బందికరంగా వుంటే కూడా, ఒక భీభత్సాన్ని సృష్టించి ఆ పరిస్థితిని తన కంట్రోల్‌లోకి తెచ్చుకోగలరు ఆయన. ఒక పాత్ర నుంచి మరొకపాత్రకు వెంటనే మారగలరు ఆయన. మళ్ళీ వెంటనే క్లాసు చెప్పాలంటే, పరమప్రశాంతంగా వెళ్ళి క్లాసు చెపుతారు ఆయన. అలాగే హ్యూమర్‌లోకి వెళ్ళి అంటే హాస్యంతో అందరినీ కడుపుబ్బ నవ్వించగలరు!

మామూలుగా మనం గమనించే ఒక సహజమైన మనిషి, భార్యతో బాగా గొడవపడ్డాడనుకోండి.. అతడు దాన్ని కొన్ని రోజులు, కొన్నిసార్లు కొన్ని వారాలు కూడా మనస్సులో పెట్టుకుని, భార్య వద్ద ప్రవర్తిస్తూ వుంటాడు. అలాంటివాడు ఒక క్లాసు చెపితే, స్టేజిమీదకు వచ్చాడంటే, అతడు ముఖవళికల్లో భార్యతో పోట్లాడిన వైనం, ఆ డిస్ట్రబెన్స్, చిరాకు అన్నీ అతడి ముఖంలో కొన్ని రోజులపాటు కనపడుతూ వుంటాయి. అదే పత్రిసార్ని గమనిస్తే... ఇలా తిడతారు, వెంటనే జోక్స్ వేస్తారు; ఆ వెంటనే ఎవరితోనైనా క్యాజువల్‌గా మాట్లాడతారు. మళ్ళీ ఎదుటివారి మాటల్లో ఏదైనా తేడా కనపడితే వారిని చీల్చి చెండాడుతారు! మళ్ళీ క్షణాల్లో వారితో చేయి కలిపి, స్టేజీమీదకు వెళ్ళి వారిని స్టేజిమీద ప్రక్కన కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, వారి మాటలు శ్రద్ధగా వింటారు. వెంటనే తనూ క్లాస్ చెపుతారు.

వెరసి, సమయానికి తగు మాటలు మాట్లాడతారు!

సమయానికి తగు నటన చేస్తారు!

సమయానికి తగినట్లుగా జీవిస్తారు!

మారం : ఇలా పత్రీజీ ప్రవర్తిస్తూంటారు, నటిస్తూంటారు, జీవిస్తూంటారు. చూసేవాళ్ళకు అర్థంకాక వాళ్ళు జుట్టు పీక్కుంటూంటారు!

సాయికుమార్ : ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం కంటే, మనను మనం అర్థం చేసుకోవడం మొదలుపెడితే, క్రమంగా ఎదుటిమనిషి అర్థవంతమవుతూ కనపడుతాడు. పత్రిసార్ చెసే "యాక్షన్స్" అన్నీ కూడా రకరకాలుగా వుంటాయి. నా మటుకు నేను ప్రతి విషయంలోనూ, ఎన్ని సంశయాలు వచ్చినా కూడా నన్ను నేను చెక్ చేసుకుంటూ ఆయనతో మూవ్ అవుతూ వుంటాను. ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఆయన ఆలోచనలు నాకు అర్థం అవుతూ వున్నాయి!

అలాగే ప్రతి మాస్టర్ కూడా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఒక షార్ట్ టర్మ ప్లాన్ పెట్టుకుని, దానికి అనువుగా ఎప్పటికిప్పుడు తనను తాను మార్పు చేసుకుంటూ పోతూ వుంటాడు. అలాగే పత్రీజీ కూడా ఎప్పటికప్పుడు తనను తాను మార్పుచేసుకుంటూ పోతూ వుంటారు. అందుకే ఆయన అంత సులభంగా అర్థం కారు.

మారం : 1997 నుంచి 2000 వరకు పత్రీజీ గురించి, 2001 నుంచి 2004"ధ్యానాంధ్రప్రదేశ్" పత్రీజీ గురించి, 2004 నుంచి 2008 "ధ్యానభారత్ ప్రాజెక్టు పత్రీజీ" గురించి మీరు వివరంగా చెప్పండి!

సాయికుమార్ : 1996 లో నేను మొదట ఆయనను కలుసుకుని, 1997 నుండి ఆయనతో తిరగడం ప్రారంభించాను. అప్పుడు ఆయన ఎలాంటి అంకితభావంతో వున్నారో, ఏదైతే తాను చేయాలకున్న ప్లాన్ వుందో, అప్పుడు ఎంత ఉత్సాహంగా వున్నారో, ఏదైతే ఇక నిర్దిష్టమైన అభిప్రాయం వుందో, ఇప్పటికీ అది వీసమంతకూడా తగ్గలేదు; మరింత ఇనుమడిస్తూ, మరింత విజృంభిస్తూ, శ్రమిస్తూ వున్నారాయన!

1997 లో తీసుకుంటే అప్పుడు మహాఅయితే రెండంకెలలోపె సెంటర్లు వుండేవి. ఫోన్ చేసి, "సాయికుమార్! ఈ రోజు మనకు నెల్లూరులో ఒక క్లాస్ దొరికిందయ్యా. తిరుపతిలో ఒక కొత్త క్లాసయ్యా" అని సంబరపడుతూ క్లాస్‌కి వెళ్ళేవారు, చెప్పిన క్లాస్ గురించి మళ్ళీ రాత్రి రివ్యూ చేస్తూ, ఎన్నో కొత్త కాన్స్‌ప్ట్స్ చెప్పేవారు. మరొకసారి "ధర్మవరంలో భలే విన్నారయ్యా క్లాసు" అని మురిసిపోయేవారు. 1997 నుండి 2000 వరకు అదొక అద్భుతమైన సమయం! ఎంతో లీజర్‌గా దొరికేవారు. ఆయన వున్నారంటే వందలకొద్దీ మాస్టర్స్ వెయిట్ చేసేవారు. ప్రతిరాత్రీ ఆయన నూతనంగా కనపడేవారు, సరికొత్త కాన్స్‌ప్ట్స్‌తో వచ్చేవారు అద్భుతంగా వుండేవి ఆయన అన్నీ కాన్స్‌ప్ట్స్. ఆ తరువాత కూడా 2001 నుండి 2004 వరకు కానీ, 2005 నుండి ఇప్పుడు 2008 లో కానీ ఆయన ప్రతిరోజూ ఉదయించే సూర్యుడు! ప్రతిరోజూ నూతనత్వంతో కనపడతారు పత్రీజీ. ప్రయాణ సాధనాలలో మార్పులు వున్నాయి. అప్పుడు ఎర్రబస్సుల్లో వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు సమయభావాల వల్ల విమానంలో తిరుగుతున్నారు అవసరరీత్యా. 1997లో అయినా, 2008లో అయినా.. నేను ఎరిగిన, నాకు తెలిసిన పిరమిడ్ ప్రపంచపు పత్రీజీ ఇంతే! ఇలాగే వున్నారు, ఇలాగే వుంటారు!

మారం : మరి ఇంత గొప్ప ప్ర్రణాళికలు ఎప్పటికిప్పుడు "ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్" సూచనల ప్రకారం ఆయన అమలు చేస్తూ వుంటారా లేకా ఆయనలోపల నుండి వచ్చే సంకల్పాలా?

సాయికుమార్ : ఖచ్చితంగా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ సూచనల ప్రకారమే ఆయన నడుస్తూ వుంటారు! దీనికి సందర్భంగా నాకు జరిగిన ఒక "Out of Body Experience" నేను చెపుతాను. ఒకసారి ధ్యానంలోని ఆ ఆస్ట్రల్ ట్రావెల్లో నేను వుండగా ఒక అహ్లాదకరమైన ప్రదేశంలో బుద్ధుడు కూర్చుని వున్నారు. పత్రీజీ ఆయన ప్రక్కనే వున్నారు. చుట్టూ అర్ధచంద్రాకారంలో ఎంతోమంది మాస్టర్లు కూర్చుని వున్నారు. బుద్ధుడు ఏదోచెపుతూ వున్నాడు. బుద్ధుడు చెప్పేది నాకు ఏమీ అర్థం కాలేదు. పత్రీజీతో సహా అందరూ చప్పట్లు కొడుతూ వున్నారు! నేను వెనకాల నిలుచుని అంతా చూస్తూ వున్నాను. 1999 లో జరిగిందిది. ఆ తర్వాత నాకు మెలుకువ వచ్చింది. మేము మహారాష్ట్రలోని సాంగ్లీ వెళ్ళాలి. పత్రిసార్‌ను లేపి నేను "సార్! సాంగ్లీ స్టేషన్ 15 నిమిషాల్లో వస్తుంది సార్" అన్నాను. సార్ నన్ను అడిగారు.. "రాత్రి ‘మీటింగ్’ ఎలా జరిగింది?" అని. ఆ ముందురోజు అసలు మాకు ఏ మీటింగ్ లేకుండా వుంది. మరి నాకు అర్థమయింది ఆయన అడిగింది రాత్రి జరిగిన నా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అని! జరిగిందంతా ఆయనకు చెప్పాను.

"మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు" అన్నాను. ఆయన నవ్వి" కంగ్రాట్యులేషన్స్..వెరీగుడ్, వెరీగుడ్" అన్నారు. ఇలాంటి సూచనలు నాకు చాలాసార్లు వచ్చాయి. "అదంతా Intergalactic Federation Meeting అయ్యా" అని చెప్పారాయన.

"హింసని మనం ముందు తీసివేయాలి" అని ఆయన చెపుతారు. "ఈ జైనులకీ, వైశ్యులకీ ధ్యానం బోధించడం చాలా సులవయ్యా! ఎందుకంటే వారు శాకాహారులు కనుక 50% రెడీ అయినట్లే. వారు ధ్యానంలోకి రావడం చాలా సులభం. అసలయిన సమస్య అంతా ఈ మాంసాహారులతోనే! వీళ్ళను మార్చగలిగినప్పుడే నేను ఈ భూమి మీదకు వచ్చిన కార్యక్రమం నెరవేరుతుంది" అంటారు ఆయన.

"ఈ భూమి యొక్క మానవాళి అంతా కూడా అన్ని జీవరాసులతో సహగమనం చేస్తూ జీవించాలి" అన్నారు" ఒకసారి "జంతువులను Zoo లో ఎందుకు పెడతారు సార్?" అంటే "వాటిని బందీ చేసి కాదు.. ఋష్యాశ్రమాల్లాగా అవీ, మనమూ కలిసి జీవించాలి. మనిషి ఎనర్జీలెవల్ అంతగా పెరగాలి. మన వైబ్రేషన్స్‌తో క్రూర జంతువులు కూడా మనతో సహచర్యం చేయగలగాలి" అన్నారాయన..

మారం : ఫోటాన్‌బ్యాండ్ కక్ష్య... 2012 డిసెంబరు 21... పత్రీజీ నుండి ఈ విషయాలలో ఎంతో క్లారిఫికేషన్ తీసుకునే వుంటారు మీరు!

సాయికుమార్ : మన చిన్నప్పుడు "హిందూ" పేపర్‌లో వెనుక పేపర్‌లో ఆధ్యాత్మికతను గురించి కొంత వ్రాసేవారు. ఇంకా మిగతా పేపర్లలో "భక్తి" గురించి వ్రాసేవారు.. అదీ పండగల సందర్భాల్లో 1987 తరువాత చూడండి.. -నా అనుభవంలో నేను చెపుతున్నాను.. 1987 నుండి ఆధ్యాత్మికత గురించిన చర్చలు ఎంతో పెరిగాయి. ముఖ్యంగా నైన్టీస్‌లో తెల్లావారుఝాము నుండె టీవీల్లో, రేడియోల్లో ఎన్నో ఛానెల్స్లో ఆధ్యాత్మికత ప్రసంగాలే ప్రసంగాలు! న్యూస్ పేపర్స్‌లో కూడా, వీక్లీస్‌లో, మాసపత్రికల్లో ఆధ్యాత్మికత లేకుండా ఏ పేపరూ, మ్యాగజైన్ కూడా వుండడం లేదు! 1997 నుండి ఇప్పటివరకు నేను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశమంతా ఒక ఇరవైసార్లు తిరిగివుంటాను.. ఎంతమార్పు అంటే ప్రతి కుటుంబంలో ఆధ్యాత్మికత గురించిన చింతనలు, చర్చలు వుంటున్నాయి! ఎన్నోచోట్ల గమనించాను నేను. ఇప్పుడు సినిమా ఛానళ్ళు ఎన్ని వుంటున్నాయో, స్పిరిచ్యువల్ ఛానెల్స్ కూడా అన్ని వుంటున్నాయి. ఏ మాస్టర్ నోటి వెంట విన్నా ధ్యానమే! ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా 2012వ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత గురించి చెపుతోంది. మనం చెప్పినంతగా చెప్తూండకపోవచ్చును. "ఎదో జరుగుతుందట, ఏదో అయిపోతుందట" అని ప్రతి ఒక ఆహ్యాత్మిక సంస్థలో చెప్పుకుంటూనే వున్నారు.

నేను మనకిద్దరికే ప్రక్కన ప్రక్కన వున పొలాల్లో గట్టు గురించి వాదులాడుకున్నామంటే, 2012 తరువాత మనకు ఒకరికొకరం "మనమెందుకన్నా గొడవలు చేసుకోవాలి? ఇద్దరం హ్యాపీగా వుందాం! నువ్వే తీసుకో ఈ స్థలం" అని పరస్పర మైత్రితో అందరూ వుండే కాలం వస్తుంది. అదే కదా సత్యయుగం అంటే!

శారీరక రుగ్మతలతోనూ, మానసిక రుగ్మతలతోనూ ధ్యానం చేయని వారు 2012 తరువాత ఇబ్బందిపడడం ఖాయం. ఈ స్థితుల నుండి మనవి మనం కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్.. ఒక రక్షకవచం.. ధ్యానం. ఒకరకంగా చెప్పాలంటే స్పేస్‌లో తిరగాలంటే ప్రత్యేకమైన స్పేస్ సూట్ వుండాలి. అలాగే మనచుట్టూ మనం ఎనర్జీతో కల్పించుకునే ఒక వైబ్రేషనే సర్కిల్ ధ్యానం. ఈ ధ్యాన కవచమే 2012 తరువాత అన్ని రుగ్మతల నుండి మనను కాపాడుతుంది. మనం ధ్యానం ద్వారనే Sustain చేసుకోగలం మనల్ని.

"ఈ భూకక్ష్యలో ఇంక గడ్డుపరిస్థితి కొనసాగటానికి వీలులేదు" అని Galactic Federation Masters అందరూ ఆలోచిస్తున్నప్పుడు సరియైన సమయంలో 1986 నుండి ఫోటో బ్యాండ్ యాక్సిస్ భూమి కక్ష్యపైకి రావడం జరిగింది. ఈ అద్భుత అవకాశాన్ని Galactic Masters అందరూ అద్భుతంగా ఈ Earth Planet సత్యయుగంగా మార్చడానికి అనువుగా వాడుకున్నారు. అందుకే మాస్టర్స్ అందరూ భూమిపైన Walk-in అవుతున్నారు. మన consiciousness లోకి వస్తున్నారు. ఎంతో మంది మాస్టర్స్ ఈ సమయంలో భూమిపైన జన్మించడానికి తహతహలాడి జన్మలు తీసుకున్నారు, తీసుకుంటున్నారు. అందుకే 1986 తరువాత పుట్టిన పిల్లల చాలా చాలాచురుగ్గానూ, మేధావులుగానూ, గొప్ప చదువులు చదివే వారిగానూ, గొప్ప క్రీడాకారులు గానూ, ఆత్మజ్ఞానులుగానూ వున్నారు. అద్భుతమైన నవయుగాన్ని మనకు చూపిస్తున్నారు. సత్యాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

ఒక లక్షా నలభై నాలుగు వేలమంది పిరమిడ్ మాస్టర్లు సత్యయుగ స్థాపనకోసం కృషి చేస్తున్నారని పత్రీజీ మనకు క్లియర్‌గా చెప్పారు కదా! గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాలక్రితం చూసిన భవిష్యత్ దర్శనం నిజానికి ఇదే!

మారం : పత్రీజీ సాంగత్యం కల్గిన తర్వాత మరెవ్వరి దగ్గరికీ పోవాలని కానీ, ఏ ఇతర యోగిని కలవాలనిగానీ అనిపించలేదు. అయితే అన్ని పుస్తకాలూ చదువుతూంటాను. "పత్రీజీ బోధనలు వింటేచాలు" అని నా అభిప్రాయం. కామెంట్ ప్లీజ్!

సాయికుమార్ : నాకూ అదే అనిపిస్తుంది, కరెక్టుగా మీలాగే! ఆల్‌రెడీ పొందిన అనుభూతులు మళ్ళీ తిరిగి అనుభవించాలని అనిపించవు! అనేక జన్మల్లో, అనేక గురువుల వద్దకు వెళ్ళి పొందిన అనుభూతులు మళ్ళీ మనకు రుచించవు. పత్రీజీ అన్నీ అధ్యాయనం చేసినవారు, అన్నీ చదివినవారు. అన్నీ అనుభూతి పొందినవారు; అన్నీ అందించిన వారు.

పత్రిసార్ థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళారు. అక్కడ స్టడీ చేసి, అందులో సారం తీసుకున్నారు. రామక్రిష్ణ మిషన్‌కు వెళ్ళారు. ఆ విధంగా ప్రతి సొసైటీలోని జ్ఞానసారాన్ని అధ్యయనం చేశారు. యాభై వేలకు పైగా ఆధ్యాత్మిక పుస్తకాలను చదివారు. చివరకి బుద్ధ ప్రబోధిత "ఆనాపానసతి" ని మూలంగా తీసుకుని, దానికి "పిరమిడ్ శక్తి" ని చేర్చి, తాను జన్మజన్మలుగా పొందిన, ఈ జన్మలో సేకరించిన, చదివిన జ్ఞానాన్నీ, తన అనుభవ జ్ఞానాన్నీ జోడించి "వడ్డించిన విస్తరి" గా ఈ ఆధ్యాత్మిక "బ్రహ్మజ్ఞానామృతం" అనే "సంజీవనీ విద్య" ని మనకు బోధిస్తున్నారు. తేనె రుచి చూసిన తర్వాత, అమృతపానం చేసిన తర్వాత ఇంకేది రుచిగా వుందదు కదా! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి వచ్చి ఎన్లైటెన్ అయిన మాస్టర్స్ మనమంతా ! అందుకే మరే ఇతరమైనదీ మనకు రుచించదు!

మారం : ఈ ఆధ్యాత్మిక పయనంలో పత్రీజీ వెంటవుంటూ మీరు తెలుసుకున్న సత్యం ఏమిటి? మీరు దాన్ని ఎలా అనుభూతి చెందుతున్నారు? ఫ్యూచర్లో ఎలా వుండాలి అనుకుంటున్నారు?

సాయికుమార్ : నాకు past, present, future అంతా పత్రీజీయే! రోజురోజుకూ వారి సాహచర్యం వల్ల నా అండర్‌స్టాండింగ్ లెవెల్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వుంది తదనుగుణంగా నా ఆత్మ ఎదుగుదల కూడా.

ఈ గొప్ప "మహత్ ధ్యానజగత్" కార్యక్రమంలో ఆయన చేసే "సర్వేజనా సుఖినోభవంతు" "వసుధైక కుటుంబం" అనే ఆ మహనీయుని వెంట గత12 సంవత్సరాలుగా నేను ఒక పాత్రని వారి "నార్త్ ఇండియా సెక్రటరీ" గా వుండడమే నా మహద్భాగ్యం!

1996, 1997 ప్రాంతాల్లో నాకు డబ్బు గురించి చాలా దిగులుగా వుండేది. అప్పటి నా ఆర్థక పరిస్థితి అలాంటిది.

ఒకరోజు పీలేరు పోవాలి, కారు అరేంజ్ చేయమని చెప్పారాయన. పీలేరు పోయిరావాలంటే డీజలుకే వందరూపాయలు కావాలి. ఈయనకు నా పరిస్థితి తెలిసి ఇలా చెబుతారేమిటి?" అని అనుకుంటూనే కారైతే మాట్లాడాను. ఒక వందరూపాయలుంటే డీజలకు సరిపోతుంది. కారు బాడుగకు పీలేరు వచ్చిన తరువాత చూడవచ్చు. మరి వందరూపాయలు ఎలాగా? "ప్రొద్దున ఆరు గంటలకే బయలుదేరాలి" అన్నాడు పత్రిసార్ అని ఆలోచిస్తూ పడుకున్నాను. రాత్రి 11.30 గంటలకు ఎవరో తలుపు తట్టారు. "ఎవరు?" అని అడిగితే, "సార్! నేను రాయచోటి దగ్గర పల్లె నుంచి వచ్చాను. తులసీదళం పుస్తకం కావాలి. అని అడిగాడు రూ|| 100/- ఇచ్చి పుస్తకం తీసుకున్నాడు.. ఆ వందరూపాయలు పెట్టి డీజలు వేయించాను కారుకి "సరే ఒక గండం గడించింది కదా" అని.

ఉదయమే కారులో పీలేరు బయలుదేరాం. కడుపులో సంకటమవుతోంది, తిరిగివచ్చిన తర్వాత కారు బాడుగ గురించి, ఇంట్లో అవసరాల గురించి. "ఏం అవస్థలురా బాబూ! ప్రొద్దున లేచిన తర్వాత కూరగాయల నుండి ప్రతిదానికీ వెదుకులాటే! ఎలారా బాబూ! ధ్యానం చేస్తే ‘ఏదో వచ్చేస్తది’ అని అందరూ చెపుతూ వుంటే ఇందులో దూరాం. ఏం వస్తుందో ఏం రాదో" అని ఆలోచిస్తూ వుంటే, కొంతదూరం వచ్చిన తర్వాత అడిగారు పత్రిసార్ - "నువ్వు ఎవరితో వుండాలనుకుంటున్నావు?" అని. నాకు అర్థంకాక తెల్లమొఖం వేశాను.

"నువ్వు దుర్యోధనుని ప్రక్కన వుంటావా? లేకపోతే కృష్ణుడి ప్రక్కన వుంటావా?" అని అడిగారు.

"కృష్ణుడి ప్రక్కనే వుంటాను సర్" అన్నాను. అరే! అది గుర్తుపెట్టుకో బాగా" అన్నారు. "సరే" అన్నాను. ఇంకా పత్రిసార్ అన్నారు- "నాకు నిన్ను రాజుల్లో చక్రవర్తిలా చూడాలని లేదు, యోగుల్లో చక్రవర్తిలాగా చూడాలని వుంది" అన్నారు "యోగివి కా అర్జునా" అని కృష్ణుడు అర్జునుడు అంత గొప్పవాడికి చెబితే, పత్రీజీ నన్ను "యోగులలో చక్రవర్తి" ని కమ్మంటున్నారు ఆధ్యాత్మిక చక్రవర్తి జీవించమంటున్నారు. ఇవి విని న కళ్ళలో నీళ్ళు, ఆనందభాష్పాలు! ఇంత గొప్ప భావనా నాపట్ల! ఆ రోజు నా జివితంలోనే తర్నింగ్ పాయింట్! ఎప్పటికీ మరచిపోను నేను ఈ పత్రీజీ భాష్యాన్ని! నా ఈ గుండెల్లో స్థిరంగా పదిలపరుచుకున్నాను ఈ సత్యాని!

నేను కట్టుకున్న బట్టలతోనే వచ్చేను ఈ సొసైటీలోకి! పదమూడేళ్ళ తర్వాత ఇప్పుడు నా పరిస్థితిలో పెద్దగా ఏమీ మార్పులేదు. "నా ఎండింగ్ ఆప్ ది డే ఏంటి సార్?" అడిగాను ఒకసారి ఆయన్ని నవ్వి వారన్నారు కదా "నీ ఎండింగ్ ఆఫ్ ది డే, బిగినింగ్ ఆఫ్ ది డే ఒకటిగానే వుండాలి. మైత్రిని సంపాదించుకో! గుడ్ విల్ మెయిన్‌టైన్ చెయ్యి!" అని చెప్పారు. అది నాకు చాలా ఇన్‌స్పిరేషన్.

వారి మార్గంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవ్వరికీ "రోటీ-కపడా-ఔర్ మకాన్" కు ఏమీ లోటుందదు. ‘అవసరాలు‘ అన్నీ తీరుతాయి. ‘కోరిక’ వుండకూడదు. అంతే!

మారం : మరి అవసరాలు ఏంటో వివరణ ఇస్తారా?

సాయికుమార్ : పత్రీజీయే ఇచ్చిన ఒక ఉదాహరణ చెపుతాను మీకు. "మారం శివప్రసాద్‌కు తిరువణ్ణామలై ధ్యానయజ్ఞం కోసం అయితే ఏం, ఇప్పుడు ధ్యానగ్రామీణం - 2010 ప్రాజెక్టుకోసం అయితే ఏం ఆయన టవేరా జీపు, ఇతర హంగులు అవసరం. అది ఆయనకు ‘అవసరం’ అదే నీకు నీ డ్యూటీస్‌కి అది ‘కోరిక’ అని చెప్పారాయన, ఇలా వుంటాయి మరి" అని..

ప్రతి మాస్టర్‌కి వారి వారి ‘అవసరాలు’ తీరుతుంటాయి. కోరికలు తీరకపోవచ్చు. పైన పత్రీజీ ఇచ్చిన వివరణ అర్థం అయినప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. ఒకరికి ‘అవసరం’ అయింది మరొకరికి ‘కోరిక’ అవుతుందని, అలాగే ఒకరికి ‘కోరిక’ అయింది మరొకరికి ‘అవసరం’ అవుతుందని!

మారం : సాయికుమార్ గారూ! మీరెప్పుడూ నవ్వుతూ, త్రుళ్ళుతూ ఆనందంగా వుంటారు. మీ విజయరహస్యమేమిటి! చాలా తక్కువమందే ఇలా వుంటారు!

సాయికుమార్ : నా విజయానికి కారణాల్లో మొదటిది సింపుల్ లివింగ్. అయితే విజయ రహస్యానికి అసలు ముఖ్యకారణం ఆచార్యసాంగత్యం. నెలలో ఇరవైరోజులు దాదాపు నాకు పత్రీజీ సాంగత్యం దొరుకుతుంది! పత్రిసార్‌ను ఏ ఇబ్బందిరాకుండా అన్నీ ఏర్పాట్లు చేసి స్టేజిపైన ఆయన కూర్చుని క్లాస్ చెప్పేట్లుగా నేను ప్లాన్ చేస్తూ వుంటాను, గతంలోనూ, ఇప్పుడు కూడా ఇత్తర భారతదేశంలోని ఎన్నో, మరి అన్ని స్థలాలలోనూ. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నిర్దిష్టమైన ప్రణాళికను నేను సిద్ధం చేసుకుంటాను.టికెట్లు కానీ, బస కానీ, ఆహారం కానీ, నాకిచ్చిన నార్త్ ఇండియన్ బెల్ట్స్‌లో నేను ప్లానింగ్‌తో రెడీ చేసుకుంటాను. ఏ ఇతర చికాకు ఆయన పడవలసిన అవసరం లేకుండా, స్టేజీమీద పత్రిసార్ తన పూర్తి ఎనర్జీస్‌ని ప్రెజెంట్ చేసేలా చూడటం నాకిష్టం, నా భాధ్యత. 2002 ప్రాంతంలో పత్రీజీ చెప్పారు: "2004 సంవత్సరానికి ధ్యానాంధ్రప్రదేశ్ పూర్తవుతూనే మన మాస్టర్స్ అంతాగుంపులు గుంపులుగా నార్త్ ఇండియాకు బయలుదేరుతారు. అంతవరకు మనం నార్త్ ఇండియాలో నాటిన జెండాలు వూడిపోకుండా నువ్వు చూసుకో" అన్నారు. పత్రీజీ చెప్పినట్లుగా 2004 వరకు నార్త్‌లో నేను తయారుచేసిన 150, 200 సెంటర్లు జారిపోకుండా, ఆ మాస్టర్స్‌నందరిని గమనించుకోవడం జరిగింది. 2005 నుండి మన "ధ్యానాంధ్రప్రదేశ్ మాస్టర్స్" వలసలు, వలసలుగా మిడిల్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియాలకు క్రమంగా వెళ్ళడం, మనం తయారుచేసిన మాస్టర్స్, మనం ప్రతిష్ట చేసిన సెంటర్స్ సహాయంతో ముమ్మరంగా ధ్యానప్రచారం నిర్వహిస్తూ వుండడం జరిగింది, జరుగుతోంది.

మరి నాకు ఇంత క్లియర్‌గా "నేనేం చేయాలి?" అని తెలిసి చేస్తున్నప్పుడు, "సమిష్ఠిలో ఒక భాగమే అంతా" అని తెలిసినప్పుడు, ఓపెన్ మైండ్ స్టేటస్ వుండడం వల్ల ఒక్కొక్క ప్రాజెక్టు రావడం, అలా దూసుకెళ్ళిపోవడం అంటే! ఇదే నా డ్యూటీ!

నాకు నా పట్ల "క్లియర్ క్లారిటీ" వుంది. "మారం సార్ ఏం చేస్తున్నాడు?" అనేది నా దృష్టి కాదు. "నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి" అన్నదే నా దృష్టి. నేను ‘వర్తమానం’ లో జీవిస్తూంటాను. ఇదే నా విజయరహస్యం! ఎప్పుడు ఆనందంగా వుండడానికి కారణం. "కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన" కృష్ణుడు చెప్పినట్లు కర్మచేయడం నా వంతు -ఫలితం పత్రీజీ వంతు!

మారం : పత్రీజీ ప్రెజెన్స్ ఎలా ఫీలవుతారు మీరు? ఆయనలో మీరు మిరాకిల్స్ ఏవైనా చూశారా లేక ఆయన చూపించారా?

సాయికుమార్ : ఒకసారి భోపాల్లో ఒక గెస్ట్‌హౌస్‌లో వున్నాం. అప్పటికి ఆయన సహచర్యం ఒక సంవత్సరం కూడా కాలేదు. సడన్‌గా లేచికూర్చుని "సాయికుమార్! మిరాకిల్ చూస్తావా?" అన్నాడు. నేను ఆశ్చర్యచకితుడనయి, కొంచెం సేపటికి తేరుకున్నాను.

"సార్! ‘మిరాకిల్స్’ అంటే మీరొక విభూదియో, వస్తువో చూపిస్తారేమో! అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్న నేనేంటి, మీలాంటి పరమగురువుతో తిరగడమేంటి?! ఇదే ఒక ‘మహామిరాకిల్’" అన్నాను. మరి ఆ ఒక్క సంవత్సరంలోనే ఆయన సాంగత్యం వల్ల ఈ ఆత్మ ఎదుగుదల ఎంతగా వుందో చూడండి! గత 13 సంవత్సరాలుగా ఆయన సాహచర్యం చాలా తరుచుగా, మరెవ్వరికీ లభించనన్ని ఎక్కువరోజులు నాకు దొరకడమే ఎక్కువ! ఆనందుడు బుద్ధుడితో ఎలా తిరిగాడో అలాగా, నాకు నేను ఇబ్బందులు కల్పించుకోకుండా, వారితో తిరగడమే నా జీవితంలోని మిరాకిల్స్‌లో మిరాకిల్! ఏకధాటిగా ఆయనతో ఇలా 13 సంవత్సరాలు తిరగడానికి ఎంతో గత జన్మల సంస్కారం వుంటేనే సాధ్యం!

మారం : మీరు ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్. కామెంట్ ప్లీజ్!

సాయికుమార్ : నేనొక ఎన్‌లైటెన్డ్ మాస్టర్‌ను! ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నాలో నన్ను ఎప్పటికప్పుడు ‘చెక్’ చేసుకుంటూ, నన్ను నేను సంస్కరించుకుంటూ నేను పొందుతున్న ఎదుగుదల వల్ల ఇంత ధీమాగా వుండగలుగుతున్నాను. దీనికి నాలుగు ఉదాహరణలు : 1. నేనెటువంటి పరిస్థితుల్లోనూ, ఎప్పుడూ హాయిగానే వున్నాను. 2. నాకెలాంటి సంశయాలు లేవు. 3. అందరిపట్ల మైత్రీభావం. 4. సదా "సర్వేజనా సుఖినోభవంతు" అని భావించడం, సంకల్పించడం!

మొన్న పత్రీజీ నెక్‌ల్లులో చెప్పారు: "మాస్టర్" అంటే "మనస్సు మీద ఆధిపత్యం సంపాదించిన వాడు" అని. 1999వ సంవత్సరంలో ఒకసారి పత్రీజీతో కలిసి వెంకటగిరి టూర్ బయలుదేరబోతున్నాను. బయటికి వచ్చి బయలుదేరబోతూ, ఎందుకో ఇంట్లోకి చూశాను. కిటికీలోంచి చూస్తే నా భార్య ఫ్యాన్‌కి‘ఉరి‘ వేసుకోవాలని చీర మెడచుట్టూ చుట్టుకోబోతోంది. నేను వెంటనే కిటికీ వద్దకు వెళ్ళి, "నువ్వు ‘ఉరి’ వేసుకోదలచుకుంటే మీవాళ్ళ వూరికి...కడపకు...వెళ్ళి వేసుకో! ఇప్పుడు నేను పత్రీజీతో కలిసి టూర్ వెళ్ళాలి" అని స్పాంటేనియస్‌గా చెప్పి పత్రీజీ వెంట వెళ్ళిపోయాను! దారిలో పత్రీజీతో ఈ విషయం చెప్పాను. ఆయన నవ్వి "ఏం కాదులే అన్నారు! సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే, అంతా ప్రశాంతంగా వుంది. ఏమీ లేదు. 1999 లోనే నేను అంత బాలెన్స్‌డ్‌గా వున్నాను.. పత్రీజీ సాహచర్యంలో. మరి ఇప్పుడు.. ఈ 2008 లో.. "ఎన్‌లైటెన్డ్ మాస్టర్ని నేను" అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను మరి!

మారం : "సాయికుమార్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను" అని పత్రీజీకి చెప్పినప్పుడు ఆయన- "ఆనందుడు బుద్ధుని వద్ద దీక్ష తీసుకునే ముందు అనేక షరతులు పెట్టి, ఆయన అంగీకరించిన తర్వాతనే, బుద్ధుని వద్ద చేరతాడు. అలాగే సాయికుమార్ కూడా ఒక షరతు పెట్టి సెక్రటరీగా నా దగ్గరికి వచ్చాడు. ఆ విధంగా నాకు ఆంక్షలు పెట్టగలగడం చాలా గొప్ప విషయం. దట్ ఈజ్ సాయికుమార్ రెడ్డి" అని చెప్పారు!

సాయికుమార్ : ఈ విషయం మీరు చెబుతూంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. "నేను ఆయన సెక్రెటరీగా వుండాలి" అని ఇష్టపూర్తిగా చేరాను. ఆయన అంగీకరించారు. 1999లో "పిరమిడ్ పార్టీ" పెట్టి "నువ్వు ప్రెసిడెంట్, నువ్వు సెక్రెటరీ" అని సీనియర్ మాస్టర్లకు పదువులు కేటాయిస్తూ, నా వైపు చూశారు పత్రీజీ. "సర్! మీ వద్ద పర్సనల్ సెక్రెటరీగా వుండడం కన్నా గొప్ప పదవి మరేమి నాకు అక్కరలేదు" అన్నాను. "ఓకే!" అని ఆయన అంగీకరించిన విషయం...నాకు ఇప్పటికి మళ్ళీ గుర్తుకు వస్తోంది!

ఎక్కడికైనా నేను వెళ్ళినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటూ "నేనూ పత్రీజీ పర్సనల్ సెక్రటరీని" అని చెప్పుకోవడం నాకు ఎంతో అధికారికంగానూ, ఆనందంగానూ వుంటుంది.

పత్రిసార్ దగ్గర గమనించుకోవలసిన ఒక గొప్ప విషయం ఏమంటే - ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు, ఆయనతో మాట్లాడాలని నా మనస్సులో వుండి కూడా, "ఏం ఫోన్ చెయ్యాల్లే" అని బద్ధకంగానో, లేక "ఆయన బిజీగా వున్నారేమోలే" అనుకుని వున్నప్పుడు ఆయనే ఫోన్ చేస్తారు!

పత్రీజీ వేరే దేశాలు వెళ్ళినప్పుడు, ఆయనే నాకు ఫోన్ చేస్తే నా భార్య నన్ను తిడుతుంది: "నువ్వేం శిష్యుడివయ్యా!? ‘పర్సనల్ సెక్రటరీ’ అంటావు. ఆయన నంబర్ తెలుసుకుని నువ్వు ఆయనకు ఫోన్ చేయాలా? లేక నీకు ఆయన ఫోన్ చేయాలా? అని! తన డిసైపుల్స్ అంటే ఆయనకున్న ప్రేమనూ, స్నేహాన్నీ వర్ణించడానికి మాటలు చాలవు!

అంతేకాదు, పత్రీజీకి నా పట్ల వున్న గొప్ప విశ్వాసానికి మరొక ఉదాహరణ చెపుతాను. ఒకసారి సార్ అమెరికాలో ధ్యానప్రచారం ముగించుకుని ముంబాయికి వచ్చారు. అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ కి రావాలి. అప్పుడాయన హైదరాబాద్‌లో ఉన్న నాకు ఫోన్ చేసి మరీ "సాయికుమార్! నువ్వు ముంబాయికి వచ్చి నన్ను హైదరాబాద్ తీసుకుపో" అని చెప్పారు. మరి ముంబాయి లో ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ మరి శ్రేయన్స్ ఉన్నారు. వాళ్ళంతా సార్ వెంటే వున్నారు. కానీ ఆయనకు నా మీద విశ్వాసం! నేనైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసి దగ్గరుండి మరీ తీసుకుని వెళ్తానని.. నా ప్లానింగ్ చక్కగా వుంటుందని. అందుకే మీరు నా గురించి అడిగినప్పుడు సార్ "ఆనందుడి"గా నన్ను గుర్తు చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు మీరు నాకు చెప్పి మహదానందం కలిగించారు మారం సార్!

మారం : ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా స్వంత ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా, ఆత్మస్థితిలో చాల బావుంటారు, ఆనందంగా వుండుగలుగుతారు. అందుకే మీరిలా ఆనందంగా వుండగలుగుతున్నారా?

సాయికుమార్ : "భవదరిద్రం వుండవచ్చు గాక, భావదారిద్ర్యం వుండకూడదయ్యా" అని చెప్పారొకసారి పత్రీజీ! భవంలో నాకు దారిద్ర్యం వుండవచ్చు గాక, భావాల్లో నాకు గొప్ప సంస్కారమార్గాన్ని చూపారు. నా భావాల్లో నేను గొప్పవాడినయ్యాను ఆయన సహచర్యంలో!

మారం : పిరమిడ్ మాస్టర్స్‌కు పనులు కేటాయించి అద్భుతంగా వారితో చేయించడంలో పత్రీజీ మహా మహా నిష్ణాతులు. దీని గురించి వివరించండి!

సాయికుమార్ : ఒక అద్భుతమైన మార్కెటింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ వున్నాయి పత్రిసార్‌లో. "ఆయన ఆ పనికి నిష్ణాతుడయ్యా" అని వారికి ఆ పనిని అప్పగిస్తారు. "ఎవరికి ఏ పని అప్పగించాలి?", "ఎవరితో ఎలా పనిచేయించుకోవాలి?"అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య! బయటకు కనిపించే మనుష్యుల మనస్తత్వం కాక, వారిలోపలి క్రియేటివిటీని గుర్తించి, వారికి కూడా తెలియని శక్తిని వారి నుండి నుండి బయటకు లాగి పనిచేయిస్తారు. ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠుడు, ఒక చాణక్యుడు, ఒక వ్యాసుడు.. వీళ్ళందరూ కలిపితే పత్ర్రీజీ! శిలను శిల్పంగా తయారుచేసి ప్రాణశక్తినిస్తారాయన! ఎంతోమంది మాస్టర్లను ఇలా ఆయన తయారు చేసారు, చేస్తున్నారు, చేస్తారు.

మారం : ఒక క్లాస్‌కు చాలామంది వచ్చినా, మరొక క్లాస్‌కు పదిమందే వచ్చినా కూడా పత్రీజీ హ్యాపీగానే వుంటారు. ఎవ్వరినీ ఏమీ అనరు. క్లాస్ చక్కగా ఏర్పాటు చేస్తే మంది తక్కువైనా ప్రశంసిస్తారు. దీన్ని వివరించండి సర్!

సాయికుమార్ : పత్రిసార్‌కు ఏర్పాటు చేసే క్లాసులు కొత్త ప్రదేశాల్లో ఒక్కోసారి ‘క్లిక్’ అవుతాయి. ఒక్కోసారి ‘క్లిక్’ అవవు. బ్రోచర్స్ వేసి, బ్యానర్లు కట్టి ఎంతో కృషి చేస్తే కూడా కొన్నిసార్లు పదిమంది కూడా రారు. మనం దిగులుగా: "సార్! నేను ఎంతో కృషి చేశాను. అయినా పదిమందే వచ్చారు" అంటే, "నువ్వు చేసిన పనిపట్ల, నీ కృషి పట్ల నువ్వు హ్యాపీగా వుండడం ముఖ్యం. ఎంతమంది వచ్చారని కాదు. నువ్వు క్లాస్ ఏర్పాటు చేసిన టైంలో వాళ్ళకేం పనులుండవా? నువ్వనుకున్నట్లే జనం రావాలా? నువ్వు బ్యానర్లు కట్టి, బ్రోచర్లు పంచినంత మాత్రాన అందరూ రావాలా? వారు పదిమంది వస్తే వాళ్ళఖర్మ. నువ్వు హ్యాపీగా వుండు" అంటారు.

అంతేకాదు ఆయా సందర్భాల్లో మనవి రిలాక్స్ కూడా చేస్తారాయన. "సాయికుమార్! నేను డిల్లీ అంతా చూశాను. కాబట్టి రూమ్‌లో పుస్తకం చదువుతూ వుంటాను. నువ్వు మారంకు, నిర్మలా మేడమ్‌కు, నాగలక్ష్మి మేడమ్‌కు, వేణుకు మెస్సేజి ఇవ్వవయ్యా. ఆ రాఘవరావును నాతో మాట్లాడమను. ఈ లోగా నువ్వు వెళ్ళి డిల్లీలో చూడని ప్రాంతాలు చూసిరా. ఎంజాయ్ చేసిరా. నేను రూమ్‌లోనే వుంటాను" అని నన్ను పంపించి, తాను ఫోన్లు మాట్లాడుతూ, పుస్తకాలు చదువుకుంటూ వుంటారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛకు అనువుగా మనం కూడా మరింత చక్కగా పనిచేసుకుని పోతూ వుంటాం. ఆయన దగ్గర స్వేచ్ఛ ఎంతుంటుందో, ఆయన పట్ల గౌరవం కూడా అంతే సహజంగా వుంటుంది. అలా మెయిన్‌టెన్ చేస్తారాయన!

మారం : పత్రిసార్ దేనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు? తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఎలా వుంటాయి ఆయన ఆలోచనలు?

సాయికుమార్ : పత్రిసార్ అంతిమ లక్ష్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. "కనపడిన మనిషికంతా ధ్యానం చెప్పాలి" అంతే, అదే ఆయన ధ్యేయం; ఆయనకు విసుగు లేనేలేదు! మనం లూథియానా వెళ్ళి ఒక క్లాస్ చెప్పి రావాలనుకుందాం. ఒక మామూలు మాస్టర్ ఎలా ఆలోచిస్తాడంటే, "లూథియానా ఎలా వెళ్ళాలి?" "ఎక్కడ దిగాలి? ఎవరిని కలవాలి? ఎక్కడ క్లాస్ చెప్పాలి?", "దీని కంతా డబ్బు ఎలా?.. అని రకరకాల ఆలోచనలు చేస్తాడు కదా! కానీ పత్రిసార్ వీటన్నిటికీ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేసి వేస్ట్ చేయకుండా, "లూథియానా వెళ్ళి క్లాస్ చెప్పాలి" అనే విషయం పట్ల మాత్రమే తమ ఎనర్జీని కేంద్రీకరిస్తారు. అలా చేస్తూ వుంటే మనం కూడా నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించగలం.

" క్షీరసాగర మధనం" జరిగి ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, కౌస్తుభమణి, లక్ష్మీ వచ్చినా కూడా, వీటిన్నిటినీ కాదని "అమృతాన్ని" మాత్రమే కోరుకున్నారాయన! అదే బ్రహ్మజ్ఞానం! అదే అంతిమ లక్ష్యం! ఆ సత్యాన్ని ఆయన క్షుణ్ణంగా ఎరుగును. అదే కావాలి ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి.

మారం : సాయికుమార్ రెడ్డి గారూ! పత్రీజీ వర్ఛస్సులో ఎప్పుడూ దివ్యకాంతి ప్రతిబింబిస్తూ వుంటుంది. "రాయల్ బెంగాల్ టైగర్" వంటి చురుకుదనం, "పంచకళ్యాణి గుర్రం" లాంటి వేగం వారి స్వంతం. సాధనలోని అత్యున్నత స్థానంలో "బ్రహ్మర్షి" తత్వానికి తోడు వారి "అటిట్యూడ్"లో ఎంతో విలక్షణత ఉంటుంది. ఎంతో గొప్ప మహర్షులు, స్వామీజీలు, బాబాలు కూడాఈ భౌతిక ప్రపంచంలో మసలుతున్నపుడు విభిన్న మనస్తత్వాల మనుష్యులతో అడ్జస్ట్ కాలేక కాస్త ఇబ్బంది పడటం, మనం చూస్తూంటాం. మరి ఇన్ని లక్షలమందితో అనునిత్యం మెలుగుతూ, కూడా బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేయగలగడం పత్రీజీ ప్రత్యేకత. దీన్ని గురించి మీ విశ్లేషణ?

సాయికుమార్ : పత్రిసార్ ఎప్పుడూ ఆనందంగా వుంటారు. ఎవరి విషయమైనా ఏదైనా నచ్చనట్లయితే, ముఖాన్నే కడిగేస్తారు, అంతే! దాచుకోవడం ఎప్పుడూ వుండదు పత్రిసార్ దగ్గర." ఎవరైనా మనకు నచ్చలేదు అంటే వారిని గురించి ఆలోచించడం ద్వారా చాలా ఎనర్జీ వృధా అవుతుంది" అని చెపుతారు. అవేర్‌నెస్ వున్నా, తాత్కాలికంగా అది లోపించి మనం బాధపడుతూ వుంటాం. ఆయన దగ్గర "లాస్ ఆఫ్ అవేర్‌నెస్" అస్సలు వుండదు. మస్తిష్కం లోంచి అవసరం లేని ప్రతి ఆలోచనని తుడిచేస్తారు. అంత ఉన్నతోన్నత ఎరుక! ఇది "ఛాయిస్ వరల్డ్." ఎవరెవరి ఇష్టాయిష్టాలు వారివి. ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుతూంటారు.

మారం : ప్రయాణాల్లో పత్రిసార్ ఎలా ప్రవర్తిస్తూంటారు? ఆయనకు నచ్చిన వారి పట్ల ఆయన ఎలా వుంటారు? ఏదైనా క్లాసు వుంటే అటెండ్ కావాలాన్నప్పుడు ప్రయాణం ఎలా సాగేది? కారు లేనప్పుడు మీ ప్రయాణాలు ఎలా వుండేవి?

సాయికుమార్ : 1996, 97,98 ప్రాంతాల్లో ఇన్ని హైటెక్ బస్సులు, ఇన్ని సౌకర్యాలు వుండేవి కావు. దగ్గరైతే స్కూటర్లో, మరి ఎర్రబస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళం లేదా రైల్లో స్లీపర్ క్లాసులో. ఆ రోజుల్లో స్లీపర్ క్లాసులో ప్రయాణం చేయడమే మాకు గగనం ఎందుకంటే థర్డ్ క్లాసు టికెట్టు కూడా తీసి ఇచ్చేవారు లేరు. ఇప్పుడంటే ఏసీలో, విమానంలో ప్రయాణం చేస్తున్నాం. రిజర్వేషన్ లేకుండా ఎన్నిసార్లు ప్రయాణం చేశామో మేం ఇద్దరం!

ఏదైనా క్లాసు ఫిక్స్ అయితే చాలు, "వెళ్ళిపోదాం పద" అనేవారు. వేసవిలో రిజర్వేషన్ లేకుండా ఆర్డినరీ కంపార్ట్‌మెంట్లో ఎన్నోసార్లు ప్రయాణం చేశాం నేను, సార్, మరి శివప్రసాద్. మావెంట పుస్తకాలు నింపిన పెద్ద టార్పాలిన్ సంచులు తీసుకెళ్ళే వాళ్ళం. ఆ సంచులను బాత్‌రూమ్ ప్రక్కన ఖాళీ జాగాలో పెడితే ఒక గంట నేను, మరొకగంట సార్ మా సంచులను గమనిస్తూ కూర్చూనేవాళ్ళం.

"నాకు ఇబ్బంది కలిగిందే" అని కానీ, ఇలా ప్రయాణించవలసి వచ్చిందే" అని కానీ కాకుండా, "ప్రకృతి నాకు ఈ అవకాశం ఇచ్చింది; మనం క్లాసుకు ఎలాగైనా వెళ్ళగలుగుతున్నాం; ప్రస్తుతానికి ఈ వసతి దొరికింది" అని ఎంతో కృతజ్ఞతతో సంతోషించేవారు పత్రీజీ. ఉదయానికి మేం వెళ్ళవలసిన ఊరికి వెళ్ళి, అక్కడి ఆర్గనైజర్స్‌తో "ఏమీ ఇబ్బంది లేదు మేడమ్, హాయిగా వచ్చేశాం" అని చెప్పి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని క్లాస్‌కి రెడీ అయిపోయేవారు.

ఒకసారి కర్నాటకలోని "తుమ్‌కూర్" లో బస్సు ఎక్కాం. బస్సులో నిలబడడానికి కూడా స్థలం లేదు. మళ్ళీ హోస్పేట్ ప్రయాణం. లవీనా మేడమ్. శ్రేయాన్స్ డాగా గారి సిస్టర్ హోస్పేట్ లో ఏర్పాటు చేసిన క్లాసుకు వెళుతున్నాం. మరి బస్సులో ఎవరికో పత్రీజీ కాలు తగిలింది. "ఏరా ముసలోడా! కళ్ళు కనిపించడం లేదా?" అని కసురుకున్నాడు కాలు తగిలిన అతను. అయినా చిరుమందహాసంతో మౌనంగానే వున్నారు పత్రీజీ! ఎంతో కూల్‌గా. నేను లవీనా మేడమ్‌ను కలిసినప్పుడు చెప్పాను "హారిబుల్ జర్నీ మేడమ్! ఎంత ఇబ్బంది పడ్డామో. కనీసం పత్రిసార్ సరిగ్గా నిలబడడానికి కూడా స్థలం లేదు" అని. కానీ పత్రిసార్ విని "అలాంటిదేం లేదు మేడమ్" అని చాలా తేలిగ్గా అనేసారు.

ఆ క్లాస్ కోసం హొస్పేట్‌లో ఉదయం 8గం||లకు దిగాం. వెంటనే ప్రెష్ అయి, స్నానం చేసి గంట కల్లా క్లాస్‌కు రెడీ అయ్యారు. ఇది ఆయన మహా స్థితప్రజ్ఞతకు ఒక ఉదాహరణ!

అదే ఇతరులైతే చిలవలు పలువలుగా వర్ణించి చెబుతారు తాము పడిన ఇబ్బందులన్నీ. కానీ పత్రిసార్ కరెక్ట్ చేస్తూంటారు ఆ మాటలను..-"నువ్వెలా వచ్చావు అనేది ముఖ్య విషయం కాదు. సమయానికి వచ్చి క్లాస్ తీసుకున్నావా లేదా, క్లాస్‌కు అటెండ్ అయ్యావా లేదా అది ముఖ్యం" అని.

ఏ విషయంలోనైనా ఎంత అవసరమో అంతే జాగ్రత్త తీసుకుంటారు. అవసరం లేని విషయాలను అస్సలు పట్టించుకోరు.

ఇంతేకాదు ఏదైనా క్లాస్‌కు ఎంతో శ్రమపడి వెళతాం. తీరా వెళ్ళిన తర్వాత ఆ క్లాస్ కాన్సిల్ అవుతుంది. అయినా ఆయన అంతే బ్యాలెన్స్‌డ్‌గా, పట్టనట్లు వుంటారు.

పత్రిసార్ ఒక జెన్ మాస్టర్ కథ చెపుతుంటారు. ఒక ఇంట్లో మేడపైన గదిలో కూర్చుని వుంటాడొక జెన్‌మాస్టర్. ఒక శిష్యుడు ఖంగారుగా వచ్చి, "గురువుగారూ! క్రింద వంటింట్లో నిప్పంటుకుని ఇల్లంతా అలుముకుంటోంది. మీరు కిటికీ లోంచి క్రిందికి దూకేయండి" అని. "నిప్పు వంటింట్లో కదా! అది నా వరకూ వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే!" అంటాడు ఎంతో కూల్‌గా ఆ జెన్‌మాస్టర్. అలా అని సీరియస్‌నెస్ వుండదని కాదు. అనవసరమైనప్పుడు ఎంతైనా కూల్‌గా వుంటారు, అవసరమైతే ఎంతో సీరియస్‌గా వుంటారు. ఎంత త్వరగా అయినా మూవ్ అవుతారు పత్రీజీ. "ఎప్పుడూ సత్యాన్ని పలుకుతూనే వుంటాను", ఎప్పుడూ ధ్యానం చెపుతూనే వుంటాను"-ఇదీ ఆయన ధ్యేయం! ఇరవైనాలుగు గంటలూ ఏదైనా పని చేద్దామనే ఊసే తప్ప ఇంకేమి వుండదు వారిలో!

లాంగ్ డిస్టెన్స్‌లో ఒక్కోసారి రిజర్వేషన్ దొరకదు. "రేపు వెళదామా సార్?" అంటే, "వద్దయ్యా! రేపటికి ఇంకేదో అడ్డం రావచ్చు, ఇవాళే వెళదాం" అని ఎంతశ్రమ అయినా, ఎంత దూరం అయినా, ఎంత క్రిక్కిరిసి వున్నా, రిజర్వేషన్ లేకున్నా ప్రయాణిస్తారు, తీరా అంతశ్రమపడి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఏదో ఒక కారణంవల్ల చివరిక్షణంలో కూడా ఆ క్లాస్ రద్దయిన సందర్భాలు వున్నాయి. "అవునయ్యా! సాయికుమార్! మనకు కూడా రెస్ట్ కావాలి కదా. ఈ రోజంతా రెస్ట్ తీసుకుందాం. ఫోన్ కలపవయ్యా" అని ప్రశాంతంగా పడుకుని మాస్టర్స్‌తో ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ, ఏదో ఒక స్పిరిచ్యువల్ బుక్ చదువుతూ, ఎవరైనా వుంటే వారితో మాట్లాడుతూ, అన్ని పనులు కూడా ఒకేసారి చేస్తూ సమయం గడుపుతారు.

మారం : కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఆయన్ని విమర్శిస్తూ వుంటారు. ఆ కామెంట్స్‌కి పత్రీజీ అంటారు కదా, "ఇవన్నీ అనవగాహనా విన్యాసాలు. ఎవరు ఏ స్థాయిలోని వారైతే.. వారివారి ఆత్మ ఎదుగుదల ఎంతైతే వుందో.. వారు ఆ స్థాయిలోనే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు"అని!

సాయికుమార్ : ఎంతో అద్భుతంగా చెప్తారు పత్రీజీ! "నా గురించి నా వెనుక ఎవరేం మాట్లాడినా నేను పట్టించుకోను. ఎవరు ఏ సందర్భంలో ఎందుకు అలా మాట్లాడారో ఎవరికి తెలుసు? నా ముందు మాట్లాడినప్పుడు మాత్రమే నేను దేనికైనా ఎలా స్పందించాలో అలాగే స్పందిస్తాను, ఎంతమేర స్పందించాలో అంతమేరకే స్పందిస్తాను" అంటారు. చాలా సందర్భాలలో ఎదుటికి ఎవరైనా వచ్చి దుర్భాషలాడినా, మరి నిందించినా కూడా అస్సలు సమాధానం చెప్పకుండా, ఓర్పుగా, మౌనంగా వుంటారు. ఇలా జీవించడమే నిజమైన యోగత్వం. ప్రతి చిన్న విషయానికీ అనవసరమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మనిషి వెతలపాలు అవుతూ వుంటాడు. "టేకిట్ ఈజీ" పాలసీ రావాలి ప్రతి ఒక్కరికీ! "ధ్యానం ద్వారా, ఎరుక ద్వారానే అని సాధ్యం" అంటారు పత్రీజీ.

మారం : ఎవ్వరినయిన దగ్గరికి తీసినట్లే వుంటారు, అంతే దూరం మెయిన్‌టైన్ చేస్తారు పత్రీజీ. ఎదుటివారు ధ్యాన ప్రచారానికి ఉపయోగపడతారు అన్నప్పుడు, తప్పనిసరి అయితే, ఎంతో వినయంగా వారితో మసలుతారు!

సాయికుమార్ : ఒక యోగికి ఎవరిపట్లా రాగద్వేషాలు వుండవు. "సమయానికి తగుమాటలు" అని అంటారు కదా త్యాగరాజస్వామి! పనికి తగినట్లుగా ఎవరితోనైనా మసలుతారు పత్రీజీ. నాతోనైనా, మీతోనైనా కూడా కబర్లు, జోక్స్ వేసుకున్నప్పుడు చిన్నపిల్లవాడి లాగా వుంటారు. కానీ అవసరమైనప్పుడు క్షణాల్లో సీరియస్‌గానూ మారిపోతారు. ఎవరినెక్కడ వుంచాలో అక్కడే వుంచుతారు. ఎవరివద్ద ఎంత వుండాలో అంతే వుంటారు. ఎవ్వరినీ "ఒరే" అని స్వప్నంలో కూడా అనరు! పేరుతో కానీ, "ఏమయ్యా" అని కానీ, "ఏం స్వామీ" అని కానీ చిన్న పిల్లవాడినైనా, పెద్దవాడినైనా పిలుస్తారు. పదిహేను సంవత్సరాల అమ్మాయిలను కూడా "మేడమ్" అని పిలుస్తారు.

పని చేయించుకున్నపుడు, సబ్జెక్ట్ చెప్పినపుడు ఏమాత్రం క్రూయల్‌గా వుండరు. "సాధకుడి పట్ల ‘కర్కశం’ గా వుండకూడదు. కానీ, ‘కనికరం’ లేకుండా వుండాలి" అని దాని అర్థం. ఒక సాధకుడి పట్ల సద్గురువు ‘కసి’ తో కాకుండా ‘కఠినం’ గా ప్రవర్తిస్తారు. అలాగే వుంటారు పత్రీజీ "కట్‌త్రోట్" గా! శ్రీ యుక్తేశ్వర్ గిరి యోగీశ్వరులు అలాగే వుండేవారు. అపారమైన ప్రేమ కానీ, అపారమైన కోపంగానీ లేకుండా ఎవరి ‘అహం’ను అయినా కొంత తృప్తి అయ్యేవరకు ఎదురు చూస్తారు. ఆ తర్వాత క్రమంగా వారి అహం అంతరించేవరకు వారిని తీర్చిదిద్దుతూనే వుంటారు. ఎంతటి భీభత్సం సృష్టించయినా సరే ఆ కార్యాన్ని పూర్తి చేస్తారు!

ఒకవేళ ఎవరికైనా ఏదైనా పెద్ద బాధ్యత అప్పచెప్పారు అనుకుందాం. వాళ్ళు కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో అది నిర్వహిస్తూ, అకస్మాత్తుగా ఆగిపోతారు ఏవేవో కొన్ని ప్రాపంచిక కారణాల వల్ల. అప్పుడు పత్రీజీ కోపగించుకోరు సరికదా, అందరితో చప్పట్లు కొట్టించి, అభినందించి మరీ సాగనంపుతారు. అది సత్యం కూడా!

"Act as per situation" అనే సిద్ధాంతాన్ని ఎంతో పర్‌ఫెక్టుగా పాటిస్తారు పత్రీజీ. అంతేకాకుండా క్షణాలలో ఆ "Situation" ని నవరసభరితం చేసి, అందరినీ ఆనందడోలికల్లో అలసరిస్తారు!

మారం: ఎంత ఆత్మీయులనైనా, ఎంత గొప్ప మాస్టర్నైనా అవసరమైతే ఖచ్చితంగా ప్రక్కన పెడతారు లేదా వెళ్ళిపొమ్మంటారు. దాన్ని గురించి ఏ కామెంట్ చేయరు. ఎవ్వరినీ ద్వేషించరు!

సాయికుమార్: ఎవరు ఎంత గొప్పవారయినా, తలపెట్టిన ఈ "ధ్యానప్రచారం" అనే "మహాయజ్ఞం"లో, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్‌లో ప్రత్యక్షం కానీ, పరోక్షంగా కానీ ఇబ్బందిపెడుతూ వున్నారని విశదమైతే వారు ఎటువంటి వారయినా వాళ్ళను నిర్మొహమాటంగా ప్రక్కనపెడతారు! అంతేకాదు ఆ చర్యని అస్సలు ప్రొలాంగ్ చేయరు. దాన్ని గురించి మళ్ళీ అసలు చర్చించరు. ఇవి కేవలం ఎవరికివారు అర్థం చేసుకోవలసిన విషయాలు. పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శసూత్రాలు ఎవరైతే పాటిస్తారో వారిని ఆయన ఆదరిస్తారు. ఆయన ఎవ్వరినీ తిట్టరు. ఎవరినీ ఇబ్బందికి గురిచెయ్యరు. ఎవ్వరినీ ఆయన ద్వేషించగా నేను ఎప్పుడూ చూడలేదు.

మారం : మీరొకసారి, మరి పత్రీజీ, రెండూచోట్ల కనబడ్డారు అని చెప్పారు. దాన్ని గురించి వివరించండి!

సాయికుమార్ : మొన్నామధ్య పత్రీజీ అహ్మదాబాద్‌లో ఒక స్కూలుకు వెళ్ళివచ్చినట్లు వాళ్ళు చెప్పారు. ఆ సమయంలో పత్రీజీ గ్యాంగ్‌టాక్‌లో వున్నారు. ఇలాంటి సంఘటన నా పట్ల కూడా జరిగింది. ఒకసారి ఒంగోలులో మన చీఫ్ ప్యాట్రన్, మరి "పిరమిడ్ టూర్స్& ట్రావెల్స్" కి ముఖ్యపోషకుడు శ్రీ సిద్ధా సూర్యప్రకాశరావు గారింటికి వెళ్ళాను. అక్కడ వారితో, వారి శ్రీమతి జయశ్రీ గారితో చాలాసేపు ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నాం. అప్పటికి రాత్రి దాదాపు ఎనిమిది గంటలైంది. అప్పుడు ఒంగోలులో 40 రోజుల ఇంటింటా ధ్యానం ప్రోగ్రాం జరుగుతూ వుంది. రోజూ రాత్రి 8 గం||లకు అయిపోతుంది ప్రోగ్రాం. అయినా సిద్ధా సూర్యప్రకాశరావు గారు క్లాస్ అయిపోయినా మన మాస్టర్స్ వుంటారు. "కాస్సేపు వుండివద్దాం" అని నన్ను తీసుకెళ్ళారు. అప్పటికి ఇంకా కొద్దిమంది వున్నారు వెళ్ళిపోకుండా. వారికి నన్ను పరిచయం చేసి, ఆలస్యంగా వచ్చాం మేం, అయితే, "సాయికుమార్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్. వీరు పత్రీజీ సెక్రెటరీ. చాలా విషయాలు చెబుతారు" అని నన్ను కూర్చోబెట్టారు. నేను దాదాపు గంటసేపు క్లాస్ చెప్పాను. ఒకాయన మాత్రం నన్ను తీక్షణంగా చూశాడు మిగిలివున్న వారిలో. సరే! క్లాస్ అయిపోయింది. అక్కడున్న కొంతమందికి షేక్‌హ్యాండ్ ఇచ్చాను నేను. అప్పుడు నన్ను తీక్షణంగా చూసిన వ్యక్తి నాతో "సార్! మీరు ఆలస్యంగా వచ్చారని చెబుతున్నారు. కానీ మీరు ఈ సాయంత్రం క్లాస్ మొదలుపెట్టినప్పటి నుంచీ నా ప్రక్కనే కూర్చుని వున్నారు. మీరూ మెడిటేషన్ చేశారు" అని చెప్పాడు. పత్రిసార్ సాహచర్యం వల్ల జరిగే అద్భుతాలివి. వీటినే మనం "మిరాకిల్స్" అంటాం.

మారం : మీరు, D.శివప్రసాద్.. ఇద్దరూ పత్రీజీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ చాలా క్లోజ్‌గా వారిని గమనించారు. పత్రీజీ గురించిన కొన్ని ముఖ్యవిషయాలు, వారు బోధించిన గొప్పసత్యాలు మనం చదవనివి, వినవివి ఏవైనా కొన్ని చెప్పండి!

సాయికుమార్ : ఒకసారి చెప్పారు పత్రీజీ "ఆధ్యాత్మిక పురోగతి పొందేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. ఇది పరమపద సోపానపదం- అదే వైకుంఠపాళి. ఇందులో నిచ్చెనలూ వుంటాయి. పాములూ వుంటాయి. 99వ గదిలో కూడా పెద్ద పాము వుంటుంది. జాగ్రత్తగా వుండకపోతే 99వ గదిలో జారిపడతావు. 98వ గదిలో జాగ్రత్తగా వుండి 99వగదిని దాటితేనే కర్మలు దగ్ధం అవుతాయి. ఆధ్యాత్మిక అహంకారం అనేది మనిషిని చాలా త్వరగా పడవేస్తుంది. స్పిరిచ్యువల్ ఇగోని అధిగమించడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జగ్రత్తగా, అప్రమత్తతతో ఉంటూ, పొగడ్తలకు పొంగకుండా, దేనికీ క్రుంగకుండా ఆధ్యాత్మిక పయనం సాగించగలిగినప్పుడే, ఈ పరమపద సోపానం పూర్తవుతుంది. ఒకప్పుడు నాతో ఎంతో సన్నిహితంగా వున్న ఒక మాస్టర్ సడన్‌గా దూరమయ్యాడు. ఆ మధ్య బాడీ వెకేట్ చేశాడు. నిన్నరాత్రి ఆ ‘సోల్’ నా వద్దకు వచ్చి, ‘తప్పు చేశాను’ అని పశ్చాత్తాపంతో తన విచారాన్ని వ్యక్తం చేసింది. మళ్ళీ ఆ తప్పును సరిదిద్దడానికి ఎంతోకాలం పట్టవచ్చు" అని చెప్పారు పత్రీజీ!

మారం : మనల్ని గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన ‘ఆరా’ పరిధి అనంతం. అందర్నీ ఆయన గమనిస్తూంటారు!

సాయికుమార్ : "నేనేమీ చేయను" అని అంటారు పత్రీజీ! అయితే ఆయన అన్నీ చేస్తారు. చాలాసార్లు చెప్పారు "99సార్లు నీ ప్రయత్నం నువ్వు చేయవయ్యా సాయికుమార్! 99ప్రయత్నాలు కుదరకపోతే 100వ సారి నా వద్దకురా" అని. ఎన్నోసార్లు అలా 99% నేను నా ప్రయత్నం చేసి విఫలమయినప్పుడు, 100వ సారి ఆయనే నా వద్దకు వచ్చేవారు. నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి. "మన గురించి మనం ఏం అనుకుంటున్నాం" అని ఆయనకు పూర్తిగా తెలుసు. ఒకసారి "ఏమయ్యా సాయికుమార్! నాకేమి తెలియదనుకుంటున్నావా?" అన్నారు.

"డాన్ జువాన్" టెక్నిక్ చాలా ఫాలో అవుతారు పత్రీజీ. కొందరికీ "బాగా ధ్యానం చేయాలి" అని చెబుతారు. మరి కొందరికి "నువ్వు గత జన్మల్లో చాలా సాధన చేశావు. ఇంక సాధన కాదు, బోధన చేయి. ఆర్గనైజేషన్ చేయి. టీమ్ తయారుచేయి. ఫలానాచోటు వెళ్ళి సెంటర్ ఏర్పాటు చేసిరా" అని ఇలాగ ఇలాగ. ఎన్నో ఎన్నో అనుభూతులు, విభూతులు పత్రీజీ సాహచర్యంలో! ఆయన అందర్నీ గమనిస్తూంటారు. ఎవరేం ఆలోచించినా పట్టించుకోరు. నోరు విప్పి మాట్లాడింది, అదీ ఎదురుగా మాట్లాడింది మాత్రమే పట్టించుకుంటారు.

మారం : పత్రీజీ సాంగత్యంలో ఆయన ప్రక్కన కాకుండ మీ ఇంట్లో వున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను వివరించండి!

సాయికుమార్ : ఒకసారి తిరుపతిలోనే పత్రీజీ భీమాస్ హోటల్లో వున్నారు. ఆయనను కలిసి ఆ తరువాత ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ నిద్రలో ఆ రోజు రాత్రి నా సూక్ష్మశరీరం విడుదలై, భీమాస్ హోటల్ వైపు వెళ్ళింది. అయితే భీమాస్ లోకి వెళ్ళలేకపోయింది నా సూక్ష్మశరీరం. భీమాస్ చుట్టుప్రక్కల అంతా కనపడుతోండి. ఒక్క భీమాస్ హోటల్ మాత్రం కనపడడం లేదు. ఆ ప్రదేశం అంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది! ఆ వెలుగులోకి నా సూక్ష్మశరీరం ప్రవేశించలేకపోయింది! మరునాడు ఉదయం లేచి, మళ్ళీ భీమాస్‌కు వెళ్ళినప్పుడు రిలాక్స్‌గా నవ్వుతూ అన్నారు పత్రీజీ-"సాయికుమార్! రాత్రి వచ్చి వెళ్ళావు కదా! అని.

మారం : మీరు పత్రీజీ పర్సనల్ సెక్రటరీ కదా! మీకు వారు ఎలాంటి సూచనలు ఇస్తూంటారు?

సాయికుమార్ : "నా కనుసైగలను పట్టి ఆలోచించాలయ్యా సాయికుమార్ నువ్వు! నా హావభావాలను గమనించి, నువ్వు నా పర్సనల్ సెక్రెటరీగా మూవ్ కావాలి. కనపడీ, కనపడనట్లుగా వుండాలి" అని చెప్పారు. "సీనియర్లెవరూ నా వద్దకు రావద్దు అవసరమైతే నేనే వస్తాను" అన్నారు. రోజు మనం చూసే పత్రిసార్ కదా. మనం కనపడీ కనపడనట్లే వుండాలి. షేక్‌హ్యాండ్ కోసం ఎగబడకూడదు. వేలాదిమంది వచ్చినప్పుడు జూనియర్ మాస్టర్లకు, క్రొత్తవారికి అవకాశం ఇవ్వాలి.

ఇక మీలాంటి, నాలాంటి వాళ్ళయితే ఆయన హావభావాలను, ప్రక్కన వున్నవారిని, గమనించి పత్రీజీ ఎవరితో ఎలా సంభాషిస్తున్నారో, ఎందుకు అలా సంభాషుస్తున్నారో అర్థం చేసుకుని, అవసరమైతే వారికి ప్రైవెసీ కల్పించి దూరం వెళ్ళిపోవాలి. దూరంగా కనబడీ కనపడనట్లుండి, అవసరమై పత్రీజీ మనవైపు చూస్తే దాన్ని గమనించి దగ్గరికి పోవాలి, ఇవన్నీ వారి నుండి క్రమక్రమంగా నేర్చుకుని నేను సుశిక్షితుడియ్యాను. అయితే ఎప్పటికప్పుడు వారి వద్ద నుండి నేర్చుకోవలసింది ఎంతో ఎంతో వుంటూనే వుంటుంది!

ఎవరైన ఏదైనా పని చేస్తూవుండి వచ్చి చెప్పితే, "ఆ చెయ్యవయ్యా!"అంటారు. వాళ్ళు చెయ్యలేక మళ్ళీ వచ్చి అడుగుతారు. అప్పుడు ఎలా బాగా చేయాలో చెపుతారు. "ముందే చెబితే, వాళ్ళేమీ నేర్చుకోరు కదా" అంటారు పత్రీజీ! ఆయనలో వున్న తీర్చిదిద్దే తత్వం, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ అపూర్వం, ఆనందకరం!

మారం : పదమూడుసంవత్సరాల నుంచీ వారి వెంట వుంటూ పత్రీజీ సాహచర్యంలో ఎంతో సాధించుకున్నారు మీరు!

సాయికుమార్ : "ఎంతో గొప్ప పనులు చేస్తున్నాను" అని ఎప్పుడూ నేను అనుకోను. "నా ధర్మాన్ని నేను ఫర్‌పెక్టుగా, పత్రీజీ పర్సనల్ సెక్రెటరీగా పూర్తి న్యాయం చేయగలిగాను" అని మాత్రం తృప్తిపడతాను. నా అర్హత కొద్దీ ఇవ్వబడిన ఈ బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. స్పిరిచ్యువల్ ఇండియా"మ్యాగజైన్ క్రమం తప్పకుండా తీసుకుని వస్తున్నాను. ఉత్తర భారతదేశంలో, మరి విదేశాల్లో కూడా, పత్రీజీ వేంట వుంటూ నేను నిర్వహించవలసిన బాధ్యతలను నేను నిర్వహిస్తున్నాను;

తిరువణ్ణామలై ధ్యానయజ్ఞాన్ని, "ధ్యానగ్రామీణ" ప్రాజెక్టుని మీకు అప్పగించారు. "నార్త్ ఇండియా టూర్ సెక్రటరీ", "పిరమిడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్" ఇలాంటి బాధ్యతలు నాకు అప్పజెప్పబడ్డాయి. ఎవరు ఏది ఎలా, ఎంత చక్కగా నిర్వహిస్తారో వారికి అప్పచెపుతారు పత్రిసార్.

మారం : ఎవరినైనా ఏ బాధ్యత నుంచైన తప్పించాలి అనుకున్నప్పు చాలా యుక్తియుక్తంగా ప్రవర్తిస్తారు పత్రీజీ!


సాయికుమార్ :
కరెక్ట్ సార్! అన్వాంటెడ్ థింగ్స్‌ని సున్నితంగా తప్పిస్తారు పత్రిసార్ ఎంతో చాకచక్యంగా, ఎంతో సందర్భోచితంగా కూడా. ఏదైనా పని ఎవరికైనా చెప్పినప్పుడు, ఇంకొకరు దాంట్లో జోక్యం చేసుకుంటే, సున్నితంగా "నీ కొద్దు లేవయ్యా ఈ పని. నువ్వు చేయవలసిన గొప్పపని ఇంకొకటి వుందిలే" అని తప్పిస్తారు ఎంతో చతురతతో. అలాగే ఎవరికైనా అప్పజెప్పబడిన బాధ్యతలో వారు కృతకృత్యులు కాలేనప్పుడు కూడా, వారికి వేరొక పని అప్పజెప్పి అక్కడి నుండి వారిని తప్పిస్తారు. ఇలా ఎన్నో, ఎన్నెన్నో అద్భుతాలు ! అనుభవాలు! ఆశ్చర్యాలు! హర్షాలు! పత్రిసార్ సాహచర్యంలో ఈ 13 సంవత్సరాలలో నేను పూర్తి ఆనందంతో వున్నాను. ఎంతో నేర్చుకున్నాను. ఎంతో పొందాను! I am the most lucky Master!

A.Vసాయికుమార్

Go to top