" అందిరిపైనా ఆయన వ్యక్తిగతంగా చూపించే శ్రద్ద చాలా అద్భుతంగా వుంటుంది! "

 

నా పేరు గుణాకరరెడ్డి, నాది అనంతపురం.

చిన్ననాటి ముచ్చట్లు చెప్పు కోవాలంటే... మామూలు కథలకంటే రామాయణ, మహాభారత, భాగవత కథలు వినటం, చదవటం ఇష్టం; "చందమామ" మాసపత్రికలో అలాంటి కథలే ముందు చదివి మిగతావి తర్వాత చదివేవాడిని. పుట్టుకతో హిందువునయినా, క్రిస్టియానిటీ అన్నా చాలా ఇష్టం. "అందరూ మహానుభావులే" అనిపించినా, జీసస్ నా ఫేవరేట్ హీరో!

"ఏదోరకంగా జీసస్ కనిపిస్తే బాగుండు" అనిపించేది. వయస్సు పెరిగి ఇంజనీరింగ్ చదువు అయిపోయి, జీవనభృతి కోసం వెదికే రోజుల్లో కూడా, "ఆధ్యాత్మిక విషయాలు మరింత వివరంగా చెప్పే మహనీయులు ఎక్కడ వుంటారో" అని వెదుకులాడేవాడిని. ఆ రోజుల్లోనే...సరిగ్గా 15 సంవత్సరాల క్రితం..పత్రిసార్‌ను కలిసాను.

అవి 1992-93-94 సంవత్సరాలు! అనంతపురంలో మాది చిన్న గ్రూప్. పత్రిసార్ ప్రతి ఆదివారం, సోమవారం పూర్తిగా మాకే సమయం కేటాయించేవారు!

పిరమిడ్ ధ్యానకేంద్రాలు మొదలైన క్రొత్తల్లో కాబట్టి.... పత్ర్రిసార్ ధ్యాన ప్రచారంకోసం పూర్తిగా తన జీవితం అంకితం చేసిన తొలిరోజులు కాబట్టి...

ఎన్నిజన్మల జ్ఞాన దాహార్తితోనో మేమంతా ఎదురుచూస్తున్న ఆఖరిరోజులు కాబట్టి...

మాలాంటి ఎన్నో జీవితాల సుదీర్ఘ అజ్ఞాన నిశాతిమిరం అంతరించే శుభోదయాలు కాబట్టి...

ఆయన గారితో ఎక్కువ సమయం గడిపే మహాభాగ్యం మాకు ఎక్కువగా కలిగింది!

"పత్రిసార్ కర్నూలులో ఒక కొత్త కాన్సెఫ్ట్ చెప్పారట!".. "ఈ ఆదివారం పత్రిసార్ మనకు ఇంకోకొత్త కాన్సెప్ట్ చెప్తారంట!"

ఇలాంటి స్టేట్‌మెంట్స్ విని ఎన్ని ఆనందోద్వేగాలకు లోనయ్యేవాళ్ళమో.. ఎంత దహించే ఉత్కంఠతో "ఆదివారం"

కోసం ఎదురుచూసే వాళ్ళమో...!

"కాన్స్‌ప్ట్" అంటే ఒకానొక ఏదేని మర్మగర్భితమైన భావలహరి. "పత్రిసార్ కాన్స్‌ప్ట్" అంటే ఒకానొక విశేష ఆధ్యాత్మిక అవగాహన. "తప్పుడు అభిప్రాయాలు" అనే పిచ్చుకపై ఒక జ్ఞాన బ్రహ్మాస్త్రం!

పత్రిసార్ కాన్స్‌ప్ట్ చెప్పే విధానం ఎలా ఉండేదంటే... ఒక ప్రశ్న వేసేవారు, మనందరికీ జీవితాల్లో ఎదురయ్యే మేళిక ప్రశ్నలాగా... విన్న తర్వాత దానికి సరియైన సమాధానం దొరికితే "అందరి జీవితాలు ధన్యమవుతాయి" అనిపించేంతలా... చప్పట్లు!

మేము..రకరకాలుగా మాకు తోచిన మూర్ఖ సమాధానాలు చెప్పేవాళ్ళం. అప్పుడు ఆయన అనితర సాధ్య విశ్లేషణ ఎలా వుండేదంటే...

....అన్నింటికీ విరుద్ధంగా "ఇదే సత్యం" అనిపించేలా...

...."మొత్తం లోకానికి ఈ ‘సత్యం’ చాటి చెప్పాలి" అని నిర్ణయించుకునేలా...

..."ఇంతవరకు మనకు ఎందుకు తట్టలేదీ సమాధానం?" అని ఈర్ష్య పడేలా -"ఈయన సహచర్యం మాకే దొరికింది" అని గర్వపడేలా....

దటీజ్ పత్రీజీ...

ఒకసారి క్లాసులో "బుద్ధుడంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఎవరైనా చూశారా?" అని సార్ అడిగారు. అందరం చిన్నప్పటి నుంచి బుద్ధుని గురించి చదివినవీ, గురువుల ద్వారా విన్నవీ రకరకాల సమాధానాలు చెప్పాం. అన్నీ విని సార్ ఒక చిరునవ్వు నవ్వారు!! "బుద్ధుడి గురించి వివరించడానికి ఎక్కడా వెతకక్కరలేదు, ఎవరికి వాళ్ళే బుద్ధుళ్ళు!! ఒకప్పుడు బుద్ధుడు కూడా మనలాగే సామాన్యంగా ఉండేవాడు... ఏది దొరికితే అది మహదానంగా తినేవాడు... ప్రతి మనిషికీ ధ్యానం నేర్పడానికి తహతహ లాడేవాడు. కాలికి బలపం కట్టుకుని మనలాగే మానవాళిని ఉద్ధరించాలనితిరిగేవాడు! అసలు ఇంకే బుద్ధుని గురించో ఎందుకు వెతుకుతావు? నువ్వే ఒక బుద్ధునివి, నీకూ ఆ బుద్ధుడికీ ఎన్ని పోలికలున్నాయో చూడూ!!" అన్నారు. ఇక హాలంతా ఒకటే చప్పట్లు! ఇలాంటి ఎన్నో మార్గదర్శకాలు, మన జీవిత గమ్యాలను మార్చేసేంతలా!!

దటీజ్ పత్రీజీ!

ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురుపడితే "నమస్తే సార్! అని చేయి పైకెత్తడం అందరికీ అలవాటు.

పత్రిసార్ ఎదురైనప్పుడు కూడా అలా చేస్తే... "చేతికేమైనా రోగమా...? అని అరిచేవారు!

"అందరూ ఆత్మస్వరూపులే... అందరూ సమానమే" అన్న సత్యం ఆయన మాటల్లోనే కాదు... చేతల్లో కూడా ఎక్కువగా చూపించేవారు!

అదే భావన.. కాన్స్‌ప్ట్.. అందరిలో! సత్వరంగా ఎదగడానికి అదో అద్భుత శిక్షణ.

ఎవరైన ఖాళీ చేతుల్తో ఎదురొస్తే అంతే సంగతులు. " ఆ ఖాళీ చేతులేంటి దరిద్రంగా... చేతులకు ఆభరణం ‘బంగారం’ కాదు ‘పుస్తకం’.. " పుస్తకం హస్తభూషణం! పుస్తకం లేకుండా ఖాళీ చేతుల్తో ఎవ్వరూ కనిపించడానికి వీల్లేదు " అని తెగేసి చెప్పేవారు. దటీజ్ పత్రీజీ!

అనేక వేల ఉద్గ్రంధాలు చదివి అందులో ఉన్న " జన్మలు తరింపజేసే జ్ఞానరసానందాన్ని" జాతి, మత, లింగ వయోబేధాలు లేకుండా ప్రపంచం మొత్తం పంచాలన్న తపన, వేదన ఆయన ప్రతి అరుపులోనూ కనిపించేది! ఇది అందరిమీదా ఆయనకున్న అపరిమితమైన ప్రేమ కు నిదర్శనం! పొరపాటున " నేను ‘నన్-వెజిటేరియన్’ ని " అని ఎవరైనా అంటే చాలు... చండప్రచండుడిలా మాటల తూటాలతో చీల్చి చెండాడేవారు! దటీజ్ పత్రీజీ!

యోగులు సకల జీవరాశి యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటారు; అనుభవిస్తారు. అందుకు కారణమయ్యే వ్యక్తుల అజ్ఞానాన్ని పారద్రోలడానికి అనుక్షణం ప్రయత్నిస్తారు.

వెలుగేలేని ఎందరి చీకటి జీవితాల్లోనో శుభోదయాన్ని పూయిస్తారు. అందుకు అరుస్తారు, అనేక రకాల ప్రయత్నిస్తారు; కరుస్తారు! కరుణిస్తారు!

అన్నీ చేసి వారు అందుకోవాలనుకునే బహుమతి... అందరిలో ‘మార్పు’! మృగత్వం నుండి మానవత వైపు చేర్చే ‘నేర్పు’!

వేలాది పిరమిడ్ మాస్టర్లకు పత్రిసార్ మూల ఆధారం!

ఆయన మార్గదర్శకత్వంలో మేమూ మాస్టర్లమయ్యాం!

మేం కూడా అందరినీ మాస్టర్స్‌గా చేసే ఆధ్యాత్మిక ఉద్యమకారులం!

అన్ని విషయాలూ అమితాసక్తిగా విన్నా కూడా "థర్డ్ ఐ" కి సంబంధించిన విషయాలు రాగానే నాకు ఆవేశం, ఆనందం రెండూ పెనవేసుకుని మరీ వచ్చేవి. నా ఆసక్తిని గమనించి ఆయన కూడా నాకా విషయాలు పదేపదే చెప్పేవారు. నాకు నోరు వూరివూరి "ఏమయినా సరే ఎలాగయినా సరే... ఈ రోజు నా మూడవకన్ను తెరచి ఎవరో ఒక మహాత్ముడిని చూడాల్సిందే" అనుకున్నాను.

అలా అనుకోవడం పూర్తయింది అంతే. కరెక్టుగా ఆ సమయంలోనే ఆయన మాలోని మరోవ్యక్తితో మాట్లాడుతూ "ఎవరికయినా సరే ఏ కోరిక అయినా మనసా, వాచా, కర్మణా అతి బలీయంగా వుందనుకో.. అది తప్పక నెరవేరే తీరుతుంది. ఆ కోరిక తీర్చుకోగల స్థాయి, స్థోమత తన ఆత్మకు వున్నప్పుడు మాత్రమే ఆ కోరిక కోరుకుంటాడు" అన్నారు.

ఈ మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా నిష్ఠగా, ఏకాగ్రతగా ధ్యానంలో లీనమయ్యాను. లిప్తకాలం పాటు నా కళ్ళ ముందు ఒక మెరపు మెరిసింది. ఆ మెరుపుతో పాటే వచ్చి దానికంటే మెరుపుగా కనిపించిన మొట్టమొదటి మహానుభావుడు "జీసస్ క్రైస్ట్"... నా ఫేవరెట్ హీరో! అది మొదలు ఎన్నోసార్లు ఎందరో మహాత్ములనూ, యోగులనూ పదే, పదే చూసేవాడిని! ఎన్నో ప్రశ్నలు వేసి సముచితమైన సమాధానాలు పొందేవాడిని! పత్రిసార్‌ని కూడా అనేకసార్లు ఆస్ట్రల్‌గా కలిసి అనేక విషయాలను అడిగేవాడిని. ఇక్కడ ఎలా చెప్పేవారో అక్కడ కూడా అలాగే చెప్పేవారు!

దటీజ్ పత్రీజీ!

ఒకసారి కొన్ని వందలమంది ఆత్మజ్ఞానుల మధ్య పత్రిసార్‌ని చూశాను. అందరూ తేజోమూర్తులే అయినా కూడా నేను వేరెవ్వరినీ కన్నెత్తి చూడకుండా సరాసరి సార్ దగ్గరకే వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఆయన రుద్రరూపం దాల్చి "నన్ను మన ప్రపంచంలో కూడా కలవవచ్చు కదా! ఇక్కడ ఇంతమంది అద్భుతమూర్తులుంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఏమయినా నేర్చుకోవాలని అనిపించటం లేదా నీకు?" అని అరిచారు.

సార్ ఎప్పుడు అంతే!! మన ప్రపంచంలో కూడా కొందరి మహాత్ముల పేర్లు చెప్పి "ప్రతి వారి దగ్గరా నేర్చుకోవలసింది ఏదో ఒకటి వుంటుంది వెళ్ళి నేర్చుకురండి" అని ప్రోత్సహించేవారు. "బెలుం" గుహలో వున్న వీరారెడ్డి స్వామిని నేను సందర్శించి రావటాన్ని ఆయన ఎంతగానో హర్షించారు! అలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత నాకింక వేరెవ్వరినీ చూడలనిపించలేదు. అదే పత్రిసార్‌తో అంటే" అవును! ఇంక నువ్వు ఎవ్వరినీ చూడనక్కరలేదు! ప్రశ్నలు వెయ్యనూ అక్కర్లేదు! నీ ఆత్మ తనకు కావల్సిన అనుభవసారం మొత్తం చక్కగా సమకూర్చుకుంది" అన్నారు.

ముఖ్యంగా సూక్ష్మలోక అనుభవాల్లో... రకరకాల పౌనఃపున్య తలాలకు ప్రయాణం చేస్తూ, విచిత్రమైన అనుభూతులు పొందుఉన్నప్పుడు... పత్రీజీ సహేతుకమైన వివరణ, ప్రోత్సాహం చాలా గొప్పగా వుండేవి. వాటి సహాయంతో నా ధ్యానానుభవాల్లో, జ్ఞానపరంగా నేను చాలా సునాయాసంగా ఎదిగాను. నా పట్ల మాత్రమే కాదు... ధ్యాన సాధన మార్గంలో ఉత్సుకత వున్నవారు వందల మందైనా, అందిరిపైనా ఆయన వ్యక్తిగతంగా చూపించే శ్రద్ద చాలా అద్భుతంగా వుంటుంది!

ఇంక ఆ తర్వాత పొందవల్సిన ప్రగతికోసం ధ్యానం ఉధృతం చేశాను. దాని ఫలితంగా కనీసం వందకి తొంభై ప్రశ్నలు నా అంతరాత్మకే వేసుకోగలిగేవాడిని. ఎంత చక్కని జవాబులు వచ్చేవంటే-సార్, జీసస్, కృష్ణుడు చెప్పినంత పరిపూర్ణంగా - సందేహ రహితంగా వచ్చేవి.

సార్ సహాయం లేకుండా మనమేదయినా ఆధ్యాత్మికంగా సాధిస్తే ఆయన ముఖం వెలిగిపోతుంది! ఎంత సంతోషిస్తారో చెప్పటం అసాధ్యం!

మేమందరం ఆయనను చాలా ఎక్కువసార్లు కలిసేవాళ్ళం. ‘నా’ అని అనుకునేవాళ్ళందరి కంటే ఆయనతోనే ఎక్కువగా గడిపేవాళ్ళం. ఆయనతో వున్నంతసేపూ ఏదో తెలియని అలౌకిక ఆనందం! మమ్మల్ని ప్రాణస్నేహితులలాగా చూసేవారు! ఆనాటినుండి ఈ క్షణం వరకు కూడా ఆయనలో ఇసుమంతైనా మార్పు లేదు! అప్పుడు అతి కొద్దిమంది...ఇప్పుడు లక్షలు, కోట్లమంది! అయినా అదే మనిషి, అదే మనస్సు, అదే స్నేహం, అదే కోపం కూడా!! దటీజ్ పత్రీజీ!

ఆయన ఎప్పుడూ ఆనందంగా వుండేవారు. తనచుట్టూ వున్నవాళ్ళని ఆనందంగా వుంచేవారు. ఎన్‌లైటెన్‌మెంట్ పొందిన వారంటే ఎక్కువ ఇష్టపడేవారు. తన దగ్గరకు రాకపోయినా, తనకి సంబంధం లేకపోయినా వేరే యోగుల దగ్గర ఎన్‌లైటెన్‌మెంట్ పొందినా ఆయన అస్సలు పట్టించుకునే వారు కాదు. వారెవరయినా "ఎన్‌లైటెన్‌మెంట్ పొందారు" అంతే చాలు వారితో ఎంతో సంతోషంగా గడిపేవారు.

అపారమయిన జ్ఞాపకశక్తి ఆయనది. ఇరవై సంవత్సరాల క్రితం కల్సిన వ్యక్తిని కూడా ఇప్పుడు గుర్తుపట్టగలరు! అలాగే దేహపరంగా ఆయన ఆకలితో వున్నప్పుడు, ఆ ఆకలిని గుర్తించి ఎవరయినా రెండు పచ్చిమిరపకాయ బజ్జీలు పెడితే చాలు, ఇంక ఎన్ని సంవత్సరాలు గడిచినా మర్చిపోరు!! ఆ పెట్టిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని, అతనికి ఎప్పుడు ఆకలి అవుతుందోనని ఎదురూచూసి, మరీ తన పళ్ళెంలో నుంచి తీసిపెడతారు!

దటీజ్ పత్రీజీ...!!!

 

గుణాకరరెడ్డి
అనంతపురం

Go to top