" ధ్యానశక్తి రోగనిరోధక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించగలదు "

 

నా పేరు సత్యనారాయణ మూర్తి. వృత్తిరీత్యా వైద్యుడిని అయిన నేను జనరల్ సర్జరీ‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలో శ్రీబాలాజీనర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్నాను.

చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మికత పట్ల నాకు మక్కువ ఎక్కువ. ఊహతెలిసినప్పటి నుంచీ "హరే రామ హరే రామ..రామ రామ హరే హరే" అన్న తారకమంత్రాన్ని శిరోధార్యంగా స్వీకరించి .. ఎప్పుడయినా భయపడే పరిస్థితులు ఎదురయినప్పుడు .. ఆ మంత్రాన్ని పదేపదే ఉచ్ఛరించి .. ధైర్యం తెచ్చుకునేవాడిని.

1989లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దర్శనంతో నా అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. పుట్టపర్తి‌లో స్వామి ఆధ్వర్యంలో అందించబడుతోన్న సేవాకార్యాక్రమాలైన .. అత్యాధునిక వైద్యం, విలువలతో కూడిన విద్యాబోధన, జలయజ్ఞం రూపంలో అనంతపూర్‌జిల్లా వాసుల దాహార్తిని తీరుస్తోన్న వైనం అద్భుతంగా తోచాయి.

సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన చిన్న పిల్లవాడి దగ్గరి నుంచి పెద్దవాళ్ళ వరకు సేవాభావంతో ప్రశాంతి నిలయం ఆశ్రమంలో మెలుగుతున్న తీరు చూడముచ్చటగా అనిపించి .. నేను కూడా సత్యసాయి భక్తుడనయ్యాను. అవకాశం దొరికినప్పుడల్లా బాబాను దర్శించుకుంటూనే, జగిత్యాలలో సత్యసాయి సేవాసమితిని ఏర్పరచి భజనలు, నగరసంకీర్తనలు, చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉచిత వైద్యసేవలు, బీదసాదలకు నిత్యావసర వస్తువుల పంపిణీలు చేస్తూండేవాళ్ళం. 1998 వరకూ సత్యసాయి సేవామార్గంలో అలా నా జీవితాన్ని గడిపాను.

1998లో కర్నూలు పట్టణంలో ఒక పౌర్ణమి ధ్యానం కార్యక్రమం జరిగినప్పుడు మొట్టమొదటిసారి నేను పత్రీజీని కలుసుకున్నాను. వారి సమక్షంలో నేను చేసిన గాఢ ధ్యానం నా అంతరంగపు ద్వారాలను తెరచింది. శ్వాస మీద ధ్యాస ద్వారా స్వీయ జాగృతి పొందగలిగే నవీన ఆధ్యాత్మికతను పత్రీజీ అందిస్తున్న తీరు నాకు బాగా నచ్చి .. హైదరాబాద్‌లో వారి ధ్యానశిక్షణా శిబిరాలకు తప్పక వెళ్ళేవాడిని.

1999, జనవరి 16న వారు నన్ను తెలంగాణా ప్రాంతానికి ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ జగిత్యాల పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీని ఆవిష్కరించారు! అప్పటి నుంచి ధ్యానప్రచారమే నా జీవితంగా మారింది. ఒక వైద్యుడిగా ధ్యానంలోని శాస్త్రీయతను ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ రూపంలో సోదాహరణంగా పొందుపరచి .. తెలంగాణా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ .. స్వీయజాగృతి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాను.

నిరంతర ధ్యానసాధన ద్వారా నేను అనేకానేక దివ్యచక్షువు అనుభవాలనూ, సూక్ష్మశరీరయాన అనుభవాలనూ ప్రత్యక్షంగా పొందాను. విశ్వచైతన్యపు అవగాహనతో నేను గ్రహాలనూ, గెలక్సీలనూ చుట్టి రావడం నాకు మరపురాని అనుభూతి!

ఒకసారి నేను ఇలాగే ధ్యానంలో కూర్చుని సూక్ష్మశరీరయానం చేస్తూ చేస్తూ కొద్ది సేపటికి .. ఆ స్థితిని భరించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. వెంటనే నా నోట్లోంచి అసంకల్పితంగానే "సాయిరామ్" అన్న మాటవచ్చింది .. కనీసం "ఆయనన్నా వచ్చి నన్ను కాపాడుతాడేమో" అని!

క్షణమాత్రం ఆలస్యం లేకుండానే "నీ వాస్తవానికి నువ్వే కారకుడివి; నువ్వే అంతా; ఇక్కడ నిన్నెవ్వరూ రక్షించజాలరు" అంటూ సవరణతో కూడిన పత్రీజీ స్వరం గట్టిగా వినిపించింది. నివ్వెరపోయిన నేను, "సత్యసాయి, పత్రీజీ నేను, ఈ సృష్టి అంతా ఒక్కటే" అన్న అహం బ్రహ్మాస్మి తత్వాన్ని అవగతం చేసుకున్నాను.

ధ్యానప్రచారంలో భాగంగా మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాలను క్రమం తప్పకుండా ప్రతినెల 27, 28, 29 తేదీలో ఆరునెలల పాటు నిర్వహించాను. ఈ తరగతుల ద్వారా .. ఎంతో మంది అద్భుతమైన మాస్టర్లుగా ఎదిగారు.

రామరాజ్యం వంటి సుభిక్షమైన పరిపాలనను కేవలం ఆత్మజ్ఞానులైన పాలకులు మాత్రమే అందించగలరన్న పత్రీజీ ఆకాంక్షకు అనుగుణంగా నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున వరుసగా 1999, 2004, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో పాల్గొని రెండుసార్లు శాసన సభ్యత్వానికీ, ఒక్కసారి పార్లమెంట్ సభ్యత్వానికీ పోటీ చేశాను. ఆ సందర్భంగా లక్షలాది ధ్యానశాకాహార సమాచారంతో కూడిన కరపత్రాలను నా నియోజవర్గ పరిధిలోని ఇంటింటికీ పంచాము.

వైద్యశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించిన ఒక వైద్యుడిగా నేను .. "వైద్యం ఇంతగా అందరికీ అందుబాటులోకి వచ్చినా కూడా .. ఇంకా రోగుల సంఖ్య లెక్కకు మించి ఎందుకు పెరిగిపోతోంది? వైద్యవిధానానికి ప్రత్యామ్నాయంగా రోగానికి మూలకారణం తెలియజేసే మరేదో ఉన్నతమైన విజ్ఞానం ఉండవచ్చు" అని పదేపదే ఆలోచించేవాడిని.

ధ్యానశాస్త్ర అవగాహన ద్వారానే నాకు ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చింది! "సమాజంలో 99శాతం వస్తరించి ఉన్న మానసికజనితమైన శారీరక జబ్బులకు ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన ఒక్కటే తిరుగులేని మందు" అని అర్థం చేసుకున్నాను. ఒక డాక్టర్ .. తాను వైద్యశాస్త్రంలో చదువుకున్న కేవలం భౌతికశరీర నిర్మాణం గురించే కాకుండా ఆ భౌతిక శరీరాన్ని నడిపించే మానసిక తలాలను గురించిన, ఆత్మతలాలను గురించిన, విశేషమైన విజ్ఞానాన్ని తప్పక కలిగి ఉండాలి.

అలాగే పేషంట్లు కూడా .. తాత్కాలికమైనదైనా లేక దీర్ఘకాలికమైనదైనా సరే.. రోగాన్ని తగ్గించుకోవడానికి కావలసిన స్వస్థతాశక్తి తమలోనే నిబిడీకృతం అయ్యి ఉందని తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా దానిని వెలికితెచ్చుకున్నప్పుడు .. ఆ రోగి తనకు తానే వైద్యుడుగా మారి తనను తానే స్వస్థత పరచుకోగలడు.

"ధ్యానశక్తి ద్వారా మాత్రమే మనం మన శరీరంలోని రోగనిరోధక శక్తిని శాశ్వతంగా పునర్వవస్థీకరించుకోగలం కానీ .. మితమీరిన మందులు మ్రింగడం వల్ల ఇల్లూ, ఒళ్ళూ, గుల్ల కావడం తప్ప మరేమీ ఉండదు" అని ఒక డాక్టర్‌గా నేను ఘంటాపదంగా చెప్పగలను!

నా "బాలజీ నర్సింగ్ హోమ్" పై నేను 25'X25' సైజులో ఒక రూఫ్‌టాప్ పిరమిడ్‌ను కట్టించి .. నా దగ్గరికి వచ్చేరోగుల్లో ఎవరైనా మానసిక జనితమైన శారీరక రోగాలతో బాధపడుతూంటే వారిని అందులో కూర్చోబెట్టి .. వారిచే విశేషంగా ధ్యానం చేయిస్తున్నాను.

రోగికి ఔషధసేవనం అవసరమే! కానీ .. ఆత్మశక్తి అనే దివ్యౌషధం ముందు రసాయనికి ఔషధాలు అన్నీ కూడా దిగదుడుపే!

ప్రాపంచిక జ్ఞానంతో కూడిన వైద్యనిపుణుడిగా జీవిస్తూన్న నన్ను .. ఆత్మజ్ఞానం కలిగిన వైద్యనిపుణుడిగా తయారుచేసి .. నా జన్మను ధన్యం చేసిన బ్రహ్మర్షి పత్రీజీకి..గురుపౌర్ణమి సందర్భంగా ఆత్మప్రణామాలు సమర్పించుకుంటున్నాను!

 

Dr.V.సత్యనారాయణమూర్తి , MS
జగిత్యాల, కరీంనగర్‌జిల్లా
సెల్ : +91 9849751357

Go to top