" మహాప్రళయాన్ని కళ్ళారా చూసాము "

 

నా పేరు శ్రీనివాసరావు. నేను .. మా కుటుంబసభ్యులం అంతా 2004 నుంచి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలో ఉంటూ, పత్రీజీ ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను అతిసరళమైన రీతిలో అందుకుంటూ మా జన్మలను ధన్యం చేసుకుంటున్నాము.

ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం అన్నీ కలగలిపి ఒకే జీవితంలో అందడం నా అదృష్టం! 108 పిరమిడ్‌లతో కూడిన ధ్యానమందిరాన్నీ, రూఫ్‌టాప్ పిరమిడ్‌నూ హైదరాబాద్‌లో మా ఇంటిపై నిర్మించి .. నిరంతర ధ్యాన ప్రచారంలో తరిస్తున్నాను.

పత్రీజీ ఆధ్వర్యంలో పిరమిడ్‌సొసైటీస్ చేపట్టిన అనేకానేక అతి క్లిష్టమైన ట్రెక్కింగ్ చేసిన స్ఫూర్తితో మా బంధువులం 11మందిమి (అంతా పిరమిడ్ మాస్టర్స్) కలిసి "చార్ ధామ్ యాత్ర‌కు శ్రీకారం చుట్టాం.

సదరన్ ట్రావెల్స్ ద్వారా బయలుదేరి జూన్ 12వతేదీ న్యూఢిల్లీ మీదుగా 13వతేదీ ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్ గ్రామానికి చేరుకున్నాం. అక్కడ వైష్ణోదేవి దర్శనం చేసుకుని 14వతేదీ సాయంత్రం 5.00గం|| లకు కేదార్‌నాథ్ దర్శనం కోసం అక్కడికి 2కి.మీ దూరంలో ఉన్న గౌరీకుండ్ చేరుకున్నాం.

అక్కడి నుండి గుర్రాల మీద పర్వతం ఎక్కి అర్థరాత్రి 12.00గం||లకు కేదార్‌నాథ్ చేరుకున్నాం. అప్పటికే కురుస్తోన్న కుండపోత వర్షంలో మాకు కేటాయించబడిన గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నాం.

15వతేదీ ఉదయం 6.00గం||లకే కేదారేశ్వరుని దర్శనార్థం ఆలయం చేరుకున్నాం. అక్కడి పూజారులు డబ్బులు చేతికి ఇచ్చిన వారినే గుళ్ళోకి పంపి దేవుడి దర్శనానికి అనుమతిస్తూ .. డబ్బులు ఇవ్వని వాళ్ళనుకర్కశంగా తోసేస్తూండటంలో చాలా మంది బయటి నుంచే దణ్ణం పెట్టుకుని నిరాశగా వెనుతిరగడం నాకు బాధకలిగించింది.

"ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇంతవరకు వస్తే .. పరమశివుడి దర్శన భాగ్యం కలగలేదు" అని వాపోతున్న వారిని చూస్తూ.. "ఏమయ్యా శివయ్యా! ఇదేం న్యాయం? పరమపావనం అనుకుని ఈ దేవభూమికి వస్తే నీ చుట్టూ కూడా ఇంతటి అన్యాయమా?" అంటూ బాధపడ్డాను. "హాయిగా ఉన్న చోటనే ఉండి ధ్యానం ద్వారా మనలోనే ఉన్న శివుడిని చూసుకోకుండా ఈ యమయాతనలన్నీ ఎందుకు?" అని అందరం చర్చించుకుంటూ .. అదే రోజు ఉదయం 9.00గం|| లకు తిరుగుప్రయాణం అయ్యాం!

15వ తేదీ రాత్రి 6.00" ||లకు అక్కడికి దగ్గరలోని "రామ్‌పూర్" లోని గెస్ట్‌హౌస్‌కి చేరుకుని ధ్యానమగ్నులయ్యాం! అప్పటకే 48గం||లుగా కురుస్తోన్న వర్షం ఆ రాత్రి ప్రళయబీకరంగా రూపుదిద్దుకుని .."మొత్తం హిమాలాయాలనే కదిలిస్తోందా" అన్నట్లుగా మహాఉప్పెనలాంటి వరద రూపం దాల్చి మా కళ్ళముందే పెద్ద పెద్ద కొండలను కూల్చేస్తూ.. జలపాతాలన్నింటినీ శివాలెత్తించేసింది. జరుగుతోన్న విలయాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఏ క్షణంలో ఏమవుతుందో గడిపాము.

అదృష్టవశాత్తు మేం ఉన్నరామ్‌పూర్ గెస్ట్‌హౌస్‌ కాస్త గట్టిగా ఉన్న మెరక ప్రాంతంలో ఉండడం వల్ల వరద భయం లేకుండా అక్కడే మూడు ప్రళయ రాత్రులు గడిపాం. తిండి లేదు, కరెంటు, నీరు, సెల్‌ఫోన్ అన్నీ ‘కట్! అసలు ప్రపంచంతోనే సంబంధం లేకుండా " 2012 మహాప్రళయం" హాలివుడ్ సినిమాను చూస్తూన్నట్లుగా గడిపాం. మా కళ్ళముందే వందలాది కార్లు, జీపులు, బొమ్మలా నీటిలో కొట్టుకుని రావడం, వేలాది మంది ప్రజలు శవాలు గుట్టలు, గుట్టలుగా పడి ఉండడం చూసి తట్టుకోలేక పోయాం! చావు రోదనలతో భీకర హాహాకారాలతో, హిమాలయాలన్నీ ప్రతిధ్వనించాయి.

మూడు రోజుల ప్రత్యక్ష నరకయాతన తరువాత అక్కడి నుంచి మేము మా వాహనంలో బయలుదేరి నానా అవస్థలూ పడుతూ .. కొండల్లో, గుట్టుల్లో దారి చేసుకుంటు 30 గం||ల పాటు ప్రయాణం చేసి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ నుంచి ఢిల్లీ మీదుగా 23వతేదీ క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాం.

తిరుగుప్రయాణం దారి పొడువునా మేము .. కేదార్‌నాథ్‌‌కు వస్తూ ఉన్నప్పుడు దాటి వచ్చిన వంతెనలు, రోడ్లు వరదలో కొట్టుకుపోయి ఊళ్ళకు ఊళ్ళు బురద‌లో సమాధి అయిపోయి అన్నీ స్మశానాల్లా మారిపోయి ఉండడం చూసాం. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన శవాలు అడుగడుగునా మా దారికి అడ్డంవస్తూంటే "అవి .. ఏ కోటీశ్వరులవో? ఏ తల్లి బిడ్డలవో? ఏ బిడ్డల తల్లులవో?" అని తలుచుకుని బాధపడ్డాం!

కేవలం "ధ్యానశక్తి" మరి మేం చేసిన "ధ్యానప్రచార పుణ్యం" మాత్రమే మమ్మల్ని ఆ ప్రదేశం నుంచి తృటిలో తప్పించి ..ఈ ప్రచండ భీభత్సాన్ని ప్రత్యక్షంగా చూసి కూడా మామూలుగా ఉండగలిగే స్థిరచిత్తాన్ని మాకు ఇచ్చింది! ఆ విలయవిధ్వంస దృశ్యాలతో నిండిన మా మనస్సులను స్వాంతన పరచుకోవడానికి ఎన్ని సార్లు ధ్యానం చేసామో లెక్కలేదు!

ఈ భీకరప్రళయం బ్రతికి బట్టకట్టేవారి పైనే కాకుండా ఆత్మీయులను కోల్పోయిన వారిపై మరి సంఘటనలను పదేపదే టీవీల్లో చూసి, పత్రికల్లో చదివి తమ మెదళ్ళు నిక్షిప్తం చేసుకున్న వారి మానసికతలంపై కూడా ఎలాంటి Post-trauma ప్రభావాన్ని చూపించబోతుందో మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషణలు చేస్తున్నారు.

"పైకి కనబడని ఈ సున్నితమైన అంశం భవిష్యత్తులో మరిన్ని కోట్లమందిన మానసిక, శారీరక రోగగ్రస్థులుగా చేయబోతోంది" అని వారు అందోళన పడుతున్నారు. ఇక చెలరేగబోయే అంటువ్యాధుల సంగతి సరేసరి!

"కేవలం ధ్యానం ఒక్కటే వారి మానసిక తలాన్ని శుద్ధిచేసి భయానక దృశ్యాల ముద్రల బారినుంచి వారిని రక్షించగలదు" అని కూడా పారాసైకాలజిస్టులు, వైద్య నిపుణులు తెలియజేయడం ప్రస్తుత సమాజానికి ధ్యానం యొక్క అత్యవసరాన్ని తెలియజేస్తోంది!!

"నేను చెయ్యాల్సిన పని ఇంకా ఈ భూమ్మీద ఉంది కాబట్టే .. అంతటి ప్రళయంలోంచి కూడా నా గురుకృపతో క్షేమంగా బయటపడ్డాను" అని నాకు అర్థం అయ్యింది!

 

 

G. శ్రీనివాసరావు
వనస్థలిపురం, హైదరాబాద్
మొబైల్ : +91 9849805746

Go to top