" తస్మై శ్రీ గురవేనమః "

 

నా పేరు భవానీదేవి. నేను 2001 సెప్టెంబర్‌లో ధ్యానమార్గంలోకి ప్రవేశించాను. చిన్నప్పటి నుంచి నేను పుట్టిపెరిగిన వాతావరణం వలన నాకు " శ్రీ సత్యసాయిబాబా " అంటే చాలా చాలా ఇష్టం ఉండేది. అది అజ్ఞానమో, అహంకారమో తెలియదు కానీ .. ఎప్పుడయినా వెళ్తే ఆయన దగ్గరకే గాని .. వేరెవ్వరిదగ్గరకూ వెళ్ళాలి అనే కోరిక నాకు ఏ మాత్రం ఉండేది కాదు.

మా వారు రాజశేఖర్ గారు మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి వచ్చేవారు. వెళ్ళే ప్రతిసారి కూడా " నువ్వు వస్తావా ? " అని అడిగేవారు.

కానీ ప్రతిసారీ " నేను రాను మీరు వెళ్ళిరండి " అనేదాన్ని. అలా చాలాసార్లు " నేను రాను " అని అనటం వలన ఇక ఆయన నన్ను అడగటం మానేసి .. ఒక్కరే వెళ్ళేవారు. ఊరికే వేలం వెర్రిగా వెళ్ళేవారే గానీ .. ఎవరిపట్ల కూడా ఆయనకు గురి కానీ, నమ్మకం కానీ ఉండేది కాదు. వచ్చిన తర్వత " అనవసరంగా వెళ్ళాను " అనుకునేవారు.

అలాంటి రోజులలోనే వారు " ఆనాపానసతి ధ్యానం " గురించి విని .. నాకంటే రెండు, మూడునెలల ముందు ధ్యానం నేర్చుకున్నారు ! కానీ .. ఎప్పటిలానే నేను ఏమీ పట్టించుకోలేదు. ఒకరోజు హడావిడిగా వచ్చి .. మనకు దగ్గరలో ఉన్న " అగ్రసేన్ భవన్ " కి ‘ సుభష్ పత్రీజీ ’ అనే గురువు వస్తున్నారట; నేను వెళ్తున్నాను " అన్నారు. అయితే, నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా లోపలి నుంచి " నేను కూడా వెళ్ళాలి " అని చాలా బలంగా అనిపించి వెంటనే " నేను కూడా వస్తాను " అన్నాను!

మా వారు నావంక వింతగా చూసి చాలా ఆశ్చర్యంగా " నిజంగా అంటున్నావా ? " అన్నారు. " అవును! ఎందుకో మరి .. నాకు ‘ రావాలి ’ అనిపిస్తోంది! నాకే తెలియదు .. వెళ్దాం పదండి ! " అన్నాను.

ఇద్దరం వెళ్ళేసరికి .. ఓ సుందర స్వరూపులు వేదికను అలంకరించి ఉన్నారు .. వారే పత్రీజీ !! మేము కుర్చీలో కూర్చున్న వెంటనే వారి నోటి నుంచి నేను విన్న మొదటిమాట " కాళ్ళు క్రాస్‌చేసి, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచనలు వస్తూంటే ‘ కట్ ’ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచండి " అని !

మేం అలా ధ్యానం చేస్తూ కూర్చున్నాం ! మధ్య, మధ్యలో వారు మాట్లాడుతున్నారు. ఆ కంఠధ్వని ఆకర్షణ ఏమని చెప్పను! ఏ ఒక్కరి కంఠం కూడా అంత మృదువుగా, వినసొంపుగా మధురాతిమధురంగా పలకటం నేను ఏనాడూ వినలేదు ! ఆ మాటలు, ఆ కంఠస్వరం నన్ను ఏం మాయచేసాయో తెలియదు కానీ .. మొదటి పది నిమిషాలలోనే నేను ధ్యానానందాన్ని రుచి చూశాను ! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ పత్రిసార్ క్లాస్ సిటిలో ఎక్కడ ఉన్నా కూడా వారి అనంతశక్తి .. పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగుతున్నట్లుగా నన్ను లాక్కునివెళుతోంది.

అలా నాకు ఆనాపానసతి అక్షరభ్యాసం చేసి .. నన్ను తమ అందమైన " ఆధ్యాత్మిక బడి "లో చేర్చుకుని .. నాలో ధ్యాన విత్తనాన్ని సృష్టించి .. " గురుబ్రహ్మ " అనే సృష్టితత్త్వానికి శాశ్వత సార్ధక నామధేయులుగా నిలిచారు పత్రీజీ.

అక్కడ నుంచి మెల్ల మెల్లగా ధ్యానం చేయటం మొదలు పెట్టిన నాకు మంచి అనుభవాలు వచ్చేవి. రోజుకు రెండుసార్లు గంట గంట చొప్పున చేసిన ధ్యానం వల్ల ఏదో తెలియని ఆనందంతో హాయిగా రెండు నెలలు గడిచిపోయాయి.

హఠాత్తుగా ధ్యానంలో నాకు వికృతరూపాలు కనపడటం భయంకర ధ్వనులు వినపడటం మొదలయ్యింది. కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నా .. కళ్ళు తెరిచినా, భయమే భయం ! అయినా " ధ్యానం మానాలి " అంటే ప్రాణం ఒప్పెది కాదు. కష్టపడి ధ్యానంలో కూర్చుంటే మరుక్షణమే ఎవరో నన్ను లాగి ఇవతల పారేసినట్లు అయ్యేది. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో " ఇవన్నీ పత్రిసార్‌కు చెప్పాలి " అనిపించింది.

" కోప్పడతారేమో ? " అనే భయం వున్నా .. " ఇక వారే అభయం " అని భావించాను. " ఒక్కరోజు ఆలస్యం అయినా ధ్యానం శాశ్వతంగా మానేస్తానేమో " అనే బాధతో మా ఆయనను సంప్రదించగా వారు సార్ ఎక్కడ ఉన్నారో వాకబు చేశారు. " తెల్లవారితే సార్ ఢిల్లీ వెళ్తారు " అని తెలిసినా రాత్రి పదకొండు గంటలకు సార్‌కి ఫోన్ చేసి " ఇంటికి రావచ్చా సార్ ? " అని అడిగాను.

అన్నీ తెలిసిన మహాత్ములు కాబట్టి " వెంటనే బయలుదేరి రండి " అన్నారు మేం సార్ ఇంటికి చేరేసరికి ఇంచుమించు అర్థరాత్రి .. పదుకొండు గంటల నలభై ఐదు నిమిషాలు అయ్యింది !

2002 .. విజయవాడ ధ్యానయజ్ఞం కార్యక్రమాల గురించి సంప్రదించటానికి అప్పటికే అక్కడ అరవై, డెబ్భై మంది మాస్టర్స్‌తో సార్ స్వగృహం కిటకిటలాడుతోంది. అంత హడావిడిలో కూడా పత్రీజీ మా దంపతులు ఇద్దరినీ ఒక ప్రక్కగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి " చెప్పండి మేడమ్ " అన్నారు.

" ధ్యానం చేస్తూంటే చాలా భయం వేస్తోంది సార్ " అన్నాను. నా ముఖంలోకి సూటిగా చూస్తూ " ధ్యానం మానివేయమని నాతో చెప్పించాలనా ? మానివేయండి ! ఎవరి కర్మలకు ఎవరు కర్తలు ? " అని కోపంగా అన్నారు ! ఏం అనాలో తెలియక .. ఏడవలేక .. నవ్వాను.

ఇక చూడండి సార్ ముఖం కందగడ్డలా మారింది. " ‘ ధ్యానం చేస్తే భయం వేస్తోంది ’ అని చెప్పటానికి సిగ్గులేదా ? పైగా నవ్వొకటి ! ఏం ‘ జోకర్ ’ గాడిలాగా కనిపిస్తున్నానా ? " అని పెద్దగా అరిచారు.

అంతే ! ఏడ్పువస్తున్నా .. నిగ్రహించుకుని అలాగే నిలబడ్డాను. వెంటనే .. హాలాహలం తర్వాత అమృతం వచ్చినట్లు నెమ్మదిగా శాంతించి .. " హాలాహలానికి భయపడుతూ కూర్చుంటే ఎలా మేడమ్ ? అలా భయపడుతూంటే అమృతం దొరక్కపోగా ఆ హాలాహలానికే బలైపోవాల్సి వస్తుంది. ధ్యాని కానివారికే కాదు ధ్యాని అయిన వారి జీవితాల్లో కూడా ఈ హాలాహలం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది.

ధ్యానులకు తాత్కాలికంగా వచ్చి .. ఆ తర్వాత శాశ్వతామృత నిలయమైపోతుంది. ధ్యాని కాని వారి జీవితాల్లో ఆ హాలాహలమే మరిన్ని వికృత రూపాలు దాల్చి భీభత్సాలను సృష్టిస్తుంది. ఈ మాట ఈ మధ్యనే నేను ఓ సభలో చెప్పాను " అంటూ అమ్మలా నన్ను దగ్గరకు తీసుకుని .. జగన్మాత ప్రేమను చూపించారు !

" చీకటి తర్వాత వెలుగు, చంద్రుడి తర్వాత సూర్యుడు రావటం లేదా ? అలాగే భయం తర్వాత ధైర్యం వస్తుంది ; భయం పోతుందిలే ! " అంటూ జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పేసారు.

ఆ మాటే మంత్రమై .. ఆ క్షణం నుంచి భయంతో పాటు ఎలాంటి హాలాహలం కూడా నా దరిదాపులకు రాలేదు ! అలా " గురుబ్రహ్మ " గా తాను సృష్టించిన ధ్యాన మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తూ .. " గురువిష్ణు " గా దాని అద్భుతస్థితికి కారణభూతమయ్యారు పత్రీజీ!

హాలాహలం పోయిన తరువాత ఇక మాయదారి మనస్సుకు గందరగోళం ఎక్కువ అయ్యింది ! నా మనస్తత్వానికి వ్యతిరేకం అయిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వంకరటింకరగా ప్రతిక్షణం పరుగులు పెట్టసాగాయి. ఎన్నో ముఖ్యమైన పనులతో బిజీగా ఉండే సార్‌కి " మళ్ళీ నా గోల మొరపెట్టుకోవాలి " అంటే ఇబ్బందిగా అనిపించి .. ధ్యానంలోనే వారికి నా గోడు విన్నవించుకున్నాను !

అంతే ! ఒకరోజు ఊళ్ళోకి వచ్చిన సార్ స్టూడియో రకార్డింగ్‌కు వెళ్తూ .. " నను పాలించగ నడచి వచ్చితివా .. మొర లాలించగా కదలి వచ్చితివా .. మొర లాలించగా కదలి వచ్చితివా " అన్నట్లుగా మా సికింద్రాబాద్ " కేర్ సెంటర్ " కి వచ్చారు.

వారు వున్న గంటసేపు నా కళ్ళ వెంట నీళ్ళు కారుతూనే ఉన్నాయి! అది చూసి వారు " మేడమ్ ! ఆ రోజుల్లో మాకు ఆధ్యాత్మిక విషయాల్లో గైడ్ చేసేవారు ఎవ్వరూ లేరు! ఆదుకునేవారు అంతకన్నా లేకపోయినా మేమే అష్టకష్టాలు పడి ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవటానికి మేమందరమూ వున్నాం కదా " అంటూ నా భుజం తట్టారు ! నా మనస్సు ఎంతో నిశ్చలస్థితిని పొంది చాలా కాలం తరువాత మళ్ళీ ప్రశాంతంగా హాయిగా ధ్యానం చేయగలిగాను. కానీ .. ఈ పాపిష్టి మనస్సు ఎన్ని జన్మల అజ్ఞానం మోసుకు వస్తోందో ఏమో కానీ .. కొంతకాలం తర్వాత ఎవరిని చూసినా ద్వేషం, చిరాకు, కోపం కలుగసాగాయి. కారణం ఏమీ లేకుండానే విసుగ్గా ఉండేది. నా భర్తతో సహా అందరూ నాకు విరోధుల్లాగా కనిపించేవారు. ఈ చెడు భావాలు నన్ను పూర్తిగా చుట్టుముట్టి " నాతో పాటు నా ధ్యానస్థితి కూడా ఇక ఈ రోజుతో అంతం " అనిపించిన రోజు హఠాత్తుగా పత్రిసార్ విజయవాడ నుంచి మండుటెండల్లో హైదరాబాద్‌కు వస్తూ .. ఎక్కడికీ వెళ్ళకుండా సరాసరి మా కేర్‌సెంటర్‌కి వచ్చేసారు.

ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తరువాత మావారితో " రాజశేఖర్! నాకు ఈ మధ్య ఎవరిని చూసిన చిరాకుగా, కోపంగా మరి ద్వేషంగా అనిపిస్తోందయ్యా! నాకు కొంచెం కౌన్సెలింగ్ చెయ్యి ! అన్నారు. మా వారు తెల్లబోయి " మీకు నేను కౌన్సెలింగ్ చేయటం ఏమిటి సార్ ?! " అన్నారు. " అయితే నేనే ఎవరినో ఒకరిని కౌన్సెలింగ్ చేయాలి ! ఎవరిని చేస్తే మంచిదంటారు మేడమ్ ?! " అంటూ నా కళ్ళలోకి సూటిగా చూడడం మొదలుపెట్టారు.

ఇవతలి ఒడ్డున వున్న తల్లి తాబేలు ఇంకో ఒడ్డున ఉన్న పిల్ల తాబేలును కేవలం తన దృష్టితో పొదిగి వృద్ధిచేసినట్లుగా నా మనస్సు శుద్ధికావటానికి వారు కనీసం పదిహేను నిమిషాలపాటు అలా తదేకంగా చూస్తూనే ఉన్నారు. నా శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ తేలికగా అయిపోయి ఇక ఎప్పుడూ నాకు అలాంటి పరిస్థితి రాలేదు!!

ముల్లోకాల భీభత్సానికి కారణమైన హాలాహలాన్ని కంఠాన ధరించిన గరళకంఠునిలా .. నా వైపుగా వస్తున్న భయాలనూ, పిచ్చి ఆలోచనలనూ, ద్వేషం, కోపం లాంటి అన్ని రకాల దుర్గుణాలనూ లయం చేసేసి " గురుర్దేవో మహేశ్వరః " అన్న శాస్త్రమహావాక్యానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన మాహానుభావులు .. పత్రీజీ !!

" బేలతనం మరచి ఆకాశతలాలను అందుకోండి .. జయం మీదే ! ‘ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా ’ అన్నట్లుగా ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తే అంతగా ఇహ, పర లాభాలు సౌఖ్యాలు వస్తాయి " అన్న వారి సందేశం నాకు తారకమంత్రంలా వినిపించింది. అలా వారు నాకు మార్గనిర్దేశం చేసిన తర్వాత ఇక నేను వెనుతిరిగి చూడలేదు !!

గురుబ్రహ్మ గురువిష్ణుః .. గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ .. తస్మై శ్రీ గురవేనమః

 

S. భవానీ దేవి
సికింద్రాబాద్

Go to top