" నాద ధ్యానంతో వైద్యవృత్తికి న్యాయం "

 

నా పేరు గంగా రామారావు. నేను కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి M.B.B.S; M.S పట్టాలు పుచ్చుకుని కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో "అశ్వినీప్రియ నర్సింగ్ హోమ్"ను నిర్వహిస్తున్నాను.

వృత్తిరీత్యా నేను వైద్యుడిని అయినా .. ప్రవృత్తిరీత్యా "బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్యాత్మిక బడిలో నిత్యసత్యవిద్యార్థిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా చిన్నతనంలోనే నేను ప్రముఖ హిమాలయ యోగి "స్వామిరామా" గారు అందించిన "హిమలయ యోగులతో సహజీవనం" అన్న గ్రంధరాజాన్ని చదివిన ఆధ్యాత్మిక జీవితం పట్ల అభిరుచి పెంచుకున్నాను. పరంపరగా పత్రీజీ అందించిన "శ్వాస మీద ధ్యాస" ధ్యానం చేస్తూ శాస్త్రీయమైన మార్గం ద్వారా నా వృత్తిదక్షతను కూడా పెంచుకోగలుగుతున్నాను.

పత్రీజీని మొట్టమొదటి సారి కలిసినప్పుడు వారి మాటల్లో తీక్షణత, వారి చర్యల్లో కాఠిన్యం నాకు అస్సలు అర్థం కాలేదు! "గురువులు అంటే సౌమ్యంగా, నెమ్మదిగా ప్రసన్నవదనంతో ఉండాలి కానీ .. ఇలా ఒక ఉద్యమకారుడిలా ఆవేశంతో ఉండడం ఏమిటి?" అనుకుంటూ "ఆయనకు దూరంగా వుంటే మంచిది" అని అపోహపడ్డాను.

ఐతే .. నా అంచనాలను తలక్రిందులను చేస్తూ నా అవగాహన ఎంతటి అజ్ఞానపూరితమైందో తెలియజేసే సంఘటనలు నా జీవితంలో సంభవించాయి:

ఒకసారి నేను గుండెనొప్పి వచ్చి ఆస్పత్రి పాలయి శిరిడీసాయి ఆశీస్సులతో బ్రతికి బట్టకట్టి నా కుటుంబంతో సహా ఆ దివ్యమూర్తికి శరణాగతుడిని అయ్యాను. ఆ క్రమంలో ఒకసారి నేను బాబా చరణారవిందాల దగ్గర కూర్చుని తన్మయత్వంగా .. బాబా ముఖంలోకి చూస్తూన్నాను. చిత్రంగా బాబా ముఖంలో ‘పత్రీజీ’ కనిపించారు.

"నా భ్రమేమో .." అనుకుంటూ మళ్ళీ కళ్ళు నులుముకుని తేరిపార చూశాను.

సందేహమే లేదు! బాబా ముఖంలో నవ్వుతూ ‘పత్రీజీ’ యే కనిపిస్తున్నారు! మరింత ఎరుక స్థితిలో నేను ఎన్నిసార్లు బాబా ముఖంలోకి తలెత్తి చూసినా.. అదే అద్బుతం!!

ఇక నేను ఆగలేక పోయాను! "ఎప్పుడెప్పుడు నా భాగ్యదేవుడు పత్రీజీని కలుసుకుంటానా? శిరిడీ సాయికి ప్రతిరూపమయిన వారి గాఢపరిశ్వంగంలో ఎప్పుడు సేదతీరుతానా!" అని ఆరాటం చెందాను.

నా ఆరాటానికి సమాధానంగా "‘పత్రీజీ’ ఆదోని పట్టణానికి వస్తున్నారు" అన్న వార్త తెలిసింది. క్షణం ఆలస్యం చేయకుండా వారి దగ్గరకు వెళ్ళి పోయాను!

నా మనస్సులోని ఆరాటాన్ని గమనించిన దేవదేవుడిలా పత్రీజీ .. అంతమందిలో కూడా నా దగ్గరికి వచ్చి నన్ను ఆత్మపూర్వకంగా తమ హృదయానికి హత్తుకున్నారు!

ఆ తరువాత నన్ను తమ దగ్గర కూర్చోబెట్టుకుని నా గురించి వాకబు చేశారు. అది నా జీవితంలో మరపురాని అనుభూతి!

ఇంకోసారి నేను సర్వైకల్ డిస్క్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడి అస్వస్థత చెంది ఉన్నప్పుడు చిత్రంగా పత్రీజీ దగ్గరి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు వారు ఆస్ట్రేలియా దేశ ధ్యానప్రచార పర్యటనలో ఉన్నారు. వారి అంతరంగిక కార్యదర్శి D. శివప్రసాద్ గారి ఫోన్ ద్వారా సార్ మాట్లాడుతూ ... నేరుగా నా ఆరోగ్య పరిస్థితినే వాకబు చేస్తూంటే చాలా ఆశ్చర్యపోయాను! ఎందుకంటే అప్పుటికి నా అనారోగ్యం గురించి నేను ఎవ్వరికీ చెప్పనేలేదు!

వారి ఆదేశంతో నేను వెంటనే ధ్యానంలో కూర్చుని ఎక్కడయితే నొప్పి ఉందో అక్కడ ధ్యాస పెట్టి హీలింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను. కొద్దిసేపట్లోనే నొప్పి తగ్గిపోయి .. నేను మామూలు మనిషిని కావడం జరిగింది!

ఆ తరువాత 2010 లో నేను రెండవ సారి గుండె నొప్పి (anginal attack) కి గురి అయి మళ్ళీ ఆస్పత్రిలో చేరాను. ఆ రాత్రి నన్ను కనిపెట్టుకుని నా స్నేహితుడు నా ప్రక్కనే ఉన్నాడు.

రాత్రి 2.00 గం|| సమయంలో నేను బెడ్ పై మత్తుగా పడుకుని ఉండగా నా ఛాతీని ఒక చెయ్యి మృదువుగా మర్దనా చెయ్యడం నా స్నేహితుడు కళ్ళారా చూసాడట! మర్నాటికల్లా నేను కోలుకోవడంతో రాత్రి జరిగిన విషయాన్ని నా స్నేహితుడి ద్వారా విని అందరం ఆశ్చర్యపోయాం!

ఇలా నన్ను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడిన పత్రీజీకి నేను నా కుటుంబం సభ్యులం అంతా సర్వదా కృతజ్ఞులం అయి వుంటాం! అంత గొప్ప గురువును నాకు పరిచయం చేసిన ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ "ప్రేమ్‌నాథ్ గుప్త" గారికి నా కోటి కోటి ధన్యవాదాలు!

వృత్తిరీత్యా వైద్యుడిని అయిన నేను ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యాన విధానం ద్వారా శరీరపరంగా జరుగుతూన్న శాస్త్రీయ మార్పులను అధ్యయన చేయడం మొదలుపెట్టాను. వివిధ అనారోగ్య కారణాలతో నా హాస్పిటల్‌కు వచ్చే రోగులకు ధ్యానంతోపాటు .. లయబద్ధమైన సంగీతాన్ని కూడా జోడించి అపారమైన చికిత్సలను చేస్తూన్నాను.

కీళ్ళనొప్పులు, LDS, మైగ్రేన్, ఎపిలెప్సీ వంటి నాడీ సంబంధ వ్యాధులు, IBS, పెప్టిక్ అల్సర్ వంటి జీర్ణకోశవ్యాధులు, ఇంకా ఇదమిద్ధమైన కారణం తెలియని అనేకానేక మానసిక జనిత శారీరక జబ్బులకు, గుండె సంబంధిత వ్యాధులకు గురిఅయి .. చికిత్స కోసం నా దగ్గరికి వచ్చిన ఎందరో పేషంట్లకు నేను "ధ్యానం+లయబద్ధమైన సంగీతం" కలగలిపి చికిత్సలు చేస్తున్నాను.

అవే జబ్బులకు మామూలు డాక్టర్ బోలెడన్ని మందులు ఇచ్చి, పదే పదే పరీక్షలూ చేసేసి .. ఇంకా కాదనుకుంటే ఏదో ఒక అపరేషన్ చేసేసి లక్షలకు లక్షలు వదిలించే రోజులివి! అలాంటిది అతి తక్కువ సాధారణ మందులతో .. ఒక్కోసారి అసలు మందులే లేకుండా .. నేను చేస్తున్న "ధ్యాన సంగీత చికిత్స"లు ఎందరు పేషంట్ల జీవితాల్లో వెలుగులు చిందిచాయో చెప్పలేను! వాటిలో మచ్చుకు కొన్ని:

మహబూబ్ బాషా (53); Hepato Cellular Carcinoma అనే ఒక రకమైన క్యాన్సర్ జబ్బుకు గురి అయిన ఈ రోగి 2008 జూన్ 28 వ తేదీన తీవ్ర వ్యాధి‌గ్రస్థుడిగా హాస్పిటల్ లో చేరి .. నాద ధ్యాన చికిత్సను పొంది ఇప్పుడు హాయిగా కోలుకుంటున్నాడు.

అనంతమ్మ (73) : Carcinoma Of Breast తో బాధపడుతూ 2003 లో Mastectomy ఆపరేషన్‌కు గురి అయిన ఈమె ప్రస్తుతం సాంప్రదాయ వైద్యంతో పాటు నాదధ్యాన చికిత్సను కూడా పొందుతూ తన ఆరోగ్యానికి మళ్ళీ చేకూర్చుకుంటోంది.

సతీష్ (26) : Chronic Myoloid Leukemia తో 2006 నుంచి బాధపడుతూ ఇటీవలే మా హాస్పిటల్ లో చేరి చికిత్సతో పాటు నాదధ్యానం కూడా చేస్తు మెల్లి మెల్లిగా కోలుకుంటున్నాడు.

హైదర్ సాహెబ్ (73): Bleeding Duodenal Ulcer కారణంగా దారుణమైన పరిస్థితిలో ఇతడు మా హాస్పిటల్‌లో చేరి ఎంతో అంకిత భావంతో నాదధ్యానం చేసి కేవలం ఒక్క నెల రోజులలోనే గొప్ప ఆరోగ్యాన్ని పొందాడు.

లింగప్ప (62) : CAD with Tripple vessels Diseaseతో మా హాస్పిటల్ లో చేరిన అతడికి వైద్య చికిత్సతో పాటు నాద ధ్యానం అందించాం. అంతకు ముందుకంటే వేగంగా ఈ సారి అతడు చికిత్సకు స్పందించి త్వరగా కోలుకున్నాడు. అతడి మెడికల్ రికార్డులు చూసిన వైద్య నిపుణలు ఆశ్చర్యపోయారు.

ఒక బాలుడు (8): ఎపిలెప్సీ అనే మూర్ఛవ్యాధితో బాధపడుతున్న ఈ రోగి .. సాంప్రదాయ మందులకు స్పందించకపోగ వ్యాధి మరింత తీవ్రతరం కావడంతో మా హాస్పిటల్ లో చేరాడు. నాదధ్యానం ద్వారా అతడి నాడీచాలనాల్లో అద్భుతమైన మార్పు వచ్చి చాలా త్వరగా అతడిలో స్వస్థతా కార్యక్రమం మొదలైంది. అచిరకాలంలోనే అతడు కోలుకుని ఇంటికి వెళ్ళి ఇప్పుడు హాయిగా స్కూల్లో చదువుకుంటున్నాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే మా హాస్పిటల్‌కు వచ్చి నాదధ్యాన ప్రక్రియ ద్వారా చికిత్స‌ను అందుకుని అద్భుతమైన స్వస్థతను పొందిన రోగులు ఎందరో!!

శాస్త్రీయపరమైన ఆధ్యాత్మిక విజ్ఞానం పట్ల అవగాహన కలిగిన ఒకానొక వైద్యుడు .. ఒకానొక రోగిని కేవలం భౌతిక శరీరధారుడిగా కాకుండా .. మానసిక, భావాత్మక, ప్రాణమయ, జ్ఞానమయ, ఆనందమయ, కారణమయ శరీరాల సముదాయంతో కూడిన ఆత్మస్వరూపుడిగా చూస్తాడు. రోగి యొక్క ఏడు శరీరాల సంపూర్ణ సముదాయానికి సంపూర్ణ చికిత్సను అందించి వైద్యవృత్తికి నిజమైన న్యాయం చేయగలుగుతాడు.

ఒక వైద్యుడిగా ఇటువంటి గొప్ప అవకాశం నాకు లభించి నా జన్మను ధన్యత నొందించుకుంటున్నందుకు బ్రహ్మర్షి పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ..

 

Dr. గంగా రామారావు
ఆదోని
కర్నూలు జిల్లా
సెల్ : +91 9866715314

Go to top