" 108 రోజుల ధ్యాన దీక్షతో.. పునర్జన్మ "

 

నా పేరు నందిని. నా వయస్సు 18 సంవత్సరాలు. నేను 2012 నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచీ వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నాను. క్రింద కూర్చోలేను, చేతులు పైకి ఎత్తలేను, మెట్లు అసలే ఎక్కలేను. మా తల్లిదండ్రులు నన్ను చెన్నై, బెంగళూరు, వెల్లూరు, తిరుపతి .. ఇలా ఎవరు ఎక్కడ చెబితే అక్కడికి తీసుకుని వెళ్ళి ఎంత ఖర్చు అయినా సరే వైద్యం చేయించేవారు. అయినా నా పరిస్థితిలో మార్పులేక పోవడంతో .. నా రిపోర్ట్‌లన్నీ విదేశాలకు పంపించారు.

విదేశాల్లోని డాక్టర్లు నా ఆరోగ్య పరిస్థితినీ, రిపోర్టులనూ విశ్లేషణ చేసుకుని లాభంలేదని తేల్చేసారు. జబ్బు పేరు కూడా ’ఫలానా" అని చెప్పలేక "జీవితాంతం ఇంతే" అని చెప్పారు. అందరి పిల్లల్లా స్కూలుకీ, కాలేజీకీ వెళ్ళలేక ఇంట్లోనే ఉండి.. పదవ తరగతి, ఇంటర్ పూర్తి చేసాను. నా అనారోగ్యానికి తోడుగా మైగ్రేన్ తలనొప్పి, అల్సర్‌తో పాటు ఆస్త్మా కూడా చేరడంతో నా జీవితం మరింత నరకప్రాయమై పోయింది.

కొద్ది కాలం క్రితం మా వీధిలో "ఇంటింటా ధ్యానం" తరగతులు జరుగుతున్నాయని విని "ఇంత మంది డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బులు .. ఒక్క గంట ధ్యానంలో ఎలా తగ్గిపోతాయి?" అనిపించింది.

"అయినా వెళ్ళి చూద్దాం" అనుకుని 30-8-2012న "ఇంటింటా ధ్యానం" క్లాసుకు వెళ్ళి .. అక్కడికి వచ్చిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుగుణా మేడమ్‌కు నా సమస్య చెప్పాను.

మేడమ్ నాతో ధ్యానం చేయించి, నాకు కౌన్సెలింగ్ ఇచ్చి నన్ను వాళ్ళ దత్తాత్రేయ పిరమిడ్‌లో 108 రోజుల ధ్యాన దీక్ష చెయ్యమన్నారు. అంత వరకు నేను నా శారీరక బలం కోసం చంపితిన్న కోళ్ళు, మేకల ఆత్మలకు క్షమాపణ చెప్పించి, "సేత్ విజ్ఞానం" పుస్తకాలు చదివిస్తూ నాతో ప్రతి రోజూ 2 నుంచి 3 గం||ల సేపు ధ్యానం చేయించారు.

ధ్యానంలో నాకు ఎన్నెన్నో అనుభవాలు! ఎన్నో సార్లు ఆస్ట్రల్ హీలింగ్‌లు, ఆస్ట్రల్ ఆపరేషన్లు జరిగాయి.

మొదట్లో కనీసం అరగంట సేపు కూడా ధ్యానంలో కూర్చోలేని నేను ఇప్పుడు చక్కగా గంటలు కూర్చోగలుగుతున్నాను! 108 రోజుల ధ్యాన దీక్ష పూర్తియ్యేసరికి నా వెన్నెముక సమస్యలు పూర్తిగా నయం అయిపోయాయి!

అంతే కాదు .. అంతకు ముందు ఎవ్వరితో అయినా మాట్లాడడానికి భయపడిపోయే నేను. ఇప్పుడు చక్కగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను! చకా చకా నడుస్తూ, మెట్లూ, డాబాలూ ఎక్కగలుగుతున్నాను!

2012, డిసెంబర్ లో హైదరాబాద్ కడ్తాల్‌లో జరిగిన ధ్యానమహాచక్రం వేడుకలకు వచ్చి శ్రీ మహేశ్వర మహాపిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేసుకున్నాను.

ఇప్పుడు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నా .. ఇది వరలా బెంబేలు పడకుండా వాటిని ధ్యానంతో నా అంతట నేనే తగ్గించుకుంటూ హాయిగా వుంటున్నాను. అంతే కాదు ఇప్పుడు నేను అందరమ్మాయిల్లా కాలేజీలో చేరి .. ‘డిగ్రీ’ కూడా చదువుతున్నాను!

ఎందుకూ పనికిరాననుకున్న నాకు ఇంత గొప్పగా జీవించే అవకాశాన్ని ఇచ్చిన ధ్యానానికీ, ఆ ధ్యానాన్ని అందించిన పత్రీజీకీ వేలవేల కృతజ్ఞతలు!

 

R. నందిని
చిత్తూరు
సెల్ : +91 9642508308

Go to top