" గృహనిర్మాణంలో అడుగడుగునా అద్భుతాలే "

 


నా పేరు మాధవాచారి. మా స్వగ్రామం కృష్ణాజిల్లా .. " పెనుగంచిప్రోలు " గ్రామం. నేను కేంద్రప్రభుత్వ శాఖలో ఇంజనీరుగా వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేశాను. మాకు ఒక అమ్మాయి .. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ .. పెళ్ళయి అమెరికాలో స్థిరపడింది.

ఆర్థికపరంగా చూస్తే నాకు పెద్ద ఇబ్బందులు ఏమీ లేకపోగా .. ఒక రకంగా సంతృప్తికరమైన జీవితమే అనుకోవాలి! అయినా నా ఒకే ఒక్క కల " స్వంత ఇల్లు నిర్మించుకోవడం " అన్నది మాత్రం ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరలేదు. కట్టుకోవడానికి స్థలం ఉండీ .. బ్యాంకులో డబ్బులు ఉండీ కూడా నా కల కలగానే మిగిలిపోయింది.

దీనికి తోడు నా భార్య గత 25 సంవత్సరాలుగా " నిద్రలేమి రోగం " తో బాధపడుతూ ఉండేది. ఎందరో డాక్టర్లు, సైకియాట్రిస్టుల దగ్గరికి తిరిగినా ఆమె సమస్య తీరకపోగా రోజురోజుకీ దిగజారసాగింది. రాత్రంతా అలా ఆలోచిస్తూ కూర్చుని .. క్రమంగా మతిలేని స్థితిలోకి వెళ్ళిపోయేది. " ఏ బాధలూ లేని మా జీవితాలకు ఇదేం శాపం ? " అనుకుని " ఏమిటి ఈ బ్రతుకు ? రోజూ తినడం, పడుకోవడం, చివరికి చనిపోవడమేనా ? ఇంతకంటే జీవితమే లేదా ? " అని అంతా నిస్తేజంగా తోచేది.

ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తూండగా .. 2011 జనవరిలో బ్రహ్మర్షి పత్రీజీ యొక్క " ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస " ధ్యానమార్గం మాకు దొరికింది! ధ్యానం మొదలుపెట్టిన 15 రోజుల్లోనే నా భార్య ఆరోగ్యంలో కాస్త మార్పు కనిపించి .. ఆమె రాత్రిళ్ళు నిద్రలో స్వాంతన పొందడం మొదలయ్యింది. ఒక అమృతభాండం దొరికినట్లు ఆమె సంతోషపడుతూ తక్కువ కాలంలోనే డాక్టర్లు కూడా ఆశ్చర్యపడేట్లు స్వస్థత చెందింది !

నాకు కూడా ఇందులో ఉన్న ఆనందం దక్కడంతో .. ధ్యానంతో పాటు, సత్ససంగాలకు వెళుతూ .. పత్రీజీ సందేశాలనూ, ఆత్మజ్ఞానంతో కూడిన పుస్తకాలనూ ఎన్నో చదివాను. ఇద్దరం ధ్యానంలో గొప్ప అనుభూతులను పొందాము. మా అమ్మాయి కూడా అమెరికాలో ధ్యానం చేస్తూ తన అనుభవాలను మాతో పంచుకునేది. " ఇంతకంటే ఆనందం మా జీవితంలో లేదు " అని మేం త్రికరణశుద్ధిగా నమ్మి .. నిత్యసత్యాన్వేషి, సాక్షాత్తు భూమి మీద ఉన్న భగవంతుడు పత్రీజీని గురువుగా పొందడం మా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాం.

ఈ క్రమంలో గత యాభై సంవత్సరాలుగా నేను కలలుకంటూన్న " స్వంత ఇల్లు .. కడ్తాల్, శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో కట్టుకోవాలి " అని మాకు సంకల్పం కలిగింది వెంటవెంటనే పనులన్నీ చకచకా జరిగిపోతూ .. అతి తక్కువ కాలంలోనే ఒక ప్రశాంతమైన " పర్ణశాల " లాంటి ఇల్లు నిర్మించుకున్నాం ! ఆ ఇంటి డిజైన్ అంతా కూడా మాకు ముందే ధ్యానంలో దర్శనం ఇచ్చిన " సప్తర్షుల " ఆదేశం ప్రకారం పత్రీజీ ఆశీర్వాదబలంతో ఏడు గదులుగా నిర్మించాం !

క్రితం సంవత్సరం దీపావళి రోజు .. కడ్తాల్‌కు పత్రీజీ విచ్చేసి ధ్యానులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ .. మా ఇంటికి వచ్చారు. ధ్యానంలో మేము విశ్వామిత్ర మహర్షిని ఎక్కడయితే, ఏ భంగిమలో అయితే చూసామో .. అదే భంగిమలో నిలబడి " ఇల్లు బ్రహ్మాండంగా .. ప్రకృతికి దగ్గరగా ఉండేట్లు కట్టారు " అని ప్రశంసించారు ! ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించి " ఆది వరలక్ష్మీ సదన్ " గా మా ఇంటికి నామకరణం చేసారు !

పిలువగానే వచ్చిన పత్రీజీని చూసి " చుట్టాలకు ఆహ్వానం పంపాలి కానీ .. భగవంతుడికి ఆహ్వానం అక్కరలేదు; అప్పగించిన పని పూర్తిచేస్తే చాలు " అని మాకు అర్థం అయ్యింది! ఒక ఇల్లు కట్టినన్ని రోజులూ మాకు ఎన్నో అద్భుతాలు! ఎప్పటికప్పుడు డబ్బు సమకూరడం ; మర్నాడు కట్టుబడికి ‘ ఇసుక అందలేదు ’ అనుకోగానే .. ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి .. ఇసుక రేణువులు కొట్టుకుని వచ్చి మా ఇంటికి నాలుగువైపులా కుప్పలు కుప్పలుగా జమకావడం .. ఆ ఇసుకనే మేస్త్రీ కట్టుబడీకి వినియోగించడం జరిగింది !

అతి తక్కువ సిమెంట్‌ను ఉపయోగించి మట్టి, ఇసుక, రెల్లుగడ్డితో అత్యాధునికమైన " eco-friendly " ఇంటిని మేము నిర్మించికున్నాం! ప్రతి రోజూ పిరమిడ్‌కు వచ్చే సందర్శకులు మా ఇంటికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుని .. తమ అనుభవాలు చెప్తూంటే .. మాకు ఎంతో ఎంతో ఆనందంగా వుంటుంది. ఇంతవరకు మా రక్త సంబంధీకులు ఎవ్వరూ పెద్దగా మా ఇంటికి రాకపోయినా .. " ప్రపంచ ధ్యానమహాసభల పుణ్యమా " అని వేలాదిమంది ఆత్మబంధువులు వచ్చి వెళ్ళారు!

సిటీలో ఉన్నప్పుడే మేము ఒంటరి వాళ్ళలా ఫీల్ అయ్యేవాళ్ళం .. కానీ .. ఇక్కడ అడవిలో, కొండల మధ్య వున్నా .. పిరమిడ్‌కు వచ్చిపొయే సందర్శకులకు ధ్యానప్రచారం చేస్తూ ఉన్న చోటి నుంచే మా జీవితాలను ధన్యం చేసుకుంటున్నాం.

స్థలం ఉన్న వాళ్ళందరం .. అవకాశాన్ని అనుసరించి " కైలాసపురి " లో ఇల్లు కట్టుకుని .. ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని ధ్యానప్రచారం చేసుకుంటూ .. పత్రీజీ పచ్చని కలను నిజం చేద్దాం !

T.మాధవాచారి
సెల్ : +91 9393938305, +91 8977330170

Go to top