" యువతకు విచక్షణా బుద్ధిని కలిగించే ధ్యానం "

 

నా పేరు వాణి. కరీంనగర్ జిల్లా "వేములవాడ"కు చెందిన నేను .. ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో M.Sc (జాగ్రఫీ) పూర్తి చేసి Ph.d.,కి సన్నద్ధం అవుతున్నాను.

మేములవాడలో మా ఇల్లు గుడి ప్రక్కనే ఉండడంతో నేను నా చిన్నతనంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ఆవరణలోనే ఆడుకుంటూండేదాన్ని. దేవుడిని నాకు ఎంతో ఆత్మీయుడిలా, స్నేహితుడిలా అనుకుంటూ తోటి స్నేహితులతో కలిసి అవసరం ఉన్నవాళ్ళకు సహాయం చేస్తు ఉండేదాన్ని.

నేను డిగ్రీ చదువుకుంటూన్నప్పుడు నాకు ఎవరో స్వామీజీ మా ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూండేది. అప్పట్లో నాకు ధ్యానం తెలియదు కానీ నేను నిద్రపోయినప్పుడల్లా ఏదో శక్తి నా చుట్టూ తిరుగుతున్నట్లు మాత్రం తెలిసేది. నిద్రనుంచి లేచాక ఆ విషయాలను ఇంట్లో చెబితే వాటిని పీడకలలుగా కొట్టివేసేవారు.

కొన్నాళ్ళ తరువాత నేను .. M.Sc చదువు నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో చేరాను. వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నాకు క్రొత్తవారితో మాట్లాడడానికి భయం వేసేది. అనేకానేక నెగెటివ్ ఆలోచనలతో భవిష్యత్తు గురించి అర్థం పర్థం లేని అందోళన చెందుతూండేదాన్ని.

ఆ సమయంలోనే యూనివర్సిటీ "ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్"లో జరిగిన పిరమిడ్ సొసైటీ "పైమాగ్రూప్" వారు ఏర్పాటు చేసిన "ఏకతా ధ్యానం" లో పాల్గొని ఆ తరువాత 41 రోజుల ధ్యానమండల దీక్ష పూర్తిచేసాను.

నవంబర్ 11వ తేదీ 2010న "NTR గార్డెన్స్" లో జరిగిన ధ్యానశిక్షణా కార్యక్రమానికి వెళ్ళి .. అక్కడ వేల సంఖ్యలో హాజరయిన ప్రజలనూ మరి అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారిని చూసి .. "ధ్యానం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?" అని ఆశ్చర్యపోయాను.

అదే కార్యక్రమంలో Dr. న్యూటన్ కొండవీటి మరి రాయ జగపతిరాజు గార్లు శాకాహార ప్రాముఖ్యత గురించి చెప్పడం విని .."ఈ క్షణం నుంచే నేను శాకాహారిగా ఉంటాను" అని నిర్ణయం తీసుకున్నాను.

" నేను సంపూర్ణ శాకాహారిగా మారాలి " అని నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే నాకు ధ్యానం చక్కగా కుదురుతూ అంతకు ముందు వచ్చినట్లు అనవసరమైన ఆలోచనలు రావడం ఆగిపోయింది. అక్కడే నేను పత్రీజీని ప్రత్యక్షంగా కలిసి వారితో కరచాలనం తీసుకున్నాను. అంతకు ముందు వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులతో వ్యవహరించినట్లే పత్రీజీ తమకంటే చిన్నదానినైన నాతో కూడా అంతే ఉదాత్తంగా వ్యవహరించడం చూసి నేను ఆశ్చర్యపోయాను!

పత్రీజీ కరచాలనంతో నాలో గూడుకట్టుకుని ఉన్న ఆత్మన్యూనతాభావం పటాపంచలయ్యింది .. అప్పటి నుంచి ధ్యానం బాగా కుదురుతూ .. ఏ రకమైన నెగటివ్ ఆలోచనలు కూడా నా జోలికి రాలేదు! అంతకు ముందు డిగ్రీలో ఉన్నప్పుడు మరి ఆ తరవాత 40 రోజుల ధ్యాన మండల దీక్షలో కూడా పదే పదే నాకు కలలో కనిపించిన స్వామీజీ .. ఇక అప్పటి నుంచి కనిపించడం మానేసారు.

కారణం ఏమిటని ధ్యానంలో కూర్చుని ప్రశ్నించుకోగా .."ఇప్పుడు నువ్వు ఒక మాస్టర్‌వి! నిన్ను నువ్వు తెలుసుకున్నావు కనుక ఇక నీకు నా సహకారం అవసరం లేదు! ఇప్పుడు నువ్వే ఇతరులకు సహకారాన్ని అందించగలవు" అన్న సందేశం వచ్చింది! ధ్యానం ద్వారా నాలోని సరికాని ఆలోచనలను సమూలంగా తుడిచివేసుకున్న నేను ఇక నా స్నేహితులకూ, అధ్యాపకులకూ ధ్యానప్రచారం మొదలుపెట్టాను. మాంసాహార భోజనం వల్లవచ్చే అనర్థాలను వివరిస్తూ .. ధ్యానశక్తితో మనల్ని మనం ఎలా ఉన్నతీకరించుకోవచ్చో .. నా స్వానుభవం ద్వారా వాళ్ళకు వివరిస్తూ వచ్చాను.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని "ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్", "టాగోర్ ఆడిటోరియమ్" లలో పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన అనేకానేక ధ్యానశిక్షణ కార్యక్రమాల్లో నిర్వాహకులతో కలిసి చురుకుగా పాల్గొన్నాను.

ఈ క్రమంలో క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్‌లో ధ్యాన మందిరం కోసం "వైస్ - ఛాన్సెలర్" గారిని అభ్యర్థించగా వారు విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అక్కడ ధ్యాన మందిరం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వైస్-ఛాన్సెలర్ గారి ఆదేశం మేరకు సంబంధిత అధికారిణి ఎన్నో సంవత్సరాలుగా వాడని ఒక స్టోర్‌రూమ్‌ను మాకు అప్పగించి .."దానిని శుభ్రం చేయించి ఇస్తాను" అన్నారు. అయితే మా టీమ్ అంతా కలిసి .. అతి కొద్దిసేపట్లోనే ఆ గదిని శుభ్రం చేసి దానిని అందమైన "పిరమిడ్ ధ్యానమందిరం" గా రూపొందించడం చూసి ఆ మేడమ్ మా అంకితభావాన్ని అభినందించారు.

ప్రతి రోజు రాత్రి 9గం|| నుంచి 10గం|| వరకు తోటి విద్యార్థినులతో కలిసి ధ్యానం చేస్తూంటే మా ధ్యానశక్తి తరంగాల వల్ల అనేకమంది క్రొత్త విద్యార్థినులు ఆ శక్తిక్షేత్రానికి ఆకర్షితులై వచ్చి .. చక్కగా కూర్చుని ధ్యానం చేసుకునేవాళ్ళు. ఈ సామూహిక ధ్యానం ఏర్పాటు చేయడం వలన నేను కూడా శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలను పొందాను. అంతకు ముందు ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న నా వెన్నునొప్పి, మెడనొప్పి వాటంతట అవే తగ్గిపోయాయి.

శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వలన సైన్స్ పరంగా కణాల్లోని DNA లో కూడా మార్పులు జరుగుతాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలో మళ్ళీ ఒకసారి యూనివర్సిటీ ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్‌లో జరిగిన ధ్యాన శిక్షణా కార్యక్రమానికి విచ్చేసిన పత్రీజీ కార్యక్రమ నిర్వహణ చేస్తూ ఎక్కడో దూరంగా ఉన్న నా దగ్గరికి వడివడిగా వచ్చి నన్ను అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా తాము చేస్తోన్న మహోన్నత కార్యక్రమంలో .. "ఉడత" లాంటి నేను చేస్తోన్న చిన్న పనిని కూడా అంత పెద్ద యెత్తున అభినందిస్తూన్న వారి గొప్ప మనస్సుకు ఆశ్చర్యపోయాను. నాకంటే చిన్న వాళ్ళను కూడా గొప్పగా అభినందించడం వారిని చూసే నేర్చుకుని నా వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటున్నాను.

పత్రీజీ విద్యార్థులకు ఇచ్చే సందేశాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. "ధ్యానం ఒక్కటే సకల సమస్యలకూ పరిష్కారాలు అందిస్తుంది .. మరి ధ్యానం ఒక్కటే మనలోని భగవత్ తత్వాన్ని వెలికి తెచ్చి మన వాస్తవాలకు మనల్నే కారకులుగా మలుస్తుంది. ఇంత గొప్ప ధ్యానాన్ని చెయ్యాలంటే ఏ హిమాలయాలకో పోనక్కర లేదు. ఇంట్లో, కాలేజీలో, లైబ్రెరీలో, గార్డెన్స్‌లో, బస్సుల్లో .. ఎక్కడ ఎప్పుడు తీరిక దొరికితే అక్కడ అప్పుడు వీలును బట్టి చేసుకోవాలి. తీరిక చిక్కినప్పుడల్లా వ్యర్థ ప్రసంగాలతో కాలం సరిపుచ్చితే ఆ ఫలితం చేసే పని యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది" అంటూ విద్యార్థులకు ధ్యానం చేయాల్సిన అత్యవసరాన్ని వారు ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలా వివరిస్తూంటారు.

యువత అంతా కూడా స్వీయపరిశీలనా సదృశమైన ధ్యానాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే జీవితంలో ఏం చెయ్యాలో, ఏం చెయ్యగూడదో వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోగల విచక్షణా బుద్ధిని పెంచుకోగలుగుతాము అన్నది నా స్వానుభవం!

యూనివర్సిటీ నుంచి మా స్నేహితులం అంతా కలిసి "జగనాధ గట్టు", "పిరమిడ్ వ్యాలీ .. బెంగళూరు"లకు వెళ్ళి అక్కడి పిరమిడ్ శక్తి క్షేత్రల్లో ధ్యానం చేసుకుని ఆ శక్తి తరంగాలను అనుభూతి చెందాము. వైజాగ్, కైలాసపురి, కడ్తాల్‌లలో జరిగిన ధ్యానమహాచక్రాల్లో పాల్గొన్నాము.

"మరణం లేని మీరు" అనే పుస్తకంలో డా|| లోబ్‌సాంగ్ రాంపా మాస్టర్ చెప్పిన" ఇచ్ఛాశక్తి కంటే ఊహాశక్తి గొప్పది" అన్న వాక్యంలోని శాస్త్రీయతను అర్థం చేసుకుని సృష్టి యొక్క ఆకర్షణా సిద్ధాంతానికి అనుగుణంగా ప్రయోగాత్మమైన ఫలితాలను పొందుతున్నాను.

మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యాధికులు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ G. శ్రీనివాస రెడ్డి గారు .. యువత కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తూన్న "స్వాధ్యాయ యోగ" తరగతులకు హాజరై మనోశక్తికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఊహాశక్తి ద్వారా "మైండ్ -డీ-ప్రోగ్రామింగ్", "మైండ్-రీ-ప్రోగ్రామింగ్"లతో కూడిన మైండ్‌మ్యాపింగ్‌ను అద్భుతంగా మలచుకున్నాను.

"మన ఆలోచనలను ప్రత్యేకమైనవిగా ఎలా మలచు కోవాలి?" అహంకారాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి .. నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి" .. ఇవన్నీ వాలో వారి తరగతుల్లో చక్కగా నేర్చుకునే వాళ్ళం! టోర్కోమ్ సెరాయ్‌డారియన్, సేత్ విజ్ఞానం, రామ్తా, డా|| దీపక్ చోప్రా, గ్యారీ జుకోవ్, ఓషో, నీల్ డొనాల్డ్ వాల్ష్ వంటి గొప్ప గోప్ప మాస్టర్లు అందించిన స్వాధ్యాయ పుస్తకాలు మరి పత్రీజీ ప్రసంగాలతో కూడిన సంకల్పశక్తి, సాహసం, వాక్‌క్షేత్రం వంటి ఎన్నో CD లను విని మమ్మల్ని మేము ఉన్నతీకరించు కుంటున్నాము.

ధ్యానం ద్వారా మాకు సరియైన సమయంలో సరియైన మార్గదర్శకత్వాన్ని అందిస్తోన్న ప్రియతమ గురువు పత్రీజీకి యువతరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది.

 

T. వాణి
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
సెల్ : +91 9491343522

Go to top