" సమకాలీన సమాజానికి ధ్యానమే సరియైన మార్గం " 

 

"అశ్వినీ హెయిర్‌ఆయిల్ "పేరు వినని తెలుగువారు ఉండరు! తలనూనెల వ్యాపారాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకుని వెళ్ళిన "అశ్విని సంస్థల" అధినేత "శ్రీ సుబ్బారావు" గారు విశేషమైన వ్యాపారదక్షత కలవారే కాకుండా అపారమైన ధార్మికగుణ సంపన్నులు కూడా! "అశ్వినీ ఛారిటబుల్ ట్రస్ట్" ద్వారా వీరు సేవారంగంలో తమ విశిష్ఠతను ఛాటుతూ దాదాపు ౩౦౦౦ మంది స్వచ్ఛంద కార్యకర్తలతో ఆంధ్రరాష్ట్రంలోని 10,000 గ్రామాల్లో విద్య-వైద్య రంగాల్లో తమ దాతృత్వాన్ని అందిస్తున్నారు.

ఒకప్రక్క వ్యాపారం, మరొకప్రక్క సేవ మాత్రమే కాకుండా "భారత్ వికాస్ పరిషత్" కు ఛైర్మన్‌గా ఆధ్యాత్మిక రంగంలో సుబ్బారావు గారి కృషి అనన్యసామాన్యమైంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరిక్షణకు గాను" భారత్ వికాస్ పరిషత్" ద్వారా వీరు వివిధ సంస్థల సమన్వయంతో చేస్తోన్న అద్భుతకార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయాలు, ధ్యానం ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉన్నతమైన భావాలను కలిగిన శ్రీ ఆశ్వినీ సుబ్బారావు గారు .. తమ అమూల్యమైన సమయాన్ని సమయాన్ని కేటాయించి "ధ్యానాంధ్రప్రదేశ్"కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి పిరమిడ్ సంస్థ కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.


రవి : నమస్కారం సార్! వ్యాపారంగంలో ఎంతో బిజీగా వుండేమీరు .. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నారు .. మీకు ఇది ఎలా సాధ్యం?!

శ్రీ సుబ్బారావు గారు : నాకు తెలిసినంతవరకు .. మాటల్లో స్పష్టత, భావంలో పవిత్రత, చేతల్లో సహృదయత ..అన్న దైవ లక్షణాలు. వీటిని త్రికరణశుద్ధిగా పాటిస్తూ దేవుడిగా ఎదగడమే ఆధ్యాత్మికత. ఇది నా స్వానుభవం కూడా! ఆధ్యాత్మిక జీవనం ద్వారా మనం త్రికరణ శుద్ధత్వం పొంది అరిషడ్వర్గాలను ఎలా ఉపయోగించు కోవాలో తెలుసుకుంటాం.

పాలలో దాగివున్న నెయ్యి బయటికి రావాలంటే ముందు అందులో ఒక పెరుగుబిళ్ళ వేసి తోడుపెట్టాలి. ఆ తరువాత ఆ తోడుకున్న పెరుగుని బాగా చిలక్కోట్టి .. వెన్న బయటికితీసి .. దానిని మళ్ళీ నిప్పుల మీద కాల్చాలి. అప్పుడే ఘుమఘుమలాడే నెయ్యి బయటికి వస్తుంది.

పాలలాంటి మనలో కూడా దాగివున్న ఆత్మశక్తి బయటికి తీసి మన జన్మలక్ష్య‌సాధనవైపు ప్రయాణించాలంటే మనకు పెరుగుబిళ్ళలాంటి ధ్యానసాధన తప్పనిసరి! అప్పుడే మన ప్రాపంచిక జీవితం సరిగ్గా వుంటుంది. ఆధ్యాత్మిక స్పర్శలేని ప్రాపంచిక జీవితం ఆత్మ లేని శవంతో చేసే జీవచ్ఛవ యాత్రలా వుంటుంది.

చాలామంది "నీ లక్ష్యం ఏమిటి?" అంటే "చదువు", "ఉద్యోగం", "పెళ్ళి .. అంటూ అతి సామాన్యమైన లక్ష్యాలను చెపుతూ నీళ్ళు నములుతూంటారు! కానీ .. ఇంత విలువైన జీవితంతో ఇంకా ఏమేం చేయొచ్చో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పెద్దవాళ్ళదీ అదే పరిస్థితి .. మరి యువకులదీ అదే పరిస్థితి!

రవి : ఈ రోజు సమాజంలో వున్న అసంతృప్తికీ, ఆరాటాలకూ కారణం ఇదేనంటారా?

శ్రీ సుబ్బారావు గారు : ముఖ్యంగా ఈనాటి చదువులు యువతకు కావలసిన మానసిక‌స్థైర్యాన్నీ, ఆత్మశక్తినీ అందించలేక పోతున్నాయి. చదువుల ద్వారా ఒక యువకుడు జ్ఞాన సంపాదనాపరుడిగా, వ్యక్తిత్వ వికాస దక్షుడిగా ఎదగాలి! అలా ప్రతిఒక్కరూ ఎదిగిన రోజు మాత్రమే ఈ సమాజం తేరుకుంటుంది.

దీనికి తోడు మనకు వున్నది .. అది డబ్బైనా, సమయమైనా .. శక్తి అయినా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారికి పంచుతూ లోకకల్యాణ సేవ చెయ్యాలి! ఆత్మకల్యాణం కోసం ధ్యానం, లోకకల్యాణం కోసం సేవ చేసే యుగపురుషుల వల్లనే చరిత్ర సృష్టించబడుతూ వుంటుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏసుక్రీస్తు, గౌతమబుద్ధుడు, జగద్గురువు ఆదిశంకరుడు, స్వామీ వివేకానందుడు .. ఇలా వీళ్ళంతా కేవలం తమకోసమే తాము ఎన్నడూ జీవించలేదు. ప్రపంచం కోసం జీవించారు మరి సాటి మానవాళి ఉద్ధరణకు అహర్నిశలు చేయూత అందించారు.

సత్యం తెలుసుకున్న అలాంటి వాళ్ళ జీవితచరిత్రలను అధ్యయనం చెయ్యాలి. అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళతో సజ్జనసాంగత్యం చెయ్యాలి. నకారాత్మక ఆలోచనలనూ, అప్రయోజనకరమైన ఆలోచనలనూ కలిగి వున్న వారితో సాంగత్యం చెయ్యడం అనర్థదాయకం. ముఖ్యంగా టీవీల్లో వచ్చే నిరాధారమైన ఆరోపణలతో కూడిన మీడియా చర్చలు, తలాతోక లేని సీరియళ్ళతో సాంగత్యం చేస్తూ వుంటే అది వ్యక్తినే కాదు మొత్తం వ్యవస్థనే అనారోగ్యం పాలుచేస్తుంది.

"మనం ఏ సాంగత్యం చేస్తూంటే మన ఆత్మ ప్రగతిపధం వైపు వెళ్తోంది?" అన్న ఎరుకను మనం స్వయంగా కలిగివుండాలి. నారదుని సాంగత్యం వల్ల రత్నాకరుడు వాల్మీకిగా .. బుద్ధుని సాంగత్యం వల్ల అంగుళీమాలుడు బౌద్ధభిక్షువుగా మారినట్లు .. సమకాలీన గురువుల సాంగత్యంలో మన ఆత్మకూడా ప్రగతి పథంలో ముందుకు సాగుతూ వుంటుంది!

రవి : యువతకు మీరు ఇచ్చే సందేశం?

శ్రీ సుబ్బారావు గారు : "మనం మారితే యుగం మారుతుంది" అన్నదే శ్రీగాయిత్రీ పరివార్ మూలపురుషులు పండిత శ్రీరామ శర్మఆచార్య గారు సమస్త మానవాళికి ఇచ్చిన దివ్యసందేశం!

పిరమిడ్ గురువు పత్రీజీ .. దానిని "ధ్యానం" ద్వారా శాస్త్రీయమైన విధానంలో ఆచరణలో పెట్టిస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.

ఇలా రకరకాల సాధనల ద్వారా యుగపురుషులందరూ అశ్వమేధయాగం అనే ఒక సామూహిక లక్ష్యం కోసమే పాటుపడుతూంటారు.

"అశ్వం" అంటే "శక్తి" (Horse Power)

"మేధ" అంటే "బుద్ధి" (Intellect)

"బుద్ధి"ని "శక్తివంతం" చేసే మహాప్రయత్నమే...

"అశ్వమేధయాగం!"

యజ్ఞంలో మూలికలను సమిధులుగా అగ్నిలో వేసి కాల్చడం వల్ల చుట్టుప్రక్కల వాతావరణం పరిశుద్ధం అవుతుంది. ధ్యానంలో జన్మజన్మల కర్మఫలితాలను ధ్యానాగ్నిలో వేసి కాల్చడం వల్ల .. బుద్ధి శక్తివంతం అవుతుంది. బుద్ధి ప్రకాశాన్ని పొందిన సజ్జనుల వల్లనే మంచి ఆలోచనలు వచ్చిసమాజం ఉద్ధరించబడుతుంది.

అందుకేనేమో పత్రీజీ .. పతంజలి యోగ సూత్రాలను కూడా సమకాలీన సమాజానికి అనుగుణంగా తిరిగి వ్రాస్తూ.. "యమ", "నియమం" ల కంటే ముందు "ధ్యానం" చెయ్యమన్నారు! మరేమీ మాట్లాడకుండా ధ్యానానికి కూర్చుని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆత్మానుభవాన్ని పొందమన్నారు! ఆత్మానుభవం పొందిన ఆత్మజ్ఞాని వెంట జీవనసూత్రాలన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి!

ప్రస్తుతం వున్న ఉరుకుల పరుగుల సమాజానికి ధ్యానమే సరియైన సాధన బ్రహ్మర్షి పత్రీజీకి ధన్యవాదాలు!

Go to top