" సత్యం అందరికీ తెలియజేయడమే నా లక్ష్యం "

 

ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక పూర్వ ప్రధాన సంపాదకులు "J.K. భారవి" గారు ధ్యానం గురించి మరింత సునిశితమైన విషయాలకూ, ప్రజల్లో ఉన్న అపోహలకూ సంబంధించి తమదైన బాణీ‌లో ప్రశ్నలు అడగ్గా . .పిరమిడ్ ధ్యాన జగద్గురువు పత్రీజీ .. ఇన్నర్వ్యూ ద్వారా తమదైన రీతిలో వాటికి చక్కటి వివరణలు ఇచ్చారు.

J.K. భారవి: "నమస్కారంసార్! ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాకు వెళ్ళినా ధ్యానం ఓ ప్రభంజనంలా కనిపిస్తోంది. తమిళనాడు, కర్నాటక, ఉత్తరభారతదేశం .. అబ్బో మొత్తం దేశంలో ‘ఆనాపానసతి ధ్యానం’ ఒక ప్రభంజనంలా వ్యాప్తిలోకి వచ్చేసింది. దీనికి ప్రధాన మూలపురుషులుగా ఆచార్యస్థానంలో వున్న మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను!"

పత్రీజీ: "తప్పకుండా స్వామీజీ! అడగండి!"

J.K. భారవి: "ధ్యాన ప్రక్రియ అంటే ఏంటి?"

పత్రీజీ: "‘ధ్యానం’ అంటే మనిషి తనలోకి తాన ప్రయాణించడం! ప్రతి మనిషి కూడానూ ‘ధ్యాని’ అయ్యి తన అంతరంగంలోకి తాను ప్రయాణించాలి. అది ప్రాథమిక ఆత్మవిద్య. ప్రతి ఒక్కరూ కనీసం హైస్కూల్ వరకైనా ప్రాపంచిక విద్య చదావాలి అన్నది ఎలాగైతే అవసరమో .. ప్రతి మనిషి కూడా ధ్యాని కావాలన్నది అంతకంటే అవసరం."

J.K. భారవి: "ఈ మధ్య చాలామంది డాక్టర్స్ తమతమ ప్రిస్క్రిప్షన్స్‌లలో మందులతో పాటు ‘మెడిటేషన్’ చెయ్యమని కూడా వ్రాస్తున్నారు."

పత్రీజీ: "ఆరోగ్యం అన్నది ధ్యానం ద్వారా తప్పక సమకూరుతుంది’ అని మెడికల్ సైన్స్ ఇప్పుడు బాగా గ్రహిస్తోంది. డాక్టర్స్ అందరూ కూడా ‘మందులతోపాటు ధ్యానం కూడా చెయ్యాలి’ అనడం ఆనందించదగ్గ విషయం.

"సత్యం కావాలని కోరుకోకుండా ఎవరు వుంటారు? వారు డాక్టర్ కానీ, గృహిణి కానీ, రాజు కానీ, పేద కానీ, పండితుడు కానీ, పామరడు కానీ, ప్రధానమంత్రి కానీ, ఒక దేశాధ్యక్షుడు కానీ .. ఎవరికైతే సత్యం కావాలో, ఎవరైతే శాంతిమయం అయిన జీవితం జీవించాలని కోరుకుంటారో .. వాళ్ళందరూ తప్పకుండా ధ్యానంలోకి రావలసిందే!"

J.K. భారవి: "మామూలు మనుష్యులు, వ్యాపారస్థులు, ఉద్యోగస్థులు, స్ట్రెస్‌తో, టెన్షన్‌తో వుండి ధ్యానం చేస్తే రిలీఫ్‌గా వుంటుంది, మేలు జరుగుతుంది అని వచ్చి ధ్యానం చేస్తున్న పద్ధతి ఒకటి! కానీ .. డాక్టర్స్ ఎక్కువ సంఖ్యలో ధ్యాన ప్రక్రియకు రావడం వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచించడం వల్లనేనా?"

పత్రీజీ: "అందరూ శాస్త్రీయంగానే ఆలోచిస్తారు. శాస్త్రీయ దృక్పథం అనేది డాక్టర్ల ప్రత్యేక సొమ్మేమి కాదు! అది మీ సొమ్ము .. నా సొమ్ము .. అందరి సొమ్ము కూడా! ప్రతి మనిషి కూడా శాస్త్రీయ దృక్పధం తోనే వుంటారు. ‘ఒక రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు లాభం రావాలి’ అన్నదే శాస్త్రీయ దృక్పధం. కనుక ఉపయోగం లేనిదే ఎవ్వరూ ఏ పనీ చెయ్యరు.

"ప్రతి రైతు, ప్రతి గృహణి, ప్రతి కార్మికుడు, ప్రతి సైంటిస్ట్ శాస్త్రీయంగానే ఆలోచిస్తారు. సాధారణంగా మనం శాస్త్రీయ దృక్పథం అన్నది ‘సైంటిస్టుకే వుంది’ అనుకుంటాం కానీ అది ప్రతి మనిషికీ వుంది! దాన్ని ఉపయోగించుకుని ప్రతిఒక్కరూ శాస్త్రీయ పద్ధతిలో సంతోషంగా, ఆరోగ్యంగా వుండడానికి కొంత సాధన కావాలి."

J.K. భారవి: "ఇప్పుడు మీరు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ‘ఆనాపానసతి’ అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ, ఉపనిషత్తులో కానీ వుందా? లేదా మధ్యలో ఎవరైనా కనిపెట్టారా?"

పత్రీజీ: "ధ్యానం అన్నది ఋషి సాంప్రదాయం! ఋషులందరూ ‘ద్రష్టలు’ అంటే ‘చూసేవారు’! ధ్యానం చేసే వాళ్ళు ఋషులయ్యారు. ధ్యానం చెయ్యకుండా ఎవ్వరూ ఋషులు కారు. గ్రంథాలు చదివి పండితులు అయినట్లుధ్యానం చేసి ఋషులు అవుతారు.

"‘ఆనాపానసతి’ అన్న పదం పాళీ భాషకు చెందినది! పండితులకు ఆ రోజుల్లో సంస్కృత భాష ఎలా వుందో .. అలాగే పామరులకు పాళీ భాష ఉండేది. పామరజనాన్ని దృష్టిలో పెట్టుకుని గౌతమబుద్ధుడు తన ప్రవచనాలను పాళీ భాషలో అందించాడు. పండితుల భాషకు దూరంగా, పామరుల భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఉపయోగించిన పదం ఆనాపానసతి.

"‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస’, ‘అపాన’ అంటే ‘నిశ్వాస’, ‘సతి’ అంటే కూడుకుని వుండడం; మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకుని వుండడం ధ్యానం అని గౌతమబుద్ధుడు అనాదిగా వున్న ప్రక్రియకు మొట్టమొదటిసారి ఆ పదజాలం చేర్చారు. ఇప్పుడు పాళీ భాష లేదు కనుక దానికి కాస్త సమాంతరమైన తెలుగు పదజాలంలో ‘శ్వాస మీద ధ్యాస’ గా దానిని అందిస్తున్నాం."

J.K. భారవి: "మరి రకరకాలైన ధ్యానాలను గురించి వింటున్నాం!"

పత్రీజీ: "రకరకాల మనస్తత్వాలను బట్టే రకరకాల ధ్యానాలు ఉంటాయి. రకరకాలైన మనస్తత్వాలు కృతయుగంలో ఉన్నాయా? లేవా? కలియుగంలో ఉన్నాయా? లేవా? ఇండియాలో వున్నాయా? లేవా? కనుక రకరకాల మనస్తత్వాలు, రకరకాల ధ్యాన పద్ధతులు కూడా అప్పుడు ఇప్పుడూ, అన్ని చోట్లా వుంటాయి అది సహజం."

J.K. భారవి: "వాటన్నింటిలో శాస్త్రీయమైన విధానంగా బుద్ధుడు చెప్పిన ‘అనాపానసతి’ చాలా సరళంగా, సులభంగా ఫలితాలిచ్చే విధంగా కనిపిస్తుందేమో! అందుకే ఎక్కువమంది దీనికి ఆకర్షితులు అవుతున్నారని నేను భావిస్తున్నాను. నిజంగా అంత శాస్త్రీయమైన దృక్పధం వుందా దీంట్లో?"

పత్రీజీ: "‘శాస్త్రీయం’ అంటే ‘A+B=C+D' .. ఒకే ఉష్ణోగ్రతా, పీడనాల వద్ద అలాగే వుంటుంది! o.k నువ్వు ఉష్ణోగ్రత మార్చావనుకో, పీడనాన్ని మార్చావనుకో! ‘A+B=D+E'. ఇంకొంచెం ఉష్ణోగ్రత మారిస్తే అదే సంయోగం ‘A+B=X+Y' ని ఇస్తుంది. ఇవన్నీ శాస్త్రీయమే.

"మీరొక మంత్రం చెప్పారు. ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం రావాలో .. ఆ ఫలితం వస్తుంది. అది ‘శాస్త్రీయం’ కాదా? నేను మీకు సేవ చేసాను. సేవ చేస్తే మీరు నన్ను అన్ని ఉర్లూ తిప్పారు. నాకు అది లాభం! అది ‘శాస్త్రీయం’ కదా? ఏ పని చేస్తే ఫలితం వస్తుందో చెప్పేది ‘శాస్రం’.

"బుద్ధుడు ‘శాస్త్రం వెనుక వున్న శాస్త్రం’ కనుకున్నాడు .. అదీ ఆయన అసలు గొప్పతనం! కనిపించే శాస్త్రం ఒకటి వుంటుంది .. ‘కనిపించని శాస్త్రం! ఒకటివుంటుంది! కనిపించే శాస్త్రం వెనుక వున్న కనిపించని శాస్త్రాన్ని ఆయన తన దివ్యచక్షువు ద్వారా తెలుసుకున్నాడు?"

J.K. భారవి: "శ్వాస మీద ధ్యాసకూ .. శివుడికి వున్న ‘మూడోకన్ను’ అంటే అంతర్‌చక్షువుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?"

పత్రీజీ: "శ్వాస మీద ధ్యాస ద్వారానే .. అంతర్‌చక్షువు ఉత్తేజితం అవుతుంది.

"గౌతమబుద్ధుడికి చిన్నప్పుడే అంతర్‌చక్షువు వుండేది. గౌతమబుద్ధుడికే కాదు ప్రతి పిల్లవాడికీ వుంది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ .. మీరు కూడా చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు కూడా మీ అంతర్ చక్షువుతో అన్నీ చూసేవారు. చనిపోయినవారినీ, చనిపోనివారినీ, దేవతలనూ, ఋషులనూ, అందరినీ చూసేవారు! కానీ కాస్త వయస్సు వచ్చేసిన తర్వాత రకరకాల ఆలోచనలు భారంతో ఆ అంతర్ చక్షువు మూసుకుని పోయింది.

"అందుకే గౌతమబుద్ధుడు పోగుట్టుకున్నదానిని రాబట్టుకోవడం కోసం రకరకాల గురువుల దగ్గరికి ఐదేళ్ళు తిరిగాడు! వాళ్ళు చెప్పినవన్నీ చేశాడు. అయినా తనకి ‘అదేదో’ రావడం లేదు. ‘ఇంకెలా వస్తుందో?’ అని ఆలోచించి .. అసలు ఏం చెయ్యకుండా కూర్చున్నాడు. ఆ సహజ స్థితిలో అతనికి ఆలోచనా రహితమైన బాల్యస్థితి వచ్చేసింది. ఆ బాల్యస్థితిలో అతని దివ్యచక్షువు తెరుచుకుని .. ఆ దివ్యచక్షువుతో అంతా పరిశోధన చేసాడు. ‘నాలాగే ఈ దివ్యచక్షువు అందరికీ సులభంగా రావటానికి ఏం చెయ్యాలి?’ అని మళ్ళీ ఆ దివ్యచక్షువు ద్వారానే చూసి ‘శ్వాస మీద ధ్యాస ద్వారానే దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవచ్చు’ అని తెలుసుకున్నాడు."

J.K. భారవి: " మార్వెలస్! అందుకే జనసామాన్యమంతా ధ్యానపథంలోకి వచ్చేస్తున్నారు?!"

పత్రీజీ: "ఏసుప్రభువు కూడా ‘మీరు పసివాళ్ళుగా మారనంతవరకూ దేవుని సామ్రాజ్యంలో అడుగుపెట్టలేరు ‘ (unless you become like a child, you cannot enter the Kingdom of God) ' అని తేల్చి చెప్పారు. ఎవరయితే శ్వాస మీద ధ్యాస పెట్టి చిన్నపాపల్లా అయిపోతారో వాళ్ళు దేవుని రాజ్యంలో వున్నట్లే!"

J.K. భారవి: "అందుకే పసిపిల్లలు పరమాత్మస్వరూపులని మనం అంటాం!"

పత్రీజీ: "కరెక్ట్! పసిపిల్లల్లాంటి మనస్తత్వం కావాలి అంటే మనం ఆచరించాల్సిన అత్యుత్తమ సాంకేతిక పద్ధతి.. శ్వాస మీద ధ్యాస!"

J.K. భారవి: "అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల మనం ఒక పసిపిబిడ్డలాగా అవుతాం! మరి శూన్యస్థితి ఆ విధంగా ఎలా వస్తుంది!"

పత్రీజీ: " ఆ శూన్యస్థితి రావడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు, సేవలు రకరకాల కఠోరతపస్సులు రూపంలో ఎంతోమంది పరిశోధనలు చేసారు. కానీ గౌతమ బుద్ధుడు మాత్రం తన దివ్యచక్షువుతో ‘శ్వాస మీద ధ్యాస పెడితే చక్కగా ఆ శూన్యస్థితిని వెంటనే పొందుతాం’ అని తెలుసుకున్నాడు."

J.K. భారవి: "వెంటనే అంటే .. వెంటనే .. ఎవరికైనా వస్తుందా?"

పత్రీజీ: "మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకు తొందరగా వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకు అహంకారం ఎక్కువ! అలాగే పట్టణవాసులకన్నా పల్లెవాసులకు తొందరగా శూన్యస్థితి వస్తుంది ఎందుకంటే పట్టణ వాసులకు కొంచెం ‘అతితెలివి ’ఎక్కువ! అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పామరులకు తొందరగా వస్తుంది. చదువుకున్నవాళ్ళకు కొంచెం గర్వం ఎక్కువ! ఆ గర్వమే లేకపోతే అందరికీ ఆ శూన్య స్థితి అత్యంత సులభంగానే వచ్చేస్తుంది. గర్వం ఉండకూడదు. పిల్లవాడికి గర్వం ఉందేమిటి? పిల్లలు కొట్లాడుకుంటారు కానీ వారికి .. గర్వం అహంకారం ఉండదు.

"సంగీతం సామ్రాట్టు అయిన త్యాగరాజులవారు తన సంగీతంతో ఆ శూన్యస్థితిని సంపాదించుకుని రామభక్తిలో తాదాత్మ్యం చెందారు. అప్పుడు ఆయనకు దివ్యచక్షువు తెరుచుకుని రామచంద్రడు బాణాలతో కనపడినప్పుడు, ‘రా రా మా ఇంటిదాకా’ అనే కీర్తన పాడాడు. ఆయన ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టకపోయినా పసిపిల్లవాడిలా సహజంగా తయారయ్యాడు. మనం శ్వాస మీద ధ్యాస అనే సులభమైన టెక్నాలజీతో ఆ శూన్యస్థితిని అత్యంత సహజంగా పొందుతాం!"

J.K. భారవి: " ‘పిరమిడ్’ అనేదానికీ, బుద్ధుడు చెప్పిన ‘ఆనాపానసతి’కీ ఏమిటి సంబంధం?"

పత్రీజీ: ఏ సంబంధమూ లేదు! ఇప్పుడు ‘A.C.' కీ, మనం ఈ ‘గది’ లో కూర్చోవటానికీ ఏమైనా సంబంధం వుందా?

"‘A.C.' లో వుంటే బావుంది కదా! ‘A.C.’ అనేది, వేరే టెక్నాలజీ..‘గది’ అన్నది వేరే టెక్నాలజీ. అలాగే ‘పిరమిడ్ ఎనర్జీ’ అనేది ఒక విశిష్టమైన టెక్నాలజీ! ‘పిరమిడ్’ అనబడే ఒకానొక అత్యుత్తమమైన క్షేత్రిమితీయ ఆకారంలోని శక్తి .. తనలో తాను సుడిగుండంలా తిరుగుతూ ఒక శక్తిక్షేత్రంగా రూపుదిద్దుకుంటుంది. అందులో కూర్చుని ధ్యానం చేస్తే ఆలోచనలన్నీ స్తంభించిపోయి మనకు శూన్యస్థితి అతి తొందరగా వస్తుంది."

J.K. భారవి: "అంటే ఇప్పుడు ఆనాపానసతి ధ్యానాన్ని పిరమిడ్‌లో చేస్తే ఎక్కువ ఫలితం వుంటుందన్నమాట!

పత్రీజీ: "పిరమిడ్‌లో పడుకుంటే తొందరగా నిద్ర కూడా వస్తుంది. పిరమిడ్‌లో ఏం చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది! మూడింతలు ఎక్కువ. మీరు ఊరికే పోయి పడుకోండి. నిద్ర బాగా వస్తుంది. మీరు ఊరికే కూర్చోండి. మీ ఆలోచనలు స్తంభించిపోతాయి.

"ఎన్నో చోట్ల శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగాలు చేసి పిరమిడ్ శక్తిని తెలుసుకుంటున్నారు. నేను కూడా ఎన్నో పుస్తకాల నుండి ఈ విషయాలను తెలుసుకుని నా పరిధిలో ప్రయోగాలు చేసి దాని విశిష్టతత్వాన్ని అవగతం చేసుకున్నాను కనుక అందరికన్నా ఎక్కువ ప్రచారం చేస్తున్నాను.

J.K. భారవి: "‘ధ్యానం ప్రచారం చెయ్యాలి’ అని అసలు మీకు ఎందుకు అనిపించింది?"

పత్రీజీ: "ఎందుకు అనిపించకూడదు?! కోటి విద్యలూ కూటి కొరకే అన్నట్లు చదువులు, ఉద్యోగాలు కూటి కోసం చేసే ఎక్సట్రాలు! ఆత్మతత్వం పుట్టినప్పటి నుంచే అసలు పని వుంటుంది."

J.K. భారవి: "‘గ్లోబ్‍ను కౌగిలించుకోవాలి .. ఈ గ్లోబ్‌కి ధ్యానం గురించి చెప్పాలి’ అన్న తపన మీలో ఎలా మొదలైంది?"

పత్రీజీ: "ఆ తపన ఊరికే యాధాలాపంగా ఏమీ మొదలవ్వలేదు. ముందుగా ‘సత్యం తెలుసుకోవాలి’ అని మొదలై, ఆ తెలుసుకున్న సత్యాన్ని ఒకరిద్దరికి చెప్తూఉంటే ., ‘ఇంకా, ఇంకా పదిమందికీ చెబితే బాగుంటుంది’ అనిపించింది. దాంతో కుటుంబ పోషణార్థం అప్పటి వరకూ నేను చేస్తున్న ఉద్యోగానికి రాజినామా చేసేసాను; మరి నిరంతర ధ్యానప్రచారం చేస్తూ, చేస్తూ వస్తున్నాను. ప్రపంచానికంతటికీ ధ్యానం చెప్పాలన్నదే నా లక్ష్యం!"

J.K. భారవి: "ఈ దృక్పధంలోకి రావడానికి మీకేమైనా ప్రేరణ?

పత్రీజీ: "నేను నా ఆప్తమిత్రుడు, కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా ఈ ధ్యానం యొక్క లాభాలను గ్రహించాను. వారు మొదట ధ్యానం చేసి దాంట్లో ఉన్న లాభాలన్నీ పొందారు. ఆయనకు 1976,77 లోనే దివ్యచక్షువు వికసించింది. వారి అనుభవాలను విని నేను కూడా ధ్యానం చేసి ‘దీంట్లో ఇంత వుంది కదా’ అని రకరకాలుగా పరిశోధించి, అందులోని శాస్త్రీయతను గ్రహించి దానిని స్వానుభవంతో మేళమించి .. ఒక్కరోజు అని చెప్పలేం కానీ .. క్రమక్రమంగా అంతా వచ్చింది."

J.K. భారవి: "మీ జీవితం దీనికి అంకితం చేసేసారా?"

పత్రీజీ: "నేను క్రికెట్ ఆటకు కూడా అంకితమే! మొన్న మ్యాచ్ అంతా చూశాగా!"

J.K. భారవి: "మీకు ఫ్యామిలీ ఉందాండి? మామూలు గురువులలాగ ‘సన్యాసం’ అదీ లేదా?"

పత్రీజీ: "మీకు లేదా ‘ఫ్యామిలీ’? నాకొద్దంటారా ‘ఫ్యామిలీ’? ఏంటి సంగతి?!

J.K. భారవి: "ధ్యానం చేసేవాళ్ళకు ఫ్యామిలీ ఉండొచ్చా?"

పత్రీజీ: "అంటే వద్దనా మీ ఉద్దేశం?"

J.K. భారవి: "ఇదివరకు చేసినవాళ్ళందరూ .. హిమాలయాలకు వెళ్ళారు కదా?"

పత్రీజీ: "ఎవరు చెప్పారు? కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు లేరా? ఆయన యోగీశ్వరడు కాదా? వశిష్టుడు, అరుంధతి గొప్ప యోగీశ్వరులు కాదా?"

J.K. భారవి: "‘సన్యసించటం’ అదీ .. అక్కరలేదా?"

పత్రీజీ: "అదే పెద్ద అపోహ! అది తీసివేయడం కోసమే ‘రామాయణం’, ‘మహాభారతం’ అన్నీ వచ్చాయి! వాళ్ళు అంతగా చెప్పిన తర్వాత కూడా మనకు ఇంకా అపోహలా? వాల్మీకి, వేదవ్యాస .. అంతటి మాస్టర్స్ వచ్చి చెప్పినా కూడా మనకు ఇంకా అపోహలు ఏమిటి? రావణాసురుడు అంతమంది భార్యలను పెట్టుకుని పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకోలేదా?!

"అసలు సన్యాసం అంటే సరయిన నిర్వచనం సమ్యక్+న్యాసం=సన్యాసం. ‘సమ్యక్’ అంటే ‘సరైన’ .. ‘న్యాసం’ అంటే ‘విడిచిపెట్టడం’. సరైనది వదిలిపెట్టేసేదాన్ని ‘సన్యాసం’ అంటారు. సత్యాన్ని వదిలిపెట్టేస్తే ‘పిచ్చోడు’ అంటారు కానీ ‘సన్యాసం’ అనరు. నిజానికి తమోగుణాన్ని వదిలిపెట్టేసి, రజోగుణాన్ని వదిలిపెట్టేసి శుద్ధసాత్వికులు కావడమే సన్యాసం".

J.K. భారవి: "అద్భుత విషయం! ఇంతవరకు మాకు సన్యాసం గురించి అవగాహన ఏంటంటే పెళ్ళాన్ని వదిలిపెట్టడం, బిడ్డల్ని వదిలిపెట్టడం, లేదా ఆస్తుల్ని వదిలిపెట్టేసి గెడ్డం పెంచుకోవడం .."

పత్రీజీ: "అలాంటి సన్యాసుల్ని ‘మర్కటసన్యాసలు’ అంటారు. సన్యాసాలు నాలుగు రకాల వున్నాయి:

"పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయాలకు పోయి అక్కడ ఇంకో పెళ్ళాన్ని పెట్టుకుంటే వాడు మర్కట సన్యాసి.

"చచ్చిపోయే ముందు సన్యాసం పుచ్చుకునేవాడు ‘ఆపత్ సన్యాసి’. అంటే ఇంకో రెండు నిమిషాలలో చచ్చిపోతాడు అనగా .. పై లోకాల్లో మోక్షం రిజర్వు చేసుకోవడం కోసం .. అన్నీ వదిలేయడం.

"సత్యం కోసం తపించి అన్నీ వదులుకుని .. వివేకానందుడిలా సన్యాసం చేసినవారిని ‘వివిదశ సన్యాసులు’ అంటారు. అంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సత్యం వుందో అని అన్వేషిస్తూ పోవడం.

"ఇకపోతే శ్రీ రామకృష్ణ పరమహంస చేసింది ‘విద్వత్ సన్యాసం’. ఆయన ఎక్కడికీ వెళ్ళలేదు .. ఎవ్వరినీ వదిలి పెట్టలేదు; తనలోని తమో రజో గుణాలు వదిలిపెట్టాడు; అది ‘విద్వత్ సన్యాసం’".

J.K. భారవి: "సన్యాసం అంటే మామూలుగా కాశీకి వెళ్ళి మాకేది ఇష్టం లేదో అది వదిలిపెట్టడం లాంటిది అనుకున్నాం. ఇది ఇలాంటిది కాదన్నమాట! దీంట్లో వున్న కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది కాబట్టే ఇవ్వాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు! మరి పూర్వకాలం ఋషులంతా పెద్ద ‘మంట’ పెట్టుకుని."

పత్రీజీ: "వాళ్ళంతా చేసింది ‘యాగాలు’! "యాగాలు’, ‘హోమాలు’ ఏదైనా ఒకానొక మహత్ ప్రజాహిత కార్యక్రమానికి సంకల్పం పెట్టుకుని చేసేవి! ధ్యానానికీ, దానికీ సంబంధమే లేదు!

"ఒకానొక రాజుకు ఒక కొడుకు పుట్టాలనో లేదా ఒకానొక రాజ్యంలో అరిష్టం పోవాలనో ఇలాంటి యాగాలు చేస్తూంటారు. ప్రజలంతా ధ్యానులు కాదు కనుక ఒక ‘హోమం’, ఒక ‘యాగం’ చేసి అందరి సంకల్పం అందులో ప్రతిష్ఠ చేసేవారు.

"దశరథుడు ‘పుత్రకామేష్ఠి’ యాగం చేశాడు. అది రాజ్యానికి సంబంధించింది కనుక అందరి సమక్షంలో .. ఆ హోమం చేస్తేనే దాని ఫలితం దక్కుతుంది. తాను మాత్రమే ధ్యానంలో కూర్చుంటే .. అది అందరికీ కనపడదు కనుక అందరినీ పిలవాలని యాగం చేశాడు. ధ్యానం ఒక టెక్నాలజీ అయితే యాగం వేరే టెక్నాలజీ .. రెండింటి ప్రయోజనాలు వేరు .. వేరే!"

J.K. భారవి: "మరి "సామూహిక ధ్యానం?"

పత్రీజీ: "సామూహిక ధ్యానం మూడింతలు శక్తివంతం .. పిరమిడ్‌లో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం .. పున్నమిరాత్రుల్లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం .. ఒకానొక యోగీశ్వరుడి సమాధి దగ్గర కూర్చుని చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం .. అలాగే అడవిలో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం; ప్రతి చెట్టు కూడానూ ఒక గొప్ప కాంతిపుంజం కనుక అడవిలో చెట్ల మధ్య ధ్యానం మూడింతలు శక్తివంతం. చక్కటి సంగీతంతో కూర్చుని చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం."

J.K. భారవి: "ఇప్పుడు ఈ ధ్యానం చెయ్యాలంటే ఎంత ఖర్చుపెట్టాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి?"

పత్రీజీ: "24 గంటలలో కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించి దానిని ‘పెట్టుబడి’ గా పెట్టాలి".

J.K. భారవి: "‘డబ్బులు’ కాదా?"

పత్రీజీ: "‘సమయం’..అన్నది ‘పెట్టుబడి’ కాదా? ‘పెట్టుబడి’ అంటే ఏమిటి? ‘ఇన్‌పుట్’! అంటే ఒక వస్తువు తయారు చెయ్యాలంటే ఏ ఏ ముడి వస్తువులు కావాలో వాటిని ‘పెట్టుబడులు’ అంటారు. ‘పెట్టుబడి’ లేకుండా ఏదీ రాదు! ప్రతిదానికీ ‘పెట్టుబడి’ వుంటుంది.

మనం తెలుగు నేర్చుకోవాలి అంటే గురువు గారి దగ్గరికి రోజూ వెళ్ళి రావడమే ‘పెట్టుబడి’! అలా చెయ్యకపోతే భాష ఎలా వస్తుంది? సంగీతం నేర్చుకోవాలి అంటే రోజూ గురువు గారి దగ్గరికి వెళ్ళి నాలుగు గంటలు కూర్చోవాలా, వద్దా? అది ‘పెట్టుబడి’ కాక మరేమిటి? ధ్యానానికి పెట్టుబడి ‘సమయం’ .. అది లేకపోతే ధ్యానం రాదుగాక రాదు."

J.K. భారవి: "అంటే ..క్వాలిఫికేషన్..టెన్త్ క్లాస్ చదువుండాలి ఇలా .. వేరే ఇంకేమి అక్కరలేదా?"

పత్రీజీ: "ఏ విద్యనేర్చుకోవడానికి కావలసిన అర్హత ‘శ్రద్ధ!’ శ్రద్ధ అన్నదే ప్రధాన పెట్టుబడి. ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అంటే ‘శ్రద్ధ’ అనే పెట్టుబడితో ‘జ్ఞానం’ అనేది రాబడి వస్తుంది."

J.K. భారవి: "శ్రద్ధ ఉంటే చాలా?"

పత్రీజీ: "ఏమయ్యా బాబు! ‘శ్రద్ధ’ ఉంటే ఇంకేం కావాలి? బిర్లాకూ, టాటాకూ శ్రద్ధ ఉండబట్టే అంతటి కోటీశ్వరులు అయ్యారు. మనకి దేనిపట్ల శ్రద్ధ వుంటుందో దానికి చెందిన జ్ఞానం వస్తుంది. మనకి ‘శ్రద్ధ’ అనేది పెట్టుబడి .. ‘జ్ఞానం’ అనేది రాబడి. ధ్యానానికి పెట్టుబడిగా సమయాన్ని సరిఅయినంతగా కేటాయిస్తే రాబడిగా ధ్యానలాభాలన్నీ వస్తాయి. పెట్టుబడి పెట్టకుండా ఏదైనా ఎలా వస్తుంది? అది అశాస్త్రీయం!"

J.K. భారవి: "ఎవరైనా చెయ్యవచ్చాండీ ఈ ధ్యానం? అంటే ఒక 40 లేక 50 ఏళ్ళ తర్వాత చెయ్యాలా? లేక చిన్నపిల్లలు కూడా చెయ్యవచ్చా?"

పత్రీజీ: "ఐదేళ్ళ లోపు పిల్లలకు దివ్యచక్షువు తెరుచుకునే వుంటుంది కాబట్టి వారికి ధ్యానం అక్కరలేదు. తర్వాత నుంచి క్రమక్రమంగా దివ్యచక్షువు తరిగిపోతూ వుంటుంది కనుక అప్పటి నుండి అందరూ ధ్యానం తప్పక మొదలుపెట్టాలి."

J.K. భారవి: "ఎంతసేపు చెయ్యాలి ధ్యానం?"

పత్రీజీ: "రెండు పక్షాలు వున్నాయి; ఒకటి "కనీస పక్షం’.. రెండు ‘ఉత్తమ పక్షం’..

"కనీస పక్షంగా ఐదేళ్ళు దాటిన తర్వాత ఎవరి వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ఇక ఉత్తమ పక్షంగా ఆకాశామే హద్దు! చేసుకున్నవారికి చేసుకున్నంత! పెట్టుబడి పెట్టుకున్న వాడికి పెట్టుబడికి తగిన లాభం!"

J.K. భారవి: "చిన్న పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందే ‘చిట్కా’ పద్ధతి ఏమైనా దీంట్లో వుందా?"

పత్రీజీ: "అది ఎక్కడా లేదు! ఇందులో కూడా లేదు!"

J.K. భారవి: "ధ్యానం చేసేటప్పుడు ఒకానొక ధ్యానికి ఎలాంటి అనుభూతి స్థితిలు వస్తాయి?"

పత్రీజీ: "రకరకాల అనుభూతి స్థితులు వస్తాయి. శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది. శరీరం ఎక్కడికో ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది. సంగీతాలు వినపడుతూంటాయి. అనాహత నాదాలు వినబడుతూంటాయి. మనకు లోపలంతా శక్తి సంచారం తెలుస్తూ వుంటుంది. అంతకుముందు లేని నొప్పులు వస్తూంటాయి. ఉన్న నొప్పులు పోతూంటాయి."

J.K. భారవి: "లేని నొప్పులు వస్తాయా??"

పత్రీజీ: "వస్తాయి!! హాలాహలం మొదట వస్తుంది కదా!"

J.K. భారవి: "నొప్పులంటే .. శరీరం తట్టుకోలేనంతగా వస్తాయాండి?"

పత్రీజీ: "చచ్చిపోయేంత వస్తాయి!

J.K. భారవి: "అంటే మొత్తం శరీరం అంతా పిండేసినట్లు అవుతుందా??"

పత్రీజీ: "చేసి చూడండి స్వామీజీ! గతజన్మల్లో పాపం చేసుకుంటే ధ్యానం అన్నది ఈ జన్మలో పిండేస్తుంది! గతజన్మల్లో పుణ్యం చేసుకుంటే ధ్యానం అన్నది ఈ జన్మలో హాయిగా వుంటుంది. అసలు ధ్యానం చేసినట్లే తెలియదు."

J.K. భారవి: "‘పునర్జన్మలు’ నమ్ముతారా మీరు?"

పత్రీజీ: "ఒక మనిషి నమ్మినా, నమ్ముకపోయినా అవి వున్నాయి. గతజన్మల కొనసాగింపే ఈ జన్మ .. మరి గతజన్మల కర్మల సారమే .. వర్తమాన జన్మ కర్మ!"

J.K. భారవి: "మనుష్యులే మనుష్యులుగా పుడతారా? లేకపోతే పురాణాల్లో చెప్పినట్లు పాపం చేస్తే .. క్రిమికీటకాలై పుడతారా?

పత్రీజీ: "అవి ప్రజలను ఆధ్యాత్మికపరంగా భయపెట్టడానికి కొందరు వ్రాసిన ‘పనికి వచ్చే’ చిలిపి వ్రాతలు!"

J.K. భారవి:" ధ్యానంలో ముక్తస్థితి కలుగుతుందా?"

పత్రీజీ: "ముక్తస్థితి అంటె తనను తాను పూర్ణంగా తెలుసుకున్న స్థితి; అది ధ్యానంలో మాత్రమే కలుగుతుంది."

J.K. భారవి: "ఇంక వేరే ప్రక్రియ లేదా?’

పత్రీజీ: "వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి భోంచేసినట్లు వుంటుంది."

J.K. భారవి: "అంటే మీరు ఏ పద్ధతులనూ ఖండించకుండా ఇది సులభమైన పద్ధతి అని చెబుతున్నారా?"

పత్రీజీ: "‘అది కష్టం’, ‘ఇది సులభం’ అని కాదు! చాలామంది తమకే తెలియకుండా తమకు తాముగా ఎన్నో అవాంతరాలను కల్పించుకుని కొన్ని పద్ధతుల్లో చేస్తూంటారు.

ఇప్పుడు నేను ఇలా గాలిలో చేయి తిప్పుతూ భోంచేశాననుకోండి. ఇది ‘కష్టమైంది’ అంటారా? లేదా? నాకై నేను కష్టాలు ఎందుకు కల్పించుకుంటాను? తెలియక కల్పించుకుంటాను! తెలిసి ఎవరైనా చేస్తారా? నోరు ఎక్కడుందో తెలియక .. తిప్పి తిప్పి చివరకు నోటి దగ్గరికి వస్తారు. ‘శ్వాస మీద ధ్యాస’ అనే ‘సరియైన ధ్యాన పద్ధతి’ ని బోధిస్తూ అందరికి నోరు ఇక్కడే వుందని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ పుట్టింది!"

Go to top