" కోటి మందికి ధ్యాన పరిచయం చేయడం నా లక్ష్యం "

M.C. ఓబయ్య

కడప హనుమ పిరమిడ్ కేంద్రం సీనియర్ ధ్యాని M.C.ఓబయ్య గారితో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు.


" మీ గురించి చెప్పండి "

"నా పేరు M.C.ఓబయ్య . నేను APSRTC లో ఉద్యోగం చేస్తున్నాను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది?"

ఓబయ్య : " 1999, జూలై నెలలో కడపలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు నేరుగా లోపలికిపోయి చూశాను. అక్కడ పత్రిసార్ ధ్యానం గురించి వివరించారు. అదే నా తొలి ధ్యాన భాగ్యం. "
"పత్రీజీతో పరిచయం కూడా అదే రోజు జరిగింది. "

ధ్యానాంధ్రప్రదేశ్ : "ధ్యానానికి పూర్వం జీవితం ఎలా వుండేది?"

ఓబయ్య : "శారీరక, మానసిక స్వస్థత కోసం ఎన్నో గుళ్ళు, గోపురాలు తిరగాను. ఎందరో స్వామీజీలనూ, బాబాలనూ కలిసాను. ఎన్నో మంత్ర జపాలూ, ఎన్నెన్నో ఉపవాస దీక్షలూ చేసాను. కానీ ఫలితం శూన్యం. ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడితో బాధపడేవాడిని."

ధ్యానాంధ్రప్రదేశ్ : తొలిరోజు మీ ధ్యాన అనుభవం తెలపండి?"

ఓబయ్య : "ధ్యాన యజ్ఞంలో పత్రీజీ వివరించినట్లు నేను ధ్యానం చేసాను. మొదటిసారే గంట సేపు ధ్యానంలో నిశ్చలంగా కూర్చోగలిగాను. అయితే ఓ పదినిమిషాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ పొందని అనిర్వచనీయమైన ఆనందానుభూతిలో ఓలలాడాను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీకెలాంటి ధ్యానానుభవాలు కలిగాయి?"

ఓబయ్య : "ధ్యానానుభవాలు రెండు రకాలు
ఒకటి భౌతిక శరీరానికి సంబంధించినవి.
రెండు ఆధ్యాత్మికపరమైనవి.
శరీరానికి సంబంధించి పూర్తి అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. అలాగే అపూర్వ సంకల్పశక్తి ఒనగూడింది.
ఆధ్యాత్మికంగా అయితే...

సూక్ష్మశరీరయానంతో ఎందరో యోగులను కలిసాను. ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకున్నాను. ధ్యానానికి మునుపు నాకు విపరీతమైన భయం వుండేది. నా భయాన్ని పోగొట్టడం కోసం మాస్టర్స్ తనను అగాధాల్లోకి తోసివేసేవారు. అలా కొన్నిరోజులకు భయం నుంచి విముక్తి కలిగించారు.

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీ పూర్వజీవితానికీ, ధ్యాన జీవితానికీ ఏమైనా భేదం కనిపించిందా?"

ఓబయ్య : "ధ్యానానికి పూర్వం అస్తవ్యస్తమైన, లక్ష్యం లేని మార్గంలో వున్న నేను ధ్యానంతో నిజమైన, అద్భుతమైన మార్గంలో ప్రవేశించాను. ఇక ఆ మాధుర్యాన్ని ప్రతిక్షణం అనువిస్తూనే వున్నాను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీ అనుభవాల్లో మీ హృదయాన్ని స్పృశించిన అనుభవమేదైనా వున్నాయా?"

ఓబయ్య : "ధ్యానం ప్రారంభించిన తొలినాళ్ళలో 15 రోజులైనా ఇక ఓ ఐదు రోజులు ధ్యానం చేసి నిలిపేద్దామనుకుంటూ ధ్యానంలో కూర్చున్నప్పుడు పూర్తిగా నో మైండ్ స్థితికి చేరుకున్నాను. నా ఎదురుగానే పత్రిసార్ కూర్చుని ధ్యానాన్ని ఆపకూడదని చెప్పారు. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీరు చదివిన తొలిపుస్తకం ఏమిటి?"

ఓబయ్య : "తులసీదళం."

ధ్యానాంధ్రప్రదేశ్ : ఆ పుస్తకంపై మీ అనుభూతిని తెలపండి?

ఓబయ్య : "తులసీదళం నిజంగా అద్భుతమైన పుస్తకం. ఇంతవరకూ మనం చదివిన పుస్తకాలకు ఇది ఎంతో భిన్నంగా వుంది. ఆ పుస్తక పఠనం తరువాతే నిజమైన ఆధ్యాత్మిక మార్గానికి జవాబు దొరికింది."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీ ధ్యాన ప్రచారం ఎలా సాగుతుంది?"

ఓబయ్య : "ఇప్పటి వరకు సుమారు 400 క్లాసులను నిర్వహించాను. ప్రతి రోజూ నా డ్యూటీ అనంతరం నేరుగా ధ్యాన ప్రచారానికి వెళతాను. ప్రస్తుతం లక్షమందికి ధ్యాన పరిచయం చేశాను. కర్ణాటక రాష్ట్రంలో కూడా ధ్యాన ప్రచారానికి వెళ్ళాను. విధ్యార్థులకు, పోలీసులకు, జైల్లో ఖైదీలకు, జిల్లాలో అనేక ఆఫీసు సిబ్బందికి, గ్రామీణ ప్రజలకు ధ్యాన బోధ చేశాను."

అదేవిధంగా ఆలిండియా రేడియో ద్వారా 'నేటి జీవన విధానం - ధ్యాన ఆవశ్యకత' పేరుతో ప్రతి నెలా ఒక రోజు 15 నిమిషాల ప్రసంగం చేస్తున్నాను." "బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పాటు ఇతర ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేస్తాను." "20 గంటల పాటు ఏకధాటిగా ధ్యాన బోధ చేయగలను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "ధ్యాన ప్రచారంలో మీ అనుభూతులు ఏమిటి?"

ఓబయ్య : "కడప జిల్లాలో ఒకేరోజు ఆరు క్లాసులు తీసుకుని మూడువేలమందికి శిక్షణ ఇచ్చాను."

"కడప సెంట్రల్ జైలులో ఖైదీలందరీ చేతా చక్కగా ధ్యానం చేయించాను. ఈ రెండు అనుభవాలూ నాకు చాలా శక్తినిచ్చాయి."

ధ్యానాంధ్రప్రదేశ్ : "పత్రిగారితో మీ మరపురాని అనుభవం గురించి చెప్పండి?"

ఓబయ్య : " 1999 సంవత్సరం తుంబురు తీర్థం ట్రెక్కింగ్‌లో అర్ధరాత్రి 1.00 గంటకు పత్రిసార్‌తో ఓ కాలువ దగ్గర కూర్చున్నప్పుడు 2000 సంవత్సరం తరువాత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల అభివృద్ధి, విస్తరణ, ప్రజలంతా ధ్యానం వైపుకు ఎలా పరుగులు తీస్తారు, త్వరలోనే రాబోతున్న పిరమిడ్ యుగం, భవిష్యత్ కార్యకలాపాలు గురించి వివరించారు. అప్పటి మాటలు ఇప్పుడు కళ్ళముందు సాకారం కావడం నిజంగా అద్భుతమైన విషయం."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీ లక్ష్యం గురించి ఏమిటి?"

ఓబయ్య : "కోటి మందికి ధ్యాన పరిచయం చేయడమే నా లక్ష్యం."

ధ్యానాంధ్రప్రదేశ్ : "మీ గురించి ఇతర విషయాలు తెల్పండి?"

ఓబయ్య : "కడప పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా వున్నాను."

"మైత్రేయ బుద్ధా ధ్యాన విశ్వాలయం, బెంగళూరుకు కడప తరుపున కన్వీనర్‌గా చేస్తున్నాను."

ధ్యానాంధ్రప్రదేశ్ : "ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీరిచ్చే సందేశం?"

ఓబయ్య : "సమస్త ఆధ్యాత్మిక రహస్యం ఒక మహా నిశ్శబ్దంలో దాగివుంది. మీరు ఆ స్థితికి చేరాలంటే ధ్యానమే ఏకైక మార్గం. ఈ భూమి మీద సమస్త జీవన మాధుర్యాన్ని పొందాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం తప్ప మరో మార్గమే లేదు."

 

 

దేవ ఆదిన
ఇంటర్వ్యూ
కడప

Go to top