" జైలులో పద్ధెనిమిది రోజులు - ధ్యానప్రచారం ! "

 

" ప్రతికూల పరిస్థితులన్నీ మన అనుభవాల కోసమే మరి వాటిని మనకు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడం పిరమిడ్ మాస్టర్గా మన చేతిలోనే వుంది" అన్న విషయం తెలిపే అనుభవమే ఇది.

నా పేరు నీలిమ.

మాది గుడివాడ. నాకు ఇద్దరు పిల్లలు. మాది డిపార్ట్మెంటల్ స్టోర్స్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అయిన సురేంద్ర, దేవి, రాజకుమారిగార్ల సహకారంతో " 2008 బెంగుళూరు ధ్యాన మహాయజ్ఞం"కు వెళ్ళాను. అక్కడ పత్రిసార్ను కలిసాను. అక్కడి వైబ్రేషన్స్ నాలో ఎంతో మార్పును తెచ్చాయి. "నాలో ఎంతో అజ్ఞానం వుంది .. దాన్ని పోగొట్టుకోవాలి" అనుకున్నాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రరావు గారి లైబ్రెరీలో పుస్తక పఠనం మరి నిత్య ధ్యాన సాధన ద్వారా ఎంతో జ్ఞానాన్ని మరి శక్తిని సంపాదించుకున్నాను.

నా జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది. నేను,నా భర్త .. మాకు ప్రమేయం లేని ఒక విషయంలో జైలుకు వెళ్ళి పద్దెనిమిది రోజులు జైలులో ఉండవలసి వచ్చింది. అయినా ఎప్పుడూ ఇంటిపని, పిల్లలు, షాపులో వుండడం వీటితో సతమతమయ్యే నేను ఈ పద్దెనిమిదిరోజులు ఎంతో సరదాగా గడిపాను. ఇంట్లో ధ్యానం చేసుకోవడానికీ, పుస్తకాలు చదవడానికీ సమయం వుండేది కాదు. ప్రచారం చేయడానికి ఇంట్లో పంపేవారు కాదు. కానీ జైలులోనే ఉన్నన్ని రోజులూ ఎక్కువసేపు ధ్యానం మరి ఖైదీలకు ధ్యానం నేర్పించడం ద్వారా ధ్యానప్రచారం చేయగలిగాను.

నాతోపాటు ఉదయం అందరూ ధ్యానం చేసేవారు. వారితోపాటు జైలులో వుండటం నాకు "శిక్ష కాదు శిక్షణ" అనిపించింది. ధ్యానం చేయిస్తూ, ఆటలు ఆడుతూ అంత్యాక్షరి పాటలతో పద్దెనిమిది రోజులూ సరదాగా గడచిపోయాయి. వాళ్ళు కూడా జైలులో ఉన్నామన్న విషయం మరచిపోయారు. వారందరికీ ధైర్యం చెప్పి ప్రతిఒక్కరి జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుందన్న విషయం వివరించేదాన్ని. అలా పద్దెనిమిదిరోజులు గడిచాక ఇంటికి వచ్చేటప్పుడు వారు ఎంతో బాధపడ్డారు. ఇప్పటికీ అందులో ఇద్దరు నాకు ఫోన్ చేస్తున్నారు. ధ్యానం విడిచిపెట్టకుండా చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు గ్రూపులుగా ఉండేవారంట. వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకునేవారంట. నాకు ఇదంతా తెలియదు. నేను ఎప్పుడైతే అక్కడ అందరితో కలిసి ధ్యానం చేయించానో అప్పటిదాకా ఒకరినొకరు మాట, మాట అనుకునేవాళ్ళు అది మానేసి కలిసిపోయారు. ఇదంతా నాకు వచ్చేటప్పుడు చెప్పారు. "ఆహా, ఏమి ధ్యాన మహిమ" అనుకున్నాను.

మేము జైలులో ఉన్నంతకాలం మరి మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు(గత ఎనిమిది సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు) పిరమిడ్ మాస్టర్లు అయిన శ్రీదేవి, మాధవి గార్ల సహాయంతో సామూహిక ధ్యానం చేయించారు. జైలులో ఉన్నప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు. అప్పుడు నేను ధ్యానంలో పత్రిసార్ను తలచుకుని నాకు శక్తిని ఇవ్వమని ఆయన రెండు చేతులూ పట్టుకుంటే దాదాపు రెండు గంటలు నాకు వైబ్రేష్న్స్ వచ్చి నేను మరింత శక్తివంతురాలిని అయ్యాను. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా పత్రిసార్ను తలచుకుంటే చాలు .. ఆ కష్టం "ఇష్టం" గా మారిపోయేది. అలా నా జీవితం ఎంతో ఆనందంగా గడుస్తోంది.

మరి మనందరికీ ఇంత తేలికైన ధ్యానాన్ని తెలియజేసిన బుద్ధ భగవానుడికీ మరి అందరిచేత "శ్వాస మీద ధ్యాస" అనే ధ్యానాన్నీ మరి ధ్యానప్రచారాన్నీ చేయిస్తూ ప్రతి ధ్యాని హృదయంలో నిలిచిన బ్రహ్మర్షి పత్రీజీకి ఏం చేసి ఋణం తీర్చుకోగలం?

ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా తమ తమ జీవితాల్లోని పరిస్థితులను ఒప్పుకుని ఈ విశ్వంలోకి పాజిటివ్ను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.

"ధ్యానం ద్వారా ఎవరైనా ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా చేసుకుని ఆనందంగా ఉండగలరు" అని అందరూ తెలుసుకుని ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

జై ధ్యానం జై జై ధ్యానం
"శ్వాస దేవో భవ" .. "గురు దేవో భవ"

 

M. నీలిమ
పూజ డిపార్ట్ మెంట్ స్టోర్స్, ఏలూరు రోడ్
గుడివాడ - 521 301
ఫోన్: +91 9949369633

Go to top