" ధ్యాన సాధనతో కళాశాలలో పెరిగిన ఉత్తీర్ణత "

 

"తమ కళాశాల దినచర్యను ధ్యానంతో ప్రారంభిస్తామని, తత్ఫలితంగా గత మూడు సంవత్సరాలుగా కళాశాలలో ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగిందని చంద్రగిరి బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనసూయమ్మ గారు అన్నారు. ధ్యాన సాధన చేస్తున్న విధ్యార్ధుల ప్రవర్తనలో గణనీయమైన మార్పును తాను గమనించానని తెలిపారు.

శ్రీ కృష్ణ దేవరాయ పిరమిడ్ ధ్యానకేంద్రం - చంద్రగిరి వారు చంద్రగిరిలోని విద్యార్థులకు ధ్యాన యోగ శిక్షణా తరగతిని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరిలోని విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్ధులే కాక ధ్యానాభిలాషులు తిరుచానూరు, చిత్తూరు, పాకాల నుంచి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కంచి రఘురాం గారు మాట్లాడుతూ వినాయక చవితి నాడు ఇదే ప్రాంగణంలో తాను శ్రీ కృష్ణదేవరాయ పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని ప్రారంభించానని, సరిగ్గా 18వ రోజు పత్రీజీ గారి ధ్యాన శిక్షణా తరగతి ఏర్పాటు కావటం ఈ కళాశాల విద్యార్థుల ధ్యాన శక్తికి నిదర్శనమని అన్నారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ధ్యాన సాధనలో తనకు లభించిన ఏకాగ్రత - పట్టుదల - ఆత్మవిశ్వాసంతో తాను ఇటీవల అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ వారు నిర్వహించిన తెలుగు వెలుగు క్విజ్ పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని, రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించానని చెప్పాడు.

బ్రహ్మర్షి పత్రీజీ ధ్యానం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అన్న విషయాన్ని అరటిపండు ఒలిచి యిచ్చినట్టుగా విద్యార్థులకు ఆడుతూ పాడుతూ వివరించారు. వేమన పద్యం ద్వారా మాంసాహారం - పాపాహారమని వివరించిన విద్యార్థుల చేత స్వచ్ఛందంగా ఇక పై మాంసాహారాన్ని ముట్టబోమని ప్రమాణం చేయించారు. 20 నిమిషాలు అందరి చేత ధ్యానం చేయించి తన మధురమైన వేణుగానంతో అందరికి ధ్యానామృతాన్ని పంచారు. వందన సమర్పణ చేసిన శ్రీ నాగరాజు నాయుడు గారు విద్యార్ధులందరిచేత - పంచభూతాల సాక్షిగా ఇక పై మేము ధ్యాన సాధనను విడిచి పెట్టమని ప్రమాణం చేయించారు.

కళాశాల ప్రాంగణలో పత్రిగారు, కంచి రఘురామ్ గారు పూల మొక్కలను నాటారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ధ్యాన సాధన మార్గాన్ని ఎన్నుకుని తదనుగుణంగా ప్రోత్సాహమిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మరి అధ్యాపక బృందాన్ని పత్రీజీ అభినందించారు.

విద్యార్థుల నిత్యం ధ్యాన సాధన చేస్తున్న తరగతి గదిని సందర్శించిన గురూజీ చాక్‌పీస్ తీసుకుని బోర్డు మీద మూలాధారం నుంచి సహస్రారం వరకు గల సాధనా మార్గాన్ని వ్రాసి విద్యార్థులను వ్రాసుకోమన్నారు. హర్షధ్వానాల మధ్య ఇక సెలవంటూ తిరుపతికి బయలుదేరారు.

 

R. కరుణ కుమార్
చంద్రగిరి

Go to top