" నిలువెత్తు విగ్రహంగా ప్రత్యక్షమయ్యారు "

 

నా పేరు గాజుల పార్వతమ్మ. మాది సోమందేపల్లి. అనంతపురం జిల్లా. పత్రి సార్ 5-7-06 వ తేదీ మా ఊరు వచ్చారు. ఆ రోజు మా ఊరు ఎలా ఉందంటే నా మాటలతో, వ్రాతలతో వర్ణించలేను. అదెలా అంటే పత్రిసార్ "నిండు చందమామ" లా వుంటే, ఇక వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అంతా "ప్రకాశవంతమైన నక్షత్రాల్లాగా" మా ఊరికి ఎంతో వెలుగు తెచ్చారు. ఇక నా పరిస్థితి. నా కాళ్ళు ఈ భూమి మీద లేవు. నా కళ్ళకు ధవళ వస్త్రాలు ధరించిన మూర్తీభవించిన దేవతల్లా కనిపించారు. నా అదృష్టానికి నేనే అసూయ పడేలా పత్రి గారు ... నన్ను ... వంకరటింకరగా వున్న కఠిన శిలను .. తనకు నచ్చిన విధంగా తన ధ్యానమనే అమూల్యమైన ఉలితో చక్కని శిల్పంగా తయారు చేసారు. ఇంతకంటే అదృష్టం, అష్టైశ్వర్యాలు నాకేమీ వద్దు. ఆయన మన చెంత ఎల్లవేళలా వుంటే, మనకేల అశాశ్వతమైన సిరిసంపదలు.

పత్రిసార్ మాకు ఇచ్చిన సందేశం. "న భూతో న భవిష్యతి" లాగా, చల్లని పిల్లతెమ్మెరులుగా మనస్సులను రంజింపజేసింది. పామరులకు సైతం అర్థమయ్యేలాగా తనదైన శైలిలో అరమరికలు లేని చిరునవ్వుతో ఎంతో ఆనందంగా మా హృదయాలకు హత్తుకునేలా ఎప్పటికీ మరచిపోలేని విధంగా మా హృదయాల మీద ముద్ర వేశారు.

సార్ ఏం చేసినా అద్భుతమే. సార్ మా ఇంట్లో ఆలుగడ్డల చిప్స్ చేశారు. ఆలుగడ్డలు కట్‌చేసి వుంటే అవి అన్నీ పిరమిడ్ ఆకారంలో ఉన్నాయి. పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేస్తే ఎంతో ఎనర్జీ వస్తుంది కదా. మరి అన్ని పిరమిడ్లను నమిలి మ్రింగిన పత్రిసార్‌కు ఎంత ఎనర్జీ వుందో ఆ మూడోకన్ను వున్న ముక్కంటికి మాత్రమే తెలుసు. మానవమాత్రులమైన మనకేం తెలుసు?

మా ఊరు ఎంత పుణ్యం చేసుకుండో ఏమో, సాక్షాత్తు ఆ భగవంతుని ప్రతిరూపమైన పత్రిగారు ఎంత ప్రసన్న వదనంతో వున్నారంటే, చుసిన 600 మందికి కూడా ఆశ్చర్యం కలిగింది. ఆరోజు ఆయన ముఖంలో కించిత్తు కూడా అసహనం కనపడలేదు. అదంతా మా ఊరు చేసుకున్న పుణ్యం. అనంతపురం జిల్లా నలుమూలల నుంచీ, కర్ణాటక నుంచి ధ్యానులు ఆ వైభవాన్ని తిలకించడానికి వచ్చారు.

జూలై 7 వతేదీ రాత్రి 3.30 నుంచి 5.45 వరకు ధ్యానం చేసుకుని, నేను నా చేతుల మీద తల ఆనించి వంగి కూర్చున్నాను. ఏమని చెప్పను, ఎలా వర్ణించను వ్రాయటానికి నా కలం ముందుకు కదలనంత అద్భుతం, ఆశ్చర్యం, మహదానందం, ఉండండి చెప్తాను:

పత్రిసార్ నా తల ముందర నా రెండు చేతులకు అతి చేరువలో నిలువెత్తు విగ్రహంగా ప్రత్యక్షమయారు. ఇక నా సంగతి మీకే వదిలేస్తాను. మెల్లగా నా చేతివ్రేళ్ళు కదిలిస్తూ సార్ పాదాలను గట్టిగా పట్టుకున్నాను .. కాళ్ళు పట్టుకుంటే తంతారని తెలిసీ 'ఏమైతే అది అయిందిలే' అని. ఆశ్చర్యం, కొట్టలేదు, తిట్టలేదు. కనీసం కాళ్ళు కూడా తీసుకోలేదు. మందహాసంతో చల్లని చూపు చూసారు. అప్పుడు ఎలా వున్నానంటే ఫుల్ ఎనర్జీతో నిండిపోయాను. సార్ ప్రశాంతంగా వంగి నా వీపులో ఏదో తన దివ్యమైన వస్త్రాలతో తీసివేశారు. అప్పుడు నాకూ, నా దేహానికీ ఎంతో హాయి కలిగింది. ఏం తీసారో చెప్పేటంత పరిపక్వమైన జ్ఞానం నా దగ్గర లేదు. సార్‌కు మాత్రమే తెలుసు.

కష్టపడి రాత్రనకా, పగలనకా చేసిన ధ్యానానికి ప్రతిఫలంగా ఆరోజు ప్రత్యక్షంగా ఆ మంగళమూర్తిని దర్శించుకుని ఇంకా మిగిలిన మలినాలు కడిగివేయబడ్డాయి. ఇంతకంటే ఒక ధ్యానికి ఏం కావాలి చెప్పండి.

సార్ వచ్చి వెళ్ళిన మూడురోజుల తర్వాత కూడా ఇక్కడ వున్న ధ్యానులంతా ఫుల్ ఎనర్జీతో వున్నారు. అప్పుడే వారిని 'మినీ ట్రెక్కింగ్' లాగా మా ఊరి దగ్గర వున్న "అక్కమ్మకొండ"కు పిలుచుకుని వెళ్ళి ఆ రోజంతా అక్కడ ధ్యానం చేసి ధన్యులమయ్యాం. ఇంకొక ఆశ్చర్యమైన అద్భుతం ... అంతవరకూ ఆ కొండలో ఉక్కపోతతో ఉడికిపోయిన మాకు బ్రహ్మాండమైన వర్షం రాకతో సేద తీరింది. మా మినీ ట్రెక్కింగ్లో కూడా వర్షం వచ్చిందోచ్. పెద్ద పెద్ద ట్రెక్కింగ్‌లకు పెద్ద వర్షం. చిన్న ట్రెక్కింగ్‌కు చిన్న వర్షం. ఎంత ఆశ్చర్యంగా, అద్భుతంగా వుంది కదూ.

మరో అద్భుతం జరిగింది. నా వెనుక కూర్చున్న వారినంతా ముందుకు రమ్మన్నరు. అప్పుడు ధ్యానానికి కూర్చున్న తర్వాత (నాకు కొంచెం భయం వుండేది. అక్కడ గుహలున్నాయి కనుక) "అరే నా వెనుక ఎవ్వరూ లేరే. ఎవరైనా వుంటే బాగుండును" అనుకున్నాను. అనుకున్నదే తడువు మన పత్రిసార్ తెల్లని వస్త్రాలు ధరించి నా వెనకాల కూర్చున్నారు. ఏమని చెప్పను ఈ దేవదేవుని లీలలు. ఈ చిన్ని బుఱ్ఱ ఏమని వర్ణించగలదు? నా కన్నీళ్ళతో ఆగకుండా అలాగే ధ్యానం చేసి ధన్యురాలినయ్యాను.

దీనిని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే కన్నతల్లి, కట్టుకున్నవాడు, పుత్రపౌత్రులంతా దూరంగా వున్నా దయగల హృదయుడు, దయామయుడు, ఏ వేళనైనా, సప్త సముద్రాలైనా, కీకారణ్యాలైనా, కడకు చావులోనైనా తోడుగా, నీడగా వుంటాడు. ఆ నడిచే పలకరించే, కొట్టే, తిట్టే భగవంతుడు ఇంకా ఎక్కడైనా ఎవరైనా చూసారా? ఆయనకు నా ఆజన్మాంతం వినమ్రురాలినై ఒదిగి వుంటాను.

తర్వాత 48 మందితో 13-7-06 వతేదీ ఆదివారం రోజు టాక్సీలలో "బెంగుళూరు మైత్రేయ బుద్ధా పిరమిడ్"కు పిలుచుకుని వెళ్ళాను. అబ్బ. ఏమని వ్రాయను ట్యాక్సీలు పిరమిడ్ వైపు తిరగడమే తరువాయి అప్పటివరకు నిశ్శబ్దంగా వున్న నేను ఆనందపరవశంతో ఒకటే కేరింతలు. చిన్నపిల్లలా ఆనందంతో చప్పట్లు చరుస్తూ వుంటే వెనుక కూర్చున్న ధ్యానుల కళ్ళలో ఆనంద బాష్పాలు జలజలమని రాలాయి. ప్రతిచెట్టునూ, ప్రతి పుట్టనూ మేము బుద్ధపౌర్ణమి రోజు నడిచిన నేలను, మాగెస్ట్‌హౌస్‌లను పేరు పేరునా పలకరించాను. అక్కడ వున్న ప్రతి వస్తువూ ఎంతో సంతోషంగా ఆహ్వానం పలికాయి. అక్కడా వున ధ్యానులందరితో కలిసి స్వర్గంలో ఆడి పాడి చిన్నపిల్లలైపోయాం.

అక్కడ డాకిరెడ్డి గారు తదితరులతో క్లాసు మాదిరిగా కాక "స్వర్గంలో ఇంద్రసభ"ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, అంతకన్నా ఎక్కువ నవ్వులతో, ప్రశ్నలతో, జవాబులతో క్లాస్ జరుపుకుని ఆనందభరితులయ్యాం. అక్కడికి వెళ్ళిన ధ్యానులంతా శ్రమదానం చేసారు. ఇంతకు ముందు ఏ పనిచేసినా అంతటి అంతటి ఆనందం పొందలేదు. డాకిరెడ్డి గారైతే "మీ రామదండు క్రమశిక్షణతో చాలా చక్కగా పనిచేశారు. మీ శ్రమ ఊరికేపోదు. సార్ దృష్టిలో పడ్డారు. ఇంకా మీకేం కావాలి" అని గాలిలో ప్రశంసాపత్రన్ని ఇచ్చారు. ఎవరికిస్తారు ఇలాంటి సర్టిఫికెట్లు ఒక్క ధ్యానులకు తప్ప.

 

 

గాజుల పార్వతమ్మ
సోమందేపల్లి
ఫోన్ : +91 94408 52782

Go to top