" ఆనాపానసతి ధ్యానం ... క్యాన్సర్ నివారణ "

నా పేరు పామిశెట్టి రామదాసు. వయస్సు 73 సంవత్సరాలు. మాది కడపజిల్లా, తూర్పునడిమిపల్లె గ్రామం.

1999వ సంవత్సరం జూలై 25న కడప పట్టణంలో డాక్టర్ యుగంధర్ గారి ఆధ్వర్యంలో ధ్యానశిక్షణా కార్యక్రమానికి నేను హాజరయ్యాను. ఆనాటి నుండి ఈ అత్యద్భుతమైన "శ్వాస మీద ధ్యాస" ధ్యానమార్గంలోకి ప్రవేశించాను. ప్రతిరోజూ ధ్యానం చేస్తున్నాను. ఇక అందరికీ ధ్యానం నేర్పించాలన్న సంకల్పంతో కడప పిరమిడ్ మాస్టర్లు G.రామసుబ్బారెడ్డి, M.C.ఓబయ్య, శ్రీమతి సుమతి మేడమ్ గార్ల నేతృత్వంలో మా స్వగ్రామం తూర్పునడిమిపల్లె, మండల కేంద్రమైన నంబుల పూలకుంట, జవుకుల గ్రామం కొవ్వూరువాండ్లపల్లె గ్రామం, కాట్లకంటివారిపల్లె గ్రామం, ఎర్రగుడి గ్రామం, గోకనపేట గ్రామం, కొత్తపల్లె గ్రామాలలో విస్తారంగా ధ్యానప్రచారం చేశాం.

తూర్పునడిమిపల్లె గ్రామ సమీపంలోని ప్రేమానంద ఆశ్రమంలో పౌర్ణమి రాత్రులలో ధ్యానశిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేశాం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి కుంట మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు విరివిగా హాజరయ్యారు.

2001, జూలై 27వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ గారిని తూర్పునడిమిపల్లె, N.P.కుంటకు ఆహ్వానించాం. బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆధ్వర్యంలో తూర్పునడిమిపల్లెలో శ్రీ యోగివేమన పిరమిడ్ ధ్యానకేంద్రం, N.P.కుంట మండల కేంద్రంలో శ్రీ వివేకానంద పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలను ప్రారంభించాం. 500 మంది ధ్యానులు పాల్గొన్నారు.

తరువాత గానుగపెంట గ్రామ సమీపంలో గిన్నీస్ రికార్డ్స్‌కు ఎక్కిన ఏడుఎకరాల స్థలంలో విస్తరించియున్న సుప్రసిద్ధ వటవృక్షంగా పేరుగాంచిన "తిమ్మమ్మ మర్రిమాను" వద్ద ధ్యానకార్యక్రమం, కదిరికి సమీపంలో కటారుపల్లెలో వెలసిన శీ యోగివేమనగారి సమాధి వద్ద పత్రీజీగరి ఆధ్వర్యంలో ధ్యానకార్యక్రమం జరిగింది. కడపజిల్లా పిరమిడ్ మాస్టర్లు, తిరుపతి N.P.కుంట మండలంలోని పిరమిడ్ మాస్టర్లు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేకమంది క్రొత్తవారు పాల్గొన్నారు.

2005 ఆగష్టు 3 వ తేదీన తూర్పునడిమిపల్లెలోని జిల్లా పరిషత్ హైస్కూలులోని సుమారు 300 మంది విద్యార్ధులకు ధ్యానశిక్షణ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు శ్రీ బాబుగారు, శ్రీ వెంకటరమణగారు ఎంతో బాగా సహకరించారు.

జవుకుల గ్రామంలోని శ్రీ శంకర్‌‍రెడ్డి గారి కుమార్తె వయస్సు 24 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలు. అనేకచోట్ల డాక్టర్లను చూపించారు. సుమారు లక్షరూపాయలకు పైగా ఖర్చు చేసినా వ్యాధి నయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న మన పిరమిడ్ మాస్టర్లు రాఘవరెడ్డి, మాధవరెడ్డి, ఉత్తమరెడ్డి గార్లు ధ్యానప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వెళ్ళారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే ఆమె దగ్గరకి వెళ్ళి "ధ్యానం సర్వరోగనివారిణి" అని ధ్యానం యొక్క గొప్పతనాన్ని వివరించి ఆమెకు ధ్యానం నేర్పించి ప్రతిరోజూ ధ్యానం చేయమని చెప్పారు.

ఎంతో ఉత్సాహంతో, శ్రద్ధగా ఆమె ధ్యాన అభ్యాసం చేశారు. 30రోజులలో ఈ భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నివారణ జరిగింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి ఎంతో చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆమె.

"ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి; ధ్యానం సర్వరోగనివారిణి" అని తెలుసుకున్న T.N.పల్లె గ్రామ నివాసి శీ K.నాగముని రెడ్డిగారు "శ్వాస మీద ధ్యాస" అనే ధ్యానం నేర్చుకున్నారు. కొద్దిరోజుల తర్వాత సమీపంలోని ప్రేమానంద ఆశ్రమంలో 14 గంటలపాటు ఏ ఆహారం తీసుకోకుండా అఖండా ధ్యానంలో నిమగ్నం అయ్యారు. ధ్యానం చేస్తూండగా తెల్లటి గెడ్డం కలిగిన ఒక పొడవాటి వ్యక్తి కనిపించి నాతో రమ్మని చేయిపట్టుకుని నేరుగా హిమాలయాలకు తీసుకెళ్ళారట. అక్కడ ధ్యానం చేస్తున్న అనేకమందిని చూపించి ఒక గుహలో వదిలి ఆయన అదృశ్యమయ్యారట. కొద్దిసేపటికి ఆయనకి మెలకువ వచ్చిందట. అప్పటి నుండి ఆయన బాగా ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం గావిస్తున్నారు.

" 2006 నాటికి పిరమిడ్ ఆంధ్రప్రదేశ్ కావాలి " అని పత్రీజీగారు చెప్పారు. అందుకే పిరమిడ్స్‌ను బాగా వినియోగించుకునేలా చేస్తున్నాను. 2008 నాటికి ధ్యానభారత్, 2012 నాటికి ధ్యానజగత్ కావాలన్న పత్రీజీ గారి ఆశయంలో భాగంగా నేను కొన్ని వేల కరపత్రాలను ప్రింట్‌చేయించి ధ్యానప్రచారం గావిస్తున్నాను.

నా సందేశం : ప్రతి ఒక్కరికీ ధ్యానమే అసలైన ఔషధం. శరీరానికి ఆహార ఎంత అవసరమో ఆత్మకు ధ్యానం అంత అవసరం. ఈ జన్మలో పత్రీజీ గారు మనకు లభించడం మన అందరి అదృష్టం.

ప్రతి ఒక్కరూ అత్యద్భుతమైన "మిలారెపా" పుస్తకం చదవవలసిందిగా కోరుతున్నాను. మౌనం, పౌర్ణమి ధ్యానం అందరూ విధిగా పాటించండి.

 

- పామిశెట్టి రామదాసు,
8/210 - 2A, కడప - 516003

Go to top