" మీ శరీరంలో ప్రవేశించాలి "

నా పేరు గాయత్రి. కర్నూలు మెడికల్ కాలేజ్‌లో M.B.B.S. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను నా పదవ తరగతి నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోకి రాకముందు ఎంత బాగా చదివినా ఏం చేసినా ఎందుకో అసంతృప్తిగా ఉండేదాన్ని. ముఖ్యంగా నేనంటే ఎవరికీ ఇష్టం లేదనే బాధ ఎక్కువుగా ఉండేది. ఇప్పుడసలు ఎప్పుడూ ఆనందమే. జీవితంలో అసలు ఏడుపనేదే లేదు.

ఈ మధ్య నాకొచ్చిన అనుభవాలు.

కర్నూలు, "బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం". ఆ రోజు పిరమిడ్‌కి వెళ్ళేసరికి ప్రేమనాథ్ సార్ అక్కడ ఉన్నారు. సార్ క్లాస్ తీసుకున్నారు. ఆ తరువాత "ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తావా?" అని అడిగితే "చేస్తా" నన్నాను. ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్‌కు వెళ్ళి అక్కడ కింగ్స్ చాంబర్‌లో ధ్యానం చేసాను. అక్కడ నా శరీరం ఇంకా తేలికయింది. ఎదురుగా చూస్తే క్రిస్టల్ పిరమిడ్ వజ్రం లాగా మెరుస్తోంది. ఆకాశం అంతా తేలికయినట్లు అనిపించింది. నా మహాకారణ శరీరం విడుదలైంది. ఎదురుగా బుద్ధుడు ఇంకా ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు.

"నువ్వు దేనికీ భయపడకు. ప్రాపంచిక ఆనందాల కోసం ప్రాకులాడకు. నీ వెనుక ఇంతమందిమి ఉన్నాం. నీశక్తిని నువ్వు తెలుసుకో" అన్నారు.

ధ్యానం నుంచి లేచి నా అనుభవాల్ని ఎంతో ఆనందంతో అక్కడ అందరికీ వివరించాను. సంతోషంగా హాస్టల్‍కు వెళ్ళిపోయాను. అప్పుడు మళ్ళీ నాలో అనుమానం మొదలైంది. "ఇదంతా ముందే అనుకుని ధ్యానం చేయడం వలన నేనేమన్నా ఊహించుకున్నానేమో" అని. "ఇలా కాదు నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవాలి అని హాస్టల్లో ధ్యానం చేసి ఆస్ట్రల్ ట్రావెల్‌తో మా నాన్న ఏం చేస్తున్నారో చూసిరావాలి" అనుకుని కూర్చున్నాను. అప్పుడు నాకు తెలుపురంగు ఫ్లోరింగ్ కనిపించింది. కొంచెంసేపటి తరువాత మా నాన్నగారు హోటల్‌లో నుంచుని టిఫిన్ చేస్తున్నారు. ధ్యానం అయిపోయాక మా నాన్నగారికి ఫోన్ చేసి అడిగాను.

"అరగంట ముందు ఏం చేస్తున్నారు?" అని. "హోటల్‌లో టిఫిన్ చేసాను" అన్నారు. "నుంచిని చేసారా? కూర్చుని చేసారా?" అంటే "నుంచుని" అన్నారు. "ఫ్లోరింగ్ ఎలా ఉంది?" "గమనించలేదు" అన్నారు. "తెలుపురంగు టైల్స్ ఉన్నాయా?" అంటే, "హోటల్‌కి వెళ్ళేముందు షాప్‌కి వెళ్ళాను అక్కడ తెలుపురంగు టైల్స్ ఉన్నాయి" అన్నారు. అలా నేను నా అనుభవాన్ని నాకు నేను ప్రూవ్ చేసుకున్నాను.

10-12-2005న తాడేపల్లిగూడెంలో నేనూ ప్రేమనాథ్ సార్ కలిసాం. సార్ క్లాస్ తరువాత అందరం కూర్చుని అనుభవాలు చెప్పుకుంటూంటే ఉన్నట్టుండి సార్ "పరకాయ ప్రవేశం చేస్తావా?" అని అడిగారు. "ఓ చేస్తా" అన్నాను. "ఎవరిలోకి వెళ్తావు?" అంటే "ఎక్కితే ఏనుగే ఎక్కాలి కదా సార్ 'పత్రి సార్' లోకి వెళ్తాను" అన్నాను. "సార్ అనుమతి తీసుకుని ఆయన ఒప్పుకుంటే ప్రవేశించు" అన్నారు.

ధ్యానంలో కూర్చున్నాను. చూస్తే ఎక్కడ చూసినా సారే కనపడుతున్నారు. ఒకచోట వేణువు వాయిస్తూ, ఒకచోట నుంచుని, ఒకచోట కూర్చుని, ఒకచోట "నన్ను కనుక్కో" అన్నట్టు నవ్వుతున్నారు. ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అప్పుడు "సార్, మీ భౌతికశరీరం ఎక్కడ వుంది? నేను మీ భౌతిక శరీరంలో ప్రవేశించాలనుకుంటున్నాను, అనుమతించండి" అని వేడుకున్నాను. అప్పుడు సార్ ఎక్కడో క్లాస్ అయిపోయాక అందరినీ కలుస్తున్నారు. వెళ్ళి ఎదురుగా నిలబడ్డాను. సార్ నన్ను కౌగలించుకున్నారు. అంతలోనే నేను సార్‌లోకి ప్రవేశించాను.

వెళ్ళిన మరుక్షణం శ్వాసలో తేడా గమనించాను. సార్ ఒక్కొక్కరికి షేక్‌హ్యాండ్ ఇస్తూంటే నాకు నొప్పులు మొదలయ్యాయి. కడుపు, మెడ విపరీతంగా నొప్పి. "ఏం సార్? మీ దేహంలో ఇన్ని నొప్పులున్నాయా?" అని అడిగితే "నాకేం లేవే! కావాలని వచ్చావ్‌గా అనుభవించు" అన్నారు. ఇంక భరించలేక "నాకు చాలు సార్ నేను వెళ్తాను" అంటే, "వెళ్ళు" అని పంపించారు. నా దేహంలోకి వచ్చిన మరుక్షణం నా శ్వాస నాకు మళ్ళీ తెలిసింది.

ధ్యానం గురించి బయటకు వచ్చి నా అనుభవాన్ని అందరితో పంచుకున్నాను. ధ్యాన ప్రచారంలో పాలుపంచుకోవటానికి వీలయినంత కృషి చేస్తాను.

 

గాయత్రి
కర్నూలు

Go to top