" ఇంకెవరు, మీ గురువు గారు "

 

నా పేరు ముక్తారావు. మాది విజయవాడ. ఆటో నడపడం నా జీవనోపాధి కనుక నన్ను అందరూ 'ఆటో బుజ్జి' అని పిలుస్తూంటారు. 1997 సంవత్సాంలో వ్యాపారంలో మిత్రులచే మోసగించబడి చాలా డిప్రెషన్‌లో వున్నప్పుడు, ఈ ధ్యానం గురించి తెలిసింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నాతోబాటు నా కుటుంబ సభ్యులందరూ ధ్యానం చేస్తున్నాము.

నేను ధ్యానంలో ప్రవేశించిన తొలిరోజుల్లో అంటే 1997 ప్రాంతంలో ధ్యానంలో కూర్చుంటే అస్సలు కుదిరేది కాదు. అసలు ఎలా కూర్చోవాలో తెలిసేది కాదు. అప్పుడు ఎర్రగా వున్న ఒక వ్యక్తి బ్లాక్ ప్యాంట్, లాల్చీ వేసుకుని నా ముందుకు వచ్చి నా "శరీరాన్ని స్ట్రైట్‌గా వుంచు" అని ధ్యానం చేసే పద్ధతి నేర్పారు. అప్పటి నుంచి ధ్యానం నాకు బాగా కుదిరి అనేకమైన అనుభవాలు వస్తూండేవి.

తరువాత 1998లో మొదటిసారి నేను పత్రి గారిని చూసినప్పుడు, "ఆ రోజు నాకు ధ్యానం నేర్పించింది ఈయనే" అని గ్రహించాను. నేను ఎక్కడెక్కెడికో వెళ్ళి అనేకమైన దృశ్యాలు చూస్తూ ఉండేవాడిని. అయితే ఏ మాత్రం శబ్ధం అయినా డిస్టర్బ్ అయ్యేవాడిని. ఆ ప్రక్రియ కొంతకాలం జరిగింది.

1998 నుండి 1999 సంవత్సరాల మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవాలు: నేను కూర్చున్న చోటు నుండి కదలకుండా TVలో బొమ్మ చూస్తున్నట్లు ప్రతి విషయాన్ని చూస్తూ ఆ విషయాన్ని ప్రక్కనున్న వారికి బిగ్గరగా కళ్ళు తెరవకుండా చెబుతూండేవాడిని. ఇలా కొంతకాలం జరిగింది. 2002 వరకు నా చెవి దగ్గర ఎవరో మాట్లాడుతూన్నట్లుగా మెస్సేజ్‌లు వస్తూ వుండేవి. 2003 నుండి ప్రస్తుత కాలం వరకు కూడా ఏ విషయాన్ని అయినా నేను కళ్ళు తెరచి చూస్తున్నాను.

అందులో కొన్ని :

2003 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన, నేను ఒకరోజు ఉదయం డాబా మీద ధ్యానం చేస్తూ మెల్లగా కళ్ళు తెరచి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని గమనించగా, సూర్యుడిలో నుంచి మెరపు తీగల వంటివి చాలా కాంతివంతంగానూ, చాలా వేగంగానూ సూటిగా నా కంట్లోకి దూసుకువెళ్ళటం గమనించాను. ఏ మాత్రం కంగారు పడకుండా. తీక్షణంగా సూర్యుణ్ణి గమనిస్తూండగా సూర్యుడిలో పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు మరి ఎగిసిపడుతున్న నిప్పు కణికలు కూడా నేను చూడగలిగాను. ఆ సమయంలో నా శరీరం మొత్తం ఉక్కులాగా అయిపోయింది.

నేను 2002 లో స్వంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ ఇంజనీరు లేక తాపీమేస్త్రి సహాయం లేకుండా నా ఇంటిని నేనే ప్లాన్ చేసుకోవాలని అనుకుని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో ఎవరో మాస్టర్ వచ్చి దారంతో బిల్డింగ్ ప్లాన్ మొత్తం రూములు సైజులతో సహా వేసి చూపించారు. నేను ధ్యానంలో నుంచి లేచి నా భార్యతో ఆ విషయం చెప్పి ముగ్గుతో ఇంజనీరు వేసిన విధంగా ప్లాన్ వేసి ఇల్లు కట్టించుకున్నాను.

గృహప్రవేశం అయిన తరువాత, మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పడుకుని తలుపు చెక్కవైపు చూస్తూంటే ఆ తలుపు చెక్కలో బ్రహ్మర్షి పత్రి గారు నవ్వుతూ దర్శనం ఇచ్చారు. నేను భ్రమపడుతున్నానేమోనని క్రిందికి పైకి ప్రక్కకి వంగి చూసినా ఆ బ్రహ్మర్షి కనపడుతున్నారు. అప్పుడు నేను నా భార్యను పిలిచి "ఆ తలుపు చెక్కలో ఏమన్నా కనపడుతోందా?" అని అడుగగా ఆమె "ఇంకెవరు, మీ గురువు గారు నవ్వుతూ కనపడుతున్నారు" అంది. ఇప్పటికీ కళ్ళు ముందు ఆ దృశ్యం కదులుతుంది.

2004 సంవత్సరంలో ఒక సాయంత్రం నేను డాబా మీద వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూస్తూండగా "బెంగళూఋ పిరమిడ్ వ్యాలీ"లో ఉన్న 160/160 అడుగుల పిరమిడ్ నేల మీద ఎంత ఉన్నదో అంతే సైజ్ పిరమిడ్‌ను ఆకాశంలో నేను చూడగలిగాను. అందులో నుంచి తారాజువ్వలు పైకి విరజిల్లుతున్నట్లు ఎనర్జీ ఫ్లో అవటం మరి విశ్వం మొత్తం పెద్ద పెద్ద పాత్రలతో ఎనర్జీని ఆ పిరమిడ్‌లోకి నింపడం నేను గమనించాను. ఆ దృశ్యాన్ని నేను రియల్‌గా చూస్తూ అక్కడే ఉన్న నా భార్యను పిలిచి పిరమిడ్‌ను చూడమని ఎంత చెప్పినా ఆవిడకు మాత్రం ఆ పిరమిడ్ కనపడలేదు.

2005 సంవత్సరంలో ఆరంభంలో ఒకరోజు మా అబ్బాయి స్కూలు నుంచి వస్తూ సైకిల్ మీద నుండి పడిపోయాడు. వయస్సు 16 సంవత్సరాలు. కాస్సేపటికి చెయ్యి అంతా వాచిపోయి నొప్పితో ఏడుస్తున్నాడు. నేను కిరాయి ముగించుకుని వచ్చేసరికి నొప్పితో ఏడుస్తున్న మా అబ్బాయిని చూశాను. అప్పుడు టైమ్ రాత్రి 9.30 వెంటనే మా అబ్బాయిని కస్తూరిబాయిపేటలోని ఎముకల స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళగా వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. నేను మాత్రం తదేకంగా చూస్తూండగా నా కళ్ళకు రియల్‌గా మా అబ్బాయి చెయ్యి కనబడుతున్నది.

అందులో జాయింట్ తప్పుకుని ఉండటం క్లియర్‌గా చూశాను. అదే విషయాన్ని నా భార్యతో చెప్పాను. "ఇప్పుడు డాక్టర్ గారు మనల్ని పిలుస్తారు. ఆయన చెప్పబోయేది ఇప్పుడు నేను చూసింది, రెండూ ఒకటే అవుతాయి" అని కూడా అన్నాను. అలాగే డాక్టర్ గారు మమ్మల్ని లోపలికి పిలిచి X-ray గురించి వివరించారు. అంతకుముందు నేను హాలులో ఏదైతే చూశానో అదే X-ray లో వుంది. ఆ విషయాన్ని నేను ముందుగా చూడగలిగినందుకు చాలా ఆనందంగా వుంది.

ఒకసారి నేను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి శిథిలమై వున్న ఒక పురాతన భవనాన్ని చూడటం జరిగింది. అది బాగా పాకుడు పట్టి ఉంది. ఆ కట్టడం మీద 0-7-210 అనే అంకెలు ఉన్నాయి. నాకు చెవిలో "ఆ టైమ్‌లో నువ్వు అక్కడ వున్నావు" అనే మెస్సేజ్ పదేపదే వినబడుతున్నది.

14-12-2005 ఉదయం 5.00 గంటలకు ధ్యానంలో కూర్చున్నప్పుడు మా నాన్నగారు శరీరం వదిలేసినట్లుగానూ, ఆ విషయాన్ని మా అన్నయ్య ఫోన్ ద్వారా తెలిపినట్లుగానూ, నేను అక్కడికి వెళ్ళగానే మా అక్క నన్ను పట్టుకుని ఏడుస్తున్నట్లుగానూ మరి మా నాన్నగారి శరీరాన్ని చూడగలిగాను. అదేరోజు ఉదయం 6.30 నిమిషాలకు మా నాన్నగారు శరీరాన్ని వదిలేసినట్లు ఫోన్ వచ్చింది. వెంటానే నేను అక్కడికి వెళ్ళగా అంతకు ఒక గంట క్రితం ధ్యానంలో నేను ఏదైతే చూశానో అదే దృశ్యం అక్కడ చూశాను. నా ధ్యాన యాత్రలో ఇవి కొన్ని మాత్రమే. ఇలా వ్రాసుకుంటే పోతే మరెన్నో ...

 

ముక్తారావు
విజయవాడ

Go to top