" షిరిడిలో ... గతజన్మలో ... నేను... "

 

నా పేరు పూర్ణ. హైదరాబాద్‌లో నా డిగ్రీ పూర్తి అయ్యింది. నా అనుభవాలను మీతో పంచుకుని ఈ ధ్యానంలో ఉన్న ఆనందం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను.

నాకు ముందు నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, చాలా ఇష్టం. కానీ ఇందులో సరిగ్గా ప్రోత్సహించేవారు లేక భాదపడ్డాను. నాకు అసలు 'దేవుడు' , 'భక్తి' అని తెలియకముందు నుంచీ షిరిడీ సాయిబాబా దగ్గరకు వెళ్ళటం జరిగింది. తరువాత సాయిబాబా భక్తురాలిగా ఉండిపోయాను. ఇంక ఆయనంటే ప్రేమ, భక్తి పెరిగి ఆయన్ని విడిచి ఉండలేని స్థితికి వచ్చాను. ఎన్నోసార్లు పారాయణం చేసి, హారతులు ఇవ్వటం జరిగింది.

నాలో అసలు ఆధ్యాత్మిక చింతన కొంతవరకు తీసుకొచ్చిన ఆవిడ 'లక్ష్మి' గారు. ఆవిడ నాకు ప్రేమ, భక్తికి నిర్వచనం చెప్పి నన్ను ఒక మంచి వ్యక్తిగా తయారుచేసారు. "నాకు ఒక గురువు కావాలి" అనుకున్నాను. ఎందుకంటే నేను బాబా పుస్తకం వ్రాయాలనుకున్నాను. అప్పుడు వెంకటేశ్వరరావు గారు అనే సాయిబాబా భక్తుడు నన్ను "అంజనాదేవి" గారి దగ్గరకు పంపారు. వెళ్ళిన మొదటిరోజే నన్ను ధ్యానం చెయ్యమన్నారు.

నాకు ధ్యానం అంటే తెలీదు. కానీ అంజనాదేవి గారి ఆశీస్సులతో మొదలుపెట్టాను. నన్ను చూసిన మొదటిరోజే నేను క్రిందటి జన్మలో సాయిబాబా శిష్యరికంలో ఉన్నానని చెప్పారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే సాయిబాబాను ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమిస్తాను. సరే ఆ శిష్యులలో నేను ఎవరో తెలుసుకోవటానికి బాగా ధ్యానం చేసాను. మొదట్లో అంత ఏకాగ్రత కుదరలేదు. కానీ ముందు ముందు సహజస్థితికి చేరాలనే నా ఆకాంక్ష. అందుకు అంజనాదేవి గారిని సంప్రదించి, ఆశీస్సులను తీసుకుని మొదలుపెట్టాను. అప్పుడు ఒకరోజు ధ్యానంలో మంచి దృశ్యం కనిపించింది. ఒక గురువు గారు, కుండ, రెండు దీపాలు పట్టుకుని ఉన్నారు ఆయన నాకు "కుండ సగం నిండి ఉంది - అది నువ్వు" అని చెప్పారు. పక్కనే ఉన్న దీపాన్ని చూపించి "అది మోక్షం" అని చెప్పారు. నేను దాన్ని చేరుకోవాలని అన్నారు.

నాకు అర్థం కాక "శేషు ఆంటీ(అంజనాదేవి గారు)"ని అడిగాను. అంజనాదేవిగారు ఈ విధంగా చెప్పారు. "నీవి సగం కర్మలు అయిపోయాయి. నువ్వు మోక్షానికి చేరుతావు చేరాలి" అని చెప్పారు.

తరువాత రోజున నేను ఒక పాత దేవాలయం చిమ్మి, అలంకరించి, దీపం పెట్టినట్లు కనిపించింది. ఆ గుడి ఎక్కడిదో కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ షిరిడీ సాయినాథుడు 60 సంవత్సరాలు ఉండి, ఎందరో భక్తులను అనుగ్రహించిన ద్వారకామాయి. అంటే నన్ను 'రాధాకృష్ణమాయి'గా చూసుకున్నాను. 'రాధాకృష్ణమాయి' చాలా మంచి ఆధ్యాత్మిక చరిత్ర గల భక్తురాలు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆవిడ ఎక్కువుగా ధ్యానంలో ఉండేవారు. ఆవిడ ఇంటిని సాయిబాబా 'ఆధ్యాత్మిక పాఠశాల' అనేవారు.

కాబట్టి ఇప్పుడు నేను చేరవలసింది సహజ స్థితి. ఇంతవరకు వచ్చానంటే ధ్యానం వల్లే. ఇందులో ఇంత ఆనందం ఉందని నాకు అంజనాదేవి గారి వల్లే తెలిసింది. ధ్యానం వల్ల మనకు ఒక స్థిరత్వం, సామర్థ్యత, పెరుగుతాయి. అంతేకాకుండా నాకు ఈ మధ్య జరగబోయే విషయాలు,అంటే లౌకిక విషయాలు, కోరికలు అని మీరు భావించవద్దు. మంచి ఆధ్యాత్మిక విషయాలు నేను రేపు వెళ్ళే దేవాలయం ఈ రోజే ధ్యానంలో కనపడటం జరిగింది. అంతేకాకుండా వెంకటేశ్వరరావుగారు షిరిడీ, గాన్గాపురం వెళ్ళొచ్చారు. కానీ అవన్నీ నేను ధ్యానంలో చూసాను.

ఇప్పుడు నా ప్రథమ కర్తవ్యం అందరినీ ఈ ధ్యానంలోకి తీసుకురావడమే. అందరికీ ఇందులో ఉన్న ఆనందాన్నీ తెలియజేసి ధ్యానం ద్వారా చైతన్యం తీసుకురావాలి.

నేను ఇప్పుడు షిరిడీ వెళ్తున్నాను. అక్కడ దగ్గర్లో నాకు లెక్చరర్‌గా జాబ్ వచ్చింది. అక్కడ మొత్తం ధ్యానప్రచారం చేయదలచుకున్నాను.

ఇంత మంచి అభివృద్ధి నాలో తీసుకువచ్చిన ఆవిడ సాక్షాత్తు అంజనాదేవి గారు. ఎప్పటికీ ఇంకా నాగురువు గారి దగ్గర మంచి జ్ఞానం పొంది ఇంకా మంచి స్థాయిలో ఉండాలన్నదే నా ఆశయం.

 

I. పూర్ణ
ప్రవరి కాలేజ్ ఆఫ్ ఫార్మసి
శనిసింగనాపూర్ దగ్గర అహ్మద్‌నగర్ జిల్లా, మహరాష్ట్ర

Go to top