" శ్వాస మీద ధ్యాసే సర్వ నిర్వాణ కార్యం "

 

నా పేరు స్నేహ. మాది కర్నూలు. నేను గత రెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నాకు జూలై 17 వ తేదీన వేంకటేశ్వరస్వామి కనిపించి "ఆగష్టు 22 వరకూ నీకు 41 ఆధ్యాత్మిక సత్యాలు తెలియజేస్తాను" అన్నారు. వేంకటేశ్వరస్వామి మాత్రమే కాకుండా పత్రీజీ, రమణ మహర్షి, ఓషో, బుద్ధుడు ... వంటి గ్రేట్ మాస్టర్స్ నుండి నేను చాలా మెస్సేజెస్ తీసుకోవడం జరిగింది. అవే ఈ 41 ఆధ్యాత్మిక సత్యాలు.

 

1. చూపులేనివాడు గ్రుడ్డివాడు కాదు... జ్ఞానదృష్టి లేనివాడు గ్రుడ్డివాడు.
2. సత్యం స్పష్టమైనది ... దాన్ని తెలుసుకోవడంలో ఎన్నో అరమరికలు.
3. ఎవరి మార్గం వారిదే. గమ్యం ఒక్కటే. నిన్ను అనుసరించేవాళ్ళు వుంటారు. నువ్వు అనుసరించేవాళ్ళూ వుంటారు.
4. సత్యం సర్వవ్యాపకం; విషయాన్ని బట్టి సత్యం మారదు; విషయమే మారుతుంది.
5. సత్యం ఏకత్వం ... ద్వంద్వాలూ, త్రిత్వాలూ లేవు.
6. సత్యం అంటే సంగీతం; సంగీతంలో లాగా సత్యంలో కూడా ఎన్నో స్వరాలూ, రాగాలూ వున్నాయి; అవే జీవితంలో అందరూ పొందే అనుభవాలు.
7. సత్యం తెలుసుకున్నవాడు ఊగిసలాడడు; సత్యంలో వున్నవాడు నిర్భయుడు.
8. మరణం ఆగేది కాదు జీవితం; మృత్యువును దాటి సాగాలి జీవనం.
9. సాధన నీ ఆయుధమైతే స్వర్గంతో ఆగునా నీ పయనం?
10. స్తంభించిన జీవితంలో అలజడులెన్నో, నదిలాసాగితే ఆనందాలెన్నో.
11. అల్పునికి అందనిది విశ్రాంతి. ధ్యాని పొందినది గొప్ప విశ్రాంతి
12.జ్ఞాపకాల నీలి నీడల పరచుకున్న వేళ క్రొత్త అనుభవానికి చోటేక్కడుంది? 'రాబోయే రోజుల' ఊహల నీలో నిండి వుంటే 'నేటి జ్ఞాపకాలకు' విలువెక్కడిది? నీలో చోటు చేసుకున్నదీ, నీకు విలువనిచ్చేది 'ఈరోజు' మాత్రమే.
13.అనుభవమే జీవితం... అనుభవసారమే జ్ఞానం జ్ఞానమే ఆనందం... ఆనందమే సత్యం.
14. అంతర్ముఖుడు కానివాడు ఆత్మజ్ఞాని కాజాలదు.
15. కఠోరమైన సాధన నిన్ను ఉన్నతలోకంలో నిలబెడుతుంది.
16. సత్యాన్వేషణలో సంతృప్తి లేదు; కానీ ఓ సంతృప్తి స్థితే అది.
17. సత్యం తెలుసుకున్నవాడు, తెలియనివాడు ఒకేచోట వుంటారు ... కానీ వారి ఆత్మస్థితిలో ఎంతో తేడా.
18. సత్యం ఓ మహా సముద్రం. అందరూ దానిలో కెరటాలే.
19. ఒకప్పుడు చావు పుట్టుకల మధ్య నలిగిపోయిన జీవితం ... ఇప్పుడు చావు పుట్టుకలకు అతీతంగా వెలిగిపోతోంది ... ధ్యాని జీవితం.
20. ఆలోచన 'కర్మ' కాదు; ఆలోచన లేనిదే కర్మ లేదు.
21. అనుభవం చాలా గొప్పది ... ఎందుకంటే అది అంతటా వుంది. ధ్యాని ఇంకా గొప్పవాడు ... అటువంటి అనుభవాలు పొందుతున్నాడు కాబట్టి.
22. తనను తాను తెలుసుకున్నవాడు ఎక్కడా ఆగడు; ఆగితే ఇంకా పూర్తిగా తెలుసుకోనట్లే .
23. ప్రేమ అంటే పతాకం; అది ఎప్పుడూ స్వేచ్ఛగా ఎగరాలి.
24. నీకు ఏదీ లేనప్పుడు, నువ్వు ఏదీ కానప్పుడు, అంతా నువ్వే, నువ్వే అంతా.
25. మీరు తెలుసున్న జ్ఞానాన్ని ఏ ఆలోచనతోనూ అన్వయించకండి ... నెగెటివ్‌గా కానీ పాజిటివ్‌గా కానీ.
26. ఆత్మతో స్నేహం, బ్రహ్మాండానికి మార్గం.
27. అన్నిటితో వున్న నువ్వు ఒంటరివి కా.
ఒంటరిగా వుంటూ అన్నిటితో వుండు.
28. చీకట్లోనే మొదలవుతాయి వెలుగురేఖలు;
నిశ్శబ్దంలోనే ప్రారంభమవుతాయి శబ్ధతరంగలు;
అస్థిరత్వంలోనే ఆరంభమవుతాయి స్థిరసత్యాలు.
29. సత్యంలో వున్నవాడికి అంతటా సత్యమే గోచరిస్తుంది.
నీలో ఏది వుంటే అదే నీ వాస్తవమవుతుంది.
30. మౌనమే యోగి లక్షణం.
చైతన్యమే ఆ ఆత్మ సమస్తం
ఎరుకే ఆ నిత్య జీవితం
వేడుకే ప్రతి జీవిత క్షణం.
31. ఎంతగా ఆత్మలోతుల్లోకి వెళ్తామో
అంత ఎత్తుకి ఎదుగుతాం;
ఆత్మాలయ శిఖరానికి చేరతాం.
32. జ్ఞానానికి కొలతల సరిహద్దులు లేవు; తెలుసుకున్న విషయాన్ని ఆచరించటంలోనే వుంది జ్ఞానమంతా.
33. ఎంతోజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకునే కన్నా నీలో వున్న అజ్ఞానాన్ని తీసివేసుకోవాలి ... అప్పుడు అనంతమైన జ్ఞానం పొందినట్లే.
34. నువ్వు చేస్తున్న కర్మను గురించి చేస్తున్నప్పుడే ఆలోచించు, మొదలుపెట్టకముందు కాదు, ముగిసాక కాదు.
35. ఆత్మదృక్పధమే సరియైన దృక్పథం;
ఆత్మకళ్యాణమే లోకకళ్యాణం.
36. ఎవరి వాస్తవాన్ని వారు అందంగా సృష్టించుకున్నప్పుడు ఆనందం లేనిదెక్కడ?
37. మీలోని ఆలోచనలను జాగ్రత్తగా గమనించండి; అవి మహాప్రళయాలను సృష్టించవచ్చు; లేదా అద్భుతాలను సృష్టించవచ్చు.
38. జీవించడానికి మీకు గల ఏకైక అర్హత జీవితమే.
39. సృజనాత్మకతే సృష్టికి మూలం.
40. మీ ఆత్మ పరిధుల్లోని ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించండి. అది అంతం లేనిది. ఓ అద్భుతమైన చైతన్యశక్తిని మీలో కనుగొంటారు.
41. శ్వాస మీద ధ్యాసే సర్వ నిర్వాణ కార్యం
శ్వాస మీద ధ్యాసే సకల ముక్తికి దారి.

"ఎరుక"

ఆలోచనల అనుభూతులకు అందని ఆవేశాలు మనలో ఎన్నో వున్నాయి. వాటిని తెలుసుకోవాలంటే 'ఎరుక' అవసరం. 'ఎరుక' అనేది నిన్ను నీకు స్పష్టంగా చూపే సాధనం. ఆత్మతో స్నేహం ఎరుకతో మొదలవుతుంది. ఆత్మ ఎప్పుడూ పరిపూర్ణమైన ఎరుకలోనే స్థితమై వుంటుంది.

'ఎరుక' అంటే ఓ స్వచ్ఛం ... 'ఎరుక' అంటే ఓ పవిత్రత. ఆత్మ యొక్క నిరంతర స్థితే ఎరుక కాబట్టి జీవితంలో జరిగే అన్ని అనుభవాలకు, అంతరంగ స్పందనలకూ హృదయానుభూతులకూ ఆత్మే సాక్షి.

ప్రతి అనుభవం జ్ఞాపకమై జ్ఞానమై కొలువుంటుంది ఆత్మలో.

ప్రతి ఆత్మ తేజమై, ఉత్తేజమై కొలువుంటుంది ఎరుకలో. ఎరుకలేని జీవితం మరణమే. అన్ని అనుభవాలకూ సాక్షివికా. సాక్షీతత్వమే బుద్ధత్వం.

ప్రతీ మనిషికీ అవగాహనా పరిధులు మారుతూవుంటాయి. మామూలు మనిషి కంటే, ధ్యానికి అయిదురెట్లు ఎక్కువుగా జ్ఞాన పరిధులు, అవగాహనా పరిధులు మారుతూ వుంటాయి. ధ్యాన సాధన ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఆచార్య సాంగత్యం ద్వారా, ఆలోచనల ద్వారా అవగాహనా సామర్ధ్యం పెరుగుతుంది. అంటే ధ్యాని మల్టీ డైమెన్షల్‌గా జ్ఞానం పొందుతాడు.

"ప్రేమ"

ప్రేమంటే శక్తి... అది అంతటా వుంది.
ప్రేమ ఓ 'వస్తువు' ఏమీ కాదు పంచటానికి.
అది నీలో మాత్రమే లేదు ఇవ్వడానికి,
ఎవ్వరూ 'ప్రేమ లేనివారు' కాదు తీసుకోవడానికి.

అందంలో వున్న ప్రేమని గురించి తెలియజేయడమే ప్రేమించడం అంటే. నిన్ను నువ్వు ప్రేమించినప్పుడు అందరి మీదా వున్న, మరి అంతటా వున్న ప్రేమ గురించి తెలుస్తుంది.

అద్భుతాల వినువీధిలో నిరంతర బాటసారి!
ఆనందాల బాటలో పాదచారి !
నిరంతర వేడుకల విహారి,
శ్వాస ఆయన రహదారి.

"ఆత్మప్రజ్ఞ"

నేను ధ్యానంలో వుండగా నన్ను "ప్లైడియన్ మాస్టర్స్" అయిదు ప్రశ్నలు వేయడం జరిగింది. కానీ వాటికి సరియైన సమాధానాలు ఇచ్చింది నా ఆత్మే. నేను, నా మస్తిష్క జ్ఞానం ఆ ఆత్మ సంభాషణకి కేవలం సాక్షులం మాత్రమే.

? : "విశ్వాంతరాల్లోకి విచ్చుకుంటున్న మీ మస్తిష్కరేకుల సామర్థ్యం ఏమిటి?"
జ: "అపూర్వం"
? : "కాలాంతరాల్లోకి సాగుతున్న మీ ఆత్మస్థితి ఏమిటి?"
జ: "ప్రస్తుతం"
? : "అనుభవం హద్దులను దాటి మీ జ్ఞానస్థితి ఏమిటి?"
జ: "ఉత్తేజం"
? : "అంతా నీవై వ్యాపిస్తున్న వేళ మీ స్థితి ఏమిటి?"
జ: "తదేకం"
? : నేర్చుకున్న జ్ఞానం నుండి ఎదుగుతున్న వేళ మీ స్థితి ఏమిటి?"
జ: "ఆలోచన"
........ పత్రీజీకి నా హృదయపూర్వక నమస్కారాలు.

 

స్నేహ
కర్నూలు

Go to top