" ధ్యాన ప్రచారమే నా ధ్యేయం "

 

ఎన్నో పిరమిడ్ ట్రెక్కింగులు, పిరమిడ్ కార్యక్రమాలు, మండల ధ్యాన తరగతులు, ధ్యాన సప్తాహాలు, కైలాస మానస సరోవర ధ్యాన యాత్రలు ... ఇలా ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్, 'ధ్యాన రత్న' శ్రీ కేశవరాజు గారు. ధ్యాన ప్రచారంలో భాగంగా ఇటీవల 'ధ్యానం అందరికీ అవసరం' అనే పుస్తకాన్ని ప్రచురించి ధ్యాన జిజ్ఞాసువులకు ఉచితంగా అందిస్తున్నారు. శ్వాసే ధ్యాసగా చేసుకున ఆయన ధ్యాన అనుభవాల విశేషాలు ...

మాది ఒక పల్లెటూరు. చిత్తూరు జిల్లా వడమాల పేట మండలం. నాకు ఏడు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు మా కుటుంబసభ్యులు, మేనమామ కుటుంబం అందరం కలిసి తిరుమలకు వెళ్ళాం. శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థమై గుడికి వెళ్ళాం. శ్రీవారిని దర్శించుకుంటూ చేతులు జోడించి వినబడీ వినబడకుండా మా వారంతా మ్రొక్కుకుంటున్నారు. నేను కూడా చేతులు జోడించాను. కానీ ఏమీ కోరుకోలేదు. అందరూ బయటికి వచ్చాం. వాళ్ళందరూ స్వామి ముందు కోరుకున్నవి మాట్లాడుకుంటున్నారు. నన్నూ అడిగారు "ఏమి కోరుకున్నావు" అని. నేను ఏమీకోరుకోలేదు అని చెప్పాను. దానికి వాళ్ళు నన్ను తిట్టి 'బాగా చదువురావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి’ అని కోరుకొని ఉంటే బాగుండేదని, ఇంత దూరం వచ్చింది స్వామిని దర్శించి మనకోరికలు నెరవేర్చమని అడగడానికి కదా అన్నారు. అప్పుడు నేను మనకంటే గొప్పవారు, మహాత్ములు అయిన దేవుళ్ళ దగ్గర మనం కోరుకోవడం ఏంటి? నేను ఎప్పుడూ ఏమీ కోరుకోను అని అన్నవెంటనే నా చెంప చెళ్ళుమనిపించారు అతిగావాగానని.

హైస్కూల్‌లో నేనూ శ్రీరాములు మంచి స్నేహితులం. శ్రీరాములు ఎక్కువ సినిమాలు చూసేవాడు. అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. సినిమాకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి. రెండు, మూడు రోజుల ముందే ఏ సినిమాకి వెళ్ళాలి అని నిర్ణయించుకునేవాళ్ళం.

సినిమా చూస్తుంటే సన్నివేశాలు అంతకు మునుపే చూసినట్లు అనిపించేవి. ఇలా అనేక సార్లు జరిగింది. అయితే అసలు విషయం తరువాత తెలుసుకున్నాను. "నేను ఏ సినిమాకి వెళ్ళాలో ముందుగానే అనుకుంటాను కాబట్టి ఆ సినిమాను కలలో చూస్తున్నాను" అని అర్థమయింది. అయితే ఇది సాధ్యమా అని సందేహం కలిగేది.

ఆధ్యాత్మిక అన్వేషణ : 1973 లో ఇంటర్ పూర్తి అయింది. తరువాత చదువు ముందుకు సాగలేదు. నేను ఎంతో మంది గురువులు, స్వామీజీలు, ఆధ్యాత్మిక సంస్థల వద్దకు వెళ్ళాను. నాకు సరైన సమాధానం దొరకలేదు. " మనం ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాం? మనల్ని నడిపే శక్తి ఏంటి? ఎలా తెలుసుకోవాలి?" ఇవీ నా ప్రశ్నలు.

1994 వరకు నా అన్వేషణ ఆగలేదు. 1994 ఏప్రిల్‌లో తిరుపతి లోని దివ్యారామంలో పత్రీజీని తొలిసారి చూశాను. చూసిన వెంటనే "ఈయనే ఈ జీవితానికి ఆఖరి గురువు, ఇంకెవరి దగ్గరకూ వెళ్ళను" అని అనుకున్నాను.

పత్రీజీతో పరిచయం: దివ్యారామంలో బాలాజీ సత్సంగం ఆధ్వర్యంలో ఆచార్య సముద్రాల లక్ష్మణయ్యగారి అధ్యక్షతన ఆధ్యాత్మిక ప్రసంగం పూర్తయింది. అప్పుడు సముద్రాల గారు ధ్యానం గురించి చెప్పడానికి కర్నూలు నుంచి శ్రీ సుభాష్ పత్రి వచ్చారు, ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉండండి అని ప్రసంగం ముగించారు.

150 మంది ఉన్న సభలో మేము ఆరుగురం తప్ప మిగిలిన అందరూ వెళ్ళిపోయారు. నేను, కంచిరఘురాం, మునిస్వామి, మిట్టాశ్రీనివాసులు, శంకర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి మిగిలాం.

పత్రీజీకి బాగా సన్నిహితులైన మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ నూకల చిన సత్యనారాయాణగారి ఇంటికి పత్రీజీతో కలిసి మేమంతా వెళ్ళాం. అక్కడ ధ్యానం ఎలా చేయాలో పత్రీజీ చెప్పారు. అరగంట ధ్యానం చేశాం. అనంతరం నీ అనుభవం ఏమిటి? అని పత్రీజీ నన్ను అడిగారు.

కళ్ళు మూసుకున్న వెంటనే నేను ఒక అడవిలో ఉన్నాను. నాకు ఎదురుగా ఒక చెట్టుపై ఒక పక్షి ఉంది. అది నన్ను చూసి నీకు అనుమానాలు ఎక్కువ. 15 రోజులు క్రమం తప్పకుండా ధ్యానంచెయ్యి అని చెప్పింది. మళ్ళీ మళ్ళీ ఇదే పునరావృతం అయ్యింది. అదేమాటలు పత్రీజీకి చెప్పాను. అప్పుడు పత్రీజీ నువ్వు గ్రేట్ మాస్టర్‌వయ్యా అని అన్నారు.

మూడవరోజు ధ్యానం చేస్తుంటే నేను ఒక అడవిలో నడుస్తున్నాను. నా ప్రక్కన ఒక ఆస్ట్రల్ మాస్టర్ వున్నారు. ప్రతి రోజూ గుట్టలు, అడవులేనా తిప్పేది అని అడిగాను. వెంటనే ఒక స్థలం చూపించి చేతితో మట్టి తీయమన్నారు. మట్టి కొద్దిగా తీసిన వెంటనే ఒక చిన్న విగ్రహం కనబడింది. ఆ విగ్రహాన్ని తీసి శుభ్రం చేసాను. ఆ విగ్రహం వెంటనే మాయమైపోయింది. ఆస్ట్రల్ మాస్టర్ కూడా కనిపించలేదు. నాకు ఒక వాయిస్ వినిపించింది. నేను అన్నమయ్యను. నాలుగు దృశ్యాలను చూపిస్తాను. వాటిని పద్యరూపంలో చెప్పాలి అని అన్నారు. నేను సరే అని నాలుగింటినీ పద్యరూపంలో చెప్పాను. వెంటనే ఆయన కూడా మాయమయ్యారు.

వెంకటేశ్వరస్వామితో సంభాషణ :

ఒకరోజు ధ్యానంలో ఆస్ట్రల్‌గా తిరుమల వెళ్ళాను. ముఖద్వారం దాటిన వెంటనే ఖాళీ స్థలంలో స్వామి నాకు ఎదురై నన్ను ఆపారు. ఏం స్వామీ, లక్షలాదిమందిని లోపలికి పంపుతున్నారు కానీ, నన్ను మాత్రం ఎందుకు ఆపారు? అని అడిగాను. నువ్వు నా దగ్గరికి రావలసిన పనిలేదు, పత్రిగారు చెప్పింది చేస్తే చాలు అని చెప్పి తిరుమలేశుడు నన్ను వెనుకకు పంపించారు.

అప్పటి నుండి 5 సంవత్సరాలు గుడికి వెళ్ళలేదు. తర్వాత ఒకరోజు నా మిత్రుడు కంచి రఘురాం, కుప్పుస్వామి కలిసి గుడిలోనే ఒక చోట ధ్యానం చేయడానికి కూర్చున్నాం. వెంటనే నా దగ్గరకు స్వామి వచ్చి ఎన్ని సంవత్సరాలయింది మనం కలుసుకుని అన్నారు. అప్పుడప్పుడు ధ్యానంలో కలుస్తున్నాం కదా అన్నాను. నాతో కొంతసేపు గడుపుతావా అని అడిగారు. సరే అన్నాను. గర్భగుడిలో తీసుకువెళ్ళారు. నా ముఖానికి గంధం పూసి నా చేయి పట్టుకుని తుంబురు తీర్ధం, రామకృష్ణ తీర్ధం కుమారధార తీర్థంలో ముంచి మళ్ళీ తీసుకొచ్చారు. లడ్డూ తినిపించారు. ఇక వెళ్తావా అని అడిగారు. మీ ఇష్టం అన్నాను. నీకోసం మీవాళ్ళు ఎదురుచూస్తున్నారు. నీ ఎదురుగా నిల్చుని ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని కాసుకుని ఉన్నారు అని చెప్పి పంపారు. కళ్ళు తెరచిసచూస్తే ఎదురుగా వారు నిలుచుని ఉన్నారు.

" కైలాసంలో ధ్యానం "

ధ్యానానికి కూర్చున్న వెంటనే శివపార్వతుల దగ్గరకు వెళ్ళేవాడిని. అమ్మవారి అనుమతి తీసుకుని అక్కడ ధ్యానం చేసేవాడిని. ఒకరోజు యథా ప్రకారం అమ్మ వారి అనుమతి కోసం చూసాను. ఇంతలో పరమ శివుడు అమ్మవారితోనేనా మాట్లాడేది నాతో మాట్లాడావా? అన్నారు. లేదు స్వామీ, మాట్లాడతాను అని భయం, భయంగానే అన్నాను. నాతో రా అన్నారు. గురువు గారు ఓకే చెప్తారేమో అన్నాను. చెప్పరులే నాతో రా అని తిరుపతి కపిలతీర్థంలో శివాలయం దగ్గరకు తీసుకువెళ్ళారు. గర్భగుడిలోని శివలింగాన్ని చూపించి ఎత్తుకో అన్నారు. శివలింగం కనీసం మూడు అడుగుల ఎత్తు ఉంది. ఇది సాధ్యమా అన్నట్టు ఆయన్ను చూసాను. ప్రయత్నించు అన్నారు. రెండు చేతులూ చాచి ఎత్తుకోవడానికి ప్రయత్నించాను. శివలింగం చిన్నదవుతూ నాచేతిలోకి వచ్చి నల్లగా ఉన్న శివలింగం తెల్లగా మారింది. అలా నా హృదయం దగ్గరకు తీసుకున్నాను. నీలో ఐక్యం చేసుకో అన్నారు. వెంటనే నా శరీరం లోకి శివలింగం ప్రవేశించింది. ఇక వెళ్ళు ఓకే చెప్తారు అన్నారు. అప్పుడు దివ్యారామంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను నా శరీరంలో ప్రవేశించిన వెంటనే పత్రిగారు ఓకే చెప్పారు. వెంటనే పత్రీజీ నన్ను అనుభవం అడిగారు చెప్పాను. నీకు శివ మాస్టర్ ఆత్మలింగాన్ని ప్రసాదించారు అని గురూజి చెప్పారు.

" నో ఫుడ్ ట్రెక్కింగ్ "

1999 మే 12 వ తేదీ. రెండువందల మంది మాస్టర్లతో పులిబోను బావి నుండి మూడు రోజులు నో ఫుడ్ ట్రెక్కింగ్‌ కు బయలుదేరాం. సాయంత్రం 5 గంటలకు ఒక సెలయేటి వద్దకు అందరం చేరాం. అక్కడే రాత్రి బస. అందరూ టీ మాత్రం తాగి అనుభవాలు చెప్పుకుంటూ రాత్రి గడపారు.

రెండవరోజు 10 గంటలకు బయలుదేరాం. మండుటెండలో నడుస్తూ ఉన్నాం. బాటిళ్ళలో తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి. సాయంత్రం 5 గంటలకు నేనూ, ఇంకొంత మందీ ముందుగా అన్నదమ్ముల బండ చేరాం. అక్కడే రాత్రి బస. అక్కడ చిన్నగుంట ఉంది. ఆ గుంటలో నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. తినడానికి తిండిలేదు. కనీసం నీళ్ళు కూడా లేకుంటే ఎలా? పత్రి గారు ఇంత ఎండలో ట్రెక్కింగ్ పెట్టారే. అని తిట్టుకున్నాను. అర్థగంట గడిచింది. జడివాన కురిసింది. అడివంతా గాడాంధకారమైంది. త్రాగడానికి బిందెనీళ్ళు లేని ఆ గుంటలో పై నుండి ప్రవాహం వచ్చి నల్లగా ఉన్ననీళ్ళు కొట్టుకుపోయి వంక ప్రవహిస్తూ స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చాయి. ఎక్కడయ్యా కేశవరాజు రమ్మని అన్నారు పత్రీజీ. నేను దగ్గరకు వెళ్ళాను. నీవు నా గురించి ఏమన్నావు అన్నారు. కనీసం ఫుడ్ ఎటూ లేదు, నీళ్ళు కూడా లేకుంటే వచ్చే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి అని మిమ్మల్ని తిట్టుకున్నాను అని చెప్పాను. మరి ఇప్పుడు నీకోరిక నెరవేరిందా? అన్నారు. నో ఫుడ్ ట్రెక్కింగ్ జీవితంలో మరువలేనిది.

" సతీవియోగం "

1997 సంవత్సరంలో నా భార్య సుబ్బరత్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే హాస్పిటల్‍ లో చేర్పించాం. రాత్రుళ్ళు హాస్పిటల్‌లో పడుకునేవాడిని. ధ్యానంలో ఎందరో మాస్టర్స్ వచ్చి నీ భార్య రెండు, మూడు నెలల మధ్యలో చనిపోతుంది అనేవాళ్ళు. అలాకాదు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, కనీసం రెండు మూడు సంవత్సరాలైనా బ్రతకాలి అని నేను వాళ్ళను అడిగేవాడ్ని. ఆమె డిజైన్ అంతే వీలుకాదు అనేవాళ్ళు. కొన్ని రోజులు గడిచాయి. మద్రాసు విజయ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాం. అక్కడ కూడా ధ్యానంలో మేము చెప్తే వినలేదు ఇంతదూరం తీసుకువచ్చావు. డబ్బు ఖర్చు, శ్రమ. నీవు ఏంచేసినా మూడునెలలోపు చనిపోతుంది అనేవారు.

తరువాత తిరుపతి వచ్చాం. వారానికి అంతా మళ్ళీ నొప్పి రావడంతో తిరుపతి రుయాలో కార్డియాలజీ వార్డు లో చేర్పించాం. పత్రిగారు తిరుపతి వచ్చారు. తిరుపతి మాస్టర్లు, పత్రీజీ హాస్పిటల్‌కు వచ్చి ఆమెను చూసారు. పది నిమిషాలు అక్కడే వుండి బయటకు వచ్చాం.

జీవితం అంటే ఏమిటి? మరణం అంటే ఏంటి? మరణానంతర జీవితం ఏంటి? అని పత్రిగారు నాకు అర్థగంట బోధించారు. అప్పుడు అర్ధమైంది త్వరలో ఆమె నాకు దూరం అవుతుందని. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆమె చనిపోయే సమయం, దహనక్రియలు జరిగే సమయం, ఎవరెవరు అక్కడికి వచ్చింది ... ధ్యానంలో కనబడింది. అయితే నేనెవరికీ చెప్పలేదు. ధ్యానంలో కనబడిన విధంగానే అన్నీ జరిగిపోయాయి. మాస్టర్స్ చెప్పిన విధంగానే డెభ్భై రెండవరోజు ఆమె శరీరం వదిలిపోయింది.

2000 సంవత్సరంలో నాకు మెడిటేషన్‌లో ఒక స్త్రీరూపం కనబడింది. ఆమె నాకోసం ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. ఆమే నా రెండవ భార్య సుభాషిణి. గత జన్మలో కూడా నాకు ఇద్దరు భార్యలు వాళ్ళే ఈ జన్మలో కూడా కలిసి జీవించడానికి వచ్చారు.

" దివ్యానుభవం "

2001 సంవత్సరంలో పత్రీజీతో కలిసి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాం. దారిలో రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ కూడా మాతో కలిసారు.

మానస సరోవరం నుండి బయలుదేరి దార్బన్‌లో బసచేసి మరుసటి రోజు కైలాస పర్వతం పరిక్రమకు బయలుదేరాం. 10కి.మీ. జీపులో వదిలారు. అక్కడి నుండి కాలి నడక 32 కి.మీ. 3 రోజులు నడవాలి. తొలిరోజు బేస్ క్యాంపు నుండి బయలుదేరాం. అక్కడ ఆక్సిజన్ తక్కువ. నడకసాగదు. మెల్లిగా నడుస్తున్నాం. అంతలో నాకు ప్రక్కనే ఒక ఆస్ట్రల్ మాస్టర్ వచ్చారు. వారిని చూడగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను. మీరెవరు? అని అడిగాను. మాంధాత స్వామి శిష్యుడిని. మీకు సాయంగా వెళ్ళమని మా గురువు గారి ఆజ్ఞ. కొంత సమయం తర్వాత నా ఏరియా అయిపోయింది అని ఆయన వెళ్ళారు.

తరువాత మూషిక రాజు వచ్చారు. ఆయనను చూసి నేను నవ్వాను. నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. నా వెనుక ఎవరు ఉన్నారో చూడండి అన్నారు. మూషికరాజు వెనుక సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు వస్తున్నారు. ఒక్కసారి నాకు నోటి మాట రాలేదు. ఆశ్చర్యపోయాను. తేరుకుని అడిగాను, మీరంతా ఎందుకు వస్తున్నారు? అని పెద్దాయన చెప్పారు 'మీకు తోడు వెళ్ళమని' అని వారన్నారు. ఎవరా పెద్దాయన? అని అడిగాను. వెంటనే కుడి ప్రక్కకు చేయిచూపించి ఆయనే అన్నారు. కుడి ప్రక్క కైలాస పర్వతం ఉంది. అంటే పరమశివుడే నన్ను కరుణించి నాకు తోడు పంపారు అనుకున్నాను. కొంతసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నాగాభరణి అనే మాస్టరు రావడం అదే మెస్సేజ్ ఇవ్వడం జరిగింది.

అక్కడ కుందేళ్ళు ఎక్కువుగా ఉన్నాయి. కొంతదూరంలో ఒక కుందేలు నన్ను చూసి గంతులేస్తుంది. అది చూసి ఆగాను. ఈ దృశ్యాన్ని రెండు నెలలకు ముందు మహతీలో ధ్యానంలో చూసాను అని గుర్తుకు వచ్చింది. తను కూడా అవును, రెండు నెలల ముందు మీకు ధ్యానంలో కనబడ్డాను అని చెప్పింది.

కొంతదూరం వచ్చిన తరువాద నారద మహర్షి వచ్చారు. ఎవరు పంపారని ఆయనను కూడా అడిగాను. పెద్దాయన పంపారని సమాధానం ఇచ్చారు.

ఆ రోజు రాత్రి టెంటులో నిద్రపోతున్నాను. రాత్రి 1.30 గంటలకు మెలకువ వచ్చింది. ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. ఎదురుగా 52 అనే అంకె కనబడుతోంది. ఏమిటిది? నన్నెందుకు నిద్రపోనీయకుండా చేస్తున్నారు? అని అడిగాను.

మేమంతా వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఆత్మలమని, వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుని దిక్కుతోచని స్థితిలో తిరుగుతూ ఉన్నాం అని చెప్పాయి. మీరు మాకు ఏదైనా దారి చూపుతారేమోనని వచ్చాం అన్నారు. వారికి ధ్యాన విశిష్టత తెలియజేసిన వెంటనే మూడు బ్యాచులుగా పైలోకాలకు వెళ్ళిపోయాయి.

కొంతసేపటికి మళ్ళీ రెండు ఆత్మలు నాకు పది అడుగుల దూరంలో వచ్చాయి. వారిలో ఒకరు పంజాబులో ఆత్మహత్య చేసుకున్నవారు, ఇంకొకరు నేపాలు రాజు కుటుంబాన్ని చంపి తను ఆత్మహత్య చేసుకున్న యువరాజు. 'నీకేం పోయాకాలం, రాచ కుటుంబంలో పుట్టి భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇలాంటి పనిచేసావు' అని అడిగాను. క్షణికావేశంలో ఇలా జరిగిపోయింది అన్నాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? అని అడిగాను. అందరూ వారి వారి గదుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అది చూడలేక అక్కడ నుండి నేను వచ్చాను. మాకు కూడా దారి చెప్పండి అన్నాడు. వారికి ఎనర్జీ ఇచ్చి పైలోకాలకు పంపాను. తర్వాత హాయిగా నిద్రపట్టింది.

కైలాస మానస సరోవర ధ్యాన యాత్ర అద్భుతం.
అనుభవాలు అత్యద్భుతం.
జీవితంలో మరువలేనివి.
సామాన్య జీవితం నుండి అసామాన్య జీవితం వైపు
అశాంతి నుండి మనశ్శాంతి వైపు
అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్యస్థాయికి
ఆత్మ నుండి పూర్ణాత్మ స్థాయికి

భౌతిక సంపాదన అశాశ్వతమని, ఆత్మపర, ఆధ్యాత్మిక సంపాదనే శాశ్వతమైనది అని... జీవిత గమనాన్ని మార్చి ఆధ్యాత్మిక విలువలు పెంచి అత్యున్నత స్థాయికి చేర్చిన పత్రీజీకి ఏమి ఇవ్వగలను. ధ్యాన ప్రచారం తప్ప.

అందుకే నిరంతర ధ్యాన సాధన,
నిరంతర ధ్యాన ప్రచారం చేస్తున్నాను.
ధ్యాన జగత్తు సాధించడానికి నా వంతు సేవ చేస్తున్నాను.
గురూజీ పత్రీజీకి శతకోటి ధ్యాన ప్రణామములతో ....

 

 

ధ్యాన రత్నకేశవరాజు
కేశవ పిరమిడ్ ధ్యాన కేంద్రం
8-105, రాయల్ నగర్ RC.రోడ్, తిరుపతి - 517501

Go to top