" ధ్యానం నా ప్రాణం "


నా పేరు జగదీశ్వరరెడ్డి. మాది గొరిగెనూరు గ్రామం, జమ్మలమడుగు మండలం, Y.S.R. జిల్లా. నేను ఎంతో ప్రేమతో, అభిమానంతో, విశ్వాసంతో, ఇష్టపూర్వకంగా పిరమిడ్ ధ్యానంలోకి 2009 డిసెంబర్ నెలలో .. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరిగిన ధ్యాన మహాయజ్ఞం ద్వారా ప్రవేశించాను. నా ధ్యాన వయస్సు పది నెలలు మాత్రమే.

దాదాపు ఆరు సంవత్సరాల క్రితం .. అంటే 2005 సంవత్సరంలో గురువు గారిని ధ్యానశిక్షణ కోసం మా గ్రామంలోని ధ్యానులు పిలిపించడం, మరి ఆ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ సమావేశంలో పత్రీజీ నన్ను తన ప్రక్కన కూర్చోమన్నారు. గురువు గారిని చూడడం అదే మొదటిసారి. తరువాత ఆయన నన్ను " ధ్యానం చేస్తున్నారా ? " అని అడిగారు.

" లేదు " అని చెప్పాను. మళ్ళీ వెంటనే " మాంసం తింటున్నారా ? " అని అడిగారు. " బాగా తింటాను " అని చెప్పాను.

అప్పుడు గురువుగారు ఆ సమావేశానికి వచ్చిన గ్రామస్థులకు " ఇతడు ధ్యానంలోకి వస్తే మంచిస్థితిలోకి వస్తాడు. మంచి ధ్యాని అవుతాడు " అని చెప్పి " ఇప్పటి నుంచి ధ్యానం చేయాలి " అని " ఈ రోజు నుంచి మాంసం కూడా మానివేస్తాను ; ధ్యానం కూడా చేస్తాను " అని నాతో చెప్పించి అందరి సమక్షంలో ప్రమాణం చేయించుకున్నారు. సమావేశంలో అందరి చేత ధ్యానం చేయించి తమ అమూల్యమైన సందేశం ఇచ్చారు.

ఆ మరుసటి రోజు నుంచి గురువుగారి గురించీ, ధ్యానం గురించీ పూర్తిగా మరిచిపోయి .. రాజకీయాలలో పడి హైదరాబాదుతో పాటు మిగతా పట్టణాలకు తిరుగుతూ ప్రతిరోజూ విపరీతంగా మాంసం తింటూ త్రాగుతూ .. " ఇదే ఆనందం " అనీ, " ఇదే వైకుంఠం " అనీ ఇంతకు మించింది ఏదీలేదు " అనీ భావిస్తూ మరి అందులోనే మునిగితేలుతూ గురువుగారికి ఇచ్చిన ప్రమాణం గురించి పూర్తిగా మరిచిపోయాను.

ఇక మెల్లిగా మొదలైంది నాలో " క్రానిక్ గ్యాస్‌ట్రబుల్ " అనే రుగ్మత. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి నేను మా జమ్మలమడుగు స్థాయి నుంచి హైదరాబాద్ వరకు వున్న అన్ని మంచి ఆసుపత్రులకూ తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఎండోస్కోపి చేసి .. ఏమీలేదంటూ .. ఏవో కొన్ని మందులు ఇచ్చి పంపేవారు. మనిషిని చూస్తే రోజురోజుకూ కృశించి పోతున్నాను ; ఆకలి లేకపోవడం శారీరం బలహీనం కావడం జరుగుతోంది. దాంతో నాలో విపరీతమైన ఆలోచనలతో పాటు ఒక విధమైన చావుభయం కూడా మొదలై రాత్రిళ్ళు నిద్రలేకుండా .. ఎవరితో ఎక్కువగా కలవలేక, ఏ కార్యక్రమానికీ పోలేక, వివాహాది శుభ కార్యక్రమాలకు వెళ్ళడం మానివేశాను. జనంలోకి వెళ్ళాలంటే భయం, ఎప్పుడూ నా భార్య నాకు తోడుగా వుండవలసిందే. ఏమీ చేయలేని పరిస్థితిలో .. నిరాసక్తంగా జీవచ్ఛవంగా ఇంటి దగ్గరే వున్నాను.

ఒకరోజు మా ఇంటి ఆవరణలో ఒక్కడినే కూర్చుని ఆలోచిస్తూ వుండగా .. పూజ్యగురువు గారికి నేను మాంసం తినను అనీ, ధ్యానం చేస్తాను అనీ చేసిన ప్రమాణం గుర్తుకు వచ్చి వెంటనే " ధ్యాన మార్గమే నాకు రక్ష ; ఇక వేరే వాటి ద్వారా రక్షణ లేదు " అనిపించింది. మొదట మాంసం తినను అని నిర్ణయం తీసుకుని .. ఆ రోజు నుంచి మాంసం మానుకున్నాను. మా స్నేహితులు మరి మండపేట మాజీ శాసనసభ్యులు V.S.S.R చౌదరిగారు కూడా ధ్యానం యొక్క విశిష్టతనూ మరి పిరమిడ్ శక్తినీ నాకు తెలియజేసి .. ఒక 4'X4' పిరమిడ్‌ను వారే స్వయంగా కొని నాకు ఇచ్చారు. ఇక నేను మహదానందంతో " నాకు మంచి రోజులు వచ్చాయి " అని మనస్సులో అనుకుంటూ ధ్యానం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే ధ్యానులందరం కలిసి .. శ్రీశైలం ధ్యానయజ్ఞానికి వెళ్ళి అక్కడ వారంరోజులు వున్నాం.

"శ్రీశైలం ధ్యానయజ్ఞం " లో ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు సామూహిక ధ్యానం చేస్తోంటే .. ఒకరోజు నాకు విపరీతమైన చెమటలుపట్టి తల తిరుగుతూ వాంతి అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ లోపు మూడు గంటల సమయం పూర్తి అయి అందరూలేచి వెళ్తూంటే నేను కొద్దిసేపు అలాగే కూర్చుని .. లేచి బయటకు వచ్చాను. వెంటనే స్నానం చేయాలని నా రూమ్‌కు వెళ్తూంటే ఆశ్చర్యకరంగా అంతకు కొన్ని రోజుల ముందు నుంచి నన్ను అనేక విధాలుగా బాధించిన నా మోకాలునొప్పి " పూర్తిగా తగ్గిపోయింది " అని గమనించాను. నన్ను నేను నమ్మలేక వెంటనే రూమ్‌కు వచ్చి పద్మాసనంలో కూర్చున్నాను. అయినా నాకు ఎలాంటి నొప్పి అనిపించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మోకాలు నొప్పి మళ్ళీ రాలేదు. ఆ నొప్పితో దాదాపు కొన్నాళ్ళుగా మంచానికే అంకితమైన నేను .. ఇప్పుడు బాగా వేగంగా నడవగలుగుతున్నాను. ఇది నా జీవితంలో అత్యంత గొప్ప అనుభవం.

వారం రోజుల ధ్యానయజ్ఞం తరువాత మా ఇంటిలో వున్న పిరమిడ్ క్రింద ప్రతిరోజూ ఉదయం. సాయంత్రం ధ్యానం చేస్తున్నాను. నాలో వున్న భయం, అలజడి, ఆందోళన, చావు భయం పుర్తిగా తగ్గిపోయింది. అలాగే నాకున్న గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఎలాంటి మందులు వాడే అవసరం లేకుండానే చాలా వరకు తగ్గి .. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా వుంటోంది.

" పిరమిడ్ ధ్యానంలో వున్న ఇంత గొప్ప అద్భుతం,ఆరోగ్యం, ఆనందం నేను ఒక్కడినే అనుభవిస్తే మంచి పద్ధతి కాదు " అనిపించి .. ఇది మా గ్రామస్థులందరికీ పంచి వారందరినీ ఆరోగ్యవంతులు చేసి ధ్యానమార్గం వైపు రప్పించాలనే దృఢ సంకల్పంతో గ్రామస్థులందరి సహకారంతో మా గ్రామంలో 25 సెంట్ల స్థలంలో 27'X27' కొలతలతో పిరమిడ్ మరి దాని క్రింద ఒక హాలు నిర్మాణం మొదలుపెట్టాము.

 

గోనా జగదీశ్వరరెడ్డి
Y.S.R. జిల్లా
ఫోన్ : +91 94402 84966

Go to top