" బంగారు ధ్యాన కుటుంబం "

 

నా పేరు అరుణ. ధ్యానమే నిత్యం, ధ్యానమే సత్యం, ధ్యానమే సర్వస్వంగా జీవిస్తున్న మా కుటుంబం " బంగారు ధ్యాన కుటుంబం ". నా పేరు అరుణ. మాది ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం. నేను 2011 ఫిబ్రవరిలో మా వదిన " మాధవి మాస్టర్ " ద్వారా ధ్యానంలోకి వచ్చాను. సైనస్ మరి అల్సర్ సమస్యలతో ఎంతో బాధను అనుభవించిన నేను వాడని మందులంటూ లేవు. అల్సర్ వల్ల ఆహారం సరిగా తీసుకోలేకపోవడమే కాకుండా వాంతులు అవడం ఈ విధంగా కడుపునిండా ఆహారం, కంటినిండా నిద్ర లేక ఎంతో నరకాన్ని అనుభవించాను.

 

సైనస్ సమస్యవల్ల నాకు ముక్కు ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు నా ముక్కులోని ఎముక కాస్త క్రాస్‌గా వుండడం వల్ల ముందు బోన్ ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు మా వదిన నన్ను గట్టిగా మందలించి " ముందు నువ్వు 45 రోజులు క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యి; అప్పటికీ నీ సమస్యలు తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకుందువు గానీ " అంది. ఆ తరువాత క్రమం తప్పకుండా ధ్యానసాధన చేయడం ద్వారా నా సైనస్ మరి అల్సర్ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయి. నమ్మలేని స్థితికి నా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా గృహిణిగా నా యొక్క బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ నా భర్త, బాబులతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను. ఇంత చక్కని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించిన ధ్యానానికి వేవేల కృతజ్ఞతలు ! నా ఆరోగ్యంలో వచ్చిన మార్పును ప్రత్యక్షంగా చూశాక మా అమ్మ, నాన్న, తమ్ముడు, మొత్తం కుటుంబసభ్యులు, అందరూ ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టారు. మా కుటుంబం అంతటికీ చక్కని ఆరోగ్యాన్ని మరి ఆనందభరిత జీవనాన్ని అందించిన ధ్యానాన్ని అందరికీ పరిచయం చేసి అందరిచేతా ధ్యానం చేయించాలన్న సంకల్పంతో మా అన్నయ్య నల్గొండజిల్లా జొన్నలగడ్డ గూడెంలో " శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ " కట్టించారు. ఈ పిరమిడ్‌లో ప్రతి నెల ధ్యానతరగతులు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుప్రక్కలవారు చాలా మంది క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ వారి చక్కటి అనుభవాలను తెలియజేయడం జరుగుతోంది.

 

2011లో వైజాగ్‌లోని ధ్యానమహాచక్రం పాల్గొనడం, పత్రీజీ గారిని దర్శించుకోవడం జరిగింది. 2012లో మా వదిన హైదరాబాద్‌లో 40 రోజుల ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేసారు, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వివిధ సీనియర్ మాస్టర్ల తరగతులు, వారు చేస్తున్న సేవలను విన్న నాకు, ఈ విధంగా సేవ చేయాలని అనిపించింది. " మనస్సు లోని కోరికకు ధ్యానం మార్గం చూపుతుంది " అన్న విధంగా మా పాల్వంచ పిరమిడ్ మాస్టర్లు మరి మేము అందరం కలసి మా యింటివద్ద K.T.P.S, కాలనీలోని " ముత్యాలమ్మ గుడి " లో 17 రోజుల ధ్యాన తరగతులు ఏర్పాటుచేయడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ సీనియర్ మాస్టర్లతో ధ్యాన తరగతులు చెప్పించడం మరియు పిప్పళ్ళప్రసాద్ గారి ధ్యాన గానామృతం ఏర్పాటు చేయడం జరిగింది. " ఈ గుడిలో బలులు బాగా జరుగుతాయి, అవి తగ్గిపోవాలి " అనే సంకల్పంతో ఈ తరగతులు ఏర్పాటు చేయించాము. అప్పటి నుంచి ధ్యానం తెలియని వారికి ధ్యానం గురించి వివరిస్తూ 100కు పైగా ధ్యానపుస్తకాలను, 150కు పైగా CDలను, 1000 పైగా పాంప్లెట్‌నూ అందజేసి శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ ధ్యానసేవలో తరిస్తున్నాను. 2012 మార్చి 4వ తేదీన మా తమ్ముడి వివాహం జరిగింది. మా కుటుంబంలో మొట్టమొదటిసారిగా వివాహ విందు శాకాహారంతో ఏర్పాటు చేసాము. ధ్యానం చేస్తే ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా తట్టుకోగలం అన్నది, మేము 2013 మే నెలలో రోహిణికార్తెలో కర్నూలులోని జగన్నాథగట్టును మిట్టమధ్యాహ్నం 12.00 గం||లకు ఎండలో సునాయాసంగా ఎక్కగలగడంతో నిరూపితమయింది.

 

2013 ధ్యానమహాచక్రంలో అఖండ ధ్యానం చేసేవారికి నేను వాలింటీర్‌గా, 14 రోజులు కేవలం జావ మాత్రమే తీసుకుంటూ .. ఇతర ఆహారం ఏమీ తీసుకోకుండా సేవ చేయగలిగాను ! అఖండ ధ్యానం చేసిన వారి అనుభవాలను అడిగి తెలుసుకుని ఎంతో చక్కని అనుభూతి, ఆనందాలను పొంది, ఏ మాత్రం అలసట, అనారోగ్యం లేకుండా " మహేశ్వర మహాపిరమిడ్ శక్తి " తో మరి ధ్యానుల యొక్క ధ్యానశక్తితో నా సేవ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించగలిగాను ! ఒకరోజు నేను ధ్యానం చేస్తుండగా పత్రీజీ నా ముందు కూర్చున్నట్లు, ఆయనతో పాటు నేనూ ధ్యానం చేస్తున్నట్లు కనిపించింది. నాకు ధ్యానంలో కనిపించిన విధంగానే ఎంతో అద్భుతంగా నెలరోజుల లోపే పత్రీజీ మా పాల్వంచ గ్రామానికి రావడం .. 2014 ఏప్రిల్ 21,22,23 తేదీలలో పత్రీజీ పాల్వంచ మరి చుట్టుప్రక్కల ప్రాంతాలలోని పిరమిడ్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి పాల్వంచలో కేర్ సెంటర్ ప్రారంభోత్సవం చేసి ధ్యాన జ్ఞాన సేవా కార్యక్రమాలను నిర్వర్తించాము. సార్‌తో పాటు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాలలో భాగస్వాములం కావడం నాకు జన్మజన్మల సుకృతం.

 

2014 ఏప్రిల్ 24న నల్గొండ జిల్లా లోని మా అమ్మగారింట్లో పిరమిడ్ ప్రారంభోత్సవం పత్రీజీ గారితో చేయించి సార్‌తో పాటు చక్కగా పిరమిడ్ లో ధ్యానం చేయగలగడం నా అదృష్టం. ఆ తరువాత సార్‌తో పాటు ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నాను ! నేను ఈ విధంగా ధ్యానం, ధ్యానసేవ ఎంతో చక్కగా చేయడానికి నా ఆత్మసహచరులు, నా జీవిత భాగస్వామి అయిన నా భర్త శ్రీ దేశిరెడ్డి గారు మరి మా అబ్బాయి జ్ఞానసాయిరెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ .. ధ్యానసేవలో వారి వంఉ సేవలందిస్తున్నారు. నా భర్త " పాల్వంచ పిరమిడ్ కేర్ సెంటర్‌కి " కార్యదర్శిగా తన సేవనందిస్తూ, నేను చేసే ఏ కార్యక్రమానికైనా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. పాల్వంచ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోని ధ్యానులంతా మా కుటుంబ సభ్యులుగా ధ్యానంలో మరి వేడుకలలో ఒకటిగా ఉంటూ ఆనందాలను రెట్టింపు చేసుకుంటూ పిరమిడ్ ధ్యాన కుటుంబంగా విరాజిల్లుతున్నాము. సదా ధ్యాన సేవలో ..

 

 

 

J.అరుణ

పాల్వంచ - ఖమ్మం, సెల్: 94918 88402

Go to top