" శక్తి వున్నంతవరకూ ఇక్కడే పనిచేస్తాను "

 

 

మారం: మేడమ్! " ధ్యానాంధ్రప్రదేశ్ " ఆఫీస్‌లో మీ ఉద్యోగ విధులను గురించి చెప్పండి!
నాగప్రసన్న: నేను 2007, ఆగస్ట్ నుంచి " ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసు "లో కంప్యూటర్ డిపార్ట్‌మెంట్‌కు ఇన్‌ఛార్జ్‌గా నా ఉద్యోగవిధులను నిర్వహిస్తున్నాను. నేను B.Com చేశాను. నాకు ఒక అబ్బాయి, మా వారు ఉద్యోగస్థులు. " ధ్యానాంధ్రప్రదేశ్ " లో ప్రతి నెలా చందాదారుల పట్టికను అనుసరించి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా లిస్టులను కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేసి .. వాటిని సంబంధిత కవర్లపై అంటించి .. ప్రింటింగ్ ప్రెస్ నుంచి పత్రిక ప్రింట్ అయి వచ్చే వరకు తయారుగా ఉంచుతాం ! ప్రతి నెలా ఇదొక యజ్ఞం ! పత్రిక వచ్చాక మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఫోన్లు చేసి .. పిలిచి .. అందరం కలిసి వేలాదిగా ఉన్న ఆ కవర్లలో పత్రికను ఉంచి ఒక క్రమపద్ధతిలో వాటిని పోస్ట్ చెయ్యడం కోసం తయారుగా ఉంచుతాం ! ఎక్కడ ఏ ఒక్క లింక్ కూడా మిస్ కాకుండా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ, లిస్ట్ ప్రకారం పత్రికల బండిల్స్‌ను చెక్ చేస్తూ ఉంటాం ! ప్రతి నెలా 5వతేదీ నుంచి 7 వ తేదీ వరకు .. ఊపిరి సలపని పని ! రాత్రింబగళ్ళు ఇట్టే గడచిపోతాయి ! మ్యాగజైన్స్ అన్నీ పోస్ట్‌లో, కొరియర్‌లో, ANL పార్సిల్‌లో .. మరి ఒక్కోసారి కొందరు పిరమిడ్ మాస్టర్లు బల్క్‌లో .. తమ తమ ప్రాంతాలకు తీసుకువెళ్ళే పన్లన్నీ ప్రశాంతంగా ముగిశాక .. " హమ్మయ్య " అనుకుంటాం!

 

ఇదంతా ఒక ఎత్తయితే .. క్రొత్త చందాదారులను ఎప్పటికప్పుడు పట్టికలో చేర్చడం .. వారికి సీరియల్ నెంబర్లు కేటాయించి .. SMS ద్వారా వారికి తెలియపరచడం .. ఇక ఆ రిఫరెన్స్ నెంబర్‌తో వారు ఎప్పుడు పత్రిక ఆఫీసుకు పోన్ చేసినా వెరిఫై చేయడం ఇంకొక యజ్ఞం ! అడ్రస్ మార్పులు సరేసరి. చందా గడువు ముగిసిన వారికి మూడు నెలల ముందు నుంచే ఫోన్ల ద్వారా, SMSద్వారా, మరి పోస్ట్ కార్డుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాం ! ఇంకా పత్రిక సకాలంలో అందని వారు ఫోన్ చేస్తూంటారు, ఉత్తరాలు వ్రాస్తూంటారు మెయిల్స్ చేస్తూంటారు. వారికి సమాధానాలు చెబుతూ .. పత్రిక అందని వారిని ప్రతినెలా 25 తారీఖు వరకు వేచి చూడమని కోరుతాం ! పోస్టల్ ప్రాబ్లెమ్ వల్ల కానీ .. మరేదో సహేతుక కారణం వల్ల కానీ .. పత్రిక 25వ తేదీ వరకు కూడా వారికి అందకపోతే .. మేమే వారికి మళ్ళీ ఫోన్ చేసి .. వాకబు చేసి మళ్ళీ పోస్ట్‌లో పంపిస్తాం ! ఇదంతా 26వ తేదీ నుంచి 2వ తేదీ వరకు జరుగుతుంది ! ఇలా ప్రతి నెలా రెండు సార్లు పోస్ట్ చేయడానికి మాకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి పర్మిషన్ ఉంది. చాలామంది పత్రిక అందగానే తెలియపరుస్తారు కానీ కొందరు పని వత్తిడి వల్ల మరిచి పోయినా మేమే వాకబు చేసి రెండో కాపీ పంపుతాం ! ఇదంతా ఎంతో సహనంతో కూడుకున్న వ్యవహారం ! నాకు మొదటి నుంచి సహనం పాలు కాస్త ఎక్కువే .. అది మరింతగా వన్నె పొందడానికే .. ఈ ఉద్యోగం దోహదపడింది !

 

మారం: మీరు ధ్యానం చేస్తారా? ధ్యానాంధ్రప్రదేశ్ చదువుతారా?

 

నాగప్రసన్న: క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాను .. " ధ్యానాంధ్రప్రదేశ్ " ను ఎంతో ఇష్టంగా చదువుతాను!

 

మారం: పత్రీజీ గురించి ..?

 

నాగప్రసన్న: పత్రిసార్ గురించి తలచుకుంటేనే .. గర్వంగా ఉంటుంది ! " నిత్య కృషీవలుడు " అన్న పదానికి నిలువెత్తు రూపం వారు ! ఉదయం ఒక ఊళ్ళో, మధ్యాహ్నం ఊళ్ళో, సాయంత్రం ఒక ఊళ్ళో .. అలుపెరుగకుండా తిరుగుతూంటారు ! అంత బిజీగా ఉండే సార్ " ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక " కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి దానిని అద్భుతంగా తీర్చిదిద్దడం చూస్తూంటే .. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారు స్వాధ్యాయ సేవ కోసమే జన్మించినట్లు పత్రికకి వర్క్ చేస్తూవుంటారు.

 

మారం: " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రికను " ధ్యానజగత్ " గా మార్చడం గురించి?

 

నాగప్రసన్న: " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రిక .. ఇకముందు " ధ్యానజగత్ " గా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాలను విరజిమ్మబోతోంది ! ప్రస్తుతం పత్రికకు ఉన్న చందాదారులందరూ, పాఠకులందరూ ప్రతి ఒక్కరూ తమ వంతుకర్తవ్యంగా మరొక చందాదారుడిని చేర్పించి త్వరలో రాబోయే " ధ్యానజగత్ " పత్రిక సర్క్యులేషన్‌ని పెంచితే .. లక్షకాపీలను చేరుకోవడం త్వరలోనే సాధ్యం అవుతుంది. ఇంత మంచి పత్రిక ఆఫీసులో పని చేయడం నా భాగ్యంగా భావిస్తూ .. నా జీవితకాలంలో ఉద్యోగం చేసినంత వరకు ఇక్కడే ఉండడానికి ఇష్టపడతాను !

 

 

 

భమిడిపాటి నాగప్రసన్న

అంబర్‌పేట

హైదరాబాద్

 

Go to top