" అనుకోని ఆధ్యాత్మిక అభివృద్ధి "

 

 

మారం: మీరు ఈ మ్యాగజైన్ ప్రారంభికులలో ఒక మూల స్థంభమైన ‘ ఓషో ప్రసాద్ ’ చెల్లెలు మరి 2001 నుంచి మీరు ఇక్కడ D.T.P. ఆపరేటర్‍గా ఉన్నారు. " ధ్యాన జగత్ " గురించి మీ అనుభూతి !


రోజి: నేను మా అన్నయ్య " పిన్నమరాజు ప్రసాద్ " యొక్క బలవంతంతో నేను DTP నేర్చుకున్నాను. 2003 మే లో " గౌతమ బుద్ధుడు " ముఖచిత్రం ఉన్న ‘ ధ్యానాంధ్రప్రదేశ్ ’ మ్యాగజైన్‍తో నా అనుబంధం మొదలయింది. మేము పుట్టక ముందే మా పెద్ద వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి సరూర్‌నగర్‍లో సెటిల్ అయ్యారు! మేమంతా ఇక్కడే పుట్టి పెరిగాం. ఎక్కడో మూలాలు - మరెక్కడో జన్మలు-ఇంకెక్కడో మనుగడలు. ఈ భూమి మీద ఎక్కడున్నా ఈ ‘ జగత్తు ’ లోనే కదా! అందుకే " ధ్యాన జగత్ " అనగానే నాకు ఎంతో ఆనందం కలిగింది. అంతేకాదు ఆధ్యాత్మికత అంటే ఏమి తెలియని నేను ఇక్కడ ఎంతో తెలుసుకుని నేర్చుకున్నాను. ఇది నా జీవితంలో సంభవించిన అనుకోని ఆశించని ఆధ్యాత్మికత అభివృద్ధి. ఇది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

 

మారం: ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రిక అవతరణ గురించీ మీ పెద్దన్న ‘ ఓషో ప్రసాద్ ’కు ఈ మ్యాగజైన్ తో ఉన్న సంబంధం గురించి తెలుపండి.

 

రోజి: " ధ్యానం " అంటే మా కుటుంబానికి ఏమీ తెలియదు. హైదరబాద్‌లో ఇంటర్ వరకు మా అన్నయ్య, వెంకటేశ్ ఒకే దగ్గర చదువుకున్నారు. తరువాత ప్రసాద్ అన్నయ్య కర్నూలు G.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ అక్కడే పత్రీజీ సాంగత్యాన్ని పొందాడు. మరి ఇంజనీరింగ్ చేస్తూనే హైదరాబాద్ వచ్చి .. పత్రిసార్ ను పిలుచుకుని వచ్చి మెడిటేషన్ క్లాసు పెట్టించాడు. ఆ తరువాత " స్వతంత్ర " అనే మినీ ఆధ్యాత్మిక మ్యాగజైన్‌ను ప్రింట్ చేశాడు. ఆ పైన పత్రీజీ ఆదేశంతో " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రికకు మొదటి పబ్లిషర్‌గా అన్ని బాధ్యతలు తీసుకుని మొదలుపెట్టాడు. మా అన్నయ్య పత్రీజీతోనే ఉంటూ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ‘ మ్యాగజైన్ ’ ను తీసుకురావడం, మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, ఆధ్యాత్మిక పుస్తకాలు అనువాదం చేయించి ప్రింట్ చేయించడం చేసేవాడు ! ఇంకా పత్రీజీ ప్రసంగాలు అన్నింటినీ చిన్న పుస్తకాలుగా - " యోగపరంపర " .. " యోగి వేమన " .. " ఆనాపానసతి " .. " సంకల్పశక్తి " .. " ధ్యానానుభవాలు " .. " ధ్యానం వలన లాభాలు ", ఇలాంటి ఎన్నో చిన్నపుస్తకాలు 15 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయల వెలతో అందరూ చదవాలనే ఉద్దేశ్యంతో పిరమిడ్ పబ్లికేషన్ నుంచి పిరమిడ్ ప్రపంచానికి అందజేశాడు అన్నయ్య. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదు. మళ్ళీ కోలుకున్న తర్వాత మాట సరిగ్గా రాకున్నా పుస్తకాల ప్రింటింగ్ కోసం తపించడం మీకందరికీ తెలుసు. ఇక ఆ పైన ఊర్ధ్వలోకాలకు పయనమైపోయింది ఆ ‘ స్వాధ్యాయాత్మ ’ !

 

మారం: 2003 ‘ గురుపౌర్ణమి ’ నుండి మీరు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ D.T.P. ఆపరేటర్‌గా వున్నారు ! ప్రతి నెలా ఆర్టికల్స్ టైప్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీలయ్యేవారు !

 

రోజి: ఆర్టికల్స్ టైప్ చేసేటప్పుడు ఆ సమాచారం నాలో ఇంకిపోయేది ! బయట ఎక్కడో పనిచేస్తే అందరి లాగే ఒక వృత్తి మాత్రమే చేసేదానిని. కాని ‘ ధ్యానాంధ్రప్రదేశ్ ’ కోసం ఈ పని చేయడం వల్ల నా జ్ఞానం కూడా ఎన్నోరెట్లుగా ఎదుగుతోంది ! " పత్రీజీ " పేరు గుర్తుచేసుకుంటేనే మాకు ఎంతో ధైర్యం. ఇక ఆఫీసుకు వస్తున్నారంటే .. తండ్రి వస్తున్నట్లుగా భావిస్తాను ! పత్రీజీ సందేశాలనూ, వారి కార్యకలాపాలనూ ధ్యానుల అనుభవాలనూ చదువుతున్నప్పుడు మనం ధ్యానాంధ్రప్రదేశ్ ద్వారా " ఇంత సమాచారం " ఈ ప్రపంచానికి అందిస్తున్నందుకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది ! పత్రిసార్ టూర్ ప్రోగ్రాం టైప్ చెస్తూంటే వారు ఎక్కడెక్కడ ధ్యానప్రచారం చేసి, ప్రతి ఒక్కరినీ కలిసి, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, దేశ విదేశాల్లో వారు చేసిన ధ్యానప్రచారం చూస్తూంటే మానవమాత్రుడు ఎంత మాత్రం కాదు అనిపిస్తూ ఉంటుంది ! అలసట అనేది వారి ముఖంలో ఎప్పుడూ కనిపించదు. ఇది ఈ జన్మకు దొరికిన మహద్భాగ్యం గా అనిపిస్తుంది.

 

మారం: గత 11 సంవత్సరాలుగా మీరు పనిచేశారు. చాలామంది ఎడిటర్లుగా ఉన్నారు. వీరందరితో మీకు కలిసి పనిచేసిన అనుభవం!


రోజి: నేను ఆఫీసుకి వచ్చేటప్పటికి J.K.భారవి గారు ఎడిటర్‌గా వుండేవారు. ఆ తర్వాత ప్రసాద్ అనారోగ్యానికి గురి కాబోయే ముందు విజయవాడ .. చక్రపాణి, జయశ్రీ మేడమ్ దంపతులు, ప్రసాద్ అనారోగ్యంతో వున్నప్పుడు తిరుపతి .. B.V.రమణ, సంగీత దంపతులు, నాగలక్ష్మీ మేడమ్ .. వీరందరితో నేను పనిచేశాను ! ఇప్పుడు ఎడిటర్ వాణి మేడమ్ గారితో పనిచేస్తున్నాను. ఇక శివప్రసాద్ మొదట్లో పత్రీజీ వెంటనే వచ్చేవారు కనుక మ్యాగజైన్ ఫైనల్ వర్కు గమనించేవారు. ఆ తర్వాత చీఫ్ ఎడిటర్‌గా నియమింపబడ్డారు. వీరందరితో నేను పనిచేసి ప్రతీ ఒక్కరి దగ్గరా ఎంతో నేర్చుకున్నాను!

 

మారం: మీ అన్నయ్య ఓషో ప్రసాద్ గురించి ఇంకా ఏమన్న చెప్పలనుకుంటున్నారా?


రోజి: చిన్నప్పటి నుంచి నేనంటే పెద్ద అన్నయ్యకు చాలా ఇష్టం ఉండేది. నేను ఏ విషయం గురించి గొడవ చేసినా . . నవ్వడం తప్ప మరొక మాట అనేవాడు కాదు. అప్పట్లో " ఓషో సన్యాసి " సంతోషానంద గారు హిమాయత్ నగర్‌లో వుండేవారు .. ఇప్పుడు అంబర్‌పేట దగ్గర వుంటున్నారు. మేము పత్రీజీ క్లాసులకు అందరి దగ్గర నుంచి పుస్తకాలను సేకరించేవాళ్ళం. సంతోషానందగారు " ఓషోను తెలుగువారికి ఇంత గొప్పగా పరిచయం చేసిన ఘనత నీకు, పత్రీజీ గారికే దక్కింది. కనుకనే నిన్ను అందరూ ‘ ఓషో ప్రసాద్ ’ అని పిలుస్తున్నారు " అనేవారు. మే 29, 2010 బెంగళూరులో ప్రసాద్ మరణించేముందు .. కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆకలితో వస్తుంది అనుకుని అన్నం పెట్టాను, కొబ్బరి బొండాం కూడా తాగిచ్చాను. అయినా ఆ నొప్పి తగ్గకపోవడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేసాము. హాస్పిటల్‌లో మా చిన్న అన్నయ్య వున్నాడు. నేను పిరమిడ్ వ్యాలీలో బుద్ధపౌర్ణమి దగ్గర వున్నాను. మరొక ఆరొగ్యవంతమైన శరీరంతో ఉత్తమమైన జన్మతీసుకుని మరింతిగా స్వాధ్యాయ సేవ చేయడం కోసమే అన్నయ్య వెళ్ళిపోయాడు ! అన్నయ్య అనారోగ్యం పాలయినప్పటి నుంచి " పిరమిడ్ పబ్లికేషన్స్ " మరి " సావిత్రిదేవి పిరమిడ్ ధ్యానకేంద్రం " - వ్యవహారాలను నేను, మా చిన్న అన్నయ్య " కిట్టు " చూసుకుంటున్నాము.

 

మారం: ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యానజగత్ గా మారుతున్న ఈ సందర్భంలో ‘ ధ్యానాంధ్రప్రదేశ్ ’ పాఠకులకు మీ సందేశం!

 

రోజి: ఎంతో శ్రద్ధతో , ఎంతో సమయం కేటాయిస్తూ ఎంతోమంది యోగీశ్వరుల గురించి, ఎంతో మంది ధ్యానులనుంచి ఎన్నో పుస్తకాల నుంచి సమాచారం సేకరించి పత్రీజీ సందేశాలలో కూర్చి మరీ అందించబడుతోంది ధ్యానాంధ్రప్రదేశ్ ! పత్రిసార్ దానిని ధ్యానజగత్‌గా మార్చి మరీ మనకు అందించబోతూవున్నారు కనుక లక్షలాది మందిని సబ్‌స్క్రైబర్స్‌గా చేర్చాలని పాఠకులకు నా విజ్ఞప్తి.

 

దండు రోజి

సరూర్‍నగర్ - హైదరాబాద్

Go to top