" స్థితప్రజ్ఞత్వానికి మరో పేరు పత్రీజీ "

 

 

అనంతపూర్ నగర వాస్తవ్యులు మరి పత్రీజీ ధ్యాన ఉద్యమాన్ని ప్రారంభించిన తొలినాళ్ళలో వారితో కలిసి అడుగులు వేసిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ N.C.సంపత్‌ కుమార్ గారు అడ్వకేట్‌గా సంఘంలో మంచిపేరున్న విద్యాధికులు ! బుద్ధ పౌర్ణమి సందర్భంగా బెంగళూర్ పిరమిడ్ వ్యాలీకి విచ్చేసి .. తమ అనుభూతులను అందరితో పంచుకున్న ఈ ఆత్మీయ అతిథితో ధ్యానాంధ్రప్రదేశ్ ఇన్నర్ వ్యూ ..

 

మారం శివప్రసాద్

 

 

మారం: నమస్కారం సార్ ! పిరమిడ్ ప్రపంచానికీ .. మరి ముఖ్యంగా పత్రీజీకి .. ఎంతో ఆప్తులయిన మీ ధ్యానప్రస్థానం గురించి తెలియజేయండి !

 

సంపత్ కుమార్: ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకూ, పిరమిడ్ ధ్యానులకూ నా ఆత్మపూర్వక అభినందనలు ! పత్రీజీ తో నా పరిచయభాగ్యం .. 1992 నుంచే మొదలయ్యింది. అప్పట్లో నేను అనంతపూర్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌చేస్తూ చాలా బిజీగా ఉండేవాడిని, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో రీజియనల్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న పత్రీజీ .. ఒకానొక సందర్భంలో నన్ను కలవడానికి నా ఆఫీసుకి వచ్చారు. అప్పట్లో వారికి ‘ గెడ్డం ’ అదీ ఏమీ లేదు ! నీట్‍గా ‘ టక్ ’ చేసుకుని ఎగ్జిక్యూటివ్ డ్రెస్‌లో నా దగ్గరికి వచ్చిన పత్రీజీని చూసి " ఏదో కేస్ విషయమై నన్ను కలవడానికి వచ్చారు " అనుకున్నాను. కానీ వారితో మాట్లాడిన కొద్ది సేపట్లోనే .. " వారు అందరిలాంటి వారు కాదు " అని అర్థం అయ్యింది. స్ఫురద్రూపంతో, ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తూ .. నిష్కర్షగా, సూటిగా ఆధ్యాత్మిక విషయాలను వారు చెబుతూంటే విని ఆశ్చర్యపోయాను! " ఏదో ఆధ్యాత్మిక సంస్థకు విరాళం కోసం వచ్చి ఇలా మాట్లాడుతున్నారేమో " అనుకున్నాను కానీ .. " నా అంచనా తప్పు" అని మనస్సు హెచ్చరిస్తూనే వుంది.

 

ఏదో తెలియని ఆత్మీయత .. వారి మొట్టమొదటి పరిచయంలోనే నేను అనుభూతి చెందాను. జన్మజన్మల వియోగం తరువాత కలుసుకున్న రెండు ఆత్మస్వరూపాల కలయిక అది ! వారు చెప్పిన ప్రతిఒక్క ఆధ్యాత్మిక సత్యం నా హృదయాన్ని తట్టిలేపింది. మా ఇరువురిది ఒక " కామన్ ఎజెండా " గా నాకు ఆ క్షణంలో అనిపించి ఇక క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మా ఇంటికి రావలసిందిగా వారిని కోరాను. అందుకు సమ్మతించిన వారు 95 వారాల పాటు ఏకధాటిగా మా ఇంటికి వచ్చారు ! ప్రారంభంలో నేను .. మెల్లిమెల్లిగా నా కుటుంబ సభ్యులు, ఆ తరువాత బంధువులూ, స్నేహితులూ, నా క్లయింట్లూ .. ఇలా ధ్యానుల బృందం పెరుగుతూ, పెరుగుతూ " ఆదివారం " వస్తే చాలు అందరూ మా ఇంటిదారి పట్టేవారు ! నా శ్రీమతి కూడా ఎంతో ఉత్సాహంగా వారందరికీ వండి వడ్డించి ఆసక్తిగా పత్రీజీ ప్రవచనాలను వినేది. ఏ ఒక్కవారం కూడా మిస్ చెయ్యకుండా 95 ఆదివారాల పాటు పతీజీ మా ఇంటికి వచ్చారు ! ఆ కమిట్‌మెంట్‌తో కూడిన అంకిత భావమే వారిని ఈ రోజు ఎంతో ఎత్తుకు ఎదిగించింది ! ఆ " కమిట్‌మెంట్ " నే నేను వారి నుంచి ఆదర్శంగా తీసుకుని నా నిజ జీవితంలో కూడా అనుసంధానించు కునేవాడిని.

 

మారం: అప్పట్లో వారి సంభాషణా విధానం ఎలా ఉండేది?
సంపత్ కుమార్: ఇప్పటిలాగే ముక్కుసూటి వ్యవహారం .. ఆనాటికీ ఈనాటికీ వీసమెత్తు కూడా మారలేదు! " అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం " అన్నది వారిలో నేను చూసిన గొప్పలక్షణం ! ఏ విషయాన్నైనా సూటిగా దాపరికం లేకుండా మరి క్లుప్తంగా మాట్లాడడం మరి ప్రతిక్షణం శూన్యస్థితిలో ఉండడం వారికి వెన్నతో పెట్టిన విద్య ! సంసారంలో ఉంటూనే సదా సత్యాన్వేషణలో నిమగ్నమైన ఉన్న ఆ నవ్యయుగ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రవేత్తను నేను ఎంతో అభిమానించేవాడిని ! ప్రతి వారం " కర్నూలు " నుంచి " అనంతపూర్ " కు వచ్చేటప్పుడు ఏదో ఒక క్రొత్త ఇంగ్లీషు పుస్తకం తెచ్చి నాకు ఇచ్చేవారు. ఎన్నెన్నో లోతైన ఆధ్యాత్మిక విషయాలను అలవోకగా మాకు వివరించేవారు. మీడియమ్‌షిప్, పిరమిడ్ ఎనర్జీ, సెల్ఫ్‌హీలింగ్ వంటి ప్రయోగాలను మాతో చేయించే పత్రీజీని వారిని నేను ఎప్పుడూ " ఒక స్నేహితుడి " గానే భావించే వాడిని. వారు కూడా ఎవరైనా తనను గురువుగా సంబోధించినప్పుడు " నేను మీకు గురువును కాను .. ఒక మార్గదర్శకుడిని మాత్రమే " అని నిక్కచ్చిగా చెప్పేవారు.

 

మారం: పిరమిడ్ ధ్యాన ఉద్యమం గురించి ..


సంపత్ కుమార్: స్పిరిచ్యువాలిటీని ఒక క్రొత్త కోణంలో " పిరమిడ్ ధ్యాన ఉద్యమం " ప్రజలకు చూపించింది. ఇన్నాళ్ళూ దేవుళ్ళూ, గుళ్ళూ అంటూ తిరుగుతున్న వారికీ, ముక్తి మోక్షం అంటూ తీర్థయాత్రలు చేసున్నవారికీ, " నేనెవరు? ఎందుకు పుట్టాను? " అని స్వీయ ప్రశ్నలతో సతమతమయ్యేవారికీ .. " నేను సత్య మార్గం కనుగొన్నాను ! మీరు కూడా దానిని ప్రయోగపూర్వకంగా తెలుసుకోండి! " అంటూ మార్గదర్శనం చేశారు పత్రీజీ! " మోక్షం పొందు ", " ముక్తిని సాధించు " అని అందరూ చెప్పేవారే ! కానీ అసలు " ముక్తి అంటే ఏమిటి? " " మోక్షం ఎలా పొందవచ్చు? " అన్న నాటికి సరియైన, సరళమైన " ఆనాపానసతి మార్గాన్ని " మనకు అందించిన కారణ జన్ములు పత్రీజీ ! జ్ఞానగంగా ప్రవాహ సదృశులైన వారితో సహజీవనం జన్మజన్మల పుణ్యఫలం!

 

మారం: లాయర్ వృత్తి మీకు వంశపారంపర్యంగా వచ్చిందా?


సంపత్ కుమార్: అసలు చిన్నప్పటినుంచి నాకు లాయర్ వృత్తి అంటే పెద్దగా ఇష్టత ఉండేది కాదు. కానీ వ్యవసాయదారులైన మా నాన్న గారి భూములన్నీ అనేకానేక కారణాలవల్ల ఏవేవో లావాదేవీల్లో ఇరుక్కుని ఉండడంటో వకీళ్ళ చేతుల్లోపడి అవి దశాబ్ధాల తరబడి నలుగుతూ మా నాన్నగారిని ఆర్థిక పరంగా, మరి మానసికంగా, ఎంతో కృంగదీశాయి. ఇంక దాంతో విధిలేని పరిస్థితుల్లో నేను లాయర్ కోర్స్ చేసి స్వంతంగా మా భూముల కోసం కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపి .. గెలిచి మా భూములన్నీ మేము మళ్ళీ పొందడం జరిగింది ! ఇలా నాకు ఏది ఇష్టం లేదో దానిలోనే నేను ప్రవేశించి అందులో నేను ఎంతో కీర్తి ప్రతిష్ఠలను పొందాను. లాయర్‌గా మంచి పేరును సంపాదించినా అదేమీ సంతృప్తిని ఇవ్వలేదు ! సాధించడం అంటే అది కాదు. నన్ను నేను అర్థం చేసుకోవడం ; నా జన్మకారణం తెలుసుకోవడం .. నా జన్మ సార్థకం చేసుకోవడం అదే నా లక్ష్యం అదే గమ్యం!

 

1986లో మా అన్నగారు శ్రీనల్లాన్‌చక్రవర్తుల నరసింహాచారి గారు నాకు " ఒక యోగి ఆత్మకథ " పుస్తకాన్ని బహుకరించారు ! ఆ గ్రంథ అధ్యయనం నా పై గాఢమైన ముద్రవేసి నన్ను ఒక జిజ్ఞాసువుగా మార్చింది. అందుకేనేమో పత్రీజీ తో జరిగిన మొదటి పరిచయంలోనే నేను వారికి అనుయాయుడిగా మారిపోయాను. అది నా జీవితానికి ఒక మేలి మలుపు ! " నేను మీకు గురువును కాను .. మార్గ దర్శకుడిని " అని తరచూ చెప్పే పత్రీజీ .. తామే వెతుక్కుంటూ మన దగ్గరికి రావడం అన్నది " నేర్చుకోవడానికి శిష్యుడు సంసిద్ధంగా ఉన్నప్పుడు .. గురువు తానే వెతుక్కుంటూ వస్తాడు " అన్న మాటను నిజం చేసింది !

 

మారం: కర్మయోగం గురించి చెప్పండి!

 

సంపత్ కుమార్: కర్మను వదిలివేయడం సన్యాసం కాదు ! కర్మ చేస్తూనే .. సత్యాన్ని అన్వేషించాలి, ఆచరించాలి, అనుసరించాలి ! ఏ కర్మ ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో .. అలా చెయ్యడమే కర్మయోగం ! భార్యతో సంసారం చేస్తూనే .. పిల్లలను యోగ్యులుగా పెంచి పెద్ద చేస్తూనే సాత్విక భావాలతో జీవితాన్ని కాపాడుకోవడం అన్నదే సత్యకర్మ ! కర్మను సుఖదుఃఖాలతో బేరీజువేసి ద్వందాతీత మార్గం తెలుసుకోవడం మనలను బుద్ధుళ్ళుగా మారడానికి అనువైన వాతావరణం కలిగిస్తుంది. కర్మను సరిగ్గా అర్థం చేసుకోవడమే ధ్యానులకు మొదలి మెట్టు.

 

మారం: అనంతపూర్ లో నిర్మించిన " అగస్త్య పిరమిడ్ " ..


సంపత్ కుమార్: " ప్రతి పట్టణంలోనూ ధ్యానపిరమిడ్ రావాలి " అన్న పత్రీజీ ఆకాంక్ష మేరకు అనంతపూరంలో 60'X60' అగస్త్య పిరమిడ్ నిర్మాణం 1999 సంవత్సరంలో మొదలయ్యింది. పిరమిడ్ శక్తి గురించి ప్రజల్లో అస్సలు ఏ మాత్రం అవగాహన లేని ఆ రోజుల్లో అంత పెద్ద పిరమిడ్‌ను అనంతపూర్ నడిబొడ్డులో నిర్మించ తలపెట్టడం గొప్ప సాహసమే ! ఆనాటి నుంచి ఇప్పటివరకు నేను దానికి సెక్రటరీగా వున్నాను ! 2001 లో దాని నిర్మాణాన్ని పూర్తి చేసిన తరువాత నేను కొంతకాలం పాటు .. ఆత్మ పరిశోధనలో మునిగిపోయాను. మా ఇంటి మీద కూడా కట్టుకున్న రూఫ్‌టాప్ పిరమిడ్‍‌లో ప్రతిరోజు తెల్లవారుఝామునే వెళ్ళి కూర్చుని ధ్యానం చేసుకుంటాను. జీవితంలో గెలుపు-ఓటములు, భార్యా-పిల్లలు, బంధువులూ-ఆస్తిపాస్తులు, మానం-అవమానం వంటి ద్వంద్వాలు నన్ను బంధించలేకపోయాయి.

 

మారం: పత్రీజీతో సుదీర్ఘ కాలం మీరు సాంగత్యం నేర్పారు. స్థిత ప్రజ్ఞత్వం గురించి మీ ద్వారా మరింత వినాలి అనుకుంటున్నాము.


సంపత్ కుమార్: స్థితప్రజ్ఞత్వానికి మరో పేరుగా పత్రీజీని చెప్పుకోవచ్చు ! వారిలో నాకు నచ్చే మరో అంశం .. ఏదైనా పనిని పూర్తిచేయడంలో ఒకే విధానాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకపోవడం ! ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్త పద్ధతులను వైవిధ్యంగా చేపడుతూంటారు. క్రొత్త క్రొత్త పనులను క్రొత్త క్రొత్త పిరమిడ్ మాస్టర్లకు అప్పగిస్తూంటారు. ఏదీ రిపీట్ చేసి ఎవ్వరిని సాధించరు ! ఎప్పుడూ శూన్యస్థితిలో ఉంటూ తమ పరిధిలో తాము నిర్భయంగా, నిజాయితీగా, నిష్కపటంగా పని పూర్తి చేసుకుంటూ ఉంటారు. " టైటానిక్ " సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో ఒక ప్రక్క ఆ పెద్ద ఓడ మునిగి పోతున్నా కూడా అందులో ఉన్న కళాకారులు తమ సంగీత పరికరాలపై .. అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తూనే ఉంటారు. అంతటి స్థితప్రజ్ఞతతో మనం కూడా జీవించేలా వారు మనకు మార్గదర్శనం చేస్తున్నారు. " పరిస్థితులు ఎలా ఉన్నా .. ఎవ్వరూ తమ ఆనందాన్ని విడవకుండా ప్రతి క్షణం ఒక ఉత్పాదక శక్తిలా జీవిస్తూండాలి " అని బోధిస్తూ తాము అలా ఉంటూ మనకు చూపిస్తారు. వారు మనకు చూపించిన ధ్యాన మార్గం మనల్ని భయరహితులుగా చేయగల రాజమార్గం! " భయం " అన్న భావన మనలోని అన్నిరకాల స్పందనలనూ నాశనం చేసి .. జీవితం మీద విరక్తి భావనను కలుగజేస్తుంది. మన జీవశక్తిని కోల్పోయేలా చేసి మనల్ని జీవచ్ఛవంలా మారుస్తుంది. ఇటువంటి అధమ స్థితిలో ఉన్న మనిషి ఏ సమస్య వల్ల అయితే తనకు భయం కలిగిందో .. ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా గుర్తించలేక, ఆపదల నుంచి తప్పించుకునే అవకాశాన్ని కూడా కోల్పోతాడు. క్షణ క్షణం తన మనస్సును కలతపెట్టుకుంటూ .. శరీరాన్ని కృషింపజేసుకుంటాడు. అయితే " శ్వాస మీద ధ్యాస " పెట్టి చేసే నిరంతర ధ్యానసాధన ప్రతి ఒక్కరినీ భయరహితులుగా పరిమారుస్తుంది అని అనేక శాస్త్రీయ పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి. ఇంతటి గొప్ప అమృతకేతనధార అయిన శ్వాసధారను ఆనాడు గౌతమబుద్ధుడు ప్రపంచానికి అందిస్తే .. ఈనాడు ధ్యానప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికీ చేరవేస్తున్నారు మన మైత్రేయ బుద్ధులు .. పత్రీజీ !

 

మారం: " పిరమిడ్ వ్యాలీ " గురించి .. మీ మాటల్లో ..


సంపత్ కుమార్: " పిరమిడ్ వ్యాలీ " అన్నది బ్రహ్మర్షి పత్రీజీ కలలకు సాకార రూపం ! 1992 ప్రాంతాల్లో నేను వారితో కలిసి ఉన్నప్పుడే వారి మదిలో ఈ గొప్ప ప్రాజెక్టులు ఉండేవి. పిరమిడ్ శక్తి గురించి శాస్త్రీయంగా వివరిస్తూ వారు ఇంత గొప్ప కట్టడాల నిర్మాణంలో తమతో పాటు మరెంతో మంది పాల్గొనేలా చేసి వారి జీవితాలను కూడా ధన్యం చేస్తున్నారు. చుట్టూ అందమైన కొండలు .. మధ్యలో లోయతో ప్రకృతి సిద్ధంగా ఉన్న ఈ అద్భుతమైన ప్రదేశంలో 160'X160' మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యానానికి ఎంతో అనువైన చోటు ! ఇక ఇక్కడ కట్టబడిన కబీర్ భవనం, స్వచ్ఛం హాలు, ఆరా ప్రయోగశాల, పగోడా గెస్ట్ హౌస్‌లు, వసతి గృహాలు, లైబ్రెరీ, భోజనశాలలు .. ఒక్కటేమిటి ప్రతి ఒక్కటీ దేనికదే అత్యంత సాంకేతికంగా నిర్మించబడ్డాయి. ఇక్కడ కొలువుదీరిన మహాత్మాగాంధీ, గౌతమ బుద్ధ విగ్రహాలు చాలా బాగున్నాయి. " సమీప భవిష్యత్తులో ఇది International Spiritual Centre గా మారబోతుంది " అనడంలో సందేహం లేదు ! ధ్యానులు అంతా ఈ బృహత్ కార్యానికి సహకారం అందించి అత్యున్నత అద్భుతశక్తిక్షేత్రంగా దీనిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.

 

మారం: ఆ మధ్య మీడియాలో పత్రీజీ పట్ల కొంత అసంబద్ధమైన ప్రచారం జరిగింది. దీనిని గురించి ..


సంపత్ కుమార్: " అది అసంబద్ధం " అని తెలుస్తూనే ఉంది కదా ! దేశకాలమానాల్లో మాట పడని వారంటూ ఎవ్వరూ లేరు కనుకనే .. " వీతరాగభయక్రోధా .. మన్మయా మాముపాశ్రితా " అంటూ " అనురాగం, భయం, క్రోధం విడిచి నాయందే చిత్తం లగ్నం చేసి, నన్నే ఆశ్రయించి జ్ఞాన తపస్సుచే పవిత్రులైన వారే .. నా స్వరూపాన్ని పొందుతారు " అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారు ! ఆ స్థాయిని అందుకున్న జ్ఞానమూర్తులు కనుకనే పత్రీజీ .. ఏ మాత్రం లోటు పడలేదు సరికదా .. " వాళ్ళూ నేను ఒక్కటే " అన్నారు! " " అభియోగం " కూడా ఒక యోగమే .. " అంటూ ఆ యోగీశ్వరులు మానావమానాలను రెండింటినీ యోగస్థితి గానే స్వీకరించారు ! ఇప్పుడే కాదు ధ్యానప్రచారం మొదలు పెట్టిన తొలినాళ్ళ నుంచే వారు ఇటువంటి అవమానలను ఎన్నింటినో చిరునవ్వుతో ఎదుర్కున్నారు .. మరి ప్రతిసారీ గ్రహణం విడిచిన సూర్యుడిలా మరింతగా వెలిగిపోతూనే ఉన్నారు.

 

మారం: పిరమిడ్ మాస్టర్లకు మీరిచ్చే సందేశం ..


సంపత్ కుమార్: ఈ జీవితం మనకు ఒక బహుమానం ! దీనిని ఒక పాఠశాలగా ఎంచి .. ప్రతి క్షణం పాఠాలు నేర్చుకుంటూనే, ప్రయోగాలు చేస్తూనే, ఉండాలి ! ఎప్పటికప్పుడు జీవితాన్ని - ఆధ్యాత్మికతతో సమన్వయం చేసుకుంటూ, ఎరుకతో ఉంటూ ద్వంద్వాతీత స్థితికి చేరుకోవాలి ! ఆత్మసత్య మార్గాన్ని వీడకుండా .. ప్రతి క్షణం వర్తమానంలో జీవిస్తూ కలను - ఇలను సమన్వయం చేసుకోవాలి ! ఇదే యోగీశ్వర తత్త్వం !

 

మారం: మీకు ఎవరైనా గురువులు ఉన్నారా?


సంపత్ కుమార్: ఉన్నారు! వారు పేరు స్వామీ అవధూత్ మహానంద టాటంబరి ! " టాట్‌వాలా బాబా " గా అందరితో పిలవబడే వారి .. హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. అందమైన దస్తూరీతో వ్రాస్తూ ఏ పనినైనా నిర్ధిష్టంగా మరి అత్యంత పరిశుభ్రంగా చేస్తూంటారు. " ప్రతి రూపాయనూ, ప్రతి నీటి బొట్టునూ గౌరవంగా చూస్తూ సద్వినియోగం చెయ్యాలి ; ప్రకృతి వనరలను కాపాడుకోవాలి " అని బోధిస్తూంటారు ! వారి వయస్సు 300 సంవత్సరాల పై మాటే !

 

మారం: పిరమిడ్ మాస్టర్ల గురించి ..


సంపత్ కుమార్: ధ్యాన ప్రచారం ద్వారా పిరమిడ్ మాస్టర్లందరూ తమను తాము అద్భుత శిల్పల్లా మలచుకుంటున్నారు. ధ్యానం గురించీ, శాకాహారం గురించీ, మరి పిరమిడ్ శక్తి గురించీ పిరమిడ్ మాస్టర్లు చేస్తూన్న శాస్త్రీయ ప్రచారాలు ఎందరికో మార్గదర్శకాలు అవుతూన్నాయి. ప్రతి ఒక్కరిలో నిబిడీకృతంగా ఉన్న ఆత్మశక్తిని అద్వితీయంగా మలచుకుని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితికి ఎదుగుతున్నాడు. పిరమిడ్ మాస్టర్లందరూ మైత్రేయ బుద్ధుళ్ళే ! వారందరికీ నా అభినందనలు !

 

 

శ్రీ N.C.సంపత్ కుమర్

అనంతపూర్

Go to top