" అమ్మను మించిన అమ్మ "

 

 

హాయ్ ఫ్రెండ్స్ ! నా పేరు కృష్ణప్రియ ! నేను MBBS పూర్తి చేశాను. నాకు చిన్నప్పటి నుంచి .. అంటే నేను 4వ తరగతిలో ఉన్నప్పటి నుంచే పిరమిడ్ సొసైటీతో అనుబంధం ఏర్పడింది. ఆదోని పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ ప్రేమనాథ్ గారి ద్వారా మేమంతా ధ్యానం నేర్చుకుని .. 2007 సెప్టెంబ‍ర్‌లో పత్రిసార్‌ని మొట్టమొదటిసారి కలవడం జరిగింది. ఏదో తెలియని ఆత్మీయతా అనుబంధంతో నాకు నేను పత్రీజీ సమక్షంలో ఒక ‘ శక్తిస్వరూపం ’ లా అనుభూతి చెందాను.

 

" పత్రీజీ " అంటే మా అమ్మా, నాన్న, అక్క .. అందరికీ ఎంతో అభిమానం, గౌరవం ! " గురువు " అన్న పవిత్ర పదానికి వారు నిలువెత్తు నిదర్శనం ! వారు చూపించిన ధ్యానమార్గంలో నడుస్తూ .. మా కుటుంబసభ్యులం అంతా కూడా అంతకు ముందుకంటే ఎక్కువ పరస్పర అవగాహనతో ఒకరికొకరం మరింత దగ్గర అయ్యాం ! మా నాన్నగారు డా || గంగారామ్ గారు .. ధ్యానశక్తితో తమ వైద్యవృత్తిని అద్భుతంగా నిర్వహిస్తూ .. మరి ధ్యానప్రచార కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇదివరలో ఇంట్లో ఏ సమస్య వచ్చినా బెంబేలు పడిపోయే మేము ఇప్పుడు ఆ సమస్య గురించి పరి పరి విధాలుగా ఆలోచించడం మానివేసి ధ్యానం చేసుకుంటున్నాం.

 

ఈ క్రమంలో సాగిపోతున్న మా ధ్యాన కుటుంబంలో మా అమ్మ " శ్రీమతి అనురాధ " గారు 2014 సంవత్సరం జనవరి 26 వ తేదీన క్యాన్సర్ వ్యాధి కారణంగా నిద్రలోనే తమ భౌతిక శరీరాన్ని వదిలి చాలా ప్రశాంతంగా పైలోకాలకు తరలి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని పత్రి సార్‌కి తెలియజేయగా వారు .. " మీ అమ్మ ఆనందంగా పైలోకానికి వెళ్ళిపోయింది. నువ్వే అందరికీ ధైర్యం చెప్పు " అని చెప్పారు ! కర్తవ్యపూరితమైన వారి వాక్కులు ఆ క్షణంలో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. 2013 ధ్యాన మహాచక్రంలో .. మరణానంతర జీవితాన్ని గురించిన " సరస్వతీ జ్ఞానసందేశాలు " వారి ద్వారా విశేషంగా అందుకున్న మేము .. ఇంటికి తిరిగిరాగానే మాకు ఎదురైన ఈ పెద్ద పరీక్షను ధైర్యస్థైర్యాలతో ఎదుర్కొన్నాం ! ఇదే విషయాన్ని మేము కృతజ్ఞతాపూర్వకంగా పత్రీజీతో ప్రస్తావించగా " నేను కాదయ్యా ! పిరమిడ్ మాస్టర్ తనకు తాను తయారు అవుతున్నాడు ; దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్నాడు " అని చెప్పారు.

 

తమ గొప్పతనాన్ని చూపించకుండా మరి మనల్ని ఏ మాత్రం తమపై ఆధారపడనివ్వకుండా .. సర్వస్వతంత్రులుగా తీర్చిదిద్దుతున్నారు బ్రహ్మర్షి పత్రీజీ.

 

ఈ రోజు మా అమ్మ భౌతికంగా మా మధ్య లేకపోయినా .. ఇక్కడ ఉన్నప్పుడు చేసినట్లే ఏదో ఒక లోకంలో ఖచ్చితంగా అద్భుతమైన పనులను చేస్తూనే వుంటుంది ! మేము కూడా ధ్యానశక్తితో కూడిన ఆత్మస్థైర్యంతో మరి .. అమ్మను మించిన అమ్మ .. పత్రీజీ ప్రేమతో ఇక ముందు కూడా అమ్మలేని లోటు లేకుండా అద్భుతంగా జీవిస్తాం .. మరి ధ్యాన ప్రచార కార్యక్రమాలను మరింత అంకితభావంతో చేస్తాం !! థ్యాంక్స్ పత్రీజీ !!

 

 

కృష్ణప్రియ

ఆదోని

కర్నూలు జిల్లా

Go to top