" ధ్యానం నా జీవితాన్ని శోభాయమానం చేసింది "

 

నా పేరు శోభ. నేను వృత్తిరీత్యా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ .. హైదరాబాద్ మణికొండలో ఉంటున్నాను. నేను 2006వ సంవత్సరంలో విశాఖపట్టణం PM పాలెం సీతామహాలక్ష్మి మేడమ్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఇక అప్పటినుంచి ధ్యానం, ధ్యానప్రచారం, స్వాధ్యాయం మరి సజ్జనసాంగత్యాదులతో నా ఖాళీ సమయాన్ని గడుపుతూ .. నా సంపాదనలో 10 శాతాన్ని క్రమం తప్పకుండా ధ్యానం కోసం ఖర్చుపెడుతూ వున్నాను.

 

"జీవితంలోని అన్ని సమస్యలకూ చక్కటి పరిష్కార మార్గాలను కలిగి వున్న అక్షయపాత్రలాంటి శ్వాస మీద ధ్యాస ధ్యానవిద్య నా జీవితాన్ని కూడా శోభాయమానం చేసింది" అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ధ్యానంలోకి రాకముందు నేను నడుము నొప్పితో బాధపడుతూ ఉండేదాన్ని. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా .. మరెంతో మంది డాక్టర్లను కలిసినా .. ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా ఏ మాత్రం తగ్గలేదు. దాంతో పాటు పది సంవత్సరాలపాటు బ్రాంకియల్ ఆస్తమాతో నరకం అంటే ఏమిటో చవిచూశాను. ఈ రెండు అనారోగ్యాలు ఏకకాలంలో నా పై దాడిచేస్తూ నన్ను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగదీశాయి. నాలో ఆత్మవిశ్వాసం శాతం తగ్గిపోయి డిప్రెషన్ బారిన పడిపోయాను. జీవితం అంటేనే విరక్తి కలిగిన క్లిష్టపరిస్థితుల్లో నాకు ధ్యానపరిచయం జరిగింది.

 

30 రోజుల్లోనే నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది ; మరి రెండు నెలల్లో నా ఆస్తమా తగ్గుముఖం పట్టింది. వైజాగ్ స్టీల్‌‌ప్లాంట్‍లో పత్రీజీ ధ్యానశిక్షణా తరగతికి వెళ్ళి వారి సమక్షంలో చేసిన వేణునాద ధ్యానంలో నేను మరింత విశ్వశక్తి పాతాన్ని అనుభూతి చెందాను. అక్కడే ఓషో " అతీషా ప్రజ్ఞావేదం ", " ఆత్మపరిమళం " పుస్తకాలను కొని వాటిని విశేషంగా అధ్యయనం చేశాను.

 

" అతీషా ప్రజ్ఞావేదం " .. నా ఆలోచన విధానాన్నే పరిమార్చివేసింది. దానికి తోడు బ్రహ్మర్షి పత్రీజీ విరచితమైన " వాక్‌క్షేత్రం ", " యోగపరంపర " పుస్తకాల అధ్యయనం నాకు నా జీవితం లక్ష్యం పట్లా, జీవిత గమ్యం పట్లా స్పష్టమైన అవగాహనను కలిగించాయి. ఇక " న్యూ ఎనర్జీ " పుస్తకం పరమాద్భుతం ! చదివినంత సేపు ఏదో తెలియని క్రొత్త శక్తి మనలోకి వచ్చి చేరుతున్న అనుభూతి !

 

వెరసి స్వాధ్యాయ ఫలితాలు మరి నిరంతర ధ్యానం రెండూ నా దృక్పథంలో చక్కటి మార్పును తెచ్చి ఇంటి పనుల్లోనే కాకుండా ఒక ప్రభుత్వ అధికారిణిగా నా ఉద్యోగ విధుల్లో కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. నేను చేసే పనుల్లో నాణ్యత పెరగడమే కాకుండా .. ఇతర ఉద్యోగులతో నా పరస్పర సంబంధాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. ధ్యానంలో నాకు ఎన్నెన్నో అనుభవాలు ! దివ్యచక్షువు దర్శనాలు, సూక్ష్మశరీరయానాలు ఎన్నో ఎన్నెన్నో ! ఈ క్రమంలో ఒకసారి వెహికల్ మీద వెళ్తున్న నాకు ఆక్సిడెంట్ జరిగి .. మోచేతి దగ్గర ఎముక విరిగిపోయింది. డాక్టర్లు పరీక్షచేసి " కనీసం పదకొండు కుట్లు వేయాలి. ఆరు నెలలు కదలకుండా వుండాలి " అని చెప్పారు. అలా ఒకరు కాదు ఇద్దరు డాక్టర్లు ఎక్స్-రేలు తీసి కూడా నిర్థారించారు.

 

నాకు మాత్రం " ధ్యానశక్తితో ఈ సమస్య నుంచి బయటపడాలి " అనిపించి " ఏం జరిగినా నాదే హామీ " అని డాక్టర్‌ను రిక్వెస్ట్ చేసి కేవలం నొప్పినివారణ మందులు వ్రాయించుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మా వారు, నా స్నేహితులూ, బంధువులూ .. నన్ను పిచ్చిదానిలా చూశారు. అయినా నేను పట్టువదలకుండా ధ్యానం చేస్తూ .. డాక్టర్ చెప్పినట్లు రోజు విడిచి రోజు ఎక్స్-రే తీయించుకుంటూ .. ఎలాంటి ఇన్‌ఫెక్షన్‍లు సోకకుండా డాక్టర్లు ఆశ్చర్యపోయేంతలా నాకు నేనే హీలింగ్ చేసుకున్నాను. ‌వైజాగ్‌లో పేరుపొందిన " ఏడు కొండలు ఆసుపత్రి " డాక్టర్ గారు కూడా కేవలం ఆత్మవిశ్వాసంతో ధ్యానశక్తితో ఆపరేషన్ అవసరం లేకుండానే నన్ను నేను హీల్ చేసుకున్న విధానం చూసి నన్ను అభినందించారు. కేవలం మూడున్నర నెలల్లోనే నేను పూర్తి స్వస్థత పొంది .. నా చేతి ఎముక ఎలాంటి వంకరలు లేకుండానే పూర్తిగా అతుక్కుని నేను మళ్ళీ మునుపటిలాగే బండిమీద హాయిగా ఆఫీసుకి తిరగడం మొదలుపెట్టాను ! ‘ దృఢసంకల్పానికి ధ్యానశక్తి ’ తోడై జరిగిన ఈ అద్భుత అనుభవంతో నేను నన్ను వేధిస్తూన్న ఆస్తమా నుంచి మందులు పూర్తిగా మానివేసి .. రోజుకు మూడున్నర గంటల చొప్పున రాత్రి 11.30 గం||ల నుంచి అర్థరాత్రి 2.30 గం||ల వరకు పత్రీజీ వేణునాదాన్ని వింటూ ధ్యానం మూడు నెలల పాటు చేశాను!

 

మొదట్లో కాస్త ఉపశమనంగా ఉన్నా .. క్రమంగా ఆస్తమా మళ్ళీ విజృంభించి .. ఇక నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది. ఒకరోజు నాకు శ్వాస అందక ప్రాణాంతమైన పరిస్థితి వచ్చి ధ్యానం కూడా చెయ్యలేని పరిస్థితిలో పత్రీజీని తలచుకుని " ఏమయ్యా ! శ్వాస మీద ధ్యాస అని చెప్పావు ! నాకు శ్వాసే అందడం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు నా శరీరం ఈ భూమికి అవసరం ఉందా? లేదా? ఏదో ఒకటి తేల్చు" అని బాధతో విలవిల్లాడాను ! కొద్దిసేపటికే నా ఆయాసం తగ్గుముఖం పట్టి .. మెల్లగా శ్వాస అంది .. తెల్లారేసరికి మామూలుగా అయాను ! "నేను ‘ ధ్యాన శోభ ’ను, ‘ ప్రకృతి శోభ ’ను .. విశ్వం అంతా వ్యాపించిన విశ్వశక్తి శోభను మరి స్త్రీ శోభకు మారు పేరు నేనే " అంటూ నా లోంచి ఒక సందేశం వచ్చింది !

 

ఈ ఆరు సంవత్సరాల నుంచీ నేను ఎలాంటి అనారోగ్యం లేకుండా, నా బాల్యం నాకు తిరిగి వచ్చినంత ఆనందంగా .. జీవిస్తున్నాను ! ఆఫీసర్‌గా ఎంతో ఒత్తిడితో కూడుకున్న నా ఉద్యోగ ధర్మాన్ని కూడా అలవోకగా నిర్వహిస్తూ .. నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకుంటూ మణికొండ చుట్టుప్రక్కల వున్న సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో ధ్యానశిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాను ! పగలంతా ఉద్యోగధర్మం, రాత్రిళ్ళు ధ్యానధర్మం, స్వాధ్యాయ ధర్మం నిర్వహించుకుంటూ హాయిగా వున్నాను !

 

ఇదివరలో కాలక్షేపపు కబుర్లతో సమయాన్ని వృధా చేసే నేను శాకాహారిగా మారి ధ్యానసాధనలో మునిగిపోవడం చూసిన నా సన్నిహితులు నాలోని మార్పుని జీర్ణించుకోలేక .. " నాన్-వెజ్ ఎందుకు తినడం లేదు? ".. " సన్యాసిని అయిపోతావా? " అంటూ విమర్శించారు కూడా ! ఇదివరలో అయితే ఆ విమర్శలకు తీవ్రంగా ప్రతిస్పందించేదాన్ని ! కానీ ఇప్పుడు నిశ్చలంగా .. నిబ్బరంగా వారి విమర్శలను చిరునవ్వుతో వింటూ .. ధ్యానం వల్ల నాకు కలిగిన అద్భుతాలను వారికి వివరించి .. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కును గౌరవించుకుంటున్నాను ! క్రమక్రమంగా వారు కూడా ఈ సత్యమార్గంలోకి వస్తున్నారు !

 

ఒకసారి నేను ధ్యానంలో ఉండగా .. " నేను ఎవరిని? " " నా జీవిత లక్ష్యం ఏమిటి? ", " ఈ భూమ్మీదికి నా రాకలోని పరమార్థం ఏమిటి? " అన్న ప్రశ్నలు నాలో ఉదయించాయి. అంతలోనే నా శరీరం అనంతంగా వ్యాకోచిస్తూ .. నా ఆజ్ఞాచక్రం దగ్గర " ఫట్ " అని శబ్ధం వచ్చింది ! నేను ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయి చంద్రుడు, నక్షత్రాలను చేరుకోగా అక్కడ లక్షలాది మంది జనం మధ్యలో పత్రీజీ నిలుచుని వున్నారు. ఒక చిన్ని బాలిక వచ్చి నా చేతిని స్పర్శిస్తూ " అమ్మా " .. " అమ్మా " అని స్పష్టంగా పిలిచింది.

 

కళ్ళు తెరిచి చూడగా .. ఆ దృశ్యం అంతా మటుమాయం ! నేను అరమరికలు లేని చిన్ని బాలికరూపంలో వున్న ఒకానొక ఆత్మస్వరూపంగా మరి నా జన్మలక్ష్యం ధ్యానప్రచారంగా నేను తెలుసుకున్నాను. ఈ భూమ్మీదకి నా రాకలోని పరమార్థం విశ్వంతో అనుసంధానం చెంది భూమిపై పనిచేస్తూ ఉండాలనీ అర్థం అయ్యింది. ఇక దాంతో నా ఆత్మ ఉన్నతి కోసమే ధ్యానం, ధ్యానప్రచారం అని అర్థం చేసుకుని మరింత అంకితభావంతో పనిచేస్తూ ఉండాలనీ అర్థం అయ్యింది. ఇక దాంతో నా ఆత్మ ఉన్నతి కోసమే ధ్యానం, ధ్యానప్రచారం అని అర్థం చేసుకుని మరింత అంకితభావంతో పనిచేస్తూ జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపేస్తున్నాను. ఇంతటి ఆత్మజ్ఞానయుత జీవితాన్ని గడిపే అవకాశాన్ని మనందరికీ అందజేసిన పత్రీజీకి ధ్యానాభివందనాలు సమర్పించుకుంటూ ..

 

 

శోభ
మణికొండ

హైదరాబాద్
9030262996

Go to top