" నా కళ్ళల్లోకి సూటిగా చూసి బాధ్యతలు అప్పగించారు "

 

కర్నాటక రాష్ట్రం బెంగళూరు మహానగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు శ్రీ B.నారాయణన్ గారు .. 2009లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చిన రోజే బెంగళూరు పిరమిడ్ సొసైటీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. అనన్య సామాన్యమైన కార్యదక్షతతో వారు 2010 నుంచి కర్నాటక పిరమిడ్ ధ్యాన ప్రచార ట్రస్ట్‌కు కూడా అధ్యక్షులుగా మరింత సమర్థవంతంగా పనిచేస్తూ .. మే 8 నుంచి 14వ తేదీ వరకు పిరమిడ్ వ్యాలీలో జరిగిన బుద్ధ పౌర్ణమి సందర్భంగా .. కర్నాటక ధ్యానమహాచక్ర-1 ఉత్సవాలను పరమాద్భుతంగా నిర్వహించారు ! ఈ సందర్భంగా శ్రీ నారాయణన్‌ గారితో ముఖాముఖి..

ఎడిటర్

 

మారం: PSSMకు ఆయువుపట్టు అయిన " కర్నాటక ధ్యానప్రచార ట్రస్ట్ " అధ్యక్షులుగా మీ బృందంతో కలిసి మే 8 నుంచి 14 వరకు కర్నాటక ధ్యానమహాచక్ర - 1ని మీరు, మీ బృందం అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు ! మీ గురించి ..


నారాయణన్ గారు: నేను బెంగళూరు స్వస్థలంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాను. నా చిన్నతనం నుంచీ నాకు " శ్రీ విద్యాప్రకాశనంద గిరి " గారు అంటే చాలా అభిమానం ! వారు వ్యాఖ్యానం చేసిన " గీతామకరందం " అన్నా .. మరి వారి ఆశ్రమ పత్రిక " వేదాంతభేరి " అన్నా .. నాకు ఎంతో మక్కువ ! శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న " శుకబ్రహ్మ ఆశ్రమాన్ని " నేను తరచూ దర్శిస్తూంటాను.

 

ఈ క్రమంలో ఒకసారి నేను శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి వస్తూ .. ఆలయ పరిసరాల్లో ఉన్న పిరమిడ్ బుక్‌స్టాల్ లో బ్రహ్మర్షి పత్రీజీ వ్రాసిన " ధ్యాన మహాశాస్త్రం " పుస్తకాన్ని కొని చదివాను. ఎన్నో సంవత్సరాలుగా నాలో మెదులుతూ ఉన్న అనేకానేక ప్రశ్నలకు నాకు ఆ పుస్తకంలో సమాధానాలు దొరికాయి. బెంగళూరుకు సమీపంలోనే " పిరమిడ్ వ్యాలీ " ఉందని తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్ళాను.

 

అదే సమయానికి పత్రీజీ కూడా వ్యాలీలోనే ఉండడం వల్ల వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యం నాకు వెంటనే కలిగింది ! తల్లిదండ్రులకు దూరమైన చిన్ని పిల్లవాడు చాలాకాలం తర్వాత ఆ తల్లిదండ్రులను హఠాత్తుగా కలిస్తే ఎంత ఆర్తిగా ఉంటుందో .. అలా అయ్యింది పత్రీజీని కలిసిన తరువాత నా పరిస్థితి ! " ఇక ఈ జీవితానికి వారే నా మార్గదర్శకులు " అని నా హృదయంలో అనిపించి వారికి సంపూర్ణ శరణాగతి అయిపోయాను !ఆ రోజే వారు బెంగళూరు సిటీకి బయలుదేరుతూ ఉంటే .. నేను కూడా వారి వెంట వెళ్ళిపోయాను. అక్కడ వారు ఒక పిరమిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తూ .. నన్ను " బెంగళూరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ "కు అధ్యక్షులుగా నియమించారు ! అప్పటికి నేను నా జీవితంలో దాదాపు 15 మంది గురువుల దగ్గరికి వెళ్ళి వచ్చాను .. వారందరి బోధనలు విన్నాను. ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థల కార్యకలాపాలను చూశాను. కానీ, పత్రీజీ నా కళ్ళలోకి సూటిగా చూస్తూ .. ఒక బృహత్తర బాధ్యతను నాకు అందించగానే దానిని " రామాజ్ఞ " గా శిరసావహించి ఈ రోజు వరకు ఎంతో ఇష్టంగా మరెంతో బాధ్యతగా దానిని నిర్వహిస్తున్నాను.

 

మారం: చాలా బాగుంది సార్! మరి కర్నాటక పిరమిడ్ ధ్యానప్రచార ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది? దాని కార్యకలాపాలేమిటి?


నారాయణన్ గారు: పత్రీజీ 2010లో నన్ను కర్నాటక పిరమిడ్ ధ్యానప్రచార ట్రస్ట్ కి అధ్యక్షుడి గా నియమించారు. ట్రస్ట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 18 మంది పిరమిడ్ మాస్టర్స్‌తో ఒక బృందాన్ని ఏర్పరచుకుని ఆ సంవత్సరమే బెంగళూరు " మల్లేశ్వరం "లో ఒక గొప్ప ధ్యాన యజ్ఞం నిర్వహించాము. బెంగళూరు సిటీలోనూ, ఇతర ప్రదేశాల్లోను 40 పిరమిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించాం. అనేక గీతా ధ్యాన యజ్ఞాలనూ, ధ్యాన సప్తాహాలనూ, ఇంటింటా ధ్యాన కార్యక్రమాలనూ విస్తృతంగా నిర్వహించాం. కర్నాటక రాష్ట్రంలోని అతి పెద్ద పుణ్యక్షేత్రం అయిన " ధర్మస్థల " .. ముఖ్య పర్యవేక్షకులు అయిన శ్రీ వీరేంద్ర హెగ్డే జీ వంటి ఆధ్యాత్మిక సంస్థల గురువులను పిరమిడ్ వ్యాలీకి ఆహ్వానించడం జరిగింది. కర్నాటక పిరమిడ్ ధ్యానప్రచార ట్రస్ట్ కి 80G సర్టిఫికేట్‌ను కూడా ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్ నుంచి పొందడంతో దాతల విరాళాలను మరింతగా పొందటం జరుగుతూంది.

 

ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది 2012 కడ్తాల్ ధ్యానమహాచక్రం గురించి ! ప్రపంచ ధ్యానమహాసభలకు 11 రోజులపాటు రోజుకు లక్షమంది ధ్యానుల చొప్పున హాజరైన కార్యక్రమంలో జరిగిన భారీ అన్నదానానికి కావలసిన బియ్యాన్ని కర్నాటక పిరమిడ్ ధ్యానప్రచార ట్రస్ట్ వారే సేకరించి పంపడం జరిగింది. " 160 టన్నుల బియ్యం, 16 టన్నుల కందిపప్పు " .. కర్నాటక రాష్ట్రం అంతా తిరిగి సేకరించాం ! అద్భుతమైన " టీమ్‌వర్క్" కు నిదర్శనంగా నిలిచిన ఈ లోకకళ్యాణ కార్యక్రమంలో ప్రతి ఒక్క ట్రస్ట్ మెంబర్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంతో చిత్తశుద్ధితో పని చేశారు !

 

అదే స్ఫూర్తిగా మరి మొన్న మే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు " కర్నాటక ధ్యానమహాచక్ర " సంబరాలు జరుపుకున్నాం ! 7 రోజులపాటు దాదాపు 5 వేల మంది ధ్యానులకు ముఖ్యంగా 13,14 తేదీలలో ఐదు వేల మందికి భారీ అన్నదాన వితరణ జరిగింది. ముఖ్య అతిథుల ప్రసంగాలు, కర్నాటక రాజ్య కన్నడ మత్తు సంస్కృతి వారి సాంస్కృతిక కార్యక్రమాలు మరి అన్నింటినీ మించి పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రాతఃకాల అఖండ సంగీత ధ్యానం అన్నీ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరుపబడ్డాయి.

 

ఏడు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాల సందర్భంగా క్రొత్త క్రొత్త ధ్యానులు, ప్రభుత్వాధికారులు, వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక, మత సంస్థలకు చెందినవారు .. ముఖ్యంగా కర్నాటక రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు శ్రీ D.K.శివకుమార్ గారు కూడా వ్యాలీకి విచ్చేయడం మరి మెగా పిరమిడ్‌ను సందర్శించి అందులో ధ్యానం చేసుకోవడం జరిగింది.

మారం: వ్యాలీ అభివృద్ధిలో ట్రస్ట్ ఎలాంటి బాధ్యతను వహిస్తోంది?


నారాయణన్ గారు: పిరమిడ్ వ్యాలీ జీవిత సభ్యత్వాల కోసం ట్రస్ట్ కృషి చేస్తోంది. కర్నాటక మరి ఇతర రాష్ట్రాల్లో విస్తారంగా పర్యటిస్తూ ట్రస్ట్ మెంబర్లంతా జీవిత సభ్యత్వాలను సేకరిస్తున్నారు. వ్యాలీలో ట్రస్ట్ తరపున ఇప్పటికే 20 పడకలతో కూడిన రెండు డార్మెటరీలను నిర్మించగా మరొక ఆరు డార్మెటరీల నిర్మాణానికి పత్రీజీ శంఖుస్థాపన చేశారు. ఇంతే కాకుండా ట్రస్ట్ ఆధ్వర్యంలో " కర్నాటక భవన్ " పేరిట 100 రూములలో కూడిన కాంప్లెక్స్ నిర్మాణం జరుపుకోబోతోంది. 2010 నుంచి పిరమిడ్ వ్యాలీలో ప్రారంభించిన నిత్యాన్నదాన పధకం అమలులో కూడా ట్రస్ట్ విశేషంగా కృషి చేస్తోంది !

 

మారం: స్వాధ్యాయ విస్తరణకు కర్నాటక పిరమిడ్ ధ్యాన ప్రచార ట్రస్ట్ చేస్తూన్న కృషి ..


నారాయణన్ గారు: స్వాధ్యాయానికి పెద్ద పీటవేస్తూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కృషి జరిగింది. ముఖ్యంగా " ధ్యాన కస్తూరి " మాసపత్రిక ప్రతి ఒక్క కన్నడ ధ్యానికి చేరవేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి చోట నుంచి స్పందన వస్తోంది. పత్రీజీ సందేశాల సంకలనాన్ని దాదాపు 20 వేల పుస్తకాల ప్రచురణ ఇప్పటికే పూర్తి చేశాం. లక్ష పుస్తకాలు ఈ సంవత్సరానికి పూర్తి చెయ్యాలని మా సంకల్పం ! పిరమిడ్ ధ్యాన సమాచారం కలిగి ఉన్న 13 ప్యాకెట్ సైజ్ పుస్తకాలతో కూడిన 65 వేల కాపీలు ఇప్పటికే ప్రచురించబడ్డాయి. చాలామంది " వీటిని మేమే ప్రచురింప చేస్తాం " అంటూ ముందుకు రావడం ఎంతో సంతోషకరం ! ఇక " Gurus of India " అన్న ఆంగ్ల పుస్తకాన్ని " భారత సద్గురుగళు " అన్న పేరుతో కన్నడ భాషలోకి అనువదించి ట్రస్ట్ తరపున ప్రింట్ చేయడం .. మరి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆ పుస్తకానికి మంచి స్పందన రావడం జరిగింది.

 

పత్రీజీ సూచించిన ఏ పుస్తకాన్నైనా .. ఏ భాషలో ఉన్నా .. దానిని కన్నడంలో ప్రచురింప చేసి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే బాధ్యతను ట్రస్ట్ చేపట్టింది. ఇలా పత్రీజీ స్నేహపూర్వకమైన మార్గదర్శకత్వంలో వారు మాకు అప్పగించిన బాధ్యతను ఆనందంగా నిర్వహిస్తూ మా జన్మలను ధన్యం చేసుకుంటున్నాము.

 

మారం: ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం ..


నారాయణన్ గారు: " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రికను ప్రతి నెలా చదవగలగడం ఆంధ్రుల జన్మ జన్మల భాగ్యం ! మేము ప్రతి నెలా " ధ్యానాంధ్రప్రదేశ్ "ను క్షుణ్ణంగా చదివి దానిని మా " ధ్యాన కస్తూరి " మ్యాగ్‌జైన్‌కు స్ఫూర్తిగా తీసుకుంటాం. " ధ్యాన కస్తూరి " కి " ధ్యానాంధ్రప్రదేశ్ " బ్రహ్మాండమైన మార్గదర్శి ! కర్నాటక రాష్ట్రంలోని ప్రతి తెలుగు ధ్యానికీ ధ్యానాంధ్రప్రదేశ్ మాస పత్రిక చేరే విధంగా ప్రతి ఒక్కరూ మరొక చందాదారులను చేర్పించే విధంగా కర్నాటక పిరమిడ్ ధ్యానప్రచార ట్రస్ట్ తరపున మేము కూడా ప్రయత్నిస్తాం.

 

 

 

B.నారాయణన్
బెంగళూరు
07846901388.

Go to top